ప్రధాన మంత్రి కార్యాలయం
76వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Posted On:
15 AUG 2022 2:17PM by PIB Hyderabad
ప్రధానమంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు
1. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా ప్రియమైన దేశవాసులందరికీ అభినందనలు. అందరికీ శుభాకాంక్షలు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోను, ప్రపంచవ్యాప్తంగాను గల దేశాన్ని అమితంగా ప్రేమించే వారు ఎగురవేసిన త్రివర్ణ పతాకం గర్వంగా, గౌరవనీయంగా, వెలుగులు విరజిమ్ముతూ ఎగురుతుండడం ఆనందదాయకం.
2. జాతికి సేవలందించేందుకు తమ జీవితాలను అంకితం చేసిన పూజ్య బాపూజీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్ అందరికీ దేశం ఎంతో రుణపడి ఉంది. వారు నడిచిన బాట ఎంతో బాధ్యతాయుతమైనది.
3. బ్రిటిష్ పాలకుల పునాదులను కదిలించి వేసిన మంగళ్ పాండే, తాంతియా తోపే, భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు, చంద్రశేఖర్ అజాద్, అష్ఫక్ ఉల్లా ఖాన్, రాం ప్రసాద్ బిస్మిల్ వంటి తిరుగుబాటుదారులందరికీ ఈ దేశం రుణపడి ఉంది. అలాగే మహిళా శక్తి ఏమిటో చూపించిన సాహస వనితలు రాణి లక్ష్మీ బాయి, జల్కారి బాయి, దుర్గా బాయి. రాణి గైదిన్ లియూ, రాణి చెన్నమ్మ, బేగం హజ్రత్ మహల్, వేలు నాచియార్ లకు కూడా జాతి రుణపడి ఉంది.
4. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడడమే కాదు, స్వాతంత్ర్యానంతరం దేశాన్ని నిర్మించిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జీ, నెహ్రూజీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్, శ్యామ ప్రసాద్ ముఖర్జీ, లాల్ బహదూర్ శాస్ర్తి, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్, జయ ప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, ఆచార్య వినోబాభావే, నానాజీ దేశ్ ముఖ్, సుబ్రమణియ భారతి అందరికీ శ్రద్ధాంజలి ఘటించే అవకాశం ఇది.
5. మన స్వాతంత్ర్యోద్యమం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో అడవుల్లో నివశిస్తున్న మనకు గర్వకారణమైన గిరిపుత్రుల గురించి మరిచిపోకూడదు. భగవాన్ బిర్సా ముందా, సింధు కాన్హు, అల్లూరి సీతారామరాజు, గోవింద్ గురు వంటి ఎందరో మాతృభూమి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టడం ద్వారా స్వాతంత్ర్యోద్యమ వాక్కుగా మారి మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివశిస్తున్న ఎందరో గిరిజన సోదరులు, సోదరీమణులు, తల్లులు, యువతకు స్ఫూర్తిమంతంగా నిలిచారు.
6. దేశం “అమృత్ మహోత్సవ్” ఏ విధంగా వేడుగ్గా చేసుకుందో గత ఏడాది కాలంగా మనం చూశాం. 2021లో దండి యాత్రతో ఆ వేడుకలు ప్రారంభం అయ్యాయి. ప్రతీ ఒక్క జిల్లాలోను, దేశంలోని మారుమూల ప్రాంతాల్లోను భారత స్వాతంత్ర్య “అమృత్ మహోత్సవ్” లక్ష్యాల పరిధిని విస్తరింపచేయడానికి ప్రజలు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. కేవలం ఒకే ఒక వేడుక కోసం దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున, సర్వసమగ్రంగా ఉత్సవాలు జరగడం చరిత్రలో ఇదే తొలి సారి కావచ్చు.
7. ఏవో కారణాల వల్ల చరిత్రలో గుర్తింపునకు నోచుకోని, దేశం మరిచిపోయిన గొప్ప యోధులందరినీ గుర్తు చేసుకునేందుకు దేశంలోని ప్రతీ ఒక్క ప్రాంతంలోను ప్రయత్నం జరిగింది. నేడు దేశంలోని అన్ని మూలల్లోనూ ఇలాంటి గొప్ప యోధులు, వీరులను గుర్తించి వారి త్యాగాలకు నివాళి అర్పిస్తున్నారు. అలాంటి వారందరికీ శ్రద్ధాంజలి ఘటించే చక్కని సందర్భం “అమృత్ మహోత్సవ్”.
8. నేడు మనం నిర్వహించుకుంటున్న ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గత 75 సంవత్సరాల కాలంలో దేశాన్ని సంరక్షించేందుకు, దేశ సంకల్పాలు నెరవేర్చేందుకు తమ జీవితాలనే అంకితం చేసిన సైనిక సిబ్బంది, పోలీసు సిబ్బంది, అధికార యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు, స్థానిక స్వపరిపాలన సంస్థల అడ్మినిస్ర్టేటర్లు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం సభ్యులు...ఇలా అందరి సేవలను గుర్తు చేసుకునే చక్కని అవకాశం.
9. ఈ 75 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఎగుడు దిగుడులున్నాయి. మంచి చెడుల నడుమ మన దేశవాసులు పలు విజయాలు సాధించారు. ఏ అవకాశం వదిలిపెట్టకుండా తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా వారు తమ సంకల్పాలు వదిలిపెట్టలేదు.
