గనుల మంత్రిత్వ శాఖ

హైదరాబాద్ లో రెండు రోజుల పాటు గనుల శాఖ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనున్న బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖలు


ఖనిజాల అన్వేషణను ప్రోత్సహించడంతో పాటు ఇటీవలి విధాన సంస్కరణల ప్రభావాన్ని అంచనా వేయడానికి నూతన వ్యూహాలను రూపొందించడంపై ఈ సదస్సులో దృష్టి


సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే సదస్సుకు హాజరుకానున్న పలు రాష్ట్రాల గనుల శాఖ మంత్రులు, సీనియర్ అధికారులు

Posted On: 06 SEP 2022 11:23AM by PIB Hyderabad

 

దేశంలో ఖనిజ అన్వేషణను మరింత ప్రోత్సహించడానికి, మైనింగ్ రంగంలో కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన విధాన సంస్కరణల ప్రభావాన్ని అంచనా వేయడానికి నూతన, సమర్థవంతమైన వ్యూహాలను రూపొందించడానికి బొగ్గు మంత్రిత్వ శాఖగనుల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 910 తేదీల్లో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు గనుల శాఖ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనున్నాయి.

 

కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, గనులు, బొగ్గు, రైల్వే శాఖ సహాయ మంత్రి శ్రీ రావుసాహెబ్ పాటిల్ దాన్వే, బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు (గనులు), డిజిఎంలు/డిఎమ్.జిలతో పాటు ఇతర సీనియర్ అధికారులు ఈ కీలకమైన సదస్సుకు హాజరుకానున్నారు. రాబోయే 25 సంవత్సరాలలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఖనిజాలకు ఉన్న డిమాండ్ ప్రస్తుత ఉత్పత్తిని మించిన విషయం దృష్ట్యా, మన మొత్తం పురోగతిలో ఖనిజ రంగం కీలకమైన పాత్రను పోషిస్తుంది. అందువల్ల, ఖనిజ రంగంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న అడ్డంకులను ముందుకు తీసుకురావడానికి జాతీయ గనుల మంత్రుల సదస్సు ఒక సమర్థవంతమైన వేదిక అవుతుంది. గనుల మంత్రిత్వ శాఖ, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే ఈ సదస్సు లక్ష్యం.

 

మైనింగ్ రంగంలో చేసిన కృషి, రాష్ట్ర ప్రభుత్వాలు నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్ (ఎన్ఎంఈటీ) నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవడం, కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్,, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు సమర్పించిన ప్రజెంటేషన్‌లపై చర్చలు, రాష్ట్ర ప్రభుత్వాలు వేలం వేసే స్థితి, నోటిఫైడ్ ప్రైవేట్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీలతో (ఎన్పీఈఏ) సంప్రదింపులు వంటి అంశాలపై ఈ సదస్సులో ముఖ్యంగా చర్చలు జరగనున్నాయి.

 

సదస్సు రెండో రోజున బొగ్గు రంగంలోని సంస్కరణలు, వాటి ప్రభావం, బొగ్గు గనుల ప్రాజెక్టులు, బొగ్గు లాజిస్టిక్స్ కోసం భూసేకరణకు సంబంధించిన విధానాలను వివిధ ప్రజంటేషన్ల ద్వారా బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రదర్శించనుంది. ఇప్పటికే కేటాయించిన బొగ్గు గనుల నిర్వహణ, వాటి స్థితిగతులపై దృష్టి సారించనుంది.

 

రాష్ట్ర ప్రభుత్వాల గనుల శాఖ మంత్రులతో పాటు, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ జైన్, కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ శ్రీ ప్రమోద్ అగర్వాల్ రెండో రోజు సదస్సులో ప్రసంగించనున్నారు.

 

******

 

 

 



(Release ID: 1857055) Visitor Counter : 201