ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022-23 ఆర్థిక సంవత్సరంలో 30% పెరిగిన స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు


23% వృద్ధి నమోదు చేసిన నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్లు

2022-23 ఆర్థిక సంవత్సరంలో 17% వృద్ధి సాధించి 17.09.2022 నాటికి
2,95,308 కోట్ల రూపాయలకు చేరిన అడ్వాన్స్ పన్ను చెల్లింపులు

గత ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 83% వృద్ధి సాధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,35,556 కోట్ల రూపాయల మేరకు జరిగిన రీఫండ్‌లు

Posted On: 18 SEP 2022 1:29PM by PIB Hyderabad

కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి బయటపడిన దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నదని తెలియజేసే స్పష్టమైన సూచికగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు పటిష్టమైన వేగంతో పెరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం అనుసరిస్తున్న సుస్థిర విధానాలు, వివిధ ప్రక్రియలను సులభతరం చేసి, సాంకేతిక విధానాలు అనుసరిస్తూ అమలు చేస్తున్న చర్యల వల్ల పన్ను ఎగవేత తగ్గడంతో పన్ను వసూళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. 

17.09.2022 నాటికి అందుబాటులో ఉన్న 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాల ప్రకారం దేశంలో నికర పన్ను వసూళ్లు 7,00,669 కోట్ల రూపాయల వరకు జరిగాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి పన్ను వసూళ్లు 5,68,147 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. పన్ను వసూళ్లు 23% వృద్ధి నమోదు చేశాయి. కార్పొరేషన్ పన్ను రూపంలో 3,68,484 కోట్ల రూపాయలు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ తో సహా వ్యక్తిగత ఆదాయం పన్ను రూపంలో జరిగిన 3,30,490 కోట్ల రూపాయలతో కలుపుకుని మొత్తం 7,00,669 కోట్ల రూపాయల మేరకు నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు జరిగాయి. 

2022-23 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 8,36,225 కోట్ల రూపాయల వరకు ఉన్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 6,42,287 కోట్ల రూపాయలుగా ఉంది. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 30%కి పైగా వృద్ధి నమోదు చేశాయి. 

మొత్తం 8,36,225 కోట్ల రూపాయల స్థూల పన్ను వసూళ్లలో 4,36,020 కోట్ల రూపాయల కార్పొరేషన్ పన్ను, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ తో సహా వ్యక్తిగత ఆదాయం పన్ను రూపంలో జరిగిన 3,98,440 కోట్ల రూపాయల వసూళ్లు ఉన్నాయి. మైనర్ హెడ్ పన్ను రూపంలో అడ్వాన్స్ పన్నుగా 2,95,308 కోట్ల రూపాయలు, టీడీఎస్ గా 4,34,740కోట్ల రూపాయలు, రెగ్యులర్ అసెస్మెంట్ పన్నుగా 20,880 కోట్ల రూపాయలు వసూలు కాగా మైనర్ హెడ్స్ కింద 8,933 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. 

 2022-23 ఆర్థిక సంవత్సరంలో 17.09.2022 నాటికి మొదటి మరియు రెండవ త్రైమాసికానికి సంబంధించి సంచిత అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు 2,95,308 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. తక్షణమే ముందున్న ఆర్థిక సంవత్సరానికి అంటే 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇదే సమయానికి 2,52,077 కోట్ల రూపాయలు ముందస్తు పన్ను వసూలు అయ్యింది. 2021-22 ఆర్థిక సంవత్సరం తో పోల్చి చూస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్ టాక్స్ వసూళ్లు 17% వృద్ధి సాధించాయి. ముందస్తు పన్ను రూపంలో జరిగిన వసూళ్లలో మొత్తం 2,95,308 కోట్ల రూపాయల్లో కార్పొరేషన్ పన్ను (సిఐటి) రూపంలో 2,29,132 కోట్ల రూపాయలు, మరియు వ్యక్తిగత ఆదాయపు పన్ను రూపంలో . 66,176 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌ల ప్రాసెసింగ్ వేగం గణనీయంగా పెరిగింది. సక్రమంగా ఉన్నాయని ధృవీకరించబడిన ఐటీఆర్ లలో 17.09.2022 వరకు దాదాపు 93% ప్రాసెస్ చేయబడ్డాయి. దీని ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జారీ చేయబడిన రీఫండ్‌ల సంఖ్యలో దాదాపు 468% పెరుగుదలతో వాపసులను వేగంగా జారీ చేయడం జరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 17.09.2022 వరకు 1,35,556 కోట్ల రూపాయల వరకు రీఫండ్‌లు జారీ చేయబడ్డాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం లో సంబంధిత కాలంలో 74,140 కోట్ల రూపాయల మేరకు రీఫండ్‌లు జారీ చేయబడ్డాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 2022-23 ఆర్థిక సంవత్సరంలో జరిగిన రీఫండ్‌లు 83% మించి వృద్ధి సాధించాయి. 

 


(Release ID: 1860422) Visitor Counter : 191