నీతి ఆయోగ్

నీతి ఆయోగ్‌ ‘భారత ఆవిష్కరణల సూచీ-2021’:

‘ప్రధాన రాష్ట్రాల్లో’ కర్ణాటక.. తెలంగాణలకు ప్రథమ.. ద్వితీయ స్థానాలు


ఇతర విభాగాల్లో మణిపూర్‌.. చండీగఢ్‌లకు అగ్రస్థానం

Posted On: 21 JUL 2022 11:20AM by PIB Hyderabad

 

 

   నీతి ఆయోగ్‌ విడుదల చేసిన మూడో ‘భారత ఆవిష్కరణల సూచీ’లోని ‘ప్రధాన రాష్ట్రాల’ కేటగిరీలో  కర్ణాటక ప్రథమ స్థానంలో నిలవగా, తెలంగాణ రెండోస్థానం దక్కించుకుంది. అలాగే మణిపూర్‌, చండీగఢ్‌ రాష్ట్రాలు సంబంధిత విభాగాల్లో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ సూచీని ఇవాళ నీతి ఆయోగ్ వైస్‌-చైర్మన్‌ సుమన్‌ బెరీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయోగ్‌ సభ్యులు డాక్టర్‌ వి.కె.సారస్వత్‌, సీఈవో పరమేశ్వరన్‌ అయ్యర్‌, సీనియర్‌ సలహాదారు నీరజ్‌ సిన్హా, ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌’ చైర్మన్‌ డాక్టర్‌ అమిత్‌ కపూర్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, ‘ప్రధాన నగరాల’ విభాగంలో కర్ణాటక రెండోసారి అగ్రస్థానం సాధించడం విశేషం. అలాగే ‘ఈశాన్య-పర్వత రాష్ట్రాల’ విభాగంలో మణిపూర్‌, కేంద్రపాలిత/నగర రాష్ట్రాల’ విభాగంలో చండీగఢ్‌ అత్యుత్తమ పనితీరు కనబరిచాయి.

India Innovation Index 2021: Overall Rankings

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001SJP8.jpg

 

   సందర్భంగా డాక్టర్‌ సారస్వత్‌ మాట్లాడుతూ- “సుస్థిర, సమ్మిళిత ప్రగతికి ఆవిష్కరణలు ఎంతో కీలకం. నేడు మనకు ఎదురయ్యే అతిపెద్ద సవాళ్లకు పరిష్కారం అన్వేషణలో తోడ్పడేది అవే; ఈ మేరకు కోట్లాది ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తాయి. జీవనోపాధి అవకాశాలను సృష్టిస్తాయి. అంతిమంగా స్వయం సమృద్ధ భారతానికి బాటలు పరుస్తాయి” అన్నారు. అనంతరం సీఈవో అయ్యర్‌ ప్రసంగిస్తూ- “భారత ఆవిష్కరణల సూచీ ద్వారా దేశంలో ఆవిష్కరణల స్థాయిని పర్యవేక్షించడంలో నీతి ఆయోగ్‌ నిరంతర నిబద్ధత చూపుతున్నదని నేను మరోసారి నొక్కిచెబుతున్నాను. ఇందులో భాగంగా రాష్ట్రాలు, ఇతర భాగస్వాములతో సంయుక్తంగా దేశమంతటా ఆవిష్యరణల పర్యావరణ వ్యవస్థను మెరుగుపరచేందుకు మేం కృషి చేస్తాం” అని చెప్పారు.

 

 

ఆవిష్కరణల సూచీ అంటే ఏమిటి?

