కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అన్ని సామాజికవర్గాల ప్రగతి సాధనే

భారత ఐ.సి.టి. వ్యూహం లక్ష్యం!

డబ్ల్యు.ఎస్.ఐ.ఎస్. సదస్సులో కేంద్రమంత్రి దేవుసింహ్ చౌహాన్ వెల్లడి..

వచ్చే దశాబ్దంలో భారత్ ఎ.ఐ. కేంద్రం కాబోతోందని వ్యాఖ్య..
భారత టెలికాం పథకాల్లో భాగస్వామ్యం వహించాలంటూ
జపాన్ కంపెనీలకు విజ్ఞప్తి

Posted On: 02 JUN 2022 11:38AM by PIB Hyderabad

        ప్రపంచ సమాచార సమాజపు శిఖరాగ్ర సమావేశం (డబ్ల్యు.ఎస్.ఐ.ఎస్.-2022)లో  రెండవ రోజైన జూన్ 1న జరిగిన మంత్రిత్వ శాఖల రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి దేవుసింహ్ చౌహాన్ పాల్గొన్నారు. సంక్షేమంకోసం సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐ.సి.టి.), సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను వేగిరపరిచేందుకు శిఖరాగ్ర సమావేశం సహకారం తదితర అంశాలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. డబ్ల్యు.ఎస్.ఐ.ఎస్. స్విట్జర్లాండ్ లోని ప్రధాన కేంద్రమైన జెనీవాలో

2022 మే 30 నుంచి జూన్ 3వతేదీవరకూ జరుగుతోంది. అంతర్జాతీయ టెలీకమ్యూనకేషన్ యూనియన్ల (ఐ.టి.యు.ల) ఆధ్వర్యంలో ఇది జరుగుతోంది.

   ఈ సందర్భంగా కేంద్రమంత్రి చౌహాన్ మాట్లాడుతూ, మన దైనందిన జీవితాల్లో సమాచార, కమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ఞానం (ఐ.సి.టి.) పాత్ర ఇదివరకెన్నడూ లేనంత స్థాయికి పెరిగిపోయిందన్నారు. ప్రగతిశీల సమాజాలకు ఐ.సి.టి. అనేది శక్తివంతమైన సాధనంగా నిలిచిందన్నారు. ఈ రంగంలో ముందుకు సాగేందుకు మరింత సంఘీభావం మనకు అవసరమని అన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా డబ్ల్యు.ఎస్.ఐ.ఎస్. ఎంతో సహాయం, సహకారం అందిస్తోందని అన్నారు.

  సమాజంలోని ప్రధాన జనజీవన స్రవంతికి దూరంగా, మారుమూల ప్రాంతాల్లో జీవించే అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేసేందుకు అంత్యోదయ సూత్రాన్ని భారతదేశం ప్రగాఢంగా విశ్వసిస్తోందని కేంద్రమంత్రి అన్నారు. విశ్వసనీయమైన సమాచార, కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేందుకు ఆరులక్షల గ్రామాలను ఫైబర్ ఆప్టికల్ కేబుల్ వ్యవస్థ ద్వారా అనుసంధానం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో శాటిలైట్ సమాచార సేవలు, జలంతర్గామి కేబుల్ వ్యవస్థల ద్వారా చిన్న దీవులు, మారుమూల ప్రాంతాల్లోని దీవులు, ఇతర దుర్గమ ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

   కృత్రిమ మేథో పరిజ్ఞానంపై జరిగిన చర్చలో కేంద్రమంత్రి పాల్గొంటూ, ప్రపంచంలోనే అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా ముందుకు సాగుతున్న భారతదేశానికి కృత్రిమమేథో పరిజ్ఞానంలో కీలకపాత్ర ఉందని అన్నారు. 

     ‘ప్రయోగశాలనుంచి వాస్తవ ప్రపంచం వరకూ: కృత్రిమ మేథో పరిజ్ఞానం..దశాబ్దంపాటు చర్యలు’ అన్న అంశంపై కూడా అత్యున్నత స్థాయి చర్చాగోష్టిని నిర్వహించారు. కృత్రిమ మేథో పరిజ్ఞానం, సంబంధిత అంశాలపై చర్చించేందుకు డబ్ల్యు.ఎస్.ఐ.ఎస్. సమ్మేళనంలో భాగంగానే ఈ చర్చను నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమంలో కేంద్రమంత్రి దేవుసింహ్ చౌహాన్ మాట్లాడుతూ, కొత్తగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేథో పరిజ్ఞానంపై ప్రభుత్వం విధానపరంగా తీసుకున్న చర్యలను సభకు వివరించారు. కృత్రిమ మేథో పరిజ్ఞానంపై భారతదేశం జాతీయ వ్యూహాన్ని గురించి ఆయన ప్రస్తావించారు. వివిధ రంగాల్లో కృత్రిమ మేథో పరిజ్ఞాన శక్తిని వినియోగించుకునే ప్రభుత్వ వ్యూహాన్ని ఆయన వివరించారు. ప్రత్యేకించి ఆరోగ్యరక్షణ, వ్యవసాయం, విద్యాబోధన, స్మార్ట్ సిటీలు, మౌలిక సదుపాయాలు, స్మార్ట్ మొబిలిటీ, రవాణా రంగాల్లో కృత్రిమ మేథో పరిజ్ఞాన వినియోగంకోసం చేపట్టిన వ్యూహాన్ని ఆయన వివరించారు.

