ప్రధాన మంత్రి కార్యాలయం
అహ్మదాబాద్‌లో సబర్మతి నదీతీరాన ఖాదీ ఉత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి
“7,500 మంది సోదరీమణులు.. కుమార్తెలు
చరఖాపై నూలు వడికి చరిత్ర సృష్టించారు”;
“చరఖాపై నూలు వడకడంలో మీ చేతులు భారతదేశమనే వస్త్రాన్ని నేశాయి”;
“అభివృద్ధి చెందిన.. స్వయం సమృద్ధ భారతదేశం వాగ్దానాన్ని నెరవేర్చడంలో
స్వాతంత్ర్య పోరాటం మాదిరిగానే ఖాదీ కూడా స్ఫూర్తినిస్తుంది”;
“దేశం కోసం ఖాదీ.. ఫ్యాషన్ కోసం ఖాదీ… ప్రతినల
పరివర్తనాత్మకత దిశగా ఖాదీ ప్రతిజ్ఞను మేం జోడించాం";
“భారత ఖాదీ పరిశ్రమ బలోపేతం కావడంలో మహిళా శక్తి కూడా ప్రధాన కారణం”;
“స్థిరమైన… పర్యావరణ అనుకూల వస్త్రధారణకు ఖాదీ నిదర్శనం;
ఇందులో కర్బన ఉద్గారాల జాడ అతి తక్కువగా ఉంటుంది”;
“రాబోయే పండుగల సందర్భంగా ఖాదీని బహూకరించండి.. ప్రచారం చేయండి”;
“దూరదర్శన్‌లో ‘స్వరాజ్’ సీరియల్‌ను ప్రతి కుటుంబం చూడాలి”
Posted On:
27 AUG 2022 7:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అహ్మదాబాద్‌లో సబర్మతి నదీతీరాన నిర్వహించిన ఖాదీ ఉత్సవంలో పాల్గొన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, పార్లమెంటు సభ్యుడు శ్రీ ఆర్.పాటిల్, రాష్ట్ర మంత్రులు శ్రీ హర్ష సంఘ్వీ, శ్రీ జగదీష్ పంచాల్, అహ్మదాబాద్ మేయర్ శ్రీ కీర్తిభాయ్ పర్మార్, ‘కేవీఐసీ’ చైర్మన్ శ్రీ మనోజ్‌కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- చరఖాతో తన వ్యక్తిగత అనుబంధాన్ని, తన చిన్నతనంలో తల్లి చరఖా తిప్పడం గురించి తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. “భారత 75వ స్వాతంత్ర్య వార్షికోత్సవం నేపథ్యంలో సబర్మతి నదీతీరం ఇవాళ ఒక విశిష్టతను సంతరించుకుంది. 7,500 మంది సోదరీమణులు, భరతమాత పుత్రికలు సామూహికంగా చరఖాపై నూలు వడికి కొత్త చరిత్ర సృష్టించారు” అని ఆయన ప్రశంసించారు. చరఖాపై నూలు వడకడం భరతమాతను ఆరాధించడంతో సమానమని ఈ సందర్భంగా ఆయన అభివర్ణించారు.
అనంతరం ఇవాళ తాను ప్రారంభించిన ‘అటల్ వారధి’ సాంకేతికత, రూపం ప్రత్యేకత గురించి వివరించారు. గుజరాత్ ప్రజలు సదా ప్రేమాభిమానాలు ప్రదర్శించే శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయికి ఈ వంతెన ఒక నివాళి కాగలదని ఆయన పేర్కొన్నారు. “సబర్మతి నది తీరాలను అనుసంధానించడం మాత్రమేగాక రూపం, ఆవిష్కరణల రీత్యా కూడా ‘అటల్ వారధి’ విశిష్టమైనది. దీని రూపకల్పన సమయంలో గుజరాత్‌లో ప్రసిద్ధ గాలిపటాల ఉత్సవం కూడా పరిగణనలోకి తీసుకోబడింది” అని ఆయన చెప్పారు. భారతదేశంలో ‘ఇంటింటా త్రివర్ణం’ ఉద్యమ ఉత్సాహాన్ని కూడా శ్రీ మోదీ కొనియాడారు. ఇక్కడి వేడుకలు ప్రజల్లోగల దేశభక్తిని మాత్రమేగాక ఆధునిక, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణ సంకల్పాన్ని కూడా ప్రతిబింబిస్తున్నాయని ఆయన అన్నారు. “చరఖాపై నూలు వడుకుతున్నపుడు మీ చేతులు భారతదేశమనే వస్త్రాన్ని నేస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు.
