పర్యటక మంత్రిత్వ శాఖ
పాటా (పీఏటీఏ), భారతదేశం మధ్య బలమైన బంధంపై చర్చించడానికి డబ్ల్యూటీఎం 2022, లండన్‌లో పాటా సీఈవోతో సమావేశమైన కేంద్ర పర్యాటక శాఖ కార్యదర్శి
పాటా తదుపరి వార్షిక సదస్సును భారతదేశంలో నిర్వహించే అవకాశంపైనా చర్చ
प्रविष्टि तिथि:
10 NOV 2022 1:39PM by PIB Hyderabad
కీలకాంశాలు
- నవంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు లండన్‌లో జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం)-2022లో పాల్గొన్న భారత పర్యాటక మంత్రిత్వ శాఖ
- ఈ ఏడాది ప్రదర్శన అంశం "ది ఫ్యూచర్ ఆఫ్ ట్రావెల్ స్టార్ట్స్ నౌ"
న్యూ దిల్లీ, 10 నవంబర్, 2022
పసిఫిక్ ఆసియా ట్రావెల్ అసోసియేషన్ (పాటా), భారతదేశం మధ్య బలమైన బంధంపై చర్చించడానికి ఆ సంస్థ ముఖ్య కార్యదర్శి లిజ్ ఒర్తిగురాతో భారత పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీ అరవింద్ సింగ్, అదనపు కార్యదర్శి శ్రీ రాకేష్ కుమార్ వర్మ సమావేశమయ్యారు. భారతదేశంలో తదుపరి వార్షిక సదస్సు నిర్వహించే అవకాశం, పాటా ట్రావెల్ మార్ట్, ఇతర జీ-20 సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనడంపైనా చర్చించారు. నవంబర్ 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు లండన్‌లో జరిగిన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం) 2022లో భారత పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రతినిధి బృందం పాల్గొంది.
వివిధ రాష్ట్రాల పర్యాటక శాఖ మంత్రులు, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, భారతీయ ప్రయాణ & పర్యాటక సంస్థల ప్రతినిధులు భారత ప్రతినిధి బృందంలో ఉన్నారు. డబ్ల్యూటీఎం 2022లో భారత్ పాల్గొన్న సమయంలో టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు, మీడియా వంటి ప్రపంచ పర్యాటక పరిశ్రమ వర్గాలకు భారతదేశంలోని విభిన్న పర్యాటక అవకాశాల గురించి ప్రదర్శించి, వివరించారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ బిజినెస్ ఇండస్ట్రీ (సీబీఐ) అంతర్జాతీయ డైరెక్టర్ మిస్టర్ ఆండీ బర్వెల్‌ను కూడా భారత ప్రతినిధి బృందం కలుసుకుంది. భారత్‌లో వ్యాపార/పెట్టుబడి అవకాశాల గురించి ఈ భేటీలో చర్చించింది. భారతదేశం ఎంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానమో వివరించింది.

స్థిరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడం, పర్యాటక రంగం డిజిటలీకరణ, పర్యాటక ఎంఎస్‌ఎంఈలు & నైపుణ్యాల అభివృద్ధి వంటి అంశాలతో పర్యాటక రంగానికి భారతదేశం ఇస్తున్న ప్రాధాన్యతలను భారత బృందం పంచుకుంది. సంస్కృతి, వారసత్వం, ఆధ్యాత్మికత నిండిన పుణ్యభూమి భారతదేశం. దేశంలోని ప్రతి రాష్ట్రానికి సొంత, ప్రత్యేక పర్యాటక అవకాశాలను ప్రపంచానికి అందిస్తోంది. భారతదేశంలో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది, మహమ్మారి తర్వాత ఉద్భవిస్తున్న ధోరణులకు అనుగుణంగా సన్నద్ధమవుతోంది. జీ-20కి 2022 డిసెంబర్ నుంచి 2023 నవంబర్ వరకు కొనసాగే భారతదేశ అధ్యక్షత, మన దేశం అందిస్తున్న పర్యాటక అవకాశాలను ప్రపంచానికి మరింత దగ్గర చేయడానికి, ప్రపంచ వేదిక మీద మన పర్యాటక విజయ గాథలను పంచుకోవడానికి పర్యాటక రంగానికి సహాయపడుతుంది.
యూకే ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూకేఐబీసీ) మేనేజింగ్ డైరెక్టర్ మిస్టర్ కెవిన్ మెక్‌కోల్‌ను కూడా కలిసిన భారత ప్రతినిధి బృందం, రాబోయే పర్యాటక పెట్టుబడిదారు సదస్సులో పాల్గొనాలని ఆహ్వానించింది.
ప్రయాణ & పర్యాటక రంగంలో వాణిజ్యం, పెట్టుబడులను పెంచేలా కామన్‌వెల్త్‌లో సహకారాన్ని బలోపేతం చేయడం కోసం, అంతర్జాతీయ పర్యాటక & పెట్టుబడి సదస్సు (ఐటీఐసీ) ప్యానెల్‌లో శ్రీ అరవింద్ సింగ్ పాల్గొన్నారు.
సంబంధిత కథనాలు:
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1873930
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1874453
https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1874750
*******
(रिलीज़ आईडी: 1875041)
आगंतुक पटल : 187