ప్రధాన మంత్రి కార్యాలయం

2022 మే నెల 29 వ తేదీనాటి ‘ మన్ కీ బాత్ ’ (‘ మనసు లోమాట ’) కార్యక్రమం 89 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 29 MAY 2022 11:07AM by PIB Hyderabad

నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈరోజు మరోసారి 'మన్ కీ బాత్' ద్వారా నా కుటుంబ సభ్యులందరినీ కలిసే అవకాశం వచ్చింది. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి స్వాగతం. కొన్ని రోజుల క్రితం మనందరికీ స్ఫూర్తినిచ్చే విజయాన్ని దేశం సాధించింది. ఈ విజయం భారతదేశ సామర్థ్యంపై కొత్త విశ్వాసాన్ని నింపుతుంది. క్రికెట్ మైదానంలో టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ ఎవరైనా సెంచరీ చేశారని వింటే మీరు సంతోషిస్తుండవచ్చు. కానీ, భారత్ మరో రంగంలో సెంచరీ చేసింది. అది చాలా  విశేషమైంది. ఈ నెల 5వ తేదీకి దేశంలో యూనికార్న్ స్టార్టప్ ల సంఖ్య 100కి చేరుకుంది. యూనికార్న్ స్టార్టప్ అంటే కనీసం ఏడున్నర వేల కోట్ల రూపాయల స్టార్టప్ అని మీకు తెలుసు. ఈ యూనికార్న్‌ల మొత్తం విలువ 330 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అంటే 25 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ఖచ్చితంగా ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. మన మొత్తం యూనికార్న్‌లలో 44 స్టార్టప్ లు గత ఏడాదే మొదలయ్యాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మాత్రమే కాదు- ఈ సంవత్సరం 3-4 నెలల్లో 14 కొత్త యూనికార్న్‌లు ఏర్పడ్డాయి. అంటే ఈ ప్రపంచ మహమ్మారి యుగంలో కూడా మన స్టార్టప్‌లు సంపదను, విలువను సృష్టిస్తున్నాయి. భారతీయ యూనికార్న్‌ల సగటు వార్షిక వృద్ధి రేటు USA, UKలతో సహా అనేక ఇతర దేశాల కంటే ఎక్కువ. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. శుభవార్త ఏమిటంటే మన యూనికార్న్ స్టార్టప్ లు  వైవిధ్యభరితంగా ఉంటాయి. ఈ-కామర్స్, ఫిన్-టెక్, ఎడ్-టెక్, బయోటెక్ వంటి అనేక రంగాల్లో అవి పనిచేస్తున్నాయి. నేను మరింత ముఖ్యమైందిగా భావించే మరో విషయం ఏమిటంటే స్టార్టప్‌ల ప్రపంచం నవీన భారతదేశ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. భారతదేశ  స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాదు- చిన్న పట్టణాలు , నగరాల నుండి కూడా వ్యవస్థాపకులు ముందుకు వస్తున్నారు. భారతదేశంలో వినూత్న ఆలోచన ఉన్న వ్యక్తి సంపదను సృష్టించగలడని ఇది నిరూపిస్తుంది.

మిత్రులారా! దేశం సాధించిన ఈ విజయం వెనుక దేశంలోని యువశక్తి, ప్రతిభ,