10. భారతదేశానికి సంస్కృతి, విలువలతో కూడిన అంతర్నిహిత శక్తి, మనసు, ఆత్మల మిళితమైన ఆలోచనలు ఉన్నాయని, అన్నింటి సమాహారంగా భారతదేశం అన్ని ప్రజాస్వామ్యాలకు మాతృక అన్న విషయం ప్రపంచానికి తెలుసు. మనసులో ప్రజాస్వామ్యం గురించిన ఆలోచనలున్న వారందరూ ఒక దృఢ సంకల్పం, పట్టుదలతో ముందుకు నడుస్తారు, ఆ శక్తి ప్రపంచంలోని శక్తివంతమైన సుల్తానేట్లకు వినాశకారిగా పరిణమిస్తుంది. ఈ అసాధారణమైన బలం మనకున్నదని ప్రజాస్వామ్యాలకే మాతృక అయిన భారతదేశం ప్రపంచానికి చాటి చెప్పింది.
11. ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, ఎగుడుదిగుడులతో కూడినదైనప్పటికీ ఈ 75 సంవత్సరాల ప్రయాణం ప్రతీ ఒక్కరి కృషి ఫలితంగా మనందరినీ ఈ మహోజ్వల ఘట్టానికి చేర్చింది. 2014 సంవత్సరంలో ప్రజలు నా మీద పెను బాధ్యత పెట్టారు. ఆ రకంగా స్వేచ్ఛా భారతంలో పుట్టి చారిత్రక ఎర్రకోట బురుజుల నుంచి ప్రియమైన దేశవాసుల వెలుగులను కీర్తించే అవకాశం కలిగిన, స్వాతంత్ర్యానంతరం జన్మించి ఆ స్థాయికి చేరిన తొలి భారతీయుడిగా నేను నిలిచాను.
12. భారతదేశ మారుమూల అక్షాంశాలు, రేఖాంశాలన్నింటికీ తాకుతూ తూర్పు, పశ్చిమం; ఉత్తరం, దక్షిణ దిక్కులు, సముద్రాలు, హిమాలయ పర్వత శ్రేణులు...ఏ ఒక్కటీ వదలకుండా మహాత్మాగాంధీ సమ్మిళిత కలను నెరవేర్చేందుకు నేను అన్ని ప్రాంతాలు సందర్శించారు. మారుమూలన, చిట్టచివరన ఉన్న వారికి కూడా సాధికారత కల్పించి, వారిని అభ్యున్నతి పథంలో నడపాలన్న మహాత్ముని కల సాకారం చేయడానికి నేను కట్టుబడ్డాను.
13. నేడు మనం అమృత్ మహోత్సవ్... 75 సంవత్సరాల ఉజ్వల ఘట్టంలో నిలిచి ఉన్నాం. 76వ వార్షికోత్సవ తొలి ఘడియల్లో ఇంత అద్భుతమైన చరిత్ర లిఖించిన దేశాన్ని చూసి నా హృదయం గర్వంతో ఉప్పొంగుతోంది.
14. నేడు ప్రతీ ఒక్క పౌరుడు మార్పును కోరుతున్నాడు, అందుకోసం వేచి ఉండాలనుకోవడంలేదు. తన కళ్ల ముందే అన్నీ జరగాలని, తన బాధ్యత తాను నెరవేర్చాలని ఆకాంక్షిస్తున్నాడు. వారి ఆకాంక్షలు తీర్చేందుకు ఇంకా ఎంతో కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక స్వపరిపాలన సంస్థలు...అన్ని పాలకవర్గాలు సమాజంలోని ఆ ఆకాంక్షలు తీర్చేందుకు నడుం బిగిస్తాయని నేను విశ్వసిస్తున్నాను.
15. ఆకాంక్షాపూరితమైన సమాజం ఇప్పటికే ఎంతో కాలం వేచి ఉంది. భవిష్యత్ తరాలు తమ వలె వేచి చూడడంలోనే జీవితాలు గడిపేయాలని వారు కోరుకోవడంలేదు. ఈ “అమృత కాల” తొలి ఉదయం ఆ ఆకాంక్షలు తీర్చడానికి చక్కని అవకాశం.
16. ఇటీవల మనం అలాంటి రెండు చక్కని సందర్భాలు వీక్షించాం, అనుభవించాం. భారతదేశ సుసంఘటిత పునరుజ్జీవం అది. ఈ చైతన్యం, పునరుజ్జీవం మనం గొప్ప ఆస్తులని నేను భావిస్తున్నాను. ఆగస్టు 10వ తేదీ వరకు దేశంలోనే దాగి ఉన్న శక్తి గురించి ప్రజలకు తెలియదు. కాని గత మూడు రోజులుగా దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకం ప్రయాణాన్ని వీక్షించగలిగాం. సామాజిక శాస్త్ర నిపుణులు కూడా నా దేశంలో అంతర్గతంగా గల ఈ శక్తిని ఊహించి ఉండరంటే అతిశయోక్తి కాదు.
17. ప్రపంచం భారతదేశం వైపు ఎంతో గర్వంగా చూస్తోంది. భారతదేశ భూభాగం పైనే తమ సమస్యలకు పరిష్కారాలు అన్వేషించాలని ప్రపంచం భావిస్తోంది. మన 75 సంవత్సరాల ఈ ప్రయాణమే భారత్ పట్ల ప్రపంచ వైఖరి, ఆలోచనా ధోరణి మారడానికి మూల కారణం.