“స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ఖాదీ నూలుపోగు నాటి ప్రజా ఉద్యమానికి తిరుగులేని శక్తిగా మారి బానిసత్వ శృంఖలాలను ఛేదించడానికి చరిత్రే సాక్ష్యంగా నిలుస్తోంది” అని ప్రధానమంత్రి చెప్పారు. ఇదే ఖాదీ నూలుపోగు అభివృద్ధి చెందిన భారతదేశం హామీతోపాటు తద్వారా స్వయం సమృద్ధ భారతదేశం స్వప్నాన్ని సాకారం చేయడానికీ ప్రేరణ ఇవ్వగలదని ఆయన పేర్కొన్నారు. ఖాదీవంటి సంప్రదాయ బలం మనల్ని కొత్త శిఖరాలకు చేరుస్తుందన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని, చరిత్రను పునరుద్ధరించే కృషితోపాటు నవ భారత సంకల్పాలను సాధించడంలో ఈ ఖాదీ ఉత్సవం స్ఫూర్తినిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఎర్రకోట బురుజుల నుంచి ఆగస్టు 15న తాను ప్రకటించిన ‘పంచప్రాణాల’ను ప్రధానమంత్రి గుర్తుచేసుకున్నారు. “ఈ పవిత్ర ప్రదేశంలో సబర్మతి ఒడ్డున నేను పంచ-ప్రాణాలను పునరుద్ఘాటించాలని భావిస్తున్నాను. మొదటిది- దేశం ముందున్న ప్రధాన లక్ష్యమైన… అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం. రెండోది- బానిస మనస్తత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం. మూడోది- మన వారసత్వం గురించి గర్వించడం, నాలుగోది- దేశ ఐక్యత పెంపునకు బలమైన కృషి, ఐదోది- పౌర కర్తవ్యం. ఈ ‘పంచప్రాణాల’కు ఖాదీ ఉత్సవం ఒక అందమైన ప్రతిబింబమని ఆయన అన్నారు.
స్వాతంత్ర్యం వచ్చాక ఖాదీ నిర్లక్ష్యానికి గురికావడం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. “స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో గాంధీజీ ఖాదీని దేశ ఆత్మగౌరవానికి చిహ్నంగా రూపుదిద్దారు. కానీ, స్వాతంత్ర్యం సిద్ధించాక దీనిపై ఒక న్యూనతా భావన అలముకుంది. ఈ కారణంగా ఖాదీతోపాటు దానితో ముడిపడిన గ్రామీణ పరిశ్రమల రంగం కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఖాదీకి.. ముఖ్యంగా ఇలాంటి దుస్థితి దాపురించడం చాలా బాధాకరం” అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఖాదీ పునరుజ్జీవన కృషి ఇదే గుజరాత్ గడ్డపై సాగడం తనకెంతో గర్వకారణమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘దేశం కోసం ఖాదీ, ఫ్యాషన్ కోసం ఖాదీ’ ప్రతినలకు ‘పరివర్తనాత్మకత కోసం ఖాదీ’ ప్రతినను ప్రభుత్వం జోడించిందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “గుజరాత్ విజయానుభవాలను మేం దేశవ్యాప్తం చేయడం ప్రారంభించాం” అని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా ఖాదీకి సంబంధించిన సమస్యలు పరిష్కారమయ్యాయని, ఖాదీ ఉత్పత్తుల కొనుగోలుకు ప్రజలను ప్రోత్సహించామని చెప్పారు. అలాగే ఖాదీ పునరుద్ధరణ ప్రక్రియలో మహిళల పాత్రను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు. “భారత ఖాదీ పరిశ్రమ బలోపేతం కావడంలో మహిళా శక్తి కూడా ఒక ప్రధాన కారణం. వ్యవస్థాపన స్ఫూర్తి మన సోదరీమణులు, కుమార్తెలలో పాతుకుపోయింది. గుజరాత్‌లో ‘సఖి మండళ్ల’ విస్తరణ కూడా ఇందుకు నిదర్శనం” అని ఆయన పేర్కొన్నారు. గత 8 ఏళ్లలో ఖాదీ విక్రయాలు నాలుగు రెట్లు పెరిగాయని, తొలిసారిగా ఖాదీ-గ్రామోద్యోగ్ వార్షిక వ్యాపార పరిమాణం రూ.లక్ష కోట్లు దాటిందని ఆయన వెల్లడించారు. అంతేగాక 1.75 కోట్ల కొత్త ఉద్యోగాలను కూడా ఈ రంగం సృష్టించిందని చెప్పారు. ముద్రా యోజన వంటి ఆర్థిక సార్వజనీనత పథకాలు వ్యవస్థాపనను ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు.
