ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రకృతి వ్యవసాయ సదస్సునుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగం
“అమృత కాల లక్ష్యాలు సాధించాలన్న దేశ సంకల్ప సాధనలో ముందున్న గుజరాత్”
“ప్రకృతి వ్యవసాయంలో సూరత్ నమూనా దేశం యావత్తుకు నమూనా అవుతుంది”
“నవభారత అభివృద్ధి ప్రయాణానికి మార్గదర్శకంగా సబ్ కా ప్రయాస్”
“గ్రామాలు తమంత తాముగా మార్పు చెందడమే కాదు, మార్పు తేవడంతో ముందువరుసలో నిలుస్తాయని నిరూపించాయి”
“స్వభావం, సంస్కృతి రెండు లక్షణాల్లోనూ భారత్ వ్యవసాయాధారిత దేశం”
“ప్రకృతి వ్యవసాయం బాటలో ముందుకు సాగేందుకు, ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు అందుకునేందుకు ఇది సరైన సమయం”
“సర్టిఫైడ్ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఎగుమతి చేసినట్టయితే వారికి మంచి ధరలు వస్తున్నాయి”
Posted On:
10 JUL 2022 12:39PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకృతి వ్యవసాయ సమావేశాన్ని ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించారు. గుజరాత్ లోని సూరత్ లో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రకృతి వ్యవసాయాన్ని విజయగాధగా చేపట్టిన వేలాది మంది వ్యవసాయదారులు, ఇతర సంబంధిత భాగస్వామ్య వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. గుజరాత్ గవర్నర్, ముఖ్యమంత్రి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
అమృతకాల లక్ష్యాలు సాధించాలన్న దేశ లక్ష్యాన్ని చేరే బాటలో గుజరాత్ ముందుండి నడిపిస్తున్నదనేందుకు నేటి కార్యక్రమం ఒక సంకేతమని ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధానమంత్రి అన్నారు. “ప్రతీ పంచాయతీకి చెందిన 75 మంది వ్యవసాయదారులను ప్రకృతి వ్యవసాయంతో అనుసంధానం చేయడంలో సూరత్ విజయం దేశం యావత్తుకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది” అని ప్రధానమంత్రి చెప్పారు. ఈ వ్యవహారంలో సర్పంచ్ ల పాత్రను ప్రశంసిస్తూ ప్రకృతి వ్యవసాయం దిశగా అడుగులేస్తున్న వ్యవసాయదారులను ఆయన అభినందించారు.
స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశం పలు లక్ష్యాలతో ముందుకు సాగుతోంది. రాబోయే కాలంలో పెను మార్పులకు అవి ప్రాతిపదిక కానున్నాయి. సబ్ కా ప్రయాస్ స్ఫూర్తితో దేశం పురోగమిస్తున్న తీరు, వేగం మన అభివృద్ధి ప్రయాణానికి మార్గదర్శకంగా ఉన్నాయి అని ప్రధానమంత్రి అన్నారు. అందుకే పేదలు, నిరాకరణకు గురవుతున్న వర్గాల సంక్షేమం కోసం చేపట్టే కార్యక్రమాల విషయంలో గ్రామ పంచాయతీలకు కీలక పాత్ర ఇవ్వడం జరిగిందని చెప్పారు.
ప్రతీ పంచాయతీ నుంచి 75 మంది రైతులను ఎంపిక చేసి వారికి తగు శిక్షణ, వనరులు కల్పించి ముందుకు నడిపించే ప్రక్రియలో స్థానిక సంస్థలు నిర్మాణాత్మక పాత్ర పోషించాయని ఆయన చెప్పారు. 550 పంచాయతీలకు చెందిన 40 వేల మందికి పైగా వ్యవసాయదారులు ప్రకృతి వ్యవసాయం చేపట్టేందుకు ఇది దోహదపడిందని ఆయన అన్నారు. ఇది గొప్ప ఆరంభం, అత్యంత ప్రోత్సాహకరం అంటూ ప్రకృతి వ్యవసాయంలో సూరత్ నమూనా దేశం యావత్తుకు నమూనాగా నిలుస్తుంది అని ప్రశంసించారు.
ప్రజాభాగస్వామ్య శక్తితో పెద్ద ప్రాజెక్టులు చేపడితే వాటి విజయానికి కూడా ప్రజలే బాధ్యత వహిస్తారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజలు కీలక పాత్రధారులుగా ఉన్న జల్ జీవన్ మిషన్ ను శ్రీ మోదీ ఇందుకు ఉదాహరణగా చూపారు. “గ్రామాల్లో మార్పు తేవడం సాధ్యం కాదు అని వాదించే వారికి డిజిటల్ ఇండియా సాధించిన అసాధారణ విజయమే సమాధానం ఇస్తుంది. గ్రామాలు మార్పు తేవడమే కాదు, ముందు వరుసలో నిలిచి మార్పును తెస్తాయి అని మన గ్రామాలు నిరూపించాయి” అన్నారు. ప్రకృతి వ్యవసాయం కోసం ప్రజా ఉద్యమం కూడా రాబోయే రోజుల్లో అతి పెద్ద విజయంగా నిలుస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రారంభ దశలోనే ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యే వ్యవసాయదారులు భారీ ఫలాలు అందుకోవడం ఖాయమని తెలిపారు.
