ప్రధాన మంత్రి కార్యాలయం
‘ఇన్వెస్ట్ కర్ణాటక-2022’ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగం
“ప్రతిభ లేదా సాంకేతికతల విషయానికొస్తే…
మదిలో మొదట మెదిలేది ‘బ్రాండ్ బెంగుళూరు”;
“పోటీతత్వం.. సహకారాత్మక సమాఖ్య వాదానికి
సరైన ఉదాహరణ ‘ఇన్వెస్ట్ కర్ణాటక-2022”;
“ఈ అనిశ్చితి వేళ భారత ఆర్థికవ్యవస్థ మూలాలపై ప్రపంచానికి నమ్మకముంది”;
“పెట్టుబడిదారులను జాప్యంలో ముంచడానికి బదులు
పెట్టుబడులకు ఎర్ర తివాచీ వాతావరణం సృష్టించాం”;
“సాహసోపేత సంస్కరణలు.. భారీ మౌలిక వసతులు..
అత్యుత్తమ ప్రతిభతోనే నవ భారతం నిర్మాణం సాధ్యం”;
“పెట్టుబడి.. మానవ మూలధనంపై దృష్టి పెడితేనే ప్రగతి లక్ష్యాలు సాధించగలం”;
“రెండు ఇంజన్ల ప్రభుత్వ సామర్థ్యంతోనే ప్రగతి పథంలో కర్ణాటక పరుగు”;
“భారత్‌లో పెట్టుబడులంటే- సార్వజనీనతలో.. ప్రజాస్వామ్యంలో.. ప్రపంచం కోసం మెరుగైన-పరిశుభ్ర-సురక్షిత భూగోళం కోసం పెట్టుబడి పెట్టడం”
Posted On:
02 NOV 2022 11:40AM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉదయం ‘ఇన్వెస్ట్ కర్ణాటక-2022’ ఇతివృత్తంగా నిర్వహిస్తున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభోత్సవంలో వీడియో కాన్ఫరెన్సింగ్ సౌకర్యం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత- నిన్న కర్ణాటక ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకున్న రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటక విశిష్టతను వివరిస్తూ… ఈ రాష్ట్రం సంప్రదాయం, సాంకేతికత, ప్రకృతి-సంస్కృతి, అద్భుత వాస్తుశిల్పం, శక్తిమంతమైన అంకుర సంస్థల సమ్మేళనమని ఆయన వ్యాఖ్యానించారు. “ప్రతిభ లేదా సాంకేతికత విషయంలో ముందుగా మదిలో మెదిలేది ‘బ్రాండ్ బెంగుళూరు’. ఈ పేరు దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది” అని శ్రీ మోదీ అన్నారు.
కర్ణాటకలో పెట్టుబడిదారుల సదస్సు నిర్వహించడంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేస్తూ- పోటీతత్వం.. సహకారాత్మక సమాఖ్య వాదానికి ఇది సరైన ఉదాహరణగా పేర్కొన్నారు. తయారీ, ఉత్పాదకత ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు-నియంత్రణపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. “ఈ ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు ద్వారా రాష్ట్రాలు నిర్దిష్ట రంగాలను లక్ష్యం చేసుకోవడం సహా ఇతర దేశాలతో భాగస్వామ్యం ఏర్పరచుకోగలవు” అని ప్రధాని చెప్పారు. ఈ సదస్సులో భాగంగా రూ.వేల కోట్ల విలువైన భాగస్వామ్యాలపై ప్రణాళికల ద్వారా దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెరగనుండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ 21వ శతాబ్దంలో భారతదేశం ప్రస్తుత స్థితినుంచి ముందుకు సాగాల్సి ఉందని ప్రధానమంత్రి అన్నారు. భారత్‌కు నిరుడు రికార్డు స్థాయిలో 84 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. భారతదేశంపై ప్రపంచానికిగల ఆశాభావాన్ని ప్రస్తావిస్తూ- “ఇది వివిధ రకాల అనిశ్చితి రాజ్యమేలుతున్న సమయం.. అయినప్పటికీ చాలా దేశాలు భారత ఆర్థిక వ్యవస్థ మూలాల విషయంలో పూర్తి నమ్మకంతో ఉన్నాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నేటి భిన్నాభిప్రాయాల కాలంలో భారతదేశం