18. తమ ఆకాంక్షలు తీరగల శక్తి ఎక్కడ ఉందన్నది ప్రపంచం గుర్తించడం ప్రారంభమయింది. అదే మహిళా శక్తి. అదే త్రిశక్తి...ఆకాంక్షలు, పునరుజ్జీవం, ప్రపంచ ఆకాంక్షలు. దాన్ని సాకారం చేయడంలోను, భారతదేశం పట్ల ప్రపంచ విశ్వాసాన్ని మరింతగా మేల్కొల్పడంలోను నా దేశవాసులు పోషించాల్సిన పాత్ర ఎంతో ఉందని నేను నమ్ముతున్నాను.
19. కొన్ని దశాబ్దాల విరామం అనంతరం నేడు సుస్థిర ప్రభుత్వ ప్రాధాన్యత; రాజకీయ స్థిరత్వ, విధానాల శక్తి; విశ్వసనీయతతో కూడిన విధానాల ప్రాముఖ్యత ఏమిటో నేడు 130 కోట్ల మంది భారతీయులు ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రపంచం కూడా నేడు అది అర్ధం చేసుకుంటోంది. . రాజకీయ సుస్థిరత, విధానాల్లో గమనశీలత, విధాన నిర్ణయాల్లో వేగం, సార్వత్రిక విశ్వాసం ఉన్నప్పుడు అభివృద్ధి యానంలో ప్రతీ ఒక్కరూ భారతస్వాములే అవుతారని నిరూపించారు.
20. మనం ఈ ప్రయాణాన్ని సబ్ కా సాత్, సబ్ కా వికాస్ మంత్రంతో ప్రారంభించాం. కాని దేశవాసులు దానికి సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అనే వర్ణాలు జోడించారు. నేడు మన సంఘటిత శక్తి, సంఘటిత సామర్థ్యం ఏమిటో మనం వీక్షించగలుగుతున్నాం.
21. ప్రతీ జిల్లాలోనూ 75 అమృత సరోవరాలు నిర్మించాలన్న ప్రచారంతో నేడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ముందుకు నడుపుతున్నాం. ప్రతీ ఒక్క గ్రామ ప్రజలు ఈ ప్రచారంలో భాగస్వాములై తమ సేవలందిస్తున్నారు. తమ తమ గ్రామాల్లో జల సంరక్షణ ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టారు.
22. నేడు ఈ ఎర్రకోట బురుజుల నుంచి 130 కోట్ల మంది భారతీయుల శక్తిని, వారి కలలను నేను వీక్షించగలుగుతున్నాను. వారి ఆకాంక్షల బలాన్ని నేను గుర్తించగలుగుతున్నాను. రాబోయే 25 సంవత్సరాల కాలం మనం పంచ ప్రాణం పై దృష్టి సారించగలమని నేను విశ్వసిస్తున్నాను. అందుకు మీ సంకల్పాలు, బలాన్ని పెంచుకోవాలి. 2047 నాటికి దేశం నూరు సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకునే సమయానికి ఈ పంచ ప్రాణాలతో స్వాతంత్ర్య యోధుల కలలు సాకారం చేసే బాధ్యతను మనం స్వీకరించాలి.
23. అభివృద్ధి చెందిన భారతదేశం, సామ్రాజ్యవాద ఆలోచనలు మనసు నుంచి తొలగించడం, మన మూలాలు చూసి గర్వించడం, ఐక్యత, బాధ్యత...ఇవే అమృత కాల పంచ ప్రాణాలు.
24. పోటీ తత్వం గల సహకార ఫెడరలిజం నేటి అవసరం. విభిన్న రంగాలను పురోగమన పథంలో నడపడంలో రాష్ర్టాల మధ్య ఆరోగ్యవంతమైన పోటీ ఏర్పడాలి.
25. నేను నా తొలి ప్రసంగంలో స్వచ్ఛత గురించి తొలిసారి ప్రస్తావించినప్పుడు దేశం యావత్తు దాన్ని స్వీకరించింది. ప్రతీ ఒక్కరూ తమ శక్తికి లోబడి స్వచ్ఛత వైపు అడుగులు వేశారు. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ మురికి పట్ల అసహనం ప్రదర్శిస్తున్నారు. ఈ దేశం ఆ కృషి చేసింది, చేస్తోంది, భవిష్యత్తులో కూడా ఆ కృషిని కొనసాగిస్తుంది. నేడు భారతదేశంలో బహిరంగ మలమూత్ర విసర్జన రహిత సమాజం ఆవిర్భవించింది.
26. ప్రపంచం యావత్తు ఏం చేయాలో నిర్ణయించుకోలేని సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు నిర్దిష్ట కాలపరిమితిలోనే మన దేశం 200 కోట్ల వ్యాక్సినేషన్ల మైలురాయిని చేరింది. అన్ని పాత రికార్డులు చెరిపేసింది.
27. మనం క్రూడాయిల్ కోసం గల్ఫ్ దేశాలపై ఆధారపడుతున్నాం, ఈ దశలో మనం బయో ఇంధనాల వైపు సాగాలని నిర్ణయించుకున్నాం. చమురులో 10 శాతం ఇథనాల్ మిశ్రమం ఒక పెద్ద కలగా ఉండేది. గత అనుభవాలైతే అది అసాధ్యం అని కూడా చాటి చెప్పాయి. కాని నిర్దిష్ట కాలపరిమితి కన్నా ముందే దేశం 10 శాతం ఇథనాల్ మిశ్రమం కల సాకారం చేసింది.
