రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

భారతీయ రహదారుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు ముందుకు రండి


అమెరికా ఇన్వెస్టర్లకు కేంద్రమంత్రి గడ్కరీ ఆహ్వానం

Posted On: 12 SEP 2022 2:52PM by PIB Hyderabad

      భారతదేశంలోని రోడ్లు, రహదారుల ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావలసిందిగా కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితి గడ్కరీ అమెరికా పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. పెట్టుబడిదారులకు భారతదేశం ఒక బంగారు గనివంటిందని ఆయన అన్నారు. ఇండో అమెరికన్ వాణిజ్య మండలి ఆధ్వర్యంలో జరిగిన 19వ ఇండో అమెరికన్ ఆర్థిక శిఖరాగ్రసమావేశాన్ని వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన సందర్భంగా గడ్కరీ ప్రసంగిస్తూ భారతదేశం, అమెరికా ప్రపంచంలోనే చెప్పుకోదగిన ప్రముఖ ప్రజాస్వామ్య దేశాలని, ఉభయదేశాల మధ్య బలమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయని అన్నారు. భారత్, అమెరికా సహజసిద్ధమైన భాగస్వామ్య దేశాలని, పరస్పర అభివృద్ధి లక్ష్యంగా కృషి చేసేందుకు ఉభయదేశాలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని అన్నారు.  సామాజిక, ఆర్థిక, వ్యూహాత్మక అంశాల విషయంలో ఉభయదేశాలు ఎప్పుడూ పరస్పర విశ్వాసం, గౌరవం, సహకారంతో ఉంటూ వచ్చాయని అన్నారు.  రానున్న పాతికేళ్ల కోసం కొత్త అజెండా పేరిట ఈ ఏడాది ఎంపిక చేసుకున్న ఇతివృత్తం ఎంతో ప్రభావవంతమైనదని, ఉభయదేశాల సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ప్రణాళికను రూపొందించుకునేందుకు ఇది ఎంతో దోహదపడగలదని కేంద్రమంత్రి గడ్కరీ అన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZVP7.jpg

    సమ్మిళిత వృద్ధి నమూనాతో సుస్థిర వాణిజ్యానికి తగిన వాతావరణం సృష్టించేందుకే తాము అధిక ప్రాధాన్యం ఇస్తామని గడ్కరీ అన్నారు. 2025 సంవత్సరానికల్లా భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న దార్శనికతను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించారని అన్నారు. ఈ రోజున భారతదేశం అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారిందని, ప్రపంచంలోనే ఐదవ స్థానంలో నిలిచిందని అన్నారు. పూర్తిగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు దేశంలో ఆర్థిక కార్యకలాపాలను మరింతగా పెంపొందిస్తాయని, కొత్త వ్యాపారాలను సృష్టించి, ఉపాధి, ఉద్యోగాల కల్పనకు దోహదపడతాయని గడ్కరీ అన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం జాతీయ మౌలిక సదుపాయాల కార్యక్రమం కింద  తమ ప్రభుత్వం 1.4ట్రిలియన్ డాలర్లమేర పెట్టుబడులు పెడుతోందని అన్నారు.  2019నుంచి 2025వ సంవత్సరం వరకూ అయిన మూలధన వ్యయంలో 19శాతం రహదారుల రంగానికే ఖర్చయ్యిందన్నారు. దేశంలో పరిపూర్ణ స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి జాతీయ గతిశక్తి మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం ప్రారంభించిందని అన్నారు. గతశక్తి పథకంతో భాగస్వామ్యవర్గాల వారంతా సహకారం, సమన్వయం, సమాచారం అన్న మూడు నిబంధనలను కచ్చితంగా పాటించే అవకాశం ఉందన్నారు.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00234YH.jpg

  భారతదేశ ఆర్థిక వృద్ధిలో మౌలిక సదుపాయాలకు కీలకపాత్ర ఉంటుందని, 70శాతం సరుకుల రవాణాకు, దాదాపు 90శాతం ప్రయాణికుల రవాణాకు రహదారుల వ్యవస్థ ఉపయోగపడుతోందని అన్నారు. 2014వ సంవత్సరంలో మనదేశంలో దాదాపు 91,000కిలోమీటర్ల నిడివిగల జాతీయ రహదారుల వ్యవస్థ అందుబాటులో ఉండగా, ప్రస్తుతం ఈ వ్యవస్థ లక్షా 47వేల కిలోమీటర్ల స్థాయికి చేరుకుందన్నారు. 2025వ సంవత్సరానికల్లా దేశంలో రహదారుల నెట్‌వర్క్‌ను 2లక్షల కిలోమీటర్ల స్థాయికి విస్తరించాలన్న లక్ష్యసాధనకు ప్రభుత్వం అంకితభావంతో కృషి చేస్తున్నదని అన్నారు.

