ప్రధాన మంత్రి కార్యాలయం

జూలై 16న ప్రధాని యూపీ పర్యటన.. ‘బుందేల్‌ఖండ్‌ ఎక్స్’ప్రెస్‌ వే’కి ప్రారంభోత్సవం


ఎక్స్’ప్రెస్‌ వే నిర్మాణానికి 2000 ఫిబ్రవరిలో ప్రధాని శంకుస్థాపన;

దాదాపు రూ.14,850 కోట్లతో 296 కిలోమీటర్ల
నాలుగు వరుసల ఎక్స్’ప్రెస్‌ వే నిర్మాణం;

ఈ ప్రాంతంలో అనుసంధానం.. పారిశ్రామికాభివృద్ధికి ఎక్స్’ప్రెస్‌ వే ద్వారా ఎంతో ఉత్తేజం

Posted On: 13 JUL 2022 5:13PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 జూలై 16న ఉత్త‌ప్రదేశ్‌ సంద‌ర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జ‌లౌన్ జిల్లా ఒరై తాలూకాలోని కైతేరి గ్రామంలో ఉదయం 11:30 గంటలకు బుందేల్‌ఖండ్ ‘ఎక్స్‌’ప్రెస్‌ వే’ని ఆయన ప్రారంభిస్తారు. దేశవ్యాప్తంగా అనుసంధానం పెంచడంపై నిబద్ధతతో ఉన్న ప్రభుత్వం ముఖ్యంగా రహదారి మౌలిక సదుపాయాల మెరుగుకు ప్రాధాన్యమిస్తోంది. ఈ మేరకు 2020 ఫిబ్రవరి 29న బుందేల్‌ఖండ్ ఎక్స్‌’ప్రెస్‌ వే నిర్మాణానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. అటుపైన ఈ ఎక్స్‌’ప్రెస్‌ వే  పనులు శరవేగంగా సాగుతూ 28 నెలల్లో పూర్తికాగా, ఇప్పుడు దాన్ని ప్రధాని ప్రారంభించనున్నారు.

   త్తరప్రదేశ్ ఎక్స్‌’ప్రెస్‌ వేస్-ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీ (యూపీఈఐడీఏ) ఆధ్వర్యాన దాదాపు రూ.14,850 కోట్లతో ఈ 296 కిలోమీటర్ల నాలుగు వరుసల ఎక్స్‌’ప్రెస్‌ వే నిర్మితమైంది. కాగా, దీన్ని భవిష్యత్తులో ఆరు వరుసలకు విస్తరించే వీలుంది. ఈ రహదారి చిత్రకూట్ జిల్లాలోని భరత్‌కూప్ సమీపాన గోండా గ్రామం వద్ద ‘ఎన్‌హెచ్‌-35 నుంచి ప్రారంభమై ఎటావా జిల్లాలోని కుడ్రైల్ గ్రామందాకా వెళ్తుంది. అక్కడినుంచి ఆగ్రా-లక్నో ‘ఎక్స్‌’ప్రెస్‌ వే’ తో కలిసిపోతుంది. ఈ మేరకు చిత్రకూట్, బందా, మహోబా, హమీర్‌పూర్, జలౌన్, ఔరైయా, ఇటావా... మొత్తం ఏడు జిల్లాల మీదుగా వెళ్తుంది.

   బుందేల్‌ఖండ్‌ ‘ఎక్స్‌’ప్రెస్‌ వే’ ఈ ప్రాంతంలో అనుసంధానాన్ని మెరుగుపరచడమే కాకుండా ఆర్థికాభివృద్ధికి ఇతోధికంగా దోహదం చేస్తుంది. దీంతో స్థానిక ప్రజలకు వేలాది ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. ఇందులో భాగంగా ‘ఎక్స్‌’ప్రెస్‌ వే’ వెంబడిగల బందా, జలౌన్ జిల్లాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు సంబంధిత పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

 



(Release ID: 1841393) Visitor Counter : 166