సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్
azadi ka amrit mahotsav

జాతీయ షెడ్యూల్డ్ కులాలు, తెగల హబ్ కార్యక్రమాలపై షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అవగాహన సదస్సు

Posted On: 29 SEP 2022 11:59AM by PIB Hyderabad

జాతీయ షెడ్యూల్డ్ కులాలు, తెగల హబ్ అమలు చేస్తున్న కార్యక్రమాలు, మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న కార్యక్రమాలపై   షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించేందుకు కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 2022 సెప్టెంబర్ 28న  సదస్సు నిర్వహించింది. సదస్సులో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమం కోసం ఏర్పాటైన పార్లమెంట్ స్థాయి సంఘం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కిరీట్ ప్రేమ్‌జీభాయ్ సోలంకి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన దాదాపు 300 మంది  ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సదస్సుకు హాజరయ్యారు. నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (NSIC) చైర్మన్-కమ్-మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గౌరంగ్ దీక్షిత్ స్వాగత ఉపన్యాసంతో ప్రారంభమైన సదస్సులో కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి మెర్సీ ఎపావో కీలకోపన్యాసం చేశారు.  షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ఔత్సాహిక మరియు ఇప్పటికే పరిశ్రమలు నిర్వహిస్తున్న వారికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు,రుణ సంస్థలు, జెమ్ , గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థలు, ట్రిఫెడ్ , ట్రైఫెడ్  మొదలైన వాటిపై అవగాహన పొందేందుకు సదస్సు సహకరించింది. 

జాతీయ షెడ్యూల్డ్ కులాలు, తెగల హబ్ అమలు చేస్తున్న కార్యక్రమాలను ఉపయోగించుకుని గుజరాత్ రాష్ట్రానికి చెందిన షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రయోజనం పొందాలని డాక్టర్ సోలంకి సూచించారు. వ్యాపార కార్యక్రమాలను ప్రారంభించేందుకు  షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన పారిశ్రామికవేత్తలకు ప్రాధాన్యత ఇచ్చి రుణాలు మంజూరు చేయాలని సదస్సుకు హాజరైన బ్యాంకర్లను ఆయన కోరారు.దీనివల్ల వ్యాపార విస్తరణలో ఎలాంటి సమస్యలు ఎదురుకావని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించిన విధంగా ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చే పారిశ్రామికవేత్తలుగా మారేందుకు యువత కృషి చేయాలని  అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన  పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని అన్నారు. 

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సదస్సులో పాల్గొన్నాయి.  విక్రేత నమోదు ప్రక్రియ మరియు సేకరిస్తున్న  ఉత్పత్తులు/సేవలు తదితర అంశాలను సంస్థల ప్రతినిధులు వివరించారు.  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు యెస్ బ్యాంక్ వంటి ఆర్థిక సంస్థలు కూడా ఈ సదస్సులో  పాల్గొన్నాయి.   సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా  పరిశ్రమల  రంగానికి సంబంధించిన వివిధ రుణ పథకాలకు  వివరాలు అందించారు. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా  పరిశ్రమలకు అందిస్తున్న సహకారం, అభివృద్ధికి అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల వివరాలను జెమ్,కేవీఐసి, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ లాంటి  ఇతర ప్రభుత్వ సంస్థలు వివరించాయి.  ఈ సదస్సులో UDYAM నమోదు,  జెమ్  రిజిస్ట్రేషన్‌ల అంశంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

భారత ఆర్థిక వ్యవస్థ సమ్మిళిత వృద్ధి కోసం నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ హబ్ (NSSH) పథకాన్ని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ  ప్రారంభించింది. సామర్ధ్యాన్ని పెంపొందించడం, ప్రభుత్వ కొనుగోళ్లలో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారు ఎక్కువగా పాల్గొనేలా చూసేందుకు వ్యవస్థాపకత శక్తిని  ప్రోత్సహించడం లక్ష్యంగా పథకం అమలు జరుగుతున్నది.  

దేశ  ఆర్థిక వ్యవస్థలో  సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల పాత్ర కీలకంగా ఉంటుంది. సమగ్ర అభివృద్ధి కోసం  యువతలో వ్యవస్థాపకత  ప్రోత్సహించడానికి మరియు ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో  భాగస్వాములను చేసేందుకు షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన వారిని ప్రోత్సహించేందుకు  కేంద్రీకృత ప్రయత్నాలు అమలు జరగాల్సి ఉంటుంది. 
దేశ ఆర్థికాభివృద్ధి కోసం సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.  స్థిరమైన వృద్ధి కోసం  సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను బలోపేతం చేయడానికి మరియు ప్రపంచ విలువ ఆధారిత వ్యవస్థ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు పోటీ పడేలా చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన  సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటయ్యే  రాష్ట్ర స్థాయి సమావేశాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న  వివిధ పథకాలపై వారికి అవగాహన కల్పించి  వారి పరిధులను విస్తరించేందుకు సహాయపడతాయి. 

***


(Release ID: 1863378) Visitor Counter : 178