ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మోదీ విద్యా ప్రాంగణం తొలిదశకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం

Posted On: 10 OCT 2022 6:41PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిరుపేద విద్యార్థుల కోసం ఉద్దేశించిన ‘మోదీ శైక్షానిక్‌ సంకుల్‌’ (మోదీ విద్యా ప్రాంగణం) తొలిదశను ప్రారంభించారు. విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా వారికి సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా శ్రీ మోద్ వణిక్ మోదీ సమాజ్ హితవర్ధక్‌ ట్రస్ట్ ఈ ప్రాంగణాన్ని నిర్మిస్తోంది. ఈ భవనం ప్రారంభోత్సవానికి గుర్తుగా ప్రధానమంత్రి రిబ్బను కత్తిరించారు. తర్వాత దీపం వెలిగించిన శ్రీ మోదీ, భవనంలో తిరుగుతూ సౌకర్యాలను పరిశీలించారు.

   అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన సభికులనుద్దేశించి ప్రసంగిస్తూ- నిన్న మోధేశ్వరి మాతను దర్శించుకుని, పూజలు చేయించే అదృష్టం తనకు లభించిందని తెలిపారు. ఈ సందర్భంగా జనరల్‌ కరియప్ప చెప్పిన ఓ ఆసక్తికరమైన ఉదంతాన్ని ప్రజలతో పంచుకున్నారు. జనరల్‌ కరియప్ప ఎక్కడికి వెళ్లినా ఆయనపై గౌరవంతో అందరూ సెల్యూట్‌ చేసేవారు. అయితే, తన స్వగ్రామంలో ప్రజలు ఒక వేడుక సందర్భంగా సత్కరించడంతో తానెంతో విభిన్నమైన సంతృప్తి, ఆనందం పొందానని కరియప్ప తెలిపారు. తన ఈ పర్యటనలో సదరు ఉదంతం సారూప్యాన్ని ప్రధానమంత్రి ఉటంకిస్తూ- తాను తిరిగి ఇక్కడికి వచ్చినపుడు తనవారైన మోదీ సమాజ్ ఎంతో గౌరవిస్తూ ఆశీస్సులు అందించడం చూసి తనకూ అదేవిధమైన సంతృప్తి, ఆనందం కలిగాయని పేర్కొన్నారు. మోదీ సమాజ్ సభ్యులు ఈ సందర్భాన్ని సజీవం చేస్తూ విద్యకు అత్యంత ప్రాధాన్యమివ్వడంపై ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. “కాలం కలిసిరాకపోయినా లక్ష్యసాధనలో మీరు ఎంతమాత్రం వెనక్కు తగ్గలేదు. ప్రతి ఒక్కరూ చేయికలిపి సామూహికంగా ఈ పనులకు ప్రాధాన్యమిచ్చారు” అని కొనియాడారు.

   మోదీ సమాజ్ సభ్యుల పురోగమనానికి పరిమిత అవకాశాలున్న రోజులను ప్రధాని గుర్తుచేసుకుంటూ “ఇవాళ సమాజ్‌ సభ్యులు తమదైన రీతిలో ముందడుగు వేయడం మనం చూస్తున్నాం” అని వ్యాఖ్యానించారు. ఒక విద్యా వ్యవస్థ ఏర్పాటు కోసం అందరూ ఒక్కటై పనిచేశారని, ఈ సమష్టి కృషే మోదీ సమాజ్కు బలమని ప్రధాని అన్నారు. “మార్గం మంచిదైనపుడు ఈ విధంగా సమాజ సంక్షేమాన్ని సాధించవచ్చు” అని శ్రీ మోదీ పేర్కొన్నారు. “ఒక సమాజంగా ఎవరికివారు తమ సమస్యలను పరిష్కరించుకోవడం, అవమానాలను అధిగమిస్తూనే, వారు మరెవరికీ అడ్డుపడకపోవడం చాలా గర్వించదగిన విషయం” అన్నారు.  మోదీ సమాజ్‌లో ప్ర‌తి ఒక్క‌రూ ఐక్యంగా ఉంటూ ఈ క‌లియుగంలో త‌మ భ‌విష్య‌త్తు గురించి ఆలోచిస్తున్నందుకు ప్ర‌ధానమంత్రి హర్షం వెలిబుచ్చారు.

