యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశంలో అక్టోబరు 1 నుంచి 31దాకా పరిశుభ్ర భారతం 2.0 నిర్వహణపై యువజన వ్యవహారాలు-క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటన


పరిశుభ్ర భారతం 2.0 అక్టోబరు 1న ప్రయాగ్‌రాజ్‌ నుంచి ప్రారంభం… శుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచి వారు పాల్గొనేలా ఉత్తేజం కల్పించడమే లక్ష్యం: శ్రీ అనురాగ్‌ ఠాకూర్

Posted On: 29 SEP 2022 7:07PM by PIB Hyderabad

   కేంద్ర యువజన వ్యవహారాలు-క్రీడల మంత్రిత్వశాఖ (భారత ప్రభుత్వం) 2022 అక్టోబరు 1 నుంచి 31దాకా దేశవ్యాప్తంగా ‘పరిశుభ్ర భారతం 2.0’ కార్యక్రమం నిర్వహిస్తుందని ఆ శాఖ మంత్రి శ్రీ అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ ఒక ట్వీట్‌ ద్వారా ప్రకటించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న గౌరవనీయ ప్రధానమంత్రి తన ప్రసంగంలో ‘పంచ ప్రాణ్‌’ (ఐదు సంకల్పాలు) గురించి ప్రకటించారని ఈ సందర్భంగా ఒక వీడియో సందేశం ద్వారా శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌ గుర్తుచేశారు. ఈ సంకల్పాల్లో అభివృద్ధి చెందిన భారతం ఒకటి కాగా, ఇందులో పరిశుభ్రత అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ‘పరిశుభ్ర భారతం 2.0’ కార్యక్రమానికి తమ ప్రాథమ్యాలలో అగ్రస్థానం ఇచ్చామని స్పష్టం చేశారు.

   మేరకు “గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ @నరేంద్రమోదీ స్ఫూర్తితో @IndiaSports గత ఏడాది పరిశుభ్రత కార్యక్రమం కింద ఒక నెల వ్యవధిలో 75 లక్షల కిలోల చెత్త నిర్మూలన లక్ష్యంగా నిర్దేశించగా, అంతకన్నా ఎక్కువగా 114 లక్షల కిలోల చెత్తను నిర్మూలించగలిగాం. ఈ నేపథ్యంలో 1.10.2022న ప్రయాగ్‌రాజ్‌ నుంచి #SwachhBharat2022కు శ్రీకారం చుడుతున్నాం. — Anurag Thakur (@ianuragthakur) September 29, 2022” అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్‌వైకేఎస్‌) అనుబంధ యువజన క్లబ్బులు, జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థల నెట్‌వర్క్ ద్వారా ప్రధానమంత్రి దార్శనికత మేరకు దేశంలోని 744 జిల్లాల్లోగల 6 లక్షల గ్రామాల్లో ‘పరిశుభ్ర భారతం 2.0’ కార్యక్రమం నిర్వహిస్తామని శ్రీ ఠాకూర్ వివరించారు.

   రిశుభ్ర భారతం 2.0 కార్యక్రమం 2022 అక్టోబరు 1న ప్రయాగ్‌రాజ్‌ నుంచి మొదలవుతుందని శ్రీ అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడంపై ప్రజల్లో అవగాహన పెంచి వారు ఇందులో భాగస్వాములయ్యేలా ఉత్తేజితులను చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలు, భాషలు, నేపథ్యాలుగల ప్రజలంతా సమష్టిగా పనిచేస్తూ పూర్తి స్వచ్ఛంద ప్రాతిపదికన వ్యర్థాలను నిర్మూలిస్తారని తెలియజేశారు. పరిశుభ్ర భారతం 2.0 కేవలం ఒక కార్యక్రమం కాదని, పరిశుభ్రత ప్రాముఖ్యాన్ని ప్రజలు గుర్తించేలా చేయడమే దీని ప్రధాన లక్ష్యమని శ్రీ ఠాకూర్ అన్నారు. ఇది దేశంలో ‘సంతోష సూచీ’ మెరుగుదలకూ దోహదం చేస్తుందన్నారు. తదనుగుణంగా దేశంలో ప్రజలు నిర్వహించే అతిపెద్ద పరిశుభ్రత ఉద్యమంగా దీన్ని మలచడానికి యువజన వ్యవహారాల శాఖ కృషి చేస్తుందని చెప్పారు.

   నిరుడు ఒక నెల వ్యవధిలో 75 లక్షల కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్మూలన లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ దాన్ని అధిగమించినట్లు కేంద్రమంత్రి గుర్తుచేశారు. ఈ మేరకు గత ఏడాది పరిశుభ్రత కార్యక్రమం విజయవంతమైన నేపథ్యంలో ఈ ఏడాది కోటి కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ-నిర్మూలనను యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు బాధ్యతగల పౌరులుగా పరిశుభ్ర భారతం 2.0లో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవడం సహా పరస్పర స్ఫూర్తితో లక్ష్యసాధనకు కృషి చేయాలని శ్రీ ఠాకూర్‌ పిలుపునిచ్చారు.

   రిశుభ్ర భారతం కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2022 అక్టోబరు 1 నుంచి 31దాకా బహిరంగ ప్రదేశాల్లో, నివాసాల్లో పరిశుభ్రత కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. సమాజంలోని అన్ని వర్గాలను, పంచాయతీరాజ్‌ సంస్థలను, స్వచ్ఛంద సంస్థలుసహా ప్రభుత్వ సంస్థలను ఇందులో భాగస్వాములను చేస్తారని తెలిపారు. పరిసరాల్లో వ్యర్థాలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం గర్వకారణమని భావించేలా పౌరులలో అవగాహనను పెంచే బాధ్యత వీటిపై ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంతోపాటు “పరిశుభ్రత కాలం - అమృత కాలం” అనే తారకమంత్రంతో దీన్ని జన భాగస్వామ్యంగల ప్రజా ఉద్యమంగా మలచాలని మంత్రి పిలుపునిచ్చారు.

***


(Release ID: 1863569) Visitor Counter : 152