సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

విజ్ఞాన్‌ భవన్‌లో భారత సమాచార సర్వీసు అధికారుల మూడో వార్షిక మహాసభ ప్రారంభం


‘ప్రభుత్వ సమాచార ఆదానప్రదానాలలో 5-సి మంత్రం’
వినియోగానికి కేంద్రమంత్రి శ్రీ అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌ పిలుపు;

‘సబ్‌ కా సాథ్.. సబ్‌ కా వికాస్..’ కింద జాతీయ లక్ష్యాల సాధనకు
ప్రభుత్వ సమాచార ఆదానప్రదానం కీలకం: అనురాగ్ సింగ్ ఠాకూర్

Posted On: 16 JUL 2022 4:31PM by PIB Hyderabad

   కేంద్ర సమాచార-ప్రసారశాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ విజ్ఞాన్ భవన్‌లో భారత సమాచార సర్వీసు (ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్-ఐఐఎస్‌) అధికారుల మూడో వార్షిక మహాసభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సమాచార-ప్రసారశాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ జైదీప్ భట్నాగర్, శ్రీ సత్యేంద్ర ప్రకాష్, శ్రీ వేణుధర్ రెడ్డి, శ్రీ మయాంక్ కుమార్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. రెండు రోజులపాటు సాగే ఈ సదస్సులో దేశవ్యాప్తంగాగల ఐఐఎస్‌ సీనియర్ అధికారులంతా పాల్గొంటున్నారు.

   సందర్భంగా కేంద్రమంత్రి సమాచార-ప్రసారశాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ కీలకోపన్యాసం చేస్తూ- ప్రభుత్వ సమాచార ఆదానప్రదానంలోని ఐదు కీలకాంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు పౌర కేంద్రక-సహానుభూతి, లక్షిత ప్రేక్షక జనంతో సహసృష్టి, సహకారం, సాలోచన, నిరంతర సామర్థ్య వికాసం అత్యంత ఆవశ్యకాలని ఆయన నొక్కిచెప్పారు. దీన్ని మరింత విశదీకరిస్తూ- పౌరులను దృష్టిలో ఉంచుకుంటూ అన్నిరకాల సమాచారం ఔచిత్యంతో కూడినదై అర్థం చేసుకోదగినదిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ అంగాలు, సంస్థలు, ప్రైవేటు రంగంసహా భాగస్వాములందరితోనూ చక్కని సహకారం అవశ్యమన్నారు. ప్రస్తుతం మనముందున్న బూటకపు వార్తలవంటి సవాళ్లతో సమాచార రంగం నిత్యం మారిపోతున్నదని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఇటీవలి కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల్లో గమనించిన దానికి తగినట్లు సమాచారాంశాలు వేగంతోకూడినవై, అనుసరణీయంగా ఉండాలని చెప్పారు.

   బూటకపు వార్తలను తిప్పికొట్టే సత్యనిర్ధారణ యూనిట్ల విస్తరణ, దివ్యాంగులకు సౌలభ్య కల్పన తదితరాల దిశగా ఐఐఎస్‌ అధికారులు చూపిన చొరవను, వారి పరివర్తనాత్మక కార్యక్రమాలను శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ కొనియాడారు. నవ్య మాధ్యమాల సాంకేతికతలు, సంస్థల నిర్మాణం, రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయాల ప్రాముఖ్యాన్ని ఎత్తిచూపుతూ సమాజంలోని చిట్టచివరి వ్యక్తికీ ప్రయోజనం చేకూర్చేలా ప్రభుత్వ సమాచార ప్రదాన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడంపై ఆలోచనలు, కార్యక్రమాల గురించి తన మనోభావాలను వారితో పంచుకున్నారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలకు సమాచార ప్రదాతలుగా తమ పాత్రకుగల ప్రాముఖ్యాన్ని గుర్తించాలని అధికారులందరినీ ఆయన కోరారు. ప్రజలకు మరింత చేరువ కావడంలో సమన్విత సమాచార ప్రదానం, కథన వివరణ నైపుణ్యాల ప్రాముఖ్యాన్ని కేంద్ర మంత్రి వివరించారు. అలాగే ప్రజాప్రతినిధులను మెరుగుపరచడానికి సమకాలీకరించబడిన కమ్యూనికేషన్ మరియు కథ చెప్పే కళ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. సంస్థాగత నిర్మాణం, మార్గదర్శకత్వంతోపాటు అధికారులకు ఉత్తేజం కల్పించడం కూడా సమాన ప్రాముఖ్యంగల అంశమేనని స్పష్టం చేశారు.