   దేశవ్యాప్తంగా ప్రస్తుతం రూ. 5లక్షల కోట్ల (60బిలియన్ డాలర్ల) పెట్టుబడితో 10వేల కిలోమీటర్ల నిడివితో 27 కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తున్నామని గడ్కరీ తెలిపారు. ఈ రోడ్ల నిర్మాణంతో కీలకమైన ఆర్థిక కేంద్రాల మధ్య ప్రయాణ దూరం 14శాతం తగ్గుతుందని, దీనితో రవాణా వ్యయం కూడా 2.5శాతం మేర తగ్గుతుందని అన్నారు. కొత్త ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంతో ప్రతి ఏడాదీ, దాదాపు 110కోట్ల లీటర్ల మేర ఇంధనం ఆదా అవుతుందని, వాతావరణంలోకి విడుదలయ్యే కర్బనవాయువుల పరిమాణం 250కోట్ల కిలోగ్రాముల మేర తగ్గుతుందని అన్నారు.

  చెట్ల కోత, చెట్ల తరలింపు కోసం ట్రీ బ్యాంకు పేరిట కొత్త విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోందని గడ్కరీ చెప్పారు. ఈ విధానానికి అనుగుణంగా, భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్.హెచ్.ఎ.ఎల్.), జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఎన్.హెచ్.ఐ.డి.సి.ఎల్.) వంటివి సొంతంగా ట్రీ బ్యాంకు ఖాతాను నిర్వహించాల్సి ఉంటుందని, ప్రాజెక్టు అభివృద్ధి సందర్భంగా నాటిన చెట్లు, కూల్చిన చెట్ల వివరాలతో ఒక రికార్డును ఈ ఖాతాలో పొందుపరచాలని గడ్కరీ సూచించారు. నిధుల సమీకరణ, కార్యక్రమంలో రిటైల్ పెట్టుబడిదారులను అనుమతించేందుకు మౌలిక సదుపాయాల పెట్టబడి ట్రస్టులు (ఐ.ఎన్.వి.ఐ.టి.)  వంటి సృజనాత్మకమైన సానూకూల పథకాలను తీసుకువస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు. రిటైల్ పెట్టుబడిదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లకు మించిన మంచి వార్షిక ఆదాయం పొందేందుకు వీలు కల్సిస్తూ తాము ఉత్పాదనలను రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రతిభాపూర్వకమైన మన మానవ వనరులు భారత మౌలిక సదుపాయాల రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలున్న అంశాలను గుర్తించేందుకు మరింతగా కృషి జరగాలని, ఈ విషయంలో ఇండో అమెరికన్ వాణిజ్య మండలి మార్గదర్శక బాధ్యతలు నిర్వహించాలని గడ్కరీ అభిప్రాయపడ్డారు. రహదారుల రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాలకు (పి.పి.పి.లకు) అవకాశం కల్పించగలిగే సంపూర్ణమైన, అభివృద్ధి చెందిన వ్యవస్థ మనకు అందుబాటులో ఉందన్నారు. పి.పి.పి. నిర్వహణా వ్యవహారాల విషయంలో భారతదేశం ప్రథమ స్థానంలో నిలిచినట్టు ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఎ.డి.బి.) పేర్కొందని, పి.పి.పి.ల విషయంలో భారతదేశం అభివృద్ధి చెందిన మార్కెట్‌గా ఆ బ్యాంకు నిర్ణయించిందని అన్నారు. ప్రాజెక్టు డాక్యుమెంటేషన్, ఒప్పందపు నిర్ణయాలు, ప్రాజెక్టు ఆమోదాలు ప్రస్తుతం డిజిటల్ పోర్టల్స్ ద్వారానే జరుగుతున్నాయని అన్నారు.

  ఈ రోజున విద్యుత్ ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, విద్యుత్ కార్ల విషయంలో అతిపెద్ద మార్కెట్‌గా భారతదేశం అవతరిస్తోందని గడ్కరీ అన్నారు. చార్జింగ్ వ్యవస్థ కోసం సౌరశక్తిని, పవనశక్తిని కూడా ప్రభుత్వం గట్టిగా బలపరుస్తోందని అన్నారు. సౌరశక్తితో విద్యుత్ చార్జింగ్ చేయగలిగే రహదారులను రూపొందించేందుకు తాము కృషి చేస్తున్నామని, దీనితో ట్రక్కులు, బస్సులు రహదారిపై ప్రయాణిస్తుండగానే విద్యుత్ చార్జింగ్ అయ్యేందుకు వీలుంటుందని అన్నారు. ఎలక్ట్రానిక్ వాహనాల బ్యాటరీ సాంకేతిక పరిజ్ఞానాలు, రెట్రాఫిట్టింగ్ పరిశ్రమల దిశగా పరిశోధన, అభివృద్ధికోసం అమెరికాకు చెందిన కంపెనీలు తమ సహకారం అందించే వీలుందని అన్నారు. హరిత హైడ్రోజన్ ఉత్పత్తి, రవాణాకోసం మన జాతీయ హైడ్రోజన్ పథకం తగిన ప్రోత్సాహకాలను అందిస్తోందన్నారు. తక్కువ ఖర్చుతో కూడిన నమ్మకమైన ఎలెక్ట్రోలైజర్లు, హైడ్రోజన్ ఇంధన బ్యాటరీల టెక్నాలజీ రూపకల్పన వియంలో తగిన సేవలందించాలంటూ ఇండో అమెరికన్ వాణిజ్య మండలికి కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ విజ్ఞప్తి చేశారు.

 

*****



(Release ID: 1858834) Visitor Counter : 136