   దేశంలో ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ ప్రగతిని అంచనా వేసేందుకు నీతి ఆయోగ్‌, ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌’ సంస్థలు రూపొందించిన ఓ సమగ్ర ఉపకరణమే ‘భారత ఆవిష్కరణల సూచీ.’ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆవిష్కరణ సామర్థ్యాన్ని ఈ ఉపకరణం మూల్యాంకనం చేసి, వాటికి ర్యాంకులు ఇస్తుంది. అదే సమయంలో ఆయా ప్రభుత్వాల మధ్య ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీ చట్రం ప్రాతిపదికగా రూపొందిన ప్రస్తుత మూడో వార్షిక సూచీ దేశంలో ఆవిష్కరణలపై విశ్లేషణ పరిధిని ప్రముఖంగా చూపుతుంది. మునుపటి సూచీ (భారత ఆవిష్కరణల సూచీ-2020)లో సూచికల సంఖ్య 36 కాగా, ఈసారి (భారత ఆవిష్కరణల సూచీ-2021)లో సూచీలు 66కు పెరిగాయి. ఈ సూచికలు ప్రస్తుతం 16 ఉప-స్తంభాలకు విస్తరించబడగా ఇవి తిరిగి ఏడు కీలక స్తంభాలను ఏర్పరుస్తాయి.

భారత ఆవిష్కరణల సూచీ-2021 ర్యాంకుల వివరాలు

   భారత ఆవిష్కరణల సూచీ-2021 రూపురేఖలు గత సంవత్సరం తరహాలోనే ఉన్నాయి. ఆ మేరకు నిరుటి నివేదికలాగానే ఐదు ‘సశక్తీకరణ’ స్తంభాలు ఉత్పాదకాలను అంచనా వేస్తాయి. మిగిలిన రెండు ‘పనితీరు’ స్తంభాలు ఫలితాలను మూల్యాంకనం చేస్తాయి. సశక్తీకరణ స్తంభంలోని అన్ని సూచీలూ రాష్ట్రం/కేంద్రం పరిధిలో ఆవిష్కరణల ప్రోత్సాహానికి అవసరమైన కీలకాంశాలను పర్యవేక్షిస్తాయి. ఇక పనితీరు స్తంభాల్లోని సూచీలు జ్ఞాన సృష్టి, పోటీతత్వంలో దేశం ఉత్పాదకతను తేటతెల్లం చేస్తాయి. దేశ స్వావలంబన, ప్రతిరోధకతను ప్రోత్సహించడంలో ఆవిష్కరణల పాత్ర ఎంతో కీలకం. ఈ మేరకు అన్ని భారత రాష్ట్రాల్లో ఆవిష్కరణల వికేంద్రీకరణను సూచీలోని అంశాలు సూచిస్తాయని నీతి ఆయోగ్‌ సీనియర్‌ సలహాదారు నీరజ్‌ సిన్హా చెప్పారు.

   ఈ ‘ఇండెక్స్’ కొన్ని అంతర్జాతీయ సమాంతర అంశాలనూ ఎత్తిచూపుతుంది. ఇది భారతదేశం అనుసరించే పద్ధతులను, ఇతర సమకాలీన దేశాలతో మనం సమానంగా ఉండటా'న్ని ఇది సూచిస్తుందని ‘కాంపిటీటివ్‌నెస్ ఛైర్మన్’ డాక్టర్ అమిత్ కపూర్ అన్నారు. ఇక భారత ఆవిష్కరణల సూచీ-2021 అనేది దేశాన్ని ఆవిష్కరణాధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో భారత ప్రభుత్వ నిరంతర కృషికి భారత ఆవిష్కరణల సూచీ-2021 ఒక నిదర్శనం.

   ‘సంస్కరణ-వృద్ధి’ యంత్రాంగాన్ని నడిపించే దిశగా అంతర్జాతీయ సూచీల ద్వారా ఎంపిక చేసిన కొన్ని ప్రపంచ సూచీలను పర్యవేక్షించడంలో ప్రభుత్వ కృషికి నోడల్‌ సంస్థ హోదాలో నీతి ఆయోగ్‌ రూపొందించే భారత ఆవిష్కరణల సూచీ దోహదం చేస్తుంది.

 

 

పూర్తి నివేదిక కోసం https://www.niti.gov.in/sites/default/files/2022-07/India-Innovation-Index-2021-Web-Version_21_7_22.pdf  సందర్శించవచ్చు.

***

 

 



(Release ID: 1843453) Visitor Counter : 2989