ప్రపంచంతో కలిసి నడుస్తూ కలిసి పనిచేయడానికి ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. సరఫరా ప్రక్రియకు అంతరాయం ఏర్పడిన సమయంలో మందులు, టీకాల సరఫరాపై భారతదేశం ప్రపంచానికి భరోసా ఇవ్వగలిగిందని ఆయన గుర్తుచేశారు. మార్కెట్ వాతావరణం సంతృప్త స్థితిలో ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్లు మన పౌరుల ఆకాంక్షలవల్ల బలంగా ఉన్నాయని తెలిపారు. ప్రపంచం సంక్షోభంలో మునిగినా భారత్ ఉజ్వల ప్రకాశంతో కొనసాగుతుందని నిపుణులు, విశ్లేషకులు, ఆర్థిక వేత్తలు అభివర్ణించినట్లు ప్రధానమంత్రి గుర్తుచేశారు. “భారత ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్ఠం చేయడంలో భాగంగా మన మూలాలను సుస్థిరం చేసేందుకు అనునిత్యం కృషి చేస్తున్నాం” అని అని శ్రీ మోదీ అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని ప్రధాని నొక్కిచెప్పారు. విధానాలు-అమలు సంబంధిత సమస్యలతో దేశం 9-10 ఏళ్ల కిందట సతమతం అవుతున్నపుడు మార్పు దిశగా విధానాలు మలుపు తిరగడం గురించి ఆయన వివరించారు. ఆ మేరకు “పెట్టుబడిదారులను జాప్యంలో ముంచడానికి బదులు పెట్టుబడులకు ఎర్ర తివాచీ వాతావరణం సృష్టించాం. అలాగే కొత్త సంక్లిష్ట చట్టాల రూపకల్పనకు బదులు మేం వాటిని హేతుబద్ధం చేశాం” అని ఆయన విశదీకరించారు.
ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- “సాహసోపేత సంస్కరణలు, భారీ మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ ప్రతిభతోనే నవ భారతదేశం నిర్మించడం సాధ్యం” అన్నారు. నేడు ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ సాహసోపేత సంస్కరణలు అమలవుతున్నాయని చెప్పారు. ఈ సందర్భంగా జీఎస్టీ, ఐబీసీ, బ్యాంకింగ్ సంస్కరణలు, యూపీఐ, 1500 కాలం చెల్లిన చట్టాల రద్దు, 40 వేల అనవసర నిబంధనల తొలగింపు తదితరాలను ఆయన ఉదాహరించారు. కంపెనీల చట్టంలోని అనేక నిబంధనలను నేరరహితం చేయడంతోపాటు పరోక్ష మూల్యాంకనం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కొత్త అవకాశాల కల్పన, డ్రోన్ నిబంధనల సరళీకరణతోపాటు భూగోళ-ప్రాదేశిక, అంతరిక్ష, రక్షణ వంటి రంగాల్లో చేపట్టిన చర్యలు అనూహ్య శక్తినిస్తున్నాయని గుర్తుచేశారు. గత 8 సంవత్సరాల్లో కార్యకలాపాలు సాగే విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైందని, 20కిపైగా నగరాలకు మెట్రో రైలు సేవలు విస్తరించాయని ప్రధానమంత్రి అన్నారు.
పీఎం-గతిశక్తి జాతీయ బృహత్ ప్రణాళిక లక్ష్యాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఇది సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నదని తెలిపారు. దీని అమలులో భాగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి సహా ప్రస్తుత సదుపాయాల సద్వినియోగానికి పకడ్బందీ ప్రణాళిక రచించడమేగాక దాన్ని అమలు చేసే సమర్థ మార్గం గురించి కూడా చర్చించినట్లు ఆయన వెల్లడించారు. చిట్టచివరిదాకా అనుసంధానం, ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం ద్వారా ఉత్పత్తి లేదా సేవలను మెరుగుపరచే మార్గాల గురించి శ్రీ మోదీ నొక్కి చెప్పారు. ఈ ప్రయాణంలో యువత సాధించిన ప్రగతిని ఎత్తిచూపుతూ- దేశంలోని ప్రతి రంగం యువశక్తి సామర్థ్యంతో ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు.