“మన జీవితం, మన ఆరోగ్యం, మన సమాజం అన్నింటికీ పునాది మన వ్యవసాయ వ్యవస్థే. స్వభావ రీత్యా, సంస్కృతి పరంగా రెండింటిలోనూ మనది వ్యవసాధారిత వ్యవస్థ. మన రైతులు పురోగమిస్తే మన వ్యవసాయం పురోగమించి సుసంపన్నం అవుతుంది, అలాగే మన దేశం కూడా పురోగమిస్తుంది” అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.
ప్రకృతి వ్యవసాయం అంటే సుసంపన్నత, మాతృభూమిని గౌరవించడం, సేవించడం అని ఆయన గుర్తు చేశారు. “మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టయితే మాతృభూమికి సేవచేసినట్టే. మట్టి నాణ్యతను, దాని ఉత్పాదకతను పరిరక్షించినట్టే. మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్టయితే మీరు ప్రకృతి, పర్యావరణం రెండింటినీ సేవిస్తున్నట్టే. మీరు ప్రకృతి వ్యవసాయంలో చేరినట్టయితే గౌతముని సేవించే గౌరవం కూడా మీకు దక్కుతుంది” అని ఆయన చెప్పారు.
ప్రపంచం యావత్తు స్థిరమైన జీవనశైలి గురించి మాట్లాడుతున్నదని ప్రధానమంత్రి గుర్తు చేస్తూ “భారతదేశం శతాబ్దాలుగా ప్రపంచ నాయకత్వ స్థాయిలో ఉన్న ఏకైక రంగం ఇది. అందుకే మనం ప్రకృతి వ్యవసాయం బాటలో ముందుకు సాగుతున్న ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అవకాశాలు పూర్తిగా ఉపయోగించుకోవడం అవసరం” అన్నారు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ప్రస్తావిస్తూ “పరంపరాగత్ కృషి వికాస్ స్కీమ్” వంటివి అవసరమైన వనరులు కల్పించడంతో పాటు సాంప్రదాయిక వ్యవసాయంలో శిక్షణ కూడా ఇస్తున్నాయని చెప్పారు. ఈ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా 30 వేల క్లస్టర్లు ఏర్పాటు చేశారని, దీని ద్వారా లక్షలాది మంది రైతులు లాభపడుతున్నారని ఆయన తెలిపారు. “పరంపరాగత్ కృషి వికాస్” స్కీమ్ కింద 10 లక్షల హెక్టార్ల భూమిలో ప్రకృతి వ్యవసాయం విస్తరించనున్నట్టు చెప్పారు. ప్రకృతి వ్యవసాయాన్ని నమామి గంగే ప్రాజెక్టుతో అనుసంధానం చేసి గంగా నది వెంబడి ప్రకృతి వ్యవసాయ కారిడార్ ఏర్పాటును చేపట్టినట్టు ప్రధానమంత్రి తెలిపారు.
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను సర్టిఫై చేసేందుకు నాణ్యత హామీ విధానం గురించి కూడా ప్రధానమంత్రి తెలియచేశారు. ఇలాంటి సర్టిఫై చేసిన ఉత్పత్తులు వాటిని ఎగుమతి చేసిన రైతులకు మంచి ధర ఆర్జిస్తున్నాయన్నారు.
మన శాసనాలు, సంస్కృతిలో దాగి ఉన్న ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానం గురించి ప్రస్తావిస్తూ వివిధ సంస్థలు, ఎన్ జిఓలు, నిపుణులు ఈ ప్రాచీన పరిజ్ఞానంపై పరిశోధన నిర్వహించి ఆధునిక కాల అవసరాలకు అనుగుణంగా దాన్ని రైతులకు ఎలా అందచేయాలో పరిశీలించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రతీ పంచాయతీలోనూ 75 మంది రైతులతో ప్రారంభించిన ప్రకృతి వ్యవసాయం రసాయనరహిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండుతో పాటుగా ఎన్నో రెట్లు పెరుగుతుందన్న విశ్వాసం ఆయన ప్రకటించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 2022 మార్చిలో జరిగిన గుజరాత్ పంచాయత్ మహాసమ్మేళన్ లో ప్రధానమంత్రి మాట్లాడుతూ ప్రతీ గ్రామం నుంచి కనీసం 75 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహించనున్నట్టు ప్రకటించారు. ప్రధానమంత్రి విజన్ ను మార్గదర్శకంగా తీసుకుని సూరత్ జిల్లా రైతులు ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలపై వివిధ భాగస్వామ్య విభాగాలు, రైతు బృందాలు, ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, తలాతిలు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీలు (ఎపిఎంసి), సహకార సంఘాలు, రైతులను చైతన్యవంతం చేసేందుకు సమన్వయపూర్వకమైన కృషి చేపట్టింది. అనంతరం ప్రతీ గ్రామ పంచాయతీ నుంచి 75 మంది రైతులను గుర్తించి ప్రకృతి వ్యవసాయం చేపట్టేలా చైతన్యవంతం చేసి, అవసరమైన శిక్షణ ఇచ్చారు. 90 విభిన్నమైన క్లస్టర్లలో రైతు శిక్షణ చేపట్టడం ద్వారా జిల్లా మొత్తం మీద 41,000 మంది రైతులకు శిక్షణ ఇచ్చారు.
(Release ID: 1840701)
Visitor Counter : 266
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam