జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జలశక్తి మంత్రిత్వశాఖలోని తాగునీరు-పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో 2022 అక్టోబరు 2న స్వచ్ఛభారత్‌ దినోత్సవం ముఖ్యఅతిథిగా వేడుకలకు అధ్యక్షత వహించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము;


‘స్వచ్ఛభారత్‌ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2022.. జేజేఎం ఫంక్షనాలిటీ అసెస్‌మెంట్‌ ఎఫ్‌వై 2021-22’ నివేదికలను రాష్ట్రపతికి సమర్పించనున్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి;

అత్యుత్తమ పనితీరు కనబరచిన రాష్ట్రాలు/యూటీలు/
జిల్లాల యంత్రాంగాలకు రాష్ట్రపతి ద్వారా పురస్కార ప్రదానం;

‘జల్ జీవన్ సర్వేక్షణ్-2023’, ‘రెట్రోఫిట్ టు ట్విన్ పిట్
అభియాన్’, ‘స్వచ్ఛ జల్ సే సురక్ష కార్యక్రమం’ ప్రారంభం

Posted On: 30 SEP 2022 6:11PM by PIB Hyderabad

   కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు-పారిశుధ్య విభాగం (డీడీడబ్ల్యూఎస్‌) 2022 అక్టోబరు 2న జాతిపిత మహాత్మా గాంధీ జన్మదినాన్ని ‘స్వచ్ఛ భారత్ దివస్’ (ఎస్‌బీడీ)గా నిర్వహించనుంది. “పరిశుభ్రత దైవత్వంతో సమానం” అన్న మహాత్మా గాంధీ ప్రబోధమే ఈ విభాగానికి స్ఫూర్తి. కాగా, ఈ కార్యక్రమాన్ని ‘సంపూర్ణ పరిశుభ్రత’కు భరోసానిచ్చే ప్రజా ఉద్యమంగా మార్చిన ప్రజల సంకల్పమే స్వచ్ఛ భారత్ మిషన్ బలం.

   ఈ నేపథ్యంలో 2022 అక్టోబర్ 2న విజ్ఞాన్ భవన్‌లో ‘డీడీడబ్ల్యూఎస్‌’ ఒకరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అధ్యక్షత వహిస్తారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి-పంచాయితీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్‌ సహా జలశక్తి-ఆహారోత్పత్తి, జలశక్తి-గిరిజన వ్యవహారాల సహాయ మంత్రులు శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్, శ్రీ బిశ్వేశ్వర్ తుడు ఇందులో పాల్గొంటారు.

   కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రెండు ప్రధాన కార్యక్రమాలు ‘స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ్),  జల్ జీవన్ మిషన్’ (జేజేఎం)లను ‘డీడీడబ్ల్యూఎస్‌’ అమలు చేస్తుంది. ప్రతి గ్రామీణ నివాసానికీ కొళాయి కనెక్షన్ లక్ష్యంగా 2019 ఆగస్టు 15న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్రకోట బురుజుల నుంచి ‘జేజేఎం’ను ప్రకటించారు. అలాగే గ్రామీణ భారతాన్ని బహిరంగ విసర్జన సంపూర్ణ విముక్తం (ఓడీఎఫ్‌ ప్లస్‌) చేసేదిశగా ‘ఎస్‌బీఎం (జి)’ రెండో దశ కార్యక్రమం 2020 మార్చిలో మొదలైంది. బహిరంగ విసర్జన విముక్త (ఓడీఎఫ్) స్థితి కొనసాగింపు, ప్రతి గ్రామంలో తడి-పొడి వ్యర్థాల నిర్వహణ దీని లక్ష్యాలు.

 

   విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించే కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ (ఎస్‌ఎస్‌జి)-2022 నివేదికను జలశక్తి శాఖ మంత్రి రాష్ట్రపతికి సమర్పిస్తారు. జలశక్తి శాఖ 2018 నుంచి ఈ అధ్యయనం నిర్వహిస్తుండగా, 2022కుగాను సర్వే నిర్వహణ కార్యక్రమానికి జలశక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ 2021 సెప్టెంబరు 9న శ్రీకారం చుట్టారు. పరిశుభ్రతకు సంబంధించి ర్యాంకింగ్, క్షేత్రస్థాయి అధ్యయన అంచనాలు, పౌరుల అవగాహన తదితర వివరాలను ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ నివేదిక తెలియజేస్తుంది. దాంతోపాటు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ)-2023 సంబంధిత వివరాలు కూడా అందజేయబడతాయి.