28. అతి తక్కువ సమయంలో 2.5 కోట్ల మంది ప్రజలకు విద్యుత్ కనెక్షన్లు అందించడం చిన్న పనేమీ కాదు, కాని మన దేశం అది సాధించింది. నేడు దేశం లక్షలాది ఇళ్లకు పంపు నీటి కనెక్షన్లు అందించే దిశగా వేగంగా ముందుకు సాగుతోంది.
29. నిర్ణయంలో దృఢత్వం ఉంటే ఎలాంటి లక్ష్యం అయినా సాధించగలం అని అనుభవం తెలుపుతోంది. పునరుత్పాదక ఇంధనం కావచ్చు, కొత్త వైద్య కళాశాలల నిర్మాణం కావచ్చు, వైద్యుల వర్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కావచ్చు అన్ని రంగాల్లోనూ వేగం పెరిగింది.
30. సోదరులారా, ఎంత కాలం పాటు ప్రపంచం మనకి సర్టిఫికెట్లు పంచుతూ పోవాలి? ప్రపంచం ఇచ్చే సర్టిఫికెట్లపై ఎంత కాలం పాటు మనం ఆధారపడాలి? మన ప్రమాణాలు మనం ఏర్పాటు చేసుకోలేమా? 130 కోట్ల మంది ప్రజలున్న దేశం తన సొంత ప్రమాణాలు తాను అధిగమించలేదా? ఏ సందర్భంలో అయినా సరే మనం ఇతరుల వైపు చూడకూడదు. మనకి మనమే ఎదిగి, మన సామర్థ్యాలు మనం పొందాలన్నదే మన ఆకాంక్ష కావాలి. బానిసత్వం నుంచి మనం విముక్తులం కావాలి. సప్త సముద్రాల ఆవల కూడా మన మనసులో బానిసత్వ ఆలోచన ఉండకూడదు.
31. ఎంతో మేథోమథనం, విభిన్న రంగాలకు సంబంధించిన ప్రజల అభిప్రాయ మార్పిడితో రూపు దిద్దుకున్న కొత్త విద్యా విధానం వైపు నేను ఆశగా ఎదురు చూస్తున్నాను. అదే దేశ విద్యావిధానానికి మూలం కావాలి. ఆ శక్తి నుంచే బానిసత్వ శృంఖలాల విముక్తికి అవసరమైన బలం అందుతుంది.
32. కొన్ని సందర్భాల్లో మన ప్రతిభ ఆశతో బలమైన బంధం ఉన్నట్టు మనం భావిస్తాం. బానిసత్వ ఆలోచనా ధోరణి ఫలితం అది. మన దేశంలోని ప్రతీ ఒక్క భాష మనకు గర్వకారణం. మనకి ఆ భాష తెలియవచ్చు, తెలియకపోవచ్చు...అది నా దేశ భాష అని మనం గర్వించాలి. మన పూర్వీకులు ప్రపంచానికి అందించినది భాషే.
33. నేడు మనం డిజిటల్ ఇండియా నిర్మాణాన్ని వీక్షిస్తున్నాం. స్టార్టప్ ల వైపు చూస్తున్నాం. వారంతా ఎవరు? వారంతా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామాలకు చెందిన, పేద కుటుంబాలకు ప్రతిభావంతులే. ఆ యువకులే నేడు కొత్త అన్వేషణలతో ప్రపంచం ముందుకు వస్తున్నారు.
34. ఇవాళ ప్రపంచమంతా సమగ్ర ఆరోగ్య సంరక్షణ గురించి చర్చించుకుంటోంది. అయితే, ఈ అంశం గురించి మాట్లాడుకునే వేళ భారతదేశానికి చెందిన యోగా, ఆయుర్వేదంతోబాటు భారత సమగ్ర జీవన శైలివైపు చూస్తోంది. ఆ విధంగా మన సుసంపన్న వారసత్వాన్ని ప్రపంచానికి నేడు మనం అందిస్తున్నాం.
35. మనదైన ఈ వారసత్వం ఈ రోజున ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. ఇప్పుడు మన బలేమిటో ఒకసారి చూసుకుందాం. ప్రకృతితో మమేకమై జీవించడం ఎలాగో తెలిసిన ఏకైక జాతి. ముతక ధాన్యం, చిరుధాన్యాలు ఇంటి ఆహారాలు. ఇదీ మన వారసత్వం… మన చిన్నకారు రైతుల కఠోర శ్రమ ఫలితంగా చిన్నచిన్న కమతాల్లో వరి విరగబండుతోంది. నేడు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం నిర్వహణకు ప్రపంచం సిద్ధమవుతోంది. అంటే- మన వారసత్వ సంపద నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. దీనిగురించి గర్వపడటం మొదలెడదాం. ప్రపంచానికి మనం అందించాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయి.
36. మానుమాకుల్లోనూ దైవత్వాన్ని చూసే మనుషులం మనం. నదిని తల్లిగా భావించే ప్రజలం మనం… ప్రతి రాతిలోనూ శివలింగాన్ని దర్శించే వాళ్లం మనం. ఇదీ మన శక్తి! ప్రతి నదిని సాక్షాత్తూ తల్లి స్వరూపంగా భావిస్తాం. ఇంతటి అపార పర్యావరణం జ్ఞానం మనకు గర్వకారణం! అటువంటి వారసత్వాన్ని చూసుకుని మనం గర్వంతో పొంగిపోతున్నపుడు ప్రపంచం కూడా దానిగురించి గర్విస్తుంది.