ఖాదీ వల్ల ప్రయోజనాల గురించి ప్రధాని మోదీ వివరించారు. స్థిరమైన, పర్యావరణ అనుకూల వస్త్రధారణకు ఖాదీ ఒక నిదర్శనమని ఆయన చెప్పారు. అంతేగాక ఈ రంగంలో కర్బన ఉద్గారాల జాడ అతి తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. అనేక దేశాల్లో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుందని, ఆ మేరకు ఆరోగ్యపరంగా చూసినా ఖాదీకి చాలా ప్రాముఖ్యం ఉందని చెప్పారు. కాబట్టి అంతర్జాతీయ స్థాయిలో ఖదీ ప్రధానపాత్ర పోషించగలదని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా సుస్థిర, ప్రాథమిక జీవనశైలి వైపు సాగే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో అందుకు తగినట్లుగా ఖాదీకి ప్రాముఖ్యం పెరుగుతుందన్నారు. రాబోయే పండుగల సందర్భంగా ఖాదీ-గ్రామీణ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులను మాత్రమే ప్రజలు పరస్పరం బహూకరించాలని ప్రధానమంత్రి సూచించారు. “మీరు రకరకాల వస్త్రాలతో తయారు చేసిన దుస్తులు ధరిస్తూంటారు. అయితే, వాటిలో ఖాదీకి స్థానం కల్పిస్తే ‘స్థానికం కోసం స్వగళం’ ఉద్యమానికి ఊపు లభిస్తుంది” అని ప్రధానమంత్రి సూచించారు.
గత దశాబ్దాలలో విదేశీ బొమ్మలతో పోటీలో భారతదేశంలో మనదైన సుసంపన్న బొమ్మల పరిశ్రమ నాశనమైందని ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయితే, ప్రభుత్వ ప్రయత్నాలకు బొమ్మల పరిశ్రమలతో అనుబంధమున్న సోదర సోదరీమణుల కృషి తోడు కావడంతో పరిస్థితి మెరుగుపడి మార్పు ప్రస్ఫుటమవుతున్నదని, బొమ్మల దిగుమతి భారీగా తగ్గుతోందని చెప్పారు. దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న ‘స్వరాజ్’ సీరియల్‌ని ప్రజలందరూ చూడాలని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. మహనీయులైన స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రను, వారి వీరోచిత పోరాట గాథలను ఈ సీరియల్ చక్కగా వివరిస్తుందని పేర్కొన్నారు. మనకు స్వాతంత్ర్యం తెచ్చిపెట్టడం కోసం మన పూర్వికులు ఎంతటి త్యాగాలు చేశారో తెలుసుకుని, అర్థం చేసుకునే దిశగా సకుటుంబంగా ఈ సీరియల్‌ను చూడాలని ఆయన సూచించారు.
ఖాదీ ఉత్సవం
ఖాదీకి పూర్వ వైభవం కల్పించి, తిరిగి ప్రాచుర్యంలోకి తేవడంతోపాటు ఖాదీ ఉత్పత్తులపై అవగాహన కల్పన, ఖాదీ వినియోగం గురించి యువతను ప్రోత్సహించడం కోసం ప్రధానమంత్రి నిరంతరం శ్రమిస్తున్నారు. ఆయన కృషి ఫలితంగా, 2014 నుంచి భారతదేశంలో ఖాదీ విక్రయాలు నాలుగు రెట్లు… ముఖ్యంగా గుజరాత్‌లో 8 రెట్లు పెరిగాయి. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య అమృత మహోత్సవం వంటి ప్రత్యేక వేడుకల్లో భాగంగా ఖాదీకి నివాళి అర్పించడంతోపాటు స్వాతంత్ర్య సంగ్రామంలో దాని ప్రాముఖ్యాన్ని తెలిపే విధంగా ‘ఖాదీ ఉత్సవం’ నిర్వహించబడుతోంది. అహ్మదాబాద్‌లోని సబర్మతి నదీతీరంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవంలో గుజరాత్‌లోని వివిధ జిల్లాల నుంచి 7500 మంది మహిళా ఖాదీ కళాకారులు ఏకకాలంలో, ఒకే వేదికపై చరఖామీద నూలు వడికారు. అంతేకాకుండా 1920ల కాలం నుంచి వివిధ తరాల్లో వాడిన 22 చరఖాలను ప్రదర్శించారు. తద్వారా ‘చర్ఖా పరిణామం’ గురించి ప్రదర్శన నిర్వహించబడుతుంది. స్వాతంత్ర్య పోరాటంలో ఉపయోగించిన చరఖాలను సూచించే “ఎరవాడ చరఖా” వంటివి, నేడు ఉపయోగించే సరికొత్త ఆవిష్కరణలు, సాంకేతికతతో కూడిన చరఖాలు కూడా ఇందులో ప్రదర్శిస్తారు. దీంతోపాటు పొందూరు ఖద్దరు తయారీ ప్రక్రియను ప్రత్యక్షంగా ప్రదర్శిస్తున్నారు. ఈ ఉత్సవంతోపాటు గుజరాత్ రాష్ట్ర ఖాదీ గ్రామోద్యోగ్ బోర్డు కొత్త కార్యాలయ భవనాన్ని, సబర్మతి నదిపై పాదచారుల కోసం నిర్మించిన ‘అటల్ వారధి’ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు.
*****
DS/TS
(Release ID: 1855068)
Visitor Counter : 165
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam