ఉప రాష్ట్రపతి సచివాలయం
మువ్వన్నెల స్ఫూర్తిని క్షేత్రస్థాయికి చేర్చండి
• ఎంపీలు, కేంద్ర మంత్రులకు ఉపరాష్ట్రపతి సూచన
• జాతీయవాద భావనే మన దేశ అస్తిత్వం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి
• ఎర్రకోట వద్ద జెండా ఊపి తిరంగా బైక్ ర్యాలీని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి
Posted On:
03 AUG 2022 1:09PM by PIB Hyderabad
భారత స్వాతంత్ర్య సంగ్రామం, తదనంతరం జాతి నిర్మాణంలోనూ మువ్వన్నెల జాతీయ పతాకం పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. భారతదేశ స్వాతంత్ర్య సిద్ధికి 75 ఏళ్లు పూర్తవుతున్న ప్రత్యేకమైన సందర్భంలో త్రివర్ణ పతాకం స్ఫూర్తిని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడంలో పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రులు సహా ప్రతి భారతీయుడు కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
భారతదేశ అస్తిత్వంలో సంస్కృతి, సంప్రదాయాలతోపాటు జాతీయవాద భావన ఎంతో కీలకమన్న ఉపరాష్ట్రపతి, ఈ భావనను అనుక్షణం మనకు గుర్తుచేయడంలో మువ్వన్నెల పతాకం ప్రేరణాత్మకమని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా భారతీయులమంతా ఒక్కటే అనే భావనను ముందుకు తీసుకెళ్లాలన్నారు.
బుధవారం ఢిల్లీలో ఎర్రకోట ప్రాంగణం నుంచి తిరంగా బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించిన ఉపరాష్ట్రపతి అంతకుముందు బైక్ ర్యాలీకి వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘హర్ ఘర్ తిరంగా’ (ఇంటింటికీ మువ్వన్నెల) కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైనా ఉందన్నారు. ఈ సందర్భంగా నిబంధనలకు అనుగుణంగా త్రివర్ణ పతాకం గౌరవాన్ని కాపాడుతూ క్రమశిక్షణతో జెండా వందనం చేయాలని ఆయన సూచించారు. దేశ స్వాతంత్ర్యం కోసం, ఐక్యత కోసం తన, మన, ధన, ప్రాణత్యాగాలు చేసిన వారందరినీ గుర్తుచేసుకుని వారి త్యాగాల స్ఫూర్తితో నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ముఖ్యంగా యువత మహనీయుల గురించి తెలుసుకోవాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు.
‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం సందర్భంగా సమాజంలో నెలకొన్న దురాచారాలను తరిమేయడంపైనా యువత దృష్టి సారించాలన్నారు. మహిళలకు సరైన గౌరవం కల్పించడంతోపాటు, దివ్యాంగులు, వెనుకబడిన వర్గాలకు చేయూతనందించినపుడే అందరినీ సమాజాభివృద్ధిలో భాగస్వాములు చేయగలమని ఉపరాష్ట్రపతి సూచించారు. సమృద్ధ భారత నిర్మాణానికి ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో కృషిచేయాలన్నారు.
ఈ కార్యక్రమాన్ని విజవయంతం చేసే విషయంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శ్రీ ప్రహ్లాద్ జోషి, శ్రీ జి.కిషన్ రెడ్డి, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ అనురాగ్ ఠాకూర్, శ్రీ గజేంద్ర షెకావత్, శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్, పలువురు ఎంపీలు, ర్యాలీలో పాల్గొనేందుకు పెద్దసంఖ్యలో వచ్చిన ఔత్సాహికులు పాల్గొన్నారు
***
(Release ID: 1847774)
Visitor Counter : 183