37. అంతా నాదేననే ధోరణి ప్రబలడంతో తలెత్తిన వైరుధ్యాల వల్ల ప్రపంచం నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అన్నిరకాల ఉద్రిక్తతలకూ ఇదే కారణం. దీన్ని పరిష్కరించగల జ్ఞానం మనకుంది. మన పండితులు “ఏకం సత్ విప్రా బహుధా వదంతి” అన్నారు. అంటే- “దైవ స్వరూపం ఒక్కటే… అది అనేక పేర్లతో పూజించబడుతుంది” అని అర్థం. ఇదీ మన ఘనత.
38. మన లోక కల్యాణ దృష్టిగల ప్రజలం; “సర్వే భవన్తు సుఖినః.. సర్వే సంతు నిరామయః” అని విశ్వసించడం ద్వారా మన ప్రజలకేగాక ప్రపంచం మొత్తానికీ సామాజికంగా మేలుచేసే మార్గం మనది. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని, అనారోగ్యం నుంచి విముక్తి పొందాలని, అందరికీ శుభం కలగాలని, ఎవరికీ బాధ కలగకుండా లోకం సాగాలని మనం ప్రార్థిస్తాం. అది మన విలువల్లో పాతుకుపోయిన సహజ లక్షణం.
39. అదేవిధంగా మరొక ముఖ్యాంశం ఐక్యత, సంఘీభావం. ఆ మేరకు ఈ సువిశాల దేశంలో వైవిధ్యం మనం సంబరపడాల్సిన విషయం. అసంఖ్యాక సంప్రదాయాలు, మతాల శాంతియుత సహజీవనం మనకెంతో గర్వకారణం. మనకు అందరూ సమానులే… ఎక్కువ-తక్కువంటూ ఎవరూ లేరు; అందరూ మనవారే.. ఈ ఏకత్వ భావనే ఐక్యతకు ప్రధానం.
40. నా సోదరసోదరీమణులారా! ఈ ఎర్రకోట ప్రాకారం నుంచి నేను మీతో నా మనో వ్యాకులతను మీతో పంచుకోవాలని భావిస్తున్నాను. అదేమిటంటే- నానాటికీ మన ప్రవర్తన, మాట్లాడే పద్ధతిలో ఒక విధమైన వక్రమార్గం పట్టామని చెప్పడానికి నేనెంతో చింతిస్తున్నాను. ఇటీవలి కాలంలో మన మహిళలపై దూషణాత్మక, అనుచిత పద ప్రయోగం సర్వసాధారణంగా మారిపోతోంది. మన దైనందిన జీవితంలో స్త్రీలను కించపరిచే, అవమానించే ప్రతి ప్రవర్తనను, సంస్కృతిని వదిలించుకుందామని మనం ప్రతినబూనలేమా? జాతి కలలను సాకారం చేసుకోవడంలో మహిళల ఆత్మగౌరవం మనకు అతిపెద్ద సంపద కానుంది. నేను ఈ శక్తిని చూస్తున్నాను కాబట్టి నేను దానిపై పట్టుదలతో ఉన్నాను. ఈ శక్తి ఎంతటిదో నాకు తెలుసు.. అందుకే దీన్నిగురించి నేను నొక్కిచెబుతున్నాను.
41. నిరంతరాయ విద్యుతు సరఫరాకు కృషి చేయడం ప్రభుత్వ కర్తవ్యం. అయితే, వీలైనన్ని ఎక్కువ యూనిట్ల ఆదా ప్రతి పౌరుడి విధి. ప్రతి పొలానికీ నీరివ్వడం ప్రభుత్వ బాధ్యత, కృషి. అయితే, ప్రతి కమతంలోనూ ‘ప్రతి చుక్కతో మరింత పంట’ పండించడానికి నేను కృషి చేస్తాననే మాట మన గళంనుంచి పెల్లుబకాలి. రసాయనరహిత, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అనుసరించడం మన కర్తవ్యం.
42. మిత్రులారా! పోలీసులైనా, ప్రజలైనా, పాలకులైనా లేదా నిర్వాహకుడైనా ఈ పౌర బాధ్యత ప్రతి ఒక్కరిమీదా ఉంటుంది. పౌరులందరూ తమ కర్తవ్యాన్ని చిత్తశుద్ధితో నెరవేరిస్తే మనం నిర్దేశించుకున్న లక్ష్యాలను గడువుకు ముందుగానే కచ్చితంగా సాధించగలమని నేను విశ్వసిస్తున్నాను.
43. ఇవాళ మహర్షి అరవిందులవారి జయంతి కూడా. ఆ మహానుభావుని పాదాలకు శిరసాభివందనం. అదే సమయంలో ఆయన ప్రబోధించిన “స్వదేశీ నుంచి స్వరాజ్యం-స్వరాజ్యం నుంచి సురాజ్యం” (సుపరిపాలన) నినాదం స్ఫూర్తిగా ఆ మహనీయుడిని స్మరిస్తూ ముందుకు వెళ్లాలి. ఇదే ఆయన బోధించిన తారకమంత్రం… కాబట్టి ‘స్వయం సమృద్ధ భారతం’ స్వప్న సాకారం ప్రతి పౌరుడు, ప్రతి ప్రభుత్వం, సమాజంలోని ప్రతి విభాగం కర్తవ్యమనడంలో సందేహం లేదు. ‘స్వయం సమృద్ధ భారతం’ అనేది ప్రభుత్వ ధ్యేయం లేదా కార్యక్రమం కాదు. ఇది సామూహిక, సమాజ ఉద్యమం.. దీన్ని మనం మరింత ముందుకు తీసుకెళ్లాలి.
