వ్యవసాయ మంత్రిత్వ శాఖ

ఇటీవలి వాతావరణ సంక్షోభం, వేగవంతమైన సాంకేతిక పురోగతికి ప్రతిస్పందనగా పి.ఎం.ఎఫ్.బి.వై. లో రైతు అనుకూల మార్పులు తీసుకు రావడానికి సిద్ధంగా ఉన్న - కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ


కొత్త సవాళ్లను పరిష్కరించడానికి 2016 తర్వాత పథకంలో ప్రధాన పునరుద్ధరణ చర్యలు తీసుకున్నట్లు తెలియజేసిన - కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా


వేగవంతమైన ఆవిష్కరణల యుగంలో, ఖచ్చితమైన వ్యవసాయం తో పి.ఎం.ఎఫ్.బి.వై. పరిధిని, కార్యకలాపాలను విస్తరించడంతో డిజిటలైజేషన్, సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి : శ్రీ అహుజా

Posted On: 24 NOV 2022 11:10AM by PIB Hyderabad

ఇటీవలి వాతావరణ సంక్షోభం, వేగవంతమైన సాంకేతిక పురోగతికి ప్రతిస్పందనగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పి.ఎం.ఎఫ్.బి.వై) లో రైతు అనుకూల మార్పులు తీసుకురావడానికి కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉంది.


కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ అహుజా మాట్లాడుతూ, వ్యవసాయం నేరుగా వివిధ వాతావరణ విపత్తులకు గురవుతున్న కారణంగా, దేశంలోని దుర్బలమైన వ్యవసాయ సమాజాన్ని ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షించడం అనేది చాలా ముఖ్యమైనది, అత్యంత క్లిష్టమైనది, అని పేర్కొన్నారు.  ఫలితంగా, పంటల బీమాకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. అందువల్ల భారతదేశంలో రైతులకు తగినంత బీమా రక్షణ అందించడానికి పంటలతో పాటు, ఇతర రకాల గ్రామీణ / వ్యవసాయ బీమా ఉత్పత్తులకు మరింత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం ఉంది, అని ఆయన సూచించారు. 


2016 లో పి.ఎం.ఎఫ్.బి.వై. పధకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత, జాతీయ వ్యవసాయ బీమా పథకం (ఎన్.ఏ.ఐ.ఎస్) తో పాటు సవరించిన ఎన్.ఏ.ఐ.ఎస్. కి చెందిన మునుపటి పథకాలలో చేర్చబడని, విత్తే ముందు నుంచి పంటకోత తర్వాత కాలం వరకు అన్ని పంటలు, ప్రమాదాల గురించి ఈ పథకం సమగ్ర కవరేజీని తీసుకువచ్చిందని శ్రీ అహుజా వివరించారు.   స్థానికంగా విపత్తులు సంభవించిన సందర్భంలో పంట నష్టం ఆనవాళ్ళు 72 గంటల తర్వాత కనబడకుండా పోయే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతులు, తమ పంట నష్టం వివరాలు తెలియజేయడానికి ఉన్న గడువును 48 గంటల నుండి 72 గంటలకు పెంచడం వంటి అనేక కొత్త ప్రాథమిక అంశాలు కూడా 2018 లో దాని సవరణ సమయంలో జోడించబడ్డాయి.  అదేవిధంగా, 2020 లో దాని పునరుద్ధరణ తర్వాత, ఈ పథకాన్ని రైతులకు మరింత అనుకూలంగా ఉండే విధంగా చేయడానికి, వన్యప్రాణుల దాడి కోసం స్వచ్ఛంద నమోదుతో పాటు, "యాడ్-ఆన్-కవర్‌" ను చేర్చడం జరిగింది. 


శ్రీ అహుజా మాట్లాడుతూ, పి.ఎం.ఎఫ్.బి.వై. పంట బీమా అనుసరణను సులభతరం చేస్తోందని, అలాగే అనేక సవాళ్లను పరిష్కరిస్తూ, పునరుద్దరించిన పథకంలో చేసిన ప్రధాన మార్పులు పథకం కింద నష్టాల కవరేజితో పాటు, రైతులందరికోసం కోసం ఈ పథకాన్ని స్వచ్ఛందంగా చేయాలనే రైతుల చిరకాల డిమాండును సాకారం చేయాలనే సంకల్పంతో,  ఈ పథకం రాష్ట్రాలకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తోందని, తెలియజేశారు. 


