పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

భారతదేశంలో సుస్థిర తీర నిర్వహణ అనే అంశంపై జాతీయ సదస్సును నిర్వహించిన పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ

Posted On: 10 SEP 2022 11:51AM by PIB Hyderabad

భారతదేశంలో సుస్థిర తీర నిర్వహణ అనే అంశంపై ఏర్పాటైన మొదటి జాతీయ సదస్సును కేంద్ర పర్యావరణఅటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈరోజు భువనేశ్వర్‌లో ప్రారంభించారు.

 గ్రీన్ క్లైమేట్ సంస్థ అందించిన ఆర్థిక సహకారంతో ఈ సదస్సును ఎన్‌హాన్సింగ్ క్లైమేట్ రెసిలెన్స్ ఆఫ్ ఇండియాస్ కోస్టల్ కమ్యూనిటీస్ ఏర్పాటు చేసింది. సముద్ర తీరం, సముద్ర జీవవైవిధ్యం, వాతావరణ సమస్యలు, తీరప్రాంత కాలుష్యం అనే మూడు పరస్పర సంబంధం ఉన్న అంశాలపై  దృష్టి సారించడానికి భారతదేశంలో మొత్తం 13 తీరప్రాంత రాష్ట్రాల అధికారులను ఒకే వేదికపైకి  తీసుకురావాలన్న లక్ష్యంతో సదస్సు ఏర్పాటయింది. 

ముఖ్యమైన మూడు అంశాలపై దృష్టి సారించి లక్ష్యాలను సాధించేందుకు పటిష్టమైన వ్యవస్థకు సదస్సు కృషి చేస్తుంది. సంబంధిత వర్గాలు ఒకరితో ఒకరు కలిసి పని చేసేందుకు గల అవకాశాలను  గుర్తించడంతో పాటు అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. 

సదస్సును ప్రారంభించిన అనంతరం ఏర్పాటైన సమావేశంలో ప్రసంగించిన  శ్రీ భూపేందర్ యాదవ్ భారతదేశం 7500 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతం కలిగి ఉందని తెలిపారు. ప్రపంచంలో ఇది ఏడవ పెద్ద తీర ప్రాంతమని ఆయన వివరించారు. దేశ జనాభాలో 20 శాతం మంది ప్రజలు సముద్ర తీర ప్రాంతాల్లో నివసిస్తున్నారని అన్నారు. దేశ తీర ప్రాంతం  వ్యూహాత్మకఆర్థిక మరియు సామాజిక ప్రాముఖ్యతను కలిగి ఉందని మంత్రి పేర్కొన్నారు. దేశంలో తీర ప్రాంతంలో నాలుగు మెట్రోపాలిటన్ నగరాలు ఉన్నాయని గుర్తు చేశారు. దేశ తీర ప్రాంతాల్లో 17,000 కంటే ఎక్కువ జాతుల మొక్కలు మరియు జంతువులు జీవించేందుకు అనువైన  వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థ ఉందని అన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని మంత్రి అన్నారు.  

"భారతదేశం తన సవరించిన ఎన్‌డిసిలను సమర్పించిన నేపథ్యంలో జరుగుతున్న  ఈ సమావేశం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని శ్రీ భూపేందర్ యాదవ్ సూచించారు.   లక్ష్యాన్ని చేరుకోవడానికి బహుళ-రంగాల భాగస్వామ్యాన్ని రూపొందించడానికి కృషి జరగాలని ఆయన అన్నారు. 

ఈ సందర్భంగా మాట్లాడిన  పర్యావరణంఅటవీ & వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి శ్రీ.అశ్విని కుమార్ చౌబే  దేశ తీర ప్రాంతాలకు స్థితిస్థాపకత మరియు స్థిరత్వం యొక్క సంభాషణలను తీసుకురావడానికి ఇటువంటి సమావేశాలు అవసరమని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించిన  'లైఫ్' ఉద్యమంలో కూడా ఇటువంటి సమావేశాలను నిర్వహించాలని సూచించారని మంత్రి తెలిపారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో సుస్థిర తీర నిర్వహణ అనేది ఒక ముఖ్యమైన అంశంగా గుర్తింపు పొందింది. సమర్థవంతమైన తీర నిర్వహణలో  సమాచార ఆధారిత విధానాలు మరియు నిర్వహణ వ్యవస్థభాగస్వామ్య పరిరక్షణ నమూనాలు మరియు వాటాదారుల మధ్య సంబంధాలు కీలక అంశాలుగా ఉంటాయి. 

యూఎన్డీపీ సహకారంతో తీరప్రాంత ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు ఒడిశాఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో  ప్రత్యేక  కార్యక్రమం అమలు జరుగుతోంది. గ్రీన్ క్లైమేట్ ఫండ్ (GCF) సహకారంతో ప్రజల అవసరాలకు అనుగుణంగా  తీర ప్రాంత నిర్వహణ కోసం పటిష్ట  ప్రణాళిక రూపొందించి  పర్యావరణ వ్యవస్థ మరియు సమాజ-ఆధారిత విధానాలను అమలు చేయాలన్న లక్ష్యంతో కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 

***



(Release ID: 1858314) Visitor Counter : 197