గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు ‘పరిశుభ్రత-పచ్చదనం’
కార్యక్రమానికి కేంద్ర గృహనిర్మాణ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ శ్రీకారం
అల్ప వినియోగ ప్లాస్టిక్‌ను దశలవారీగా వదిలించుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖ
Posted On:
04 JUN 2022 2:53PM by PIB Hyderabad
ప్రపంచ పర్యావరణ దినోత్సవం నేపథ్యంలో 2022 జూన్ 5న దేశంలోని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు/పట్టణ స్థానిక పాలన సంస్థలు ఉద్యమ బాటపట్టనున్నాయి. దేశాన్ని అల్ప వినియోగ (సింగిల్ యూజ్ ప్లాస్టిక్-ఎస్‌యూపీ) ప్లాస్టిక్ రహితం చేయడంతోపాటు ‘పరిశుభ్రత-పచ్చదనం’ నిర్దేశం కింద పర్యావరణం మెరుగుకు కృషి చేయడం దీని లక్ష్యం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ సామూహికంగా పరిశుభ్రత-పచ్చదనం దిశగా మొక్కలు నాటాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 మే 29న ‘మన్ కీ బాత్’ కార్యక్రమం ద్వారా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండటం గమనార్హం.
ప్రపంచ పర్యావరణ దినోత్సవ నిర్వహణతోపాటు 2022 జూన్ 30కల్లా ‘ఎస్‌యూపీ’ నిషేధంపై భారతదేశం ఇచ్చిన హామీని నెరవేర్చేలా అన్ని స్థాయులలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర గృహ-పట్టణ వ్యవహారాల శాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సవివర సూచనపత్రం జారీ చేసింది. ఈ మేరకు ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకు ప్రాధాన్యంతో పరిశుభ్రత, జాగింగ్ చేస్తూ చెత్త ఏరివేత వంటి కార్యకలాపాలు పెద్ద ఎత్తున చేపడతారు. దీంతోపాటు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయ సంఘాలు, స్థానిక ఎన్జీవో/సీఎస్‌ఓ, ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, ఆర్‌డబ్లూఏ, మార్కెట్ సంఘాలు, కార్పొరేట్ సంస్థలు వగైరాసహా పౌరులందరి భాగస్వామ్యంతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తారు.
దేశవ్యాప్తంగా ‘ఎస్‌యూపీ’ నిషేధంపై నిబద్ధతను నెరవేర్చే దిశగా ఈ సూచనాపత్రం పలు కార్యక్రమాలను సూచించింది. ప్రస్తుతం గృహ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్- అర్బన్ 2.0 కింద ‘ఎస్‌యూపీ'’నిర్మూలనతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై కీలకంగా దృష్టి సారిస్తారు. ఈ మిషన్ అమలులో భాగంగా ప్రతి పట్టణ స్థానిక పాలన సంస్థ (యూఎల్‌బీ) 100 శాతం వ్యర్థాల మూలాధార విభజన పద్ధతిని అనుసరించాల్సి ఉంటుంది. అలాగే (ప్లాస్టిక్‌సహా) పొడి వ్యర్థాల పునర్వినియోగ యోగ్యం/లేదా శుద్ధికి వీలుగా వాటిని మరింత సూక్ష్మరూపంలోకి మార్చి విలువ జోడించిన ఉత్పత్తులకు తగినట్లుగా విభజించేందుకు ‘మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ’ (ఎంఆర్‌ఎఫ్) అందుబాటులో ఉండాలి. ఈ ప్రక్రియ ద్వారా చెత్త పారబోత ప్రదేశాలు, జలవనరులకు చేరే ప్లాస్టిక్, ఇతర పొడి వ్యర్థాల పరిమాణాన్ని కనిఫ్ఠ స్థాయికి తగ్గించడంపై శ్రద్ధ వహించాలి.
