యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి నెల రోజుల పాటు సాగనున్న క్లీన్ ఇండియా 2.0 ప్రారంభించనున్న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్


కోటి కేజీల వ్యర్థాలు ప్రధానంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను సేకరించి,తొలగించడానికి ప్రజల స్వచ్ఛంద భాగస్వామ్యం, సహకారంతో ప్రజా ఉద్యమంగా కార్యక్రమం అమలు

Posted On: 28 SEP 2022 6:38PM by PIB Hyderabad

 కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా క్లీన్ ఇండియా 2.0 కార్యక్రమాన్ని అక్టోబర్ 1 నుంచి 31 వరకు నిర్వహించనున్నది. గత ఏడాది నిర్వహించిన విధంగా ఈ ఏడాది కూడా నిర్వహించి విజయవంతం చేసేందుకు మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. దేశవ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ కు అనుబంధంగా ఉన్న యువజన క్లబ్బులు, నేషనల్ సర్వీస్ స్కీమ్ అనుబంధ సంస్థల నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
కార్యక్రమ వివరాలను యువజన వ్యవహారాల కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్ ఈ రోజు న్యూఢిల్లీలో మీడియా ప్రతినిధులకు వివరించారు. క్లీన్ ఇండియా 2.0 కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ  మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ 2022 అక్టోబర్ 1న ప్రారంభిస్తారు. వ్యర్థాలు ముఖ్యంగా  సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వ్యర్ధాల తొలగించి, అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో కార్యక్రమానికి రూపకల్పన చేశారు.
గత ఏడాది నిర్వహించిన  క్లీన్ ఇండియా డ్రైవ్ విజయవంతం అయ్యిందని శ్రీ సంజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది   కోటి కేజీల  వ్యర్థాలను (ప్లాస్టిక్, ఈ-వేస్ట్ మరియు ఇతర వ్యర్థాలు)  సేకరించి, తొలగించాలన్న లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తామని  అన్నారు.  ప్రజల సహకారం,  స్వచ్ఛంద భాగస్వామ్యంతో కార్యక్రమం  జరుగుతుందని కార్యదర్శి తెలియజేశారు. వ్యర్థాల సేకరణకు   పర్యాటక ప్రదేశాలు, విద్యా సంస్థలు, బస్టాండ్/రైల్వే స్టేషన్‌లు వాటి పరిసరాలు, జాతీయ రహదారులు, చారిత్రక మరియు వారసత్వ కట్టడాలు, మతపరమైన ప్రదేశాలు, వాటి పరిసరాలు, ఆస్పత్రులు మరియు నీటి వనరులు మొదలైన ప్రాంతాల్లో దృష్టి సారిస్తామని అన్నారు.

 


అమృత కాలం కోసం ప్రధానమంత్రి సూచించిన 5 సంకల్పాల (పంచ్ ప్రాణ్) స్ఫూర్తిగా, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల కొనసాగింపుగా  యువజన వ్యవహారాలు, యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా పనిచేస్తున్న నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (NYKS) విభాగం  "క్లీన్ ఇండియా 2.0"ను నిర్వహిస్తుంది. అన్ని వర్గాల సహకారంతో దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బహిరంగ ప్రదేశాలు, నివాస ప్రాంతాలను శుభ్రం చేసి వ్యర్థాలను తొలగించేందుకు ప్రజలు, ప్రభుత్వ సంస్థలు, ప్రజా సంఘాల సహకారంతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. తమ నివాస ప్రాంతాలు, పరిసర ప్రాంతాలను వ్యర్థాలు లేకుండా శుభ్రంగా ఉంచుకుని గౌరవప్రద జీవనం గడిపే విధంగా ప్రజల్లో చైతన్యం నింపేందుకు కార్యక్రమం అమలు జరుగుతుందని  శ్రీ సంజయ్ కుమార్ వివరించారు.   “స్వచ్ఛ్ కాల్: అమృత్ కాల్” అనే నినాదానికి  మరింత ప్రచారం కల్పించే విధంగా  ప్రజా ఉద్యమంగా క్లీన్ ఇండియా 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తామని శ్రీ సంజయ్ కుమార్ తెలిపారు. 

***

 



(Release ID: 1863441) Visitor Counter : 145