చివరగా- “పెట్టుబడులు, మానవ మూలధనంపై నిశితంగా దృష్టి సారించినపుడే ప్రగతి లక్ష్యాలను సాధించగలం. ఈ ఆలోచన ధోరణితో ముందడుగు వేస్తూ ఆరోగ్య, విద్యారంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాం. అదే సమయంలో ఉత్పాదకత పెంపు, మానవ మూలధన మెరుగుదలపైనా దృష్టి కేంద్రీకరించాం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఏకకాలంలో వివిధ రంగాలకు ప్రాధాన్యమిస్తూ వాటిపై దృష్టి సారించడం గురించి ఆయన వివరించారు. తదనుగుణంగా ఆరోగ్య హామీ పథకాలతోపాటు తయారీ రంగానికి ప్రోత్సాహకాలు; వాణిజ్య సౌలభ్యం, ఆరోగ్య-శ్రేయో కేంద్రాలు; జాతీయ రహదారుల నెట్‌వర్క్, సురక్షిత నీటి సరఫరా, మరుగుదొడ్ల సౌకర్యం కల్పన; అత్యాధునిక పాఠశాలలుసహా భవిష్యత్ అవసరాలు తీర్చగల మౌలిక సదుపాయాలు వంటివాటిని ప్రధాని ఉదాహరించారు. పర్యావరణహితంగా దేశాభివృద్ధి గురించి మాట్లాడుతూ- “హరిత వృద్ధి, సుస్థిర ఇంధనం దిశగా మా కార్యక్రమాలు మరింత ఎక్కువగా పెట్టుబడిదారులను ఆకర్షించాయి. తమ ఖర్చును రాబట్టుకోవడంతోపాటు ఈ భూగోళం పట్ల తమ బాధ్యతను నెరవేర్చుకోవాలని భావించేవారు భారతదేశం వైపు ఆశాభావంతో చూస్తున్నారు” అని ప్రధానమంత్రి వివరించారు.
అనేక రంగాల లో వేగవంతమైనటువంటి అభివృద్ధి ని కర్నాటక సాధించిందంటే అందుకు ఒక కారణం కర్నాటక లో డబల్ ఇంజిన్ ప్రభుత్వం యొక్క శక్తి అని ప్రధాన మంత్రి అన్నారు. వ్యాపారాన్ని నిర్వహించడం లో సౌలభ్యం సంబంధి అగ్రగామి రాష్ట్రాల లో కర్నాటక తన స్థానాన్ని నిలబెట్టుకొంటూనే ఉంటోందని ఆయన చెప్తూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ) పరంగా అగ్రగామి రాష్ట్రాల పట్టిక లో కర్నాటక చేరడానికి ఇది తోడ్పడిందన్నారు. ‘‘ఫార్చ్యూన్ 500 కంపెనీల లో 400 కంపెనీ లు ఇక్కడే ఉన్నాయి. భారతదేశం లో వంద కు పైబడ్డ యూనికార్న్ ల లో నలభై కి పైగా యూనికార్న్ లు కర్నాటక లో ఉన్నాయి’’ అని ఆయన నొక్కిచెప్పారు. ప్రస్తుతం ప్రపంచం లో అతి పెద్దదైనటువంటి టెక్నాలజీ క్లస్టర్ గా కర్నాటక లెక్కకు వస్తున్నది అని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. కర్నాటక లో పరిశ్రమ, సమాచార సాంకేతిక విజ్ఞానం, ఫిన్ టెక్, బయోటెక్, స్టార్ట్ అప్స్ తో పాటు సస్టెయినబుల్ ఎనర్జి లకు ఆలవాలం గా ఉంది అని కూడా ఆయన అన్నారు. ప్రతి రంగం లో అభివృద్ధి తాలూకు ఒక కొత్త గాథ ను లిఖించడం జరుగుతోంది’’ అని ఆయన అన్నారు. కర్నాటక లో అభివృద్ధి కి సంబంధించినటువంటి అనేక పరామితులు భారతదేశం లోని ఇతర రాష్ట్రాల నే కాకుండా కొన్ని దేశాల ను కూడాను సవాలు చేస్తున్నాయి అని ప్రధాన మంత్రి చెప్పారు. భారతదేశం తయారీ రంగం లో ఒక సరికొత్త దశ లోకి అడుగుపెడుతోంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, నేశనల్ సెమికండక్టర్ మిశన్ ను గురించి ప్రస్తావించారు. ఇక్కడి టెక్ ఇకోసిస్టమ్ అనేది చిప్ డిజైను ను మరియు తయారీ ని నూతన శిఖరాల కు తీసుకొనిపోగలదు అని కూడా పేర్కొన్నారు.