కేంద్ర అటవీ-పర్యావరణ-వాతావరణ మార్పు మంత్రిత్వశాఖ, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జారీచేసిన ఆదేశాల ప్రకారం- ‘ఎస్‌యూపీ’పై ’దేశంలోని 2,591 (మొత్తం 4,704) ‘యూఎల్‌బీ’లు నిషేధం ప్రకటించాయి. అయితే, మిగిలిన 2,100కుపైగా ‘యూఎల్‌బీ’లు కూడా 2022 జూన్ 30లోగా ఈ నోటిఫికేషన్ జారీ చేసేవిధంగా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలు శ్రద్ధ వహించాలి. దీనికి అనుగుణంగా ‘ఎస్‌యూపీ’ ముమ్మర వినియోగ ప్రాంతాలను గుర్తించి, వాటిని తొలగించాలి. ఇందుకోసం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ల తోడ్పాటును సమాంతరంగా వాడుకోవాలి. అంతేగాక ‘ఎస్‌యూపీ’ నిషేధం ప్రత్యేక అమలు బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలతోపాటు ఉత్తర్వుల ఉల్లంఘనకు పాల్పడేవారికి భారీగా జరిమానా, అపరాధ రుసుము విధించాలి.
ప్లాస్టిక్ వ్యవర్థాల నిర్వహణ (సవరణ) నిబంధనలు-2021 మేరకు 75 మైక్రాన్ల (75µ అంటే- 0.075 మి.మీ మందం)కన్నా తక్కువ మందంతో వర్జిన్ లేదా రీసైకిల్ ప్లాస్టిక్‌తో చేసే క్యారీ బ్యాగ్‌ల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం-వాడకంపై 2021 సెప్టెంబరు 30 నుంచి నిషేధం ఉంది. సవరణకు మునుపు ‘పీడబ్ల్యూఎం’ నిబంధనలలో సిఫారసు చేసిన 50 మైక్రాన్ల పరిమితికి భిన్నంగా కొత్త నిబంధన కింద ఉత్తర్వులు జారీచేయబడ్డాయి. ఈ కొత్త నిబంధన నేపథ్యంలో వీధి వ్యాపారులు, స్థానిక దుకాణదారులు, కూరగాయల విక్రేతలు పలుచటి ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను వాడకుండా పౌరులు నిరోధించే వీలు కలిగింది. దీంతో ఆ వ్యాపారులంతా నేడు ప్రత్యామ్నాయాలను వాడుతున్నారు.
‘పీడబ్ల్యూఎం’ (సవరణ) నిబంధనలు-2021కి అనుగుణంగా నిషేధం పటిష్ట అమలుకు దోహదం చేసే వివిధ కార్యక్రమాలు చేపట్టబడతాయి. ఇందులో భాగంగా మార్కెట్‌లో తక్షణ అందుబాటులోగల ‘ఎస్‌యూపీ’ ప్రత్యామ్నాయాలను (వస్త్ర/జనపనార/ప్లాస్టిక్ సంచులు, మట్టిలో కలిసిపోయే వంటింటి పరికరాలు వగైరాలను) ‘యూఎల్‌బీ’లు గుర్తించాలి. దీంతోపాటు ఇలాంటి ప్రత్యామ్నాయ వస్తు వినియోగంపై పౌరులకు అవగాహన కూడా కల్పించాలి. ఇక సీసాల సేకరణ కేంద్రాలు (వాడకం దారులు ఇక్కడ సదరు ‘పెట్’ సీసాలను వాపసుచేసి ఎంతోకొంత ఖరీదు పొందవచ్చు) అంతేకాకుండా ‘విస్తరిత ఉత్పత్తిదారు విధుల’ (ఈపీఆర్) కింద వివిధ ప్రదేశాల్లో రాయితీసహిత పునర్వినియోగ ప్లాస్టిక్ బాటిల్ బూత్‌లను కూడా ఏర్పాటు చేసేలా చూడవచ్చు. మరోవైపు ‘ఎస్‌యూపీ’కి ప్రత్యామ్నాయంగా పౌరులకు సంచులు/పాత్రలు వంటివి అందించే కేంద్రాలను ‘యూఎల్‌బీ’లు ఏర్పాటు చేయవచ్చు. ముఖ్యంగా బహిరంగ సభలు, వేడుకలు వంటి సందర్భాల్లో ‘ఎస్‌యూపీ' వినియోగం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఏర్పాటు సముచితంగా ఉంటుంది. ‘స్వచ్ఛత రథాల’ ద్వారా బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లు, ఇతర జనసమ్మర్దం ఉండే ప్రాంతాల్లో ‘ఎస్‌యూపీ’ వినియోగం వల్ల ముప్పుతోపాటు ప్రత్యామ్నాయాలపై ప్రజలకు అవగాహన కల్పించవచ్చు.
