సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
అలరించడానికి సిద్ధమవుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
ఐఎఫ్ఎఫ్ఐ 53 లో ఏడు అర్జెంటీనా చిత్రాల ప్రదర్శన
గొప్ప సినిమా చరిత్ర కలిగి, చలన చిత్ర నిర్మాణంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అర్జెంటీనా దేశంలో రూపు దిద్దుకున్న 7 చలన చిత్రాలు భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు సిద్ధమవుతున్నాయి. చలన చిత్రాలు తమ దేశ ప్రజలు వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయని అర్జెంటీనా ప్రజలు భావిస్తారు. చలన చిత్ర రంగంలో అర్జెంటీనా దేశానికి ఘనమైన చరిత్ర ఉంది. 1896లో లూమియర్ సినిమాటోగ్రఫీని ప్యారిస్‌లో ప్రారంభించారు. ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత లూమియర్ సినిమాటోగ్రఫీని దిగుమతి చేసుకున్న మొదటి దేశాల్లో అర్జెంటీనా ఒకటి. ప్రపంచంలోనే మొట్టమొదటి యానిమేషన్ చలనచిత్రం ఎల్ అపోస్టోల్ కూడా అర్జెంటీనాలో నిర్మాణం అయ్యింది. లుక్రేసియా మార్టెల్, మార్టిన్ రెజ్ట్‌మాన్ మరియు పాబ్లో ట్రాపెరో వంటి వారి నేతృత్వంలో ఆధునిక అర్జెంటీనా సినిమా రంగం ప్రపంచ ఖ్యాతి సాధించింది. గొప్ప సినిమా సంప్రదాయం ఉన్న అర్జెంటీనా దేశంలో నిర్మాణం అయిన చిత్రాల్లో ఎంపిక చేసిన 7 చిత్రాలు 53 వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడతాయి.
రోడ్రిగో గెరెరో దర్శకత్వం వహించిన ' సెవెన్ డాగ్స్' చిత్ర నిర్మాణం 2021లో జరిగింది. అంతర్జాతీయ పోటీ విభాగంలో ప్రముఖ గోల్డెన్ పీకాక్‌కు అవార్డుకు ' సెవెన్ డాగ్స్' నామినేట్ చేయబడింది. అర్జెంటీనా దర్శకుడు దర్శకత్వం వహించిన నాలుగో సినిమా ' సెవెన్ డాగ్స్' . కేవలం 80 నిమిషాల నిడివి గల ' సెవెన్ డాగ్స్' చిత్రం మనిషి మరియు అతని పెంపుడు జంతువుల మధ్య బంధాన్ని చూపిస్తుంది.
'సెల్ఫ్ డిఫెన్స్' చిత్రానికి ఆండ్రియా బ్రాగా దర్శకత్వం వహించారు. చిత్రం ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డు రేసులో 'సెల్ఫ్ డిఫెన్స్' ఉంది. ఒక ప్రాసిక్యూటర్ తన గతానికి సంబంధించిన వరుస హత్యల కేసులను పరిష్కరించడానికి తన స్వగ్రామానికి తిరిగి వచ్చిన సంఘటన ఆధారంగా సినిమా కథ రూపుదిద్దుకుంది.
అర్జెంటీనాలో నిర్మాణం అయిన కి మిస్ వైబోర్గ్ (2022), ది బార్డర్స్ ఆఫ్ టైమ్ (2021), ది సబ్‌స్టిట్యూట్ (2022), రోబ్ ఆఫ్ జెమ్స్ (2022) మరియు ఈమి (2022) చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడతాయి.
ఎక్కువ మందికి అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్రముఖులు గురించి మాత్రమే తెలుసు. కానీ నవంబర్ 2022 లో గోవాలో అర్జెంటీనా సినిమా గొప్పదనాన్ని, అద్భుతాన్ని ప్రతి ఒక్కరూ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఆస్వాదించవచ్చు.
ఐఎఫ్ఎఫ్ఐ గురించి
1952లో ప్రారంభమైన భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ( ఐఎఫ్ఎఫ్ఐ ) ఆసియాలోని ప్రముఖ చలన చిత్రోత్సవాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సినిమా, కథలు మరియు వాటి వెనుక ఉన్న వ్యక్తులకు గుర్తింపు తేవడం లక్ష్యంగా భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరుగుతోంది. . చలనచిత్రాల పట్ల అభిమానం,ప్రేమ, జ్ఞానోదయమైన ప్రశంసలు పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి ,ప్రచారం చేయడానికి భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ప్రయత్నిస్తుంది. ప్రజల మధ్య ప్రేమ, అవగాహన మరియు సౌభ్రాతృత్వ సంబంధాలు అభివృద్ధి చేసి వ్యక్తులు, సమాజం నూతన శిఖరాలు చేరేలా ప్రోత్సహించడానికి భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కృషి చేస్తుంది.
కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా నిర్వహిస్తున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు గోవా ప్రభుత్వం ఆతిథ్యం ఇస్తుంది. గోవాలోని ఎంటర్‌టైన్‌మెంట్ సొసైటీ సహకారంతో ప్రతి సంవత్సరం భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం జరుగుతుంది. 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం కి సంబంధించిన తాజా సమాచారాన్ని ఉత్సవాల కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వెబ్‌సైట్ www.iffigoa.org లో, పిఐబి వెబ్‌సైట్ ( pib.gov.in ), ట్విట్టర్,పేస్ బుక్ మరియు ఇంస్టాగ్రామ్ లో సోషల్ మీడియా ఖాతా, మరియు పిఐబి గోవా సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ద్వారా పొందవచ్చు.
***
(Release ID: 1876742)
Visitor Counter : 194