   మాచార-ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర మాట్లాడుతూ… కోవిడ్-19 మహమ్మారి సమయంలో సముచిత సమాచారం ప్రజలకు భరోసానిచ్చి, వారి మనస్సులోని భయాన్ని తొలగించడంలో విజయవంతమైందని పేర్కొన్నారు. ఈ మేరకు టీకాలు వేయడం, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన వంటి సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించిందని చెప్పారు. అనేక ఇతర దేశాలతో పోల్చితే భారతదేశంలో టీకాలపై సందేహం దాదాపు శూన్యమన్నారు. అందుకే ఈ కార్యక్రమం 200 కోట్ల టీకా మోతాదుల మైలురాయిని చేరుకోగలదని ఆయన విశ్వాసం వెలిబుచ్చారు.

   ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ జైదీప్ భట్నాగర్ ప్రసంగిస్తూ- సేవా ప్రదానంలో ప్రధానంగా సాధికారత, సౌలభ్య కల్పనపైనే దృష్టి కేంద్రీకృతమై ఉండాలన్నారు. అలాగే నిరంతర పౌర కేంద్రక కర్తవ్య నిమగ్నతలో ప్రవర్తనా మార్పు దిశగా సమాచార ప్రదానం, బూటకపు-తప్పుదోవ పట్టించే వార్తలను ఎదుర్కోవడం ప్రధానమని చెప్పారు. ఇటీవలి సంవత్సరాలలో సమాచార విస్ఫోటం నేపథ్యంలో ఈ పాత్ర గణనీయంగా వృద్ధి చెందడంతోపాటు విస్తరించిందని వ్యాఖ్యానించారు. ఇది కొత్త ప్రక్రియలు, ఉపకరణాల పునఃకల్పన, సార్వజనీనతలకు దోహదం చేసిందన్నారు.

   మాచార రంగం అంతర్లీనంగానే చైతన్యవంతమైనదనే వాస్తవాన్ని గుర్తిస్తూ సాగే ఈ రెండు రోజుల సదస్సులో నేటి కొత్త సవాళ్లు, భవిష్యత్తులో అత్యాధునిక కమ్యూనికేషన్ కోసం మార్గ ప్రణాళిక గురించి చర్చిస్తారు. ఈ మేరకు నిర్వహించే చర్చాగోష్ఠులలో ‘కమ్యూనికేషన్ ఫర్ ఇండియా@2047’, ‘స్కిల్ అండ్‌  కెపాసిటీ బిల్డింగ్’, ‘జీ20పై దృష్టితో విదేశాల్లో భారతదేశాన్ని ముందుకు తేవడం’, ప్రముఖ వక్తలు సూచించే ‘ఎవాల్వింగ్ రోల్ ఆఫ్ గవర్నమెంట్ కమ్యూనికేషన్’ తదితర అంశాలపైనా దృష్టి సారిస్తారు. ఈ మేరకు ‘మైగవ్‌’ సీఈవో శ్రీ అభిషేక్ సింగ్; కెపాసిటీ బిల్డింగ్ కమిషన్‌కు చెందిన డాక్టర్‌ ఆర్‌.బాలసుబ్రమణ్యం, శ్రీ హేమంగ్ జానీ;  విదేశాంగ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి శ్రీ అరిందమ్ బాగ్చీ; జి-20కి భారత షెర్పాగా వ్యవహరించే శ్రీ అమితాబ్ కాంత్ వంటి ప్రముఖులు ఇందులో ప్రసంగిస్తారు.

   మహాసభల రెండోరోజున రైల్వే-కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ కీలకోపన్యాసం చేస్తారు. ఇక ముగింపు కార్యక్రమంలో కేంద్ర సమాచార-ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ ప్రసంగిస్తారు.

 

***



(Release ID: 1842104) Visitor Counter : 150