   మరోవైపు ఇదే కార్యక్రమంలో ‘జేజేఎం’కు సంబంధించి ‘‘2021-22 ఆర్థిక సంవత్సరం పనితీరు అంచనా’’లపై నివేదికను కూడా ‘డీడీడబ్ల్యూఎస్‌’ విడుదల చేస్తుంది. వివిధ గ్రామాల్లో పనిచేస్తున్న కొళాయి కనెక్షన్ల సంఖ్య, నిర్దేశిత పరిమాణంలో నాణ్యమైన క్రమబద్ధ నీటి సరఫరా వగైరాలపై మూడో పక్షంతో ‘డీడీడబ్ల్యూఎస్‌’ అధ్యయనం చేయించిన వివరాలు ఈ నివేదికలో ఉంటాయి. ఇందులో భాగంగా 712 జిల్లాల్లోని 13,299 గ్రామాల్లోగల 3,01,389 నివాసాలు, 22,596 ప్రభుత్వ సంస్థలలో సర్వే నిర్వహించబడింది. ఈ సందర్భంగా గృహాల నుంచి 2,19,564, ప్రభుత్వ సంస్థల నుంచి 9,844 వంతున నీటి నమూనాలు పరీక్షించబడ్డాయి. మునుపటి సంవత్సరం (2021)తో పోలిస్తే 2022లో పరీక్షించిన నమూనాల సంఖ్య మూడు రెట్లు అధికం కావడం గమనార్హం.

   ‘స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ) ఫలితాలతోపాటు జేజేఎం పనితీరుపై అంచనాల నివేదిక, ఈ రెండు కార్యక్రమాల అమలుపై ‘డీడీడబ్ల్యూఎస్‌’ పురోగతి అంచనాల ఆధారంగా అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, జిల్లాలు 2022 అక్టోబరు 2నాటి కార్యక్రమంలో పురస్కారం అందుకుంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జల్ జీవన్ సర్వేక్షణ్-2023ను ప్రారంభించనున్నారు. ‘ఇంటింటికీ నీరు‘ పథకం కిందకు వచ్చే అన్ని గ్రామాలలో కొళాయి నీటి కనెక్షన్ల పనితీరును ఈ అధ్యయనం విశ్లేషిస్తుంది. జల్ జీవన్ మిషన్ లక్ష్యం నెరవేరేలా చూడటంలో ఇదొక ఉపకరణం కాగా, గ్రామంలో ప్రతి ఇంటికి తగిన పరిమాణంలో నేడు తాగునీరు క్రమం తప్పకుండా అందుతోంది.

   ఇందులో భాగంగా ‘డీడీడబ్ల్యూఎస్‌’ మరో రెండు కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. ఇళ్లలో విసర్జన మడ్డి నిర్వహణ కోసం రెండు మరుగుదొడ్డి గోతుల నిర్మాణాన్ని ప్రోత్సహించే ‘‘రెట్రోఫిట్ టు ట్విన్ పిట్ అభియాన్’’ వీటిలో ఒకటి కాగా, ఇది ‘ప్రపంచ మరుగుదొడ్డి దినోత్సవం’ అంటే 2022 నవంబర్ 19న ముగుస్తుంది. మరొక కార్యక్రమం ‘స్వచ్ఛ జల్ సే సురక్ష’ ఇళ్లకు సరఫరా చేసే నీటి నాణ్యతకు సంబంధించినది. దీనిద్వారా పరిశుభ్ర, సురక్షిత తాగునీటి ప్రాముఖ్యంపై ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు గ్రామీణ కుటుంబాలకు సరఫరా చేసే నీటి నాణ్యతపై పర్యవేక్షణ చేపడతారు.

***


(Release ID: 1864139) Visitor Counter : 171