44. నా మిత్రులారా! స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల తర్వాత దేనికోసమైతే ఇన్నాళ్లుగా ఎదురుచూస్తున్నామో ఆ ‘మోత’ను ఇవాళ మనం విన్నాం. ఆ మేరకు 75 ఏళ్ల తర్వాత తొలిసారి ‘భారత తయారీ’ ఫిరంగి ఎర్రకోటపై బురుజు పైనుంచి గర్జించి, త్రివర్ణ పతాకానికి వందనం చేసింది. ఈ శబ్దంతో స్ఫూర్తి పొందని భారతీయులు ఎవరైనా ఉంటారా?
45. నా ప్రియ సోదరసోదరీమణులారా! ఈ రోజు నేను నా దేశం సాయుధ బలగాలను, సైనికులను నా హృదయం లోతుల నుంచి అభినందించాలని భావిస్తున్నాను. సైనిక జవాన్లు ఈ స్వావలంబన బాధ్యతను సంఘటిత రీతిలో, ధైర్యంతో భుజానికెత్తుకున్న తీరుకు నేను వందనం చేస్తున్నాను. సాయుధ బలగాలు ఒక జాబితా తయారు చేసి 300 రక్షణ ఉత్పత్తుల దిగుమతిని ఆపివేయాలని సంకల్పించినపుడు అది ఆషామాషీ నిర్ణయం కాదని నాకు అర్థమైంది.
46. ‘పీఎల్‌ఐ’ పథకం గురించి మాట్లాడితే- ప్రపంచవ్యాప్త తయారీదారులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి భారతదేశం వస్తున్నారు. తమతోపాటు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తెస్తున్నారు. తద్వారా కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుండటమే కాకుండా భారతదేశం తయారీ కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. ఆ మేరకు స్వయం సమృద్ధ భారతదేశానికి పునాది వేస్తోంది.
47. ఎలక్ట్రానిక్ వస్తువులు లేదా మొబైల్ ఫోన్‌ల తయారీలో దేశం నేబు చాలా వేగంగా పురోగమిస్తోంది. మన బ్రహ్మోస్ ప్రపంచానికి ఎగుమతి అవుతుంటే గర్వించని భారతీయులు ఎవరైనా ఉంటారా? ఇవాళ వందే భారత్ రైలు, మన మెట్రో కోచ్‌లు ప్రపంచానికి ఆకర్షణీయ వస్తువులుగా మారుతున్నాయి.
48. ఇంధన రంగంలో మనమింకా ఎంతకాలం ఇతర దేశాలపై ఆధారపడతాం? ఇకనైనా స్వావలంబన సాధించాలి. సౌర శక్తి, పవన విద్యుత్, వివిధ పునరుత్పాదక ఇంధన వనరుల రంగాల్లో మనం స్వావలంబన కలిగి ఉండాలి. అలాగే మిషన్ హైడ్రోజన్, బయో ఫ్యూయల్, ఎలక్ట్రిక్ వాహనాల విషయంలోనూ ముందంజ వేయాలి.
49. నేడు ప్రకృతి వ్యవసాయం కూడా స్వావలంబనకు ఒక మార్గం. సూక్ష్మ ఎరువుల కర్మాగారాలు ఇవాళ దేశంలో కొత్త ఆశలు చిగురింపజేశాయి. అయినప్పటికీ, ప్రకృతి వ్యవసాయం, రసాయనరహిత వ్యవసాయం కూడా స్వావలంబనకు ప్రోత్సాహాన్నిస్తాయి. ఈ రోజున హరిత ఉద్యోగాల రూపంలో కొత్త ఉపాధి అవకాశాలు దేశంలో చాలా వేగంగా అందుబాటులోకి వస్తున్నాయి.
50. భారతదేశం తన విధాన ద్వారాన్ని తెరిచింది. తద్వారా ప్రపంచంలోనే డ్రోన్ల తయారీకి సంబంధించి భారత్ అత్యంత ప్రగతిశీల విధానాన్ని రూపొందించింది. దీంతో దేశంలోని యువతకు సరికొత్త అవకాశాల తలుపులు తెరుచుకున్నాయి.
51. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగం కూడా ముందుకు రావాలని నేను పిలుపునిస్తున్నాను. మనం ప్రపంచాన్ని శాసించాలి... ప్రపంచ అవసరాలు తీర్చడంలో భారత్ వెనుకబడి ఉండరాదన్నది స్వావలంబన భారతం స్వప్నాల్లో ఒకటి. ‘ఎంఎస్‌ఎంఈ’లు అయినా సరే, మన ఉత్పత్తులను శూన్య ప్రభావం, శూన్య లోపంతో ప్రపంచం ముందుంచాలి. స్వదేశీ గురించి మనం మరింత గర్వపడాలి.
52. మన గౌరవనీయులైన లాల్ బహదూర్ శాస్త్రి గారి స్ఫూర్తిదాయక నినాదం “జై జవాన్ - జై కిసాన్” నేటికీ మన గుండెల్లో మారుమోగుతూంటుంది. “సైనికుడికి వందనం.. రైతుకు వందనం” అని దీని అర్ధం. ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్‌పేయి ‘జై విజ్ఞాన్’ అనే మరో కొత్త నినాదాన్ని జోడించారు. దీనికి “శాస్త్ర జ్ఞానానికి వందనం” అని అర్థం. ఈ నినాదానికి మేం అత్యంత ప్రాధాన్యమిచ్చాం. అయితే, ప్రస్తుత అమృత కాల దశలో ఇప్పుడు ‘జై అనుసంధాన్’ని మనం జోడించడం అత్యవసరం, అదే “ఆవిష్కరణలకు నమస్కారం” అన్న మాట! ఆ మేరకు “జై జవాన్ - జై కిసాన్, జై విజ్ఞాన్ - జై అనుసంధాన్” అన్నది నేటి నినాదం కావాలి.
