యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ఈ సారి మధ్యప్రదేశ్ ఆతిథ్యం!
సి.ఎం. శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో
కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటన
ఎం.పి.లోని 8 నగరాల్లో వచ్చే ఏడాది జనవరి 31నుంచి ఫిబ్రవరి 11వరకూ నిర్వహణ
తొలిసారిగా జలక్రీడలకు స్థానం
Posted On:
20 OCT 2022 5:03PM by PIB Hyderabad
రాబోయే ఖేలో ఇండియా 5వ యువజన క్రీడోత్సవాలు (కె.ఐ.వై.జి.) మధ్యప్రదేశ్‌లో జరగనున్నాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమక్షంలో ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఈ క్రీడా పోటీలు 2023 జనవరి 31వ తేదీన ప్రారంభమై, 2023 ఫిబ్రవరి 11న ముగుస్తాయి.
గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమాణిక్ కూడా పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి యశోధర రాజే సింధియా, క్రీడాశాఖ కార్యదర్శి సుజాత చతుర్వేది, భారతీయక్రీడా ప్రాధికార సంస్థ (ఎస్.ఎ.ఐ.) డైరెక్టర్ జనరల్ సందీప్ ప్రధాన్, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు, అధికార ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం మధ్యప్రదేశ్‌కు ఇచ్చినందుకు ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ‘అతిథి దేవో భవ’ అనే మన తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రత్యేకమైన రీతిలో ఖేలో ఇండియా క్రీడోత్సవాలను తీర్చిదిద్దుతామని హామీ ఇస్తున్నాం.’ అని ఆయన అన్నారు.
“మధ్యప్రదేశ్‌లో ప్రపంచ శ్రేణి క్రీడా స్టేడియాలు ఉన్నాయి, అలాగే, షూటింగ్, జలక్రీడలకు అకాడమీలు తదితర సదుపాయాలు కూడా ఉన్నాయి. ఇంకా అనేక ఇతర సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మౌలిక సదుపాయాలలో అభివృద్ధి చెందుతూ ఉండటం, ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలకు ఆతిథ్యం ఇవ్వడం తదితర ప్రత్యేకతలతో మధ్యప్రదేశ్‌లో ఒక క్రీడా విప్లవం చోటుచేసుకోబోతున్నదని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.”అని ఆయన అన్నారు.
కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ, రాబోయే ఖేల్ ఇండియా యవజన క్రీడోత్సవాల్లో స్వదేశీ క్రీడలు మరోసారి కీలక భాగమవుతాయని అన్నారు, “ఒలింపిక్ క్రీడలు, స్వదేశీ క్రీడలకు అదే పద్ధతిలో మద్దతునివ్వాలన్నదే ప్రధానమంత్రి సంకల్పం. మల్లాఖాంబ్ క్రీడను తమ రాష్ట్ర క్రీడగా మార్చుకున్న మధ్యప్రదేశ్‌కు ఈ సందర్భంగా ధన్యావాదాలు తెలియజేస్తున్నాను.“ అని ఆయన అన్నారు.
‘క్రీడలు రాష్ట్రానికి సంబంధించిన అంశం. అయితే, మన క్రీడలకు సానుకూల వాతావరణంతో కూడిన వ్యవస్థను నిర్మించడంలో మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు చేస్తున్న కృషిని, చొరవ చూస్తే ఎంతో సంతోషంగా ఉంది. అన్ని రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆ రాష్ట్రంనుంచి నేర్చుకోవాలి. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, ఆ తర్వాత ఆపై స్థాయి వరకూ క్రీడాభివృద్ధికి పూర్తిగా సహకరించాలన్నది మనం అర్థం చేసుకోవాలి.”అని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు. అట్టడుగు స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడంలో ఖేల్ మహాకుంభ్, ముఖ్యమంత్రి కప్ (మధ్యప్రదేశ్) వంటి క్రీడా పోటీల పాత్ర ప్రశంసనీయమేనని ఆయన అన్నారు. ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు, దేశంలోని క్రీడలకు, క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందించాయని అనురాగ్ సింగ్ ఠాకూర్ పునరుద్ఘాటించారు. ఈ కారణంగానే హర్యానాలో జరిగిన గత ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో 12 జాతీయ రికార్డులు బద్దలయ్యాయని చెప్పారు.
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ సహాయమంత్రి నిశిత్ ప్రమాణిక్ మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. “కొన్నేళ్లుగా క్రీడాకారులకు మద్దతుగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తనకు సాధ్యమైనంత కృషి చేసింది. అథ్లెట్లు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రధానమంత్రి దార్శనిక దృష్టి ఎలా దోహదపడుతుంతో ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకోవాలి. ‘మహాకాళ్ భూమి’లో జరగనున్న ఈ ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవవి నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను.“ అని అన్నారు.
మధ్యప్రదేశ్ క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి యశోధర రాజే మాట్లాడుతూ భారతదేశంలో క్రీడలకు సానుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం తన వంతు కృషి చేసిందన్నారు. క్రీడల్లో భారత క్రీడాకారులు ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్నారని. ముఖ్యంగా మన ఆడపడుచులు పతకాలు సాధిస్తూ క్రీడల్లో భారతదేశానికే గర్వకారణంగా నిలుస్తున్నారని అన్నారు.
రానున్న ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో మొత్తం 27 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి.; ఖేలో ఇండియా క్రీడోత్సవాల చరిత్రలోనే మొదటిసారిగా ఈ సారి జల క్రీడలను చేర్చారు. ఈ ఉత్సవాల్లో సాధారణ క్రీడలు, స్వదేశీ క్రీడాపోటీలతో పాటుగా, కనోయ్ స్లలోమ్, కయాకింగ్, కెనోయింగ్, రోయింగ్ వంటి కొత్త విభాగాల్లో కూడా పోటీలు నిర్వహిస్తారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, ఉజ్జయిని, గ్వాలియర్, జబల్‌పూర్, మాండ్లా, ఖర్గోన్ (మహేశ్వర్), బాలాఘాట్ వంటి ఎనిమిది నగరాల్లో ఖేలో ఇండియా యువజన క్రీడలు జరుగుతాయి.
*****
(Release ID: 1869766)
Visitor Counter : 151