కొన్ని రాష్ట్రాలు ప్రాథమికంగా ఆర్థిక పరమైన పరిమితుల కారణంగా ప్రీమియం సబ్సిడీలో తమ రాష్ట్ర వాటాను చెల్లించలేకపోవడం వల్ల ఈ పథకం నుండి వైదొలిగాయని, ఆయన తెలియజేశారు. అయితే, వారి సమస్యల పరిష్కారం తర్వాత, 2022 జూలై నుంచి ఆంధ్రప్రదేశ్ ఈ పథకంలో తిరిగి చేరిందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు కూడా తమ రైతులకు సమగ్ర కవరేజీని అందించడానికి పథకంలో చేరాలని ఆలోచిస్తున్నట్లు, ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  చాలా రాష్ట్రాలు పి.ఎం.ఎఫ్.బి.వై. స్థానంలో ప్రత్యామ్నాయ పరిహార నమూనాలను ఎంచుకున్నాయని, అయితే అవి, రైతులకు పి.ఎం.ఎఫ్.బి.వై. స్థాయిలో సమగ్ర నష్ట పరిహారాన్ని అందించడం లేదన్న విషయాన్ని గమనించాలని ఆయన పేర్కొన్నారు. 


శ్రీ అహుజా మాట్లాడుతూ, వేగవంతమైన ఆవిష్కరణల యుగంలో, ఖచ్చితమైన వ్యవసాయంతో పి.ఎం.ఎఫ్.బి.వై. పరిధిని, కార్యకలాపాలను మరింతగా విస్తరించడంలో డిజిటలైజేషన్, సాంకేతికత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని, పేర్కొన్నారు.  అగ్రి-టెక్ తో రూరల్ ఇన్సూరెన్స్ కలిస్తే, సమ్మిళిత ఆర్ధికాభివృధికి ఒక మ్యాజిక్ ఫార్ములాగా పనిచేయడంతో పాటు, ఈ పథకంపై నమ్మకాన్ని కలిగిస్తుంది.  ఈ పధకం సామర్థ్యం, పారదర్శకతలను మరింతగా పెంచడానికి తీసుకున్న కొన్ని కీలక చర్యల్లో - ఇటీవల ప్రవేశపెట్టిన వాతావరణ సమాచారం, నెట్‌-వర్క్ సమాచార విధానం (డబ్ల్యూ.ఐ.ఎన్.డి.ఎస్); సాంకేతికత ఆధారంగా దిగుబడి అంచనా వ్యవస్థ (వై.ఈ.ఎస్-టెక్); వాస్తవ సమయ పరిశీలనలు, పంటల ఫోటోల సేకరణ (సి.ఆర్.ఓ.పి.ఐ.సి) వంటివి ఉన్నాయి.  రైతుల ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించేందుకు, ఛత్తీస్‌గఢ్‌ లో "బీటా-టెస్టింగ్" విధానంతో ఏర్పాటు చేసిన, ఒక సమగ్ర హెల్ప్ లైన్ వ్యవస్థ పనిచేస్తోంది. 


ప్రీమియం చెల్లింపులో కేంద్ర, రాష్ట్ర సహకారం గురించి శ్రీ అహుజా వివరంగా తెలియజేస్తూ, గత 6 సంవత్సరాలలో కేవలం 25,186 కోట్ల రూపాయలు మాత్రమే రైతులు చెల్లించగా, వారికి, 1,25,662 కోట్ల రూపాయల మేర నష్టపరిహారం అందినట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద ప్రీమియంలో ఎక్కువ శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయని కూడా ఆయన తెలియజేశారు.   2016 సంవత్సరంలో ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి రుణం పొందని రైతులు, సన్న, చిన్న కారు రైతుల వాటా 282 శాతం మేర పెరగడంతో, గత 6 సంవత్సరాల కాలంలో, రైతుల్లో ఈ పథకం ఆమోదయోగ్యత గణనీయంగా పెరిగినట్లయ్యిందని కూడా, కార్యదర్శి పేర్కొన్నారు. 