53. ఇప్పుడు మనం 5జి శకంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రపంచం ముందంజతో పోల్చుకోవడానికి ఇక మనం ఎంతోకాలం వేచి ఉండనక్కర్లే్దు. చిట్టచివరి వ్యక్తిదాకా ప్రతి గ్రామానికీ ఆప్టికల్ ఫైబర్ చేరేలా మేం సంకల్పం పూనాం. గ్రామీణ భారతం సాయంతోనే డిజిటల్ భారతం కల సాకారం కాగలదన్న విశ్వాసం నాకు మెండుగా ఉంది. ఇవాళ గ్రామాల్లోని యువత నిర్వహిస్తున్న దేశంలోని 4 లక్షల సార్వత్రిక సేవా కేంద్రాల నిర్వహించే స్థాయికి దేశం ఎదగడం నాకెంతో సంతోషంగా ఉంది.
54. సెమికండక్టర్ల తయారీ, 5జి శకంలో ప్రవేశం, ఆప్టికల్ ఫైబర్‌ల నెట్‌వర్క విస్తరణ వంటివాటితో కూడిన ఈ డిజిటల్ భారతం ఉద్యమం మనల్ని మనం ఆధునికంగా, అభివృద్ధి చెందిన దేశంగా నిలిపింది. అయితే, ఈ విజయం మూడు అంతర్గత కార్యక్రమాల వల్లనే సాధ్యమైంది. విద్యా పర్యావరణ వ్యవస్థలో సంపూర్ణ మార్పు, ఆరోగ్య మౌలిక సదుపాయాల విప్లవం, పౌరుల జీవనశైలి నాణ్యత మెరుగు వంటివి డిజిటలీకరణ ద్వారా మాత్రమే సాధ్యం కాగలవు.
55. మిత్రులారా! మానవాళికి సాంకేతిక యుగంగా పేరుపొందిన ఈ దశాబ్దంలో భారతదేశం అద్భుతంగా ముందడుగు వేయడాన్ని నేనెంతో ముందుగానే ఊహించగలను. ఇది సాంకేతిక పరిజ్ఞాన దశాబ్దం. ఐటీ రంగంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా పరిగణించదగిన శక్తిగా రూపొందింది. ఈ సాంకేతిక యుగంలో మనవంతు పాత్ర పోషించగల సత్తా, సామర్థ్యం మనకున్నాయి.
56. మన అటల్ ఇన్నొవేషన్ మిషన్, ఇంక్యుబేషన్ కేంద్రాలు, అంకుర సంస్థలు సరికొత్త రంగాన్ని రూపొందిస్తున్నాయి, యువతరానికి కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయి. అంతరిక్ష యాత్రకు సంబంధించిన అంశైమానా, మన సముద్ర వనరుల అన్వేషణ కార్యక్రమమైనా, సముద్రంలోకి లోతుగా వెళ్లాలన్నా, అంబరాన్ని చుంబించాలన్నా… ఇవన్నీ కొత్త రంగాలైనప్పటికీ మనం వీటిలో ముందడుగు వేస్తున్నాం.
57. మన చిన్న రైతులు, పారిశ్రామికవేత్తలు, చిన్న-మధ్య తరహా సంస్థలు, కుటీర పరిశ్రమలు, సూక్ష్మ పరిశ్రమలు, వీధి వ్యాపారులు, ఇళ్లలో పనిచేసే వారు, రోజుకూలీలు, ఆటో డ్రైవర్లు, బస్ సేవల ప్రదాతలు తదితరుల సామర్థ్యాలను మనం గుర్తించి బలోపేతం చేయాలి. సాధికారత పొందాల్సిన ప్రజానీకంలో అధికశాతం వీరే.
58. కొన్నేళ్ల నా అనుభవాల నుంచి నేను నేర్చుకున్నదేమిటో చెప్పదలిచాను. న్యాయవ్యవస్థలోని న్యాయస్థానాలలో ‘నారీ శక్తి’ సామర్థ్యం ఎలాంటిదో మీరు తప్పక చూసి ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులను చూడండి.. మన ‘నారీ శక్తి’ మన గ్రామాల సమస్యల పరిష్కారంలో అంకితభావంతో నిమగ్నమై ఉంది. విజ్ఞానం లేదా శాస్త్ర రంగాన్ని గమనించండి.. మన దేశంలోని ‘నారీ శక్తి’ కనిపిస్తుంది. పోలీసుశాఖలోనూ ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యతను మన ‘నారీ శక్తి’ సమర్థంగా నిర్వహిస్తోంది.
59. ఆటస్థలమైనా, యుద్దభూమి అయినా ప్రతి జీవనపథంలో భారత ‘నారీ శక్తి’ కొత్త బలంతో, కొత్త నమ్మకంతో ముందడుగు వేస్తోంది. గత 75 సంవత్సరాల భారతదేశ ప్రగతి పయనంలో వారు పోషించిన పాత్రతో పోలిస్తే రాబోయే 25 సంవత్సరాల్లో నా తల్లులు, సోదరీమణులు, పుత్రికల ‘నారీ శక్తి’ మరింత తోడ్పాటు అందించగలదనే విశ్వాసం నాకు మెండుగా ఉంది. ఈ అంశంపై మనం ఎంత శ్రద్ధ వహిస్తే, మనం అంతగా మన పుత్రికలకు ఎక్కువ అవకాశాలు, సౌకర్యాలు కల్పించగలం. తద్వారా వారు తాము పొందినదానికన్నా మనకు చాలా ఎక్కువ ఫలితాన్ని అందిస్తూ దేశాన్ని సమున్నత శిఖరాలకు చేరుస్తారు.
