శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
పరిశోధన-అభివృద్థి రంగాలకు ఆర్థిక వనరులకోసం ప్రణాళిక!
నిధులపై కేంద్ర-రాష్ట్ర సైన్స్ సదస్సులో విస్తృత చర్చ
प्रविष्टि तिथि:
11 SEP 2022 1:36PM by PIB Hyderabad
ప్రైవేటు రంగం ద్వారా సైన్స్, టెక్నాలజీ, ఆవిష్కరణలకు సేవలను పెంచుకోవడం ద్వారా
పరిశోధన, అభివృద్ధి కోసం వనరులను బలోపేతం చేసుకోవడం, సహకార నిధుల సమీకరణను పెంచుకోవడం తదితర అంశాలతో కూడిన కార్యాచరణ ప్రణాళికపై కేంద్ర రాష్ట్రాల సైన్స్ సదస్సులో విస్తృతంగా చర్చించారు. 2022 సెప్టెంబరు 11వ తేదీన ఈ సమ్మేళనం జరిగింది.
ఈ సదస్సులో జరిగిన ప్యానెల్ చర్చలో ఇన్ఫోసిస్ సంస్థ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ క్రిస్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ, పరిశోధనను, ప్రత్యేక సమస్యల పరిష్కారం కోసం జరిగే పరిశోధనను మనం మరింతగా పెంచుకోవలసిన అవసరం ఉందని, ఈ ప్రక్రియ వాణిజ్యపరంగా జరగాల్సి ఉందని అన్నారు. “ప్రైవేటు రంగం క్రియాశీలక భాగస్వామ్యం ద్వారా ఈ ప్రక్రియ మొత్తం వేగవంతం అవుతుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞాన సృష్టి, వ్యాప్తి, వినియోగంకోసం నిధులను అందించడానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. పరిశ్రమలకు, అధ్యయన సంస్థలకు మధ్య అనుబంధం, పన్ను రాయితీలు, పన్ను విరామం వంటి అంశాలకు ఈ విషయంలో కీలకపాత్ర ఉంటుందని ఆయన అన్నారు. నీటి సమస్య, కేన్సర్, వ్యాధి నిరోధక శక్తి క్షీణత వంటి ప్రస్తుత సమస్యలు, భవిష్యత్ సవాళ్ల పరిష్కారానికి పరిశ్రమలు తమ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) వనరులనుంచి కనీసం ఒక శాతమైనా నిధులను ఖర్చు చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ (డి.ఎస్.టి.) సీనియర్ సలహాదారు డాక్టర్ అఖిలేశ్ గుప్తా మాట్లాడుతూ, పరిశోధనలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించేందుకు పరిశోధనా అభివృద్ధి పన్ను కోత, దాతృత్వ కార్యకలాపాలకు నిధులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్.డి.ఐ.లకు) సానుకూల వాతావరణం పునరుద్ధరించాలని కోరారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థల్లో (ఎం.ఎస్.ఎం.ఇ.ల్లో) ఆవిష్కరణలకు, సృజనాత్మక ప్రయోగాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉందన్నారు. బయోటెక్నాలజీ పారిశ్రామిక పరిశోధనా మండలి (బి.ఐ.ఆర్.ఎ.సి.), టెక్నాలజీ అభివృద్ధి మండలి (టి.డి.బి.), పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అనుబంధంకోసం క్లస్టర్ మాడల్ వంటి వాటికి ఎక్కువ అవకాశం ఇవ్వాలన్నారు. పరిశోధనలో ప్రైవేటు రంగం ప్రమేయాన్ని పెంచేందుకు వీలుగా, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో ఉత్పత్తి అయ్యే ఉత్పాదనలను ప్రభుత్వం చెంతకు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలన్నారు. పరిశోధనలో వందశాతం ఎఫ్.డి.ఐ.లను భారీ స్థాయిలో అనుమతించడం ద్వారా కర్ణాటక వంటి రాష్ట్రాలు ఎక్కువ స్థాయిలో ఎఫ్.డి.ఐ.లను పరిశోధన, అభివృద్ధి రంగంలోకి ప్రవేశపెట్టగలిగాయని, ఈ పద్ధతిని మిగతా రాష్ట్రాలు కూడా అనుసరించవచ్చని అన్నారు.

బెంగుళూరుకు చెందిన సి-క్యాంప్ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సి.ఇ.ఒ.) డాక్టర్ తస్లిమ్ అరిఫ్ సయ్యెద్ మాట్లాడుతూ, బయోటెక్ స్టార్టప్ సంస్థల ఆవిర్భావంతో భారతదేశం ముందంజ వేయాల్సిన అవసరం ఉందని, బయోటెక్ పరిశ్రమ విలువను మరింత పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. స్టార్టప్ కంపెనీలకు మధ్యదశలో నిధులను అందించడం, వెంచర్ క్యాపిటల్ సంస్థలు, పరిశ్రమతో సహకారం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. “ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయం, వాతావరణ మార్పులతోపాటుగా ఆరోగ్య రంగానికి ప్రాధాన్యం నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో, బయోటెక్నాలజీకి ప్రాధాన్యం పెరుగుతూవస్తోంది. ఈ దశలో అత్యున్నత స్థాయి వైజ్ఞానిక శాస్త్ర పరిశోధనకు, సాంకేతిక పరిజ్ఞాన పరిశోధనకు త్వరగా నిధులను అందిస్తే, పరిస్థితులు సానుకూలం కావడానికి మనకు దోహదపడుతుంది,” అని ఆయన అన్నారు.
రాజస్థాన్ ప్రభుత్వ సైన్స్-టెక్నాలజీ శాఖ ముఖ్యకార్యదర్శి ముగ్ధా సిన్హా మాట్లాడుతూ, సైన్స్-టెక్నాలజీ ఆవిష్కరణ విధానాలను ప్రయోగాత్మకంగా వినియోగించేందుకు కృషి జరగాలన్నారు. ఈ నమూనాలను అట్టడుగు స్థాయిలో విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఈ మేరకు స్ఫూర్తిని సాధించాలన్నారు.
“అన్ని శాఖలకు సేవలందించేదిగా వైజ్ఞానిక శాస్త్రాన్ని నిలబెట్టాలి. వైజ్ఞానిక శాస్త్రానికి ఎలాంటి ప్రత్యేకతలు, అర్హతలున్నాయో విధాన నిర్ణయకర్తలకు తెలియాలి. ప్రభుత్వంనుంచి సహాయం అవసరమైన రెండవ తరహా పరిశ్రమలను గుర్తించాల్సి ఉంది” అని ముగ్ధా సిన్హా అన్నారు.
గాంధీనగర్ ఐ.ఐ.టి. డైరెక్టర్ ప్రొఫెసర్ అమిత్ ప్రశాంత్ మాట్లాడుతూ, పరిశోధనా సంస్థలకు, పారిశ్రామిక సంస్థలకు మధ్య వారధిని పరిశోధనా సహకారం ద్వారా మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖ, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో అహ్మదాబాద్ సైన్స్‌సిటీలో ఈ సదస్సు జరిగింది. పరిశోధన, అభివృద్ధి రంగాలకు పెట్టుబడులను, నిధులను పెంచే యంత్రాంగంపై, కార్యాచరణ ప్రణాళికపై భాగస్వామ్య వర్గాలు పరస్పరం అభిప్రాయాలను పంచుకునేందుకు ఈ సమ్మేళనం ఒక వేదికగా ఉపయోగపడింది.
****
(रिलीज़ आईडी: 1858571)
आगंतुक पटल : 372