   ప్రధానమంత్రి తన సమాజానికి తానెంతో రుణపడి ఉన్నానని, దీన్ని తీర్చుకోవాల్సి ఉందని చెబుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గడ్డమీద పుట్టిన పుత్రుడు గుజరాత్‌కు దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఇప్పుడు రెండోసారి దేశ ప్రధాని కాగలిగాడని పేర్కొన్నారు. తాను సుదీర్ఘకాలం పాలన బాధ్యతలలో ఉన్నప్పటికీ తన సమాజ్‌ సభ్యులలో ఏ ఒక్కరూ వ్యక్తిగత పనుల కోసం తనవద్దకు రాలేదని పేర్కొన్నారు. ఇది తన సమాజ్‌ సంస్కారమని, అందుకే హృదయపూర్వకంగా మోదీ సమాజ్‌కు నమస్కరిస్తున్నానని శ్రీ మోదీ పేర్కొన్నారు.

   నేడు అనేకమంది యువత వైద్య, ఇంజనీరింగ్‌, తదితర కోర్సులు అభ్యసించేందుకు మొగ్గు చూపుతుండటంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. నైపుణ్యాభివృద్ధి ప్రాధాన్యాన్ని నొక్కిచెబుతూ పిల్లలు తమ చదువులు పూర్తిచేసే సమయంలో వారికి ఎదురయ్యే కష్టనష్టాల గురించి తల్లిదండ్రులు మాట్లాడి, నైపుణ్యం పెంచుకోవడంపై వారికి మార్గనిర్దేశం చేయాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధితో వారికి సాధికారత కలుగుతుందని, అటుపైన వారు వెనుదిరిగి చూడాల్సిన అవసరమే రాదని చెప్పారు. నైపుణ్యాన్ని వృద్ధి చేసుకున్నపుడు వారికి నైపుణ్యం అలవడుతుంది కాబట్టి వారు వెనుదిరిగి చూసే అవసరం రాదు. మిత్రులారా కాలం మారుతోంది.. పట్టభద్రులకన్నా నైపుణ్యం గలవారి శక్తికి ప్రోత్సహం అవసరం” అని శ్రీ మోదీ అన్నారు.

   సింగపూర్‌లో అధికార పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధానమంత్రితో తన సంభాషణను ప్రధాని గుర్తుచేసుకున్నారు. అక్కడ తాను స్వయంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థను సందర్శించాల్సిందిగా ఆయన తనను ఒప్పించారని తెలిపారు. అక్కడికి వెళ్లిన తనకు ఆ సంస్థ ఆధునికత ఆశ్చర్యం కలిగించిందన్నారు. సింగపూర్‌లోని సంపన్నుల పిల్లలు కూడా అందులో ప్రవేశం కోసం బారులు తీరేవారని పేర్కొన్నారు. అదేవిధంగా మోదీ సమాజ్ గొప్పతనం గురించి ప్రధాని ప్రస్తావిస్తూ- మన పిల్లలు కూడా ఇందులో భాగం కావడం గర్వకారణంగా భావించే పరిస్థితి రావాలని ఉద్బోధించారు.

   చివరగా- శారీరక శ్రమకూ అపారశక్తి ఉందని, మోదీ సమాజ్‌లో ఒక పెద్ద వర్గం ఈ కఠోరశ్రమ చేసే కార్మికవర్గానికి చెందినది.. ‘వారిని చూసి గర్వించండి’ అని ప్రధానమంత్రి సూచించారు. స‌మాజ్‌ సభ్యులు తమవారు బాధ‌ప‌డ‌టాన్ని ఎన్న‌డూ సహించలేదని, అలాగే ఇతర సమాజాలతో ఎన్నడూ తప్పుగా వ్యవహరించలేదని సగర్వంగా చెప్పగలనని ప్రధాని పేర్కొన్నారు. “ఎల్లప్పుడూ మనం ఇలా కొనసాగే ప్రయత్నం చేయాలి… అప్పుడు రాబోయే తరం సగర్వంగా పురోగమిస్తుందని నేను కచ్చితంగా విశ్వసిస్తున్నాను” అని శ్రీ మోదీ ముగించారు.

   గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంట్ సభ్యులు శ్రీ సి.ఆర్.పాటిల్, శ్రీ నరహరి అమీన్, గుజరాత్ మంత్రి శ్రీ జితూభాయ్ వఘాని, శ్రీ మోద్ వణిక్ మోదీ సమాజ్ హితవర్ధక్‌ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ ప్రవీణ్ భాయ్ చిమన్‌లాల్ మోదీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


(Release ID: 1866711) Visitor Counter : 160