60. దేశం ముందడుగు వేయడంలో గొప్ప పాత్ర పోషించిన, నేతృత్వం వహించిన, అనేక రంగాల్లో ఆదర్శప్రాయంగా కృషిచేసిన అనేక రాష్ట్రాలు మన దేశంలో ఉన్నాయి. ఇది మన సమాఖ్య తత్వానికి బలాన్నిస్తుంది. కానీ, నేడు మనకు సహకార సమాఖ్య తత్వంతోపాటు సహకారాత్మక పోటీతో కూడిన సమాఖ్య తత్వం అవసరం. ఆ మేరకు అభివృద్ధి చెందాలంటే పోటీ అత్యావశ్యకం.
61. నేను ప్రతిదీ చర్చించాలని భావించడం లేదు. కానీ, కచ్చితంగా రెండు అంశాలపై దృష్టి సారించాలని భావిస్తున్నాను. వీటి ఒకటి అవినీతి… రెండోది- ఆశ్రిత పక్షపాతం. అవినీతిపై సర్వశక్తులు ఒడ్డి పోరాడాలి… అందుకే ప్రత్యక్ష నగదు బదిలీ, ఆధార్, మొబైల్ వంటి అన్ని ఆధునిక వ్యవస్థలను వాడుకుంటూ గత ఎనిమిదేళ్లలో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లే రూ.2 లక్షల కోట్లను ఆదాచేసి, దేశాభివృద్ధికి కృషి చేస్తూ విజయం సాధించాం.
62. గత ప్రభుత్వ హయాంలో బ్యాంకులను లూటీ చేసి దేశం నుంచి పారిపోయిన వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడమే కాకుండా వారిని స్వదేశం రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. కొందరు కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.
63. సోదరీసోదరులారా! అవినీతిపరులు దేశాన్ని చెదపురుగుల్లా తొలిచేస్తున్నారు. నేను వారిపై పోరాడాలి. ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తూ నిర్ణయాత్మక దశకు చేర్చాలి. కాబట్టి, నా 130 కోట్ల దేశవాసులారా! దయచేసి నన్ను ఆశీర్వదించండి.. నాకు మద్దతివ్వండి! ఇవాళ నేను ఈ యుద్ధంలో పోరాడటానికి మీ మద్దతు, సహకారం కోరడానికే మీ ముందుకు వచ్చాను ఈ యుద్ధంలో దేశం విజయం సాధిస్తుందని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను.
64. న్యాయస్థానంలో అవినీతి కేసుల్లో దోషులుగా తేలిన తర్వాత లేదా అలాంటి కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన తర్వాత కూడా వారిని కీర్తించేందుకు కొందరు ఎంతగానో దిగజారడం నిజంగా విచారకరం. సమాజంలో అవినీతిపరులపై అసహ్యం పెరిగేదాకా ఇటువంటివారి మనస్తత్వం బాగుపడదు.
65. ఇక నేనిప్పుడు బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం గురించి మాట్లాడాలని భావిస్తున్నాను. అయితే, వీటి గురించి నేను మాట్లాడితే రాజకీయాల్లో వీటి బెడద గురించి మాత్రమే మాట్లాడుతున్నానని ప్రజలు అనుకుంటారు. కానీ, వాస్తవం ఏమిటంటే- ఈ జబ్బు దేశంలోని అన్ని వ్యవస్థల్లోకి వ్యాపించింది, ఇది ప్రతిభను అణగదొక్కి, ప్రభావితం చేస్తుంది. అందుకే భారత రాజ్యాంగ వాస్తవిక దృక్కోణంతో భారత రాజకీయాలను, దేశంలో ప్రబలిన అన్నిరకరాల ప్రతికూల భావనల ప్రక్షాళనకు, బంధుప్రీతి బెడదను రూపుమాపడానికి త్రివర్ణ పతాకం నీడన ప్రతినబూనాల్సిందిగా ఎర్రకోట బురుజుల నుంచి నేను దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.
66. స్వాతంత్ర్య అమృత మహోత్సవం ఇప్పుడిక ‘అమృత కాలం’లోకి ప్రవేశించింది. ఈ మేరకు కొత్త అవకాశాలను పెంచుకుంటూ సరికొత్త సంకల్పాలతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా ఇవాళ్టినుంచే ఈ ‘అమృత కాలం’ వైపు పయనం ప్రారంభించాలని దేశప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ‘అమృత కాలం’లో ‘సమష్టి కృషి’ (సబ్ కా ప్రయాస్) అవసరం. తదనుగుణంగా ‘భారత జట్టు’ స్ఫూర్తి దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి 130 కోట్ల మంది దేశ పౌరులు జట్టుగా ముందడుగు వేయడం ద్వారా భారతదేశం తన కలలన్నిటినీ సాకారం చేసుకుంటుంది.
***
(Release ID: 1852063)
Visitor Counter : 506
Read this release in:
Hindi
,
Gujarati
,
Kannada
,
Malayalam
,
Assamese
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Tamil