వ్యవసాయ మంత్రిత్వ శాఖ
2వ BIMSTEC వ్యవసాయ మంత్రుల సమావేశానికి ఆతిథ్యం ఇచ్చిన భారతదేశం
సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర వ్యవసాయ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్
స్నేహపూర్వక వ్యవసాయ ఆహార వ్యవస్థ మరియు పోషకాహారం కోసం చిరుధాన్యాల ఉత్పత్తికి భారతదేశం అమలు చేస్తున్న కార్యక్రమంలో పాల్గోవాలని సభ్య దేశాలను కోరిన శ్రీ తోమర్
Posted On:
10 NOV 2022 3:00PM by PIB Hyderabad
బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ (BIMSTEC) రెండవ వ్యవసాయ మంత్రుల స్థాయి సమావేశం ఈరోజు జరిగింది. భారతదేశం ఆతిధ్యం ఇచ్చిన సమావేశానికి కేంద్ర వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అధ్యక్షత వహించారు. భూటాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, థాయ్‌లాండ్ దేశాల వ్యవసాయ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ తోమర్ మాట్లాడారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తీసుకు రావడానికి ప్రాంతీయ వ్యూహాన్ని అభివృద్ధి చేయడంలో సభ్య దేశాలు సహకరించాలని శ్రీ తోమర్ కోరారు. సమగ్ర పౌష్టికాహారంలో చిరు ధాన్యాలు కీలకంగా ఉంటాయని అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం - 2023 సందర్భంగా చిరుధాన్యాల సాగు మరియు దాని ఉత్పత్తులను ప్రోత్సహించడానికి భారతదేశం అమలు చేస్తున్న చర్యలను మంత్రి వివరించారు.అందరికీ అనుకూలమైన వ్యవసాయ ఆహార వ్యవస్థను మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి తగిన చర్యలు తీసుకోవాలని శ్రీ తోమర్ సభ్యదేశాలను కోరారు. ఆహారంగా చిరుధాన్యాలను ప్రోత్సహించే అంశంలో భారతదేశం అమలు చేస్తున్న కార్యక్రమాల్లో పాల్గొని సహకరించాలని సభ్య దేశాలను ఆయన కోరారు. వ్యవసాయ జీవవైవిధ్యాన్ని పరిరక్షించడానికి మరియు రసాయనాల వాడకాన్ని తగ్గించడానికి సహజ మరియు పర్యావరణ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని శ్రీ తోమర్ అన్నారు.
డిజిటల్ వ్యవసాయం మరియు ఖచ్చితమైన వ్యవసాయం తో పాటు 'వన్ హెల్త్' విధానంలో భారతదేశంలో కార్యక్రమాలు రూపుదిద్దుకుంటున్నాయని శ్రీ తోమర్ చెప్పారు. ఆహార భద్రత, పోషకాహారం, పర్యావరణ పరిరక్షణ, జీవనోపాధిని కల్పించడానికి వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో కలిసి కార్యక్రమాలు అమలు చేయాల్సి ఉంటుందని శ్రీ తోమర్ స్పష్టం చేశారు. దీనిలో భాగంగా వాతావరణ మార్పు, వ్యవసాయ-జీవవైవిధ్యం, సూక్ష్మజీవుల నివారణ వంటి సవాళ్లను ఎదుర్కోడానికి సాంకేతిక మరియు ఆర్థిక సహకారాన్ని 'వన్ హెల్త్' విధానం ఇతర కార్యక్రమాల కింద సభ్య దేశాల మధ్య సహకారం అవసరం ఉంటుందని అన్నారు.
బంగాళాఖాతం ప్రాంతంలో ఆహార భద్రత, శాంతి మరియు సంక్షేమం కోసం BIMSTEC దేశాలు కలిసి పనిచేయాలని 2022 మార్చి నెలలో లో కొలంబోలో జరిగిన 5 వ BIMSTEC సదస్సులో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను సభ్య దేశాలకు శ్రీ తోమర్ గుర్తు చేశారు. వ్యవసాయ ఉత్పాదకత, ఆహార భద్రత మరియు పోషకాహారం, స్థిరత్వం, పరిశోధన మరియు అభివృద్ధిని ప్రోత్సహించడానికి మరియు వ్యవసాయ-వ్యాపారం, వాతావరణ మార్పుల నిర్వహణ, డిజిటల్ వ్యవసాయం మొదలైన రంగాలలో BIMSTEC కు పూర్తి సహకారం అందించేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
BIMSTEC వ్యవసాయ సహకారాన్ని (2023-2027) బలోపేతం చేయడానికి 2 వ BIMSTEC వ్యవసాయ మంత్రుల సమావేశం కార్యాచరణ ప్రణాళికను ఆమోదించింది. బిమ్స్‌టెక్ సెక్రటేరియట్ మరియు ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎఫ్‌పిఆర్‌ఐ) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. మత్స్య మరియు పశువుల ఉప రంగాలను వ్యవసాయ వర్కింగ్ గ్రూప్ పరిధిలోకి తీసుకురావడానికి సమావేశం అంగీకరించింది. వ్యవసాయ పరిశోధన మరియు అభివృద్ధి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి మరియు వ్యవసాయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పిహెచ్‌డి ప్రోగ్రామ్‌లకు ఒక్కొక్కటి ఆరు స్కాలర్‌షిప్‌లను ప్రదానం చేయడం కోసం భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను BIMSTEC సభ్య దేశాలు అభినందించాయి.
సమావేశంలో కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి, వ్యవసాయ పరిశోధన మరియు విద్యా శాఖ (DARE) కార్యదర్శి మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
1997 సంవత్సరంలో BIMSTEC ఏర్పాటయింది. దీనిలో దక్షిణాసియాలోని ఐదు దేశాలు - బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్, శ్రీలంక మరియు రెండు ఆగ్నేయాసియా దేశాలు - మయన్మార్ మరియు థాయిలాండ్ సభ్యత్వం కలిగి ఉన్నాయి.
***
(Release ID: 1875039)
Visitor Counter : 205