  భారతీయ కృత్రిమ మేథో పరిజ్ఞానం (ఎ.ఐ.) అభివృద్ధి లక్ష్యంగా కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన వివిధరకాల గ్రూపులను గురించి కేంద్రమంత్రి చౌహన్ క్లుప్తంగా వివరించారు. తయారీ, సేవల రంగాల్లో వృద్ధికోసం కృత్రిమ మేథో పరిజ్ఞానాన్ని సానుకూలంగా వినియోగించుకునే అవకాశాలపై జరగే అన్వేషణను గురించి కూడా వివరించారు. కృత్రిమ మేథో పరిజ్ఞాన ఆధారిత స్టార్టప్ కంపెనీలకోసం అవసరమైన నమూనాలను రూపొందించేందుకు ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించిందని అన్నారు. ఇందుకోసం ‘ఎ.ఐ. గేమ్ చేంజర్స్’ పేరిట అధికారికంగా చేపట్టిన కార్యక్రమం గురించి కూడా కేంద్రమంత్రి ప్రస్తావించారు. కృత్రిమ మేథో పరిజ్ఞాన విప్లవం ఇలాగే కొనసాగుతుందని, వచ్చే దశాబ్దంలో కృత్రిమ మేథో పరిజ్ఞానానికి ప్రపంచ కేంద్రంగా భారతదేశం రూపొందగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారతీయ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రాథమిక, మాధ్యమిక, తృతీయ రంగాల్లో సమాచార కమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని, కృత్రిమ మేథో పరిజ్ఞానాన్ని పొందుపరిచేందుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.

  డబ్ల్యు.ఎస్.ఐ.ఎస్. శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో జపాన్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో కూడా కేంద్రమంత్రి దేవుసింహ్ చౌహాన్ పాలుపంచుకున్నారు. భారత టెలికాం రంగంలో భారతదేశం చేపడుతున్న కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని జపాన్ కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు ఈ శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో జరిగిన చర్చల్లో జపాన్ ప్రతినిధి బృందానికి జపాన్ అంతర్జాతీయ వ్యవహారాల విధాన సమన్వయ శాఖ ఉపమంత్రి శశాకీ యుజీ నాయకత్వం వహించారు.  ఈ సందర్భంగా దేవుసింహ్ చౌహాన్ మాట్లాడుతూ, ప్రపంచంలోని అతిపెద్ద టెలికాం వ్యవస్థల్లో భారతదేశం ఒకటని అన్నారు. టెలికాం పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడం, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహిస్తూ బ్రాడ్ బాండ్, టెలికాం అనుసంధాన్ని విస్తరింపజేయడం లక్ష్యంగా గత ఏడాది ప్రభుత్వం అద్భుతమైన సంస్కరణలను ప్రకటించిందని అన్నారు.  బహిరంగ రేడియో అనుసంధాన వ్యవస్థ (ఆర్.ఎ.ఎన్.), భారీ మల్టిపుల్ ఇన్‌పుట్, మల్టిపుల్ అవుట్‌పుట్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, కనెక్టెడ్ కార్స్, 5-జి యూస్ కేసులు, 6-జి ఇన్నోవేషన్ రంగాల్లో భారత్, జపాన్ సహకారంతో ప్రపంచ స్థాయి పరిష్కారాలు రూపొందే అవకాశాలు ఉన్నాయని దేవుసింహ్ చౌహాన్ అన్నారు.

  దేశంలో యువ ఇంజనీరింగ్ ప్రతిభ అందుబాటులో ఉన్న  నేపథ్యంలో, జపాన్‌కు చెందిన పరిశోధనా, అభివృద్ధి కేంద్రాలను భారతదేశంలో ఏర్పాటు చేసే అంశాన్ని జపాన్ టెలికాం పారిశ్రామిక రంగం పరిశీలించాలని కేంద్రమంత్రి సూచించారు. సెమీకండర్ల తయారీపై భారత ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించిన అంశాన్ని కూడా కేంద్రమంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ విధానం ప్రకారం జపాన్ కంపెనీలు మనతో భాగస్వామ్యం వహించవచ్చని అన్నారు.  సెమీ కండక్టర్ సాంకేతిక పరిజ్ఞానంలో తాము 85,000మంది ఇంజినీర్లకు శిక్షణ ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ విషయంలో జపాన్ భారతదేశానికి భాగస్వామ్య దేశంగా వ్యవహరించవచ్చని అన్నారు.

  శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో ఇరాన్ కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి ఇస్సా జరేపోర్‌తో ద్వైపాక్షిక సమావేశం సందర్భంగా కేంద్రమంత్రి చౌహాన్ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ, ఇటీవలి సంవత్సరాల్లో ద్వైపాక్షిక సహకారం గణనీయంగా ఊపందుకుందని, ఇది మరింత సుస్థిరం కావలసిన అవసరం ఉందని అన్నారు.  బహుముఖ రంగాల్లో సంబంధాలను మరింత విస్తరింపజేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని, పొరుగు ప్రాంతాలకే ప్రాధాన్యం, లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్ వంటి ఇరాన్ ప్రభుత్వ విధానాలపై దృష్టని కేంద్రీకరించామని ఆయన అన్నారు.

  ఇరాన్ చేపట్టిన పటిష్టమైన టెలికమ్యూనికేషన్, ఐ.టి. రంగాల గురించి  తెలుసుకోవాలని తాము ఆశిస్తున్నట్టు చెప్పారు. అలాగే, యాప్ ఆధారిత స్టార్టప్ వ్యవస్థ, ద్వైపాక్షిక సహకారం గురించి కూడా తెలుసుకోవాలన్నది తమ అభిమతమని ఆయన అన్నారు. ఆరోగ్యరక్షణకు సంబంధించిన సమాచార, కమ్యూనికేషన్ల రంగంలో ఇరాన్‌తో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు భారతదేశం సంసిద్ధంగా ఉందని కేంద్రమంత్రి చౌహాన్ అన్నారు.

 

 

****


(Release ID: 1830649) Visitor Counter : 170