2022 లో మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్‌ రాష్ట్రాలలో అధిక వర్షపాతం నమోదుకాగా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్‌ లలో అత్యల్ప వర్షపాతం నమోదు కావడంతో, చివరకు వరి, పప్పుధాన్యాలు, నూనెగింజలు వంటి పంటలు దెబ్బతిన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.   ఉరుములు, తుఫానులు, కరువులు, వేడి గాలులు, మెరుపులు, వరదలు, కొండచరియలు విరిగి పడటం వంటి అనిశ్చితి పరిస్థితులు కూడా పెరిగాయి. అనేక శాస్త్ర, పర్యావరణ సంబంధ దినపత్రికలు, ఇతర పత్రికల్లో పేర్కొన్న విధంగా, భారతదేశంలో 2022 సంవత్సరం మొదటి 9 నెలల్లో దాదాపు ప్రతిరోజూ ఇటువంటి పరిస్థితులు సంభవిస్తూనే ఉన్నాయి. 


రాబోయే 10 సంవత్సరాల కాలంలో సంభవించే విపరీతమైన వాతావరణ పరిస్థితులను రెండవ అతి పెద్ద ప్రమాదంగా, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కు చెందిన గ్లోబల్ రిస్క్ నివేదిక-2022 పేర్కొందనీ, ఆ పరిస్థితులు మన దేశంపై మరింత ప్రతికూల ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందనీ, శ్రీ అహుజా, అభిప్రాయపడ్డారు.  అప్పుడు, ప్రపంచంలోని రెండవ అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఆహారం అందించాల్సిన బాధ్యత మన వ్యవసాయ సమాజంపై మాత్రమే ఉంటుందని ఆయన హెచ్చరించారు.  అందువల్ల, రైతులు వారి ఆర్థిక స్థితిని కాపాడుకుని, వ్యవసాయాన్ని కొనసాగించేలా వారిని ప్రోత్సహించి, భారతదేశంతో పాటు, ప్రపంచానికి కూడా ఆహార భద్రత కల్పించే విధంగా, వారికి భద్రతా వలయాన్ని అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. 


ప్రస్తుతం రైతుల నమోదు పరంగా ప్రపంచంలోనే, పి.ఎంఎఫ్.బి.వై. పధకం, అతిపెద్ద పంటల బీమా పథకం కాగా, ప్రతి సంవత్సరం సగటున 5.5 కోట్ల దరఖాస్తుల ద్వారా అందుతున్న ప్రీమియం పరంగా ఇది మూడవ అతిపెద్ద పధకంగా నిలిచింది.   ఈ పథకం రైతుపై ఆర్థిక భారాన్ని కనీస స్థాయికి తగ్గిస్తుంది. రబీ సీజన్‌ లో మొత్తం ప్రీమియంలో 1.5 శాతం చొప్పున, ఖరీఫ్ సీజన్‌ లో మొత్తం ప్రీమియంలో 2 శాతం చొప్పున మాత్రమే రైతులు చెల్లిస్తారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన ప్రీమియంను భరిస్తాయి.  ఈ పధకం అమలులోకి వచ్చిన గత ఆరు సంవత్సరాల కాలంలో, రైతులు 25,186 కోట్ల రూపాయల మేర ప్రీమియం చెల్లించగా, 2022 అక్టోబర్, 31వ తేదీ నాటికి వారు 1,25,662 కోట్ల రూపాయల మేర నష్టపరిహారాన్ని స్వీకరించారు.  2016 లో పథకం ప్రారంభించినప్పటి నుండి రుణాలు పొందని, అట్టడుగు, చిన్న రైతుల వాటా 282 శాతం పెరిగిందనే వాస్తవం ద్వారా రైతుల్లో ఈ పథకం పట్ల ఆమోదయోగ్యత పెరుగుదలను నిర్ధారించవచ్చు.


2017, 2018, 2019 కష్టతరమైన సీజన్లలో, వాతావరణ పరిస్థితుల వల్ల దెబ్బతిన్న రైతుల జీవనోపాధిని పొందడంలో నిర్ణయాత్మక కారకంగా, ఈ పథకం నిరూపించబడింది.  వీటిలో, అనేక రాష్ట్రాలలో వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో వంద శాతం కంటే ఎక్కువగా రైతులకు నష్ట పరిహారం చెల్లించడం జరిగింది.  ఉదాహరణకు, ఛత్తీస్‌గఢ్ (2017), ఒడిశా (2017), తమిళనాడు (2018), జార్ఖండ్ (2019) రాష్ట్రాలు చెల్లించిన మొత్తం ప్రీమియంలో వరుసగా 384%, 222%, 163%, 159% చొప్పున నష్ట పరిహారాన్ని పొందాయి.
 

<><><>



(Release ID: 1878694) Visitor Counter : 265