నౌకారవాణా మంత్రిత్వ శాఖ

వివిధ పీపీపీ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌సీడీపీఎం 2.0 కార్యక్రమం కింద ‘పీపీపీ సమస్యల పరిష్కార వేదిక’ నిర్వహణ: అన్ని ప్రధాన నౌకాశ్రయాల్లో పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులు పరిష్కరించడానికి మార్గదర్శకాలు జారీ


పీపీపీ సంబంధిత వర్గాల సమస్యలు పరిష్కరించే ప్రధాన మార్గంగా మారిన 'ప్రత్యేక కార్యక్రమం 2.0'

ఓడరేవులకు చెందిన అన్ని టెర్మినల్ ఆపరేటర్ల మధ్య నిర్ణయాత్మక చర్చలు

Posted On: 31 OCT 2022 2:47PM by PIB Hyderabad

'పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం' (ఎస్‌సీడీపీఎం) 2.0లో భాగంగా; కేంద్ర నౌకాశ్రయాలు, నౌక రవాణా & జలమార్గాల మంత్రిత్వ శాఖ పరిధిలోని అన్ని ప్రధాన పోర్టులు కార్యశాలలు నిర్వహించాయి. పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులను పరిష్కరించడానికి పీపీపీ సంబంధిత వర్గాల కోసం ఈ కార్యశాలలను ఏర్పాటు చేశాయి. సాధ్యమైనన్ని ఎక్కువ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించడం, మిగిలిన సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కాలావధి ప్రకటించడం కార్యశాలల నిర్వహణలో ప్రాథమిక లక్ష్యం.

ప్రధాన ఓడరేవుల్లో, పారాదీప్ పోర్ట్ అథారిటీ వివిధ వర్గాలతో పీపీపీ ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించింది. సంబంధిత వర్గాలు/క్యాప్టివ్ బెర్త్ ఆపరేటర్ల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. వాళ్ల సమస్యలను శ్రద్ధగా విన్న పోర్ట్ మేనేజ్‌మెంట్,  వాటిలో చాలా వరకు పరిష్కరించింది.

కాండ్లాలోని దీనదయాళ్‌ పోర్ట్ అథారిటీ కూడా పీపీపీ ఫిర్యాదుల పరిష్కారం కోసం కార్యశాలను నిర్వహించింది. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్, కాండ్లా ఇంటర్నేషనల్ కంటైనర్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్‌ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్ వంటి వర్గాలు ఇందులో పాల్గొన్నాయి.

టెర్మినల్ ఆపరేటర్ల కోసం మంత్రిత్వ శాఖ జారీ మార్గదర్శకాల ప్రకారం జవహర్‌లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ కూడా 'పీపీపీ ఫిర్యాదుల పరిష్కార సమావేశం' నిర్వహించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జేఎన్‌పీఏ చైర్మన్‌, పీపీపీ నమూనా గురించి వివరించారు. మొర్ముగావ్ పోర్ట్ అథారిటీ కూడా 'పీపీపీ ఫిర్యాదుల పరిష్కార సమావేశం' నిర్వహించింది. టెర్మినల్ ఆపరేటర్లు మెస్సర్స్‌ ఎస్‌డబ్ల్యూపీఎల్‌ (జేఎస్‌డబ్ల్యూ), అదానీ మొర్ముగావ్‌ పోర్ట్ టెర్మినల్ లిమిటెడ్ పాల్గొన్నాయి.

న్యూ మంగళూరు పోర్ట్ అథారిటీ (ఎన్‌ఎంపీఏ) కూడా ప్రత్యేక కార్యక్రమం 2.0లో భాగంగా, ఇప్పటికే ఉన్న పీపీపీ & క్యాప్టివ్ టెర్మినల్/బెర్త్ వర్గాలతో 'పీపీసీ ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం'పై హైబ్రిడ్ వర్క్‌షాపు నిర్వహించింది. ఎన్‌ఎంపీఏకు చెందిన అందరు విభాగాధిపతులు, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. పీపీపీ ఫిర్యాదుల వర్క్‌షాప్ పరిష్కార కార్యక్రమానికి సంబంధిత అన్ని వర్గాలవారు హాజరయ్యారు. ఇక్కడ కూడా వివిధ సమస్యలపై చర్చించారు.

కోల్‌కతాలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ నౌకాశ్రయం, తన వాటాదారులతో పీపీపీ సమస్యల పరిష్కార కార్యశాలను నిర్వహించింది. టీఎంఐఎల్‌ఎల్‌తో దీర్ఘకాలంగా ఉన్న ఒక సమస్యను ఇక్కడ చర్చించి ఒక ఉమ్మడి పరిష్కారం తీసుకున్నారు. పాల్గొన్నవారిలో, సెంచరీ పోర్ట్స్ లిమిటెడ్ ప్రతినిధి మాట్లాడారు. తాము ఇంకా కార్యకలాపాలు ప్రారంభించలేదని, ఒప్పందం కాల పరిమితికి కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. ఈ పరిష్కార సమావేశాలన్నీ వివిధ వర్గాల మధ్య విభేదాలను తొలగిస్తాయి, పీపీపీ ప్రాజెక్టుల అమలు వేగాన్ని పెంచుతాయి. తద్వారా మెరుగైన, మరింత సమర్థవంతమైన నౌకాశ్రయ సేవలు అందుబాటులోకి వస్తాయి.

2022 అక్టోబర్ 2 నుంచి అక్టోబర్‌ 31 వరకు జరిగిన 'పెండింగ్‌లో ఉన్న అంశాల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమం' (ఎస్‌సీడీపీఎం) 2.0 మొత్తం గొప్ప స్ఫూర్తిని నింపింది. ఓడరేవులు, నౌక రవాణా, జలమార్గాల మంత్రిత్వ శాఖ ప్రధాన సచివాలయం, అన్ని ప్రధాన ఓడరేవులు, ఇతర అనుబంధ/కింది స్థాయి కార్యాలయాలు స్వచ్ఛత & పెండింగ్ అంశాల పరిష్కారం కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాయి. ప్రత్యేక కార్యక్రమం 2.0లో భాగంగా, ఓడరేవులు అనేక 'ఉత్తమ విధానాలు' కూడా అమలు చేశాయి. కార్యాలయ ఆవరణ, చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రపరచడం, అవగాహన కార్యక్రమాలు, దస్త్రాలు & రికార్డుల డిజిటలీకరణ, మొక్కల పెంపకం, ఈ-కార్లు మొదలైనవి మాత్రమేగాక, చాలా నిబంధనలను కూడా సరళీకరించాయి.

***



(Release ID: 1872512) Visitor Counter : 94