రాష్ట్రాలు, ‘యూఎల్‌బీ’లు సమీపంలోని సిమెంట్ కర్మాగారాలు లేదా ఇతర పారిశ్రామిక యూనిట్లతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవాలని సూచనపత్రం సలహా ఇచ్చింది. అలాగే ప్లాస్టిక్ వ్యర్థాలలో కొంత భాగాన్ని సిమెంట్ ప్లాంట్లలో ప్రత్యామ్నాయ ఇంధనంగా లేదా రహదారి నిర్మాణ పనుల కోసం వాడుకునేలా చూడాలి. రోడ్ల నిర్మాణానికి ఎస్‌యూపీ/మల్టీ-లేయర్డ్ ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి ‘యూఎల్‌బీ’లు, ప్రజాపనుల విభాగాలు వివరణాత్మక మార్గదర్శకాలను జారీచేయాలని పేర్కొంది.
ప్రజల భాగస్వామ్యం విస్తృతంగా ఉండేలా చూడాలని ఈ సూచనపత్రం మరీమరీ నొక్కిచెప్పింది. ఈ మేరకు మేయర్లు, వార్డు కౌన్సిలర్లు వంటి ఎన్నికైన ప్రజా ప్రతినిధులతోపాటు స్వచ్ఛంద సంస్థలు, స్థానికి ఎన్జీవో/సీఎస్‌వో, నివాసుల సంక్షేమ సంఘాలు, మార్కెట్ సంఘాలు, స్వయం సహాయ సంఘాలు, విద్యార్థులు, యువజన బృందాలు వంటి అన్నివర్గాలవారినీ భాగస్వాములను చేయాలని వివరించింది. ఈ మేరకు ఆయా వర్గాలను గుర్తించి ‘ఎస్‌యూపీ’ నిషేధం, అమలుకు కృషి చేసేలా చూడాలని స్పష్టం చేసింది. అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలను చెల్లాచెదరుగా పడవేయకుండా చూస్తామని ప్రతిజ్ఞ చేసేలా ‘యూఎల్‌బీ'లు ప్రజలను ప్రోత్సహించాలని కోరింది. తద్వారా గోతులు వ్యర్థాలతో నిండిపోకుండా చూడవచ్చునని తెలిపింది. అవసరమైతే వ్యర్థాల పారవేతలో విజ్ఞతతో వ్యవహరించే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వవచ్చునని సూచించింది. ప్రజా, సామాజిక మాధ్యమాల ద్వారా ‘ఎస్‌యూపీ’ నిషేధం అమలుపై అవగాహన కల్పించాలని పేర్కొంది. ఇక ఉన్నతస్థాయి పర్యవేక్షణకు వీలుగా తాము తీసుకునే చర్యలను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, ‘యూఎల్‌బీ’లు సమగ్రంగా నమోదు చేసి నివేదించాలని కోరింది. దేశంలోని అన్ని చట్టబద్ధ పట్టణాల్లో సమగ్ర పారిశుధ్యం-వ్యర్థాల నిర్వహణ ద్వారా “చెత్తరహిత నగరాల” ఆవిర్భావం లక్ష్యంగా కేంద్ర గృహ-పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్ కార్యక్రమం అమలు చేస్తోంది.
(Release ID: 1831204)
Visitor Counter : 673