కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఈపీఎఫ్ఓ పేరోల్ డేటా: ఈపీఎఫ్ఓ జూలై, 2022 నెలలో చేరిన నికర సభ్యులు 18.23 లక్షలు.
Posted On:
20 SEP 2022 5:31PM by PIB Hyderabad
ఈపీఎఫ్ఓ 20 సెప్టెంబర్ 2022 న తాత్కాలిక పేరోల్ డేటా విడుదల చేసింది. 2022 జూలైలో ఈపీఎఫ్ఓ 18.23 లక్షల మంది నికర సభ్యులు చేరినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. పేరోల్ డేటా యొక్క గతేడాది జూలై నెలతో పోలిస్తే 2022 జూలై నాటికి నికర సభ్యత్వం పొందిన వారి సంఖ్య 24.48% పెరుగుదలను నమోదు చేసింది.
జూలైలో చేరిన మొత్తం 18.23 లక్షల మంది సభ్యులలో, దాదాపు 10.58 లక్షల మంది కొత్త సభ్యులు మొదటిసారిగా ఈపీఎఫ్ఓ సామాజిక భద్రత పరిధిలోకి రావడం జరిగింది. ఈపీఎఫ్ఓలో చేరిన కొత్త సభ్యుల డేటా ఏప్రిల్, 2022 నుండి పెరుగుతున్న సరళిని చూపుతోంది. 10.58 లక్షల మంది కొత్త సభ్యులలో, సుమారు 57.69% మంది 18-25 ఏళ్ల వయస్సు వారు ఉన్నారు. మొదటిసారి ఉద్యోగార్ధులు తమ విద్యను అనుసరించి పెద్ద సంఖ్యలో సంఘటితరంగంలో కార్మికులుగా చేరుతున్నారని తెలుస్తోంది. దేశంలో కొత్త ఉద్యోగాలు ఎక్కువగా యువతకు సంఘటిత రంగం నుంచి వెళ్తున్నాయని ఈ గణాంకాలు చెపుతున్నాయి.
ఈపీఎఫ్ఓ పరిధి నుండి దాదాపు 4.07 లక్షల మంది సభ్యులు జూలైలో నిష్క్రమించారు. 11.72 లక్షల మంది సభ్యులు ఈపీఎఫ్ఓ నుండి నిష్క్రమించి తిరిగి చేరడం జరిగింది. ఈ సభ్యులు తుది సెటిల్‌మెంట్‌ను ఎంచుకోవడం కంటే నిధుల బదిలీ ద్వారా తమ సభ్యత్వాన్ని నిలుపుకోవాలనే అంశాన్ని ఎంచుకున్నారు. ఎలాంటి అంతరాయం లేని సేవల అందుబాటు కోసం ఈపీఎఫ్ఓ తీసుకున్న వివిధ ఇ-ఇన్షియేటివ్‌లు దీనికి కారణమని చెప్పవచ్చు.
జూలై, 2022లో నికర మహిళా సభ్యుల 4.06 లక్షల మంది చేరినట్లు లింగ వారీగా పేరోల్ డేటా విశ్లేషణ సూచిస్తుంది. ఎన్‌రోల్‌మెంట్ డేటా 2021లో కొత్త మహిళల సభ్యత్వంతో పోలిస్తే జూలై, 2022లో వ్యవస్థీకృత వర్క్‌ఫోర్స్‌లో మహిళల నూతన సభ్యత్వం 34.84% పెరిగింది.
నెలలో ఈపీఎఫ్ఓ లో చేరిన మొత్తం కొత్త సభ్యులలో, మహిళా ఉద్యోగుల నమోదు 27.54%గా నమోదైంది. ఇది గత 12 నెలల్లో అత్యధికం. ఈపీఎఫ్ఓ లో చేరిన కొత్త సభ్యులకు సంబంధించి వ్యవస్థీకృత వర్క్‌ఫోర్స్‌లో మహిళా భాగస్వామ్యం పెరుగుదలను ఇది సూచిస్తుంది.
తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో నికర సభ్యుల చేరికలో నెలవారీగా పెరుగుతున్న సరళిని రాష్ట్రాల వారీగా పేరోల్ గణాంకాలు వెల్లడించాయి. జూలైలో, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హరియాణా, గుజరాత్, దిల్లీ రాష్ట్రాల నుంచి దాదాపు 12.46 లక్షల మంది నికర సభ్యులు చేరడం ద్వారా ఆధిక్యంలో ఉన్నాయి. ఇది అన్ని వయసుల సమూహాలలో మొత్తం నికర పేరోల్ జోడింపులో 68.36%.
పరిశ్రమల వారీగా పేరోల్ డేటా వర్గీకరణను పరిశీలిస్తే, రెండు వర్గాలు అంటే 'నిపుణుల సేవలు' (మ్యాన్‌పవర్ ఏజెన్సీలు, ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, చిన్న కాంట్రాక్టర్లు మొదలైనవి) మరియు 'ట్రేడింగ్-వాణిజ్య సంస్థలు' నెలలో మొత్తం సభ్యుల చేరికలో 46.20% ఉన్నాయి. పరిశ్రమల వారీగా డేటాను గత నెలతో పోల్చి చూస్తే, 'పాఠశాలలు', 'బిల్డింగ్ & నిర్మాణ రంగం', 'ఫైనాన్సింగ్ ఎస్టాబ్లిష్మెంట్' మొదలైన పరిశ్రమలలో అధిక నమోదులు గుర్తించబడ్డాయి.
ఉద్యోగి రికార్డును అప్‌డేట్ చేయడం నిరంతర ప్రక్రియ కాబట్టి, డేటా ఉత్పత్తి అనేది నిరంతర ప్రక్రియ. కావున పేరోల్ డేటా తాత్కాలికంగా ఉంటుంది. ఈ డాటా మునుపటి డేటా ప్రతి నెలా నవీకరించబడుతుంది. ఏప్రిల్,2018 నెల నుండి, ఈపీఎఫ్ఓ సెప్టెంబర్, 2017 నుండి కాలానికి సంబంధించిన పేరోల్ డేటాను విడుదల చేస్తూ వస్తోంది. నెలవారీ పేరోల్ డేటాలో, ఆధార్ చెల్లుబాటు చేయబడిన యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ద్వారా మొదటిసారి ఈపీఎఫ్ఓలో చేరిన సభ్యుల సంఖ్య, ఈపీఎఫ్ఓ కవరేజీ నుండి నిష్క్రమించిన ప్రస్తుత సభ్యులు మరియు నిష్క్రమించి తిరిగి సభ్యులుగా చేరిన వారి సంఖ్య నికర నెలవారీ పేరోల్‌కు చేరుకోవడానికి తీసుకోబడుతుంది.
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్‌ల విస్తృత వినియోగంతో, మొబైల్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈపీఎఫ్ఓ తన సేవలను విస్తరించింది. సభ్యులకు సహాయం చేయడానికి ఈపీఎఫ్ఓ ఇప్పుడు ట్విట్టర్, వాట్సాప్ మరియు ఫేస్‌బుక్‌లలో కూడా అందుబాటులో ఉంది.
***
(Release ID: 1861109)
Visitor Counter : 140