భారతదేశం యొక్క దృష్టికోణాని కి మరియు ఒక ఇన్ వెస్టరు దృష్టికోణాని కి మధ్య పోలిక ను గురించి ప్రధాన మంత్రి చెప్తూ, ఒక ఇన్ వెస్టరు యొక్క నిర్ణయాలు అనేవి మధ్య కాలిక మరియు దీర్ఘకాలిక దృష్టికోణాల ఆధారం గా రూపుదాల్చుతుంటాయి అని, అలాగే భారతదేశం సైతం ఒక ప్రేరణాత్మకమైనటువంటి దీర్ఘకాల దృష్టికోణాన్ని కలిగివుందని వివరించారు. నానో యూరియా, హైడ్రోజన్ ఎనర్జి, గ్రీన్ అమోనియా, బొగ్గు నుండి గ్యాస్ ను వెలికితీయడం మరియు అంతరిక్ష కృత్రిమ ఉపగ్రహాలు వంటి ఉదాహరణల ను ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం భారతదేశం ప్రపంచం లో అభివృద్ధి మంత్రం తో ముందుకు సాగుతోంది అని ఆయన అన్నారు. ఇది భారతదేశానికి అమృత కాలం, మరి అలాగే ఆజాది కా అమృత్ మహోత్సవ్ కూడాను; దేశ ప్రజలు ఒక న్యూ ఇండియా ను నిర్మించాలి అనేటటువంటి ఒక ప్రతిజ్ఞ ను స్వీకరిస్తున్నారు.’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగం చివర లో, భారతదేశం 2047వ సంవత్సరానికల్లా అభివృద్ధి చెందిన దేశం గా రూపొందాలి అనేటటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకొంది అని వెల్లడించారు. మరి దీనికోసం పెట్టుబడి మరియు భారతదేశం యొక్క ప్రేరణ లు అనే అంశాల కలయిక చాలా ముఖ్యమైంది అవుతుంది; అన్ని వర్గాల ను కలుపుకొనిపోయేటటువంటి, ప్రజాస్వామికమైనటువంటి మరియు బలమైనటువంటి భారతదేశం యొక్క అభివృద్ధి అనేది ప్రపంచం లో అభివృద్ధి ని శీఘ్రతరం చేస్తుంది కాబట్టి అని ఆయన వివరించారు. ‘‘భారతదేశం లో పెట్టుబడి పెట్టడం అంటే దానికి అర్థం అన్ని వర్గాల ను కలుపుకొని పోవడం లో పెట్టుబడి ని పెట్టడం, ప్రజాస్వామ్యం లో పెట్టుబడి ని పెట్టడం, ప్రపంచం కోసం పెట్టుబడి ని పెట్టడం, ఒక మెరుగైనటువంటి, స్వచ్ఛమైనటువంటి మరియు భద్రమైనటువంటి భూమి కోసం పెట్టుబడి ని పెట్టడం’’ అని వివరిస్తూ ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
పూర్వరంగం
ఔత్సాహిక ఇన్ వెస్టర్ లను ఆకట్టుకోవడం తో పాటు గా తదుపరి పది సంవత్సరాల కు గాను ఒక అభివృద్ధి సంబంధి ప్రణాళిక ను రూపొందించడం కూడా ఈ సమావేశం యొక్క ధ్యేయాలు గా ఉన్నాయి. బెంగళూరు లో మూడు రోజుల పాటు, నవంబర్ 2వ తేదీ మొదలుకొని నవంబర్ 4వ తేదీ వరకు, జరుగనున్న ఈ కార్యక్రమం లో 80కి పైగా ప్రసంగపూర్వక గోష్ఠులు చోటు చేసుకొంటాయి. శ్రీయుతులు కుమార్ మంగళం బిడ్ లా, సజ్జన్ జిందల్, విక్రమ్ కిర్లోస్ కర్ ల వంటి అగ్రగామి పరిశ్రమ రంగ ప్రముఖులు వీటి కి హాజరు కానున్నారు. దీనికి తోడు, 300కు పైగా ప్రదర్శకులతో సహా అనేక వ్యాపార ప్రదర్శనలు, దేశాల తరఫు గోష్ఠులు కూడా నడుస్తాయి. ఈ గోష్ఠులు భాగస్వామ్య దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా ల ద్వారా నిర్వహించబడతాయి. ఇందులో భాగం గా ఆయా దేశాల నుండి మంత్రులు, పరిశ్రమ రంగ దిగ్గజాలు వంటి ఉన్నత స్థాయి ప్రతినిధులు దీనికి హాజరు అయ్యేటట్టు ఆయా దేశాలు ఏర్పాటుల ను చేశాయి. ఈ అంతర్జాతీయ స్థాయి కార్యక్రమం కర్నాటక కు తన సంస్కృతి ని ప్రపంచాని కి ప్రదర్శించే అవకాశాన్ని సైతం ఇవ్వనుంది.
*****
DS/TS
(Release ID: 1873009)
Visitor Counter : 232
Read this release in:
Marathi
,
Odia
,
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Kannada
,
Malayalam