చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన - శ్రీ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్

Posted On: 10 AUG 2022 5:33PM by PIB Hyderabad

భారత రాజ్యాంగంలోని 124 అధికరణంలోని క్లాజ్ (2) ద్వారా రాష్ట్రపతి తమకు సంక్రమించిన అధికారాన్ని ఉపయోగించి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న శ్రీ జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ని భారత ప్రధాన న్యాయమూర్తి గా నియమించారు.  భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ 2022 ఆగష్టు, 27వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.

జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ 2014 ఆగష్టు, లో భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బార్ కౌన్సిల్ నుంచి నియమితులయ్యారు.  1971 లో 13వ సి.జె.ఐ. గా పనిచేసిన జస్టిస్ ఎస్.ఎం. సిక్రి తర్వాత బార్ కౌన్సిల్ నుండి నేరుగా సుప్రీంకోర్టుకు నియమితులైన రెండవ భారత ప్రధాన న్యాయమూర్తిగా  జస్టిస్ లలిత్ నిలిచారు.  జస్టిస్ లలిత్ సుప్రీంకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ సభ్యునిగా కూడా రెండు పర్యాయాలు పనిచేశారు.

జస్టిస్ యు.యు. లలిత్‌ తమ సర్వీసులో అనేక కీలక తీర్పులు ఇచ్చారు. 

మహారాష్ట్రలోని షోలాపూర్‌లో 1957 నవంబర్, 9వ తేదీన జన్మించిన జస్టిస్ లలిత్, 1983 జూన్ లో మహారాష్ట్ర మరియు గోవా బార్ కౌన్సిల్‌ లో న్యాయవాదిగా తమ పేరు నమోదు చేసుకున్నారు.  1986 జనవరి లో ఢిల్లీ లో న్యాయవాద వృత్తి చేపట్టడానికి ముందు 1985 డిసెంబర్ వరకు బాంబే హైకోర్టు లో న్యాయవాదిగా పనిచేశారు. 

1986 అక్టోబర్ నుండి 1992 వరకు శ్రీ సోలి జె. సోరాబ్జీ ఛాంబర్‌ లో జస్టిస్ లలిత్  పనిచేశారు.  శ్రీ సోలి జె. సోరాబ్జీ భారతదేశానికి అటార్నీ జనరల్‌ గా ఉన్న కాలంలో యూనియన్ ఆఫ్ ఇండియా తరఫున న్యాయవాదుల బృందం లో జస్టిస్ లలిత్ కూడా ఉన్నారు.  1992 నుండి 2002 వరకు ఆయన "అడ్వకేట్-ఆన్-రికార్డ్‌" గా పనిచేశారు. 2004 ఏప్రిల్ నెలలో సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్‌ గా నియమితులయ్యారు.  అటవీ వ్యవహారాలు, వాహన కాలుష్యం, యమునా కాలుష్యం మొదలైన అనేక ముఖ్యమైన కేసుల్లో, ఆయన "అమికస్-క్యూరీ" గా నియమితులయ్యారు.  2-జీ కి సంబంధించిన అన్ని వ్యవహారాల్లో విచారణ జరిపేందుకు,  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సి.బి.ఐ. కి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ గా కూడా జస్టిస్ లలిత్ వ్యవహరించారు. 

 

*****



(Release ID: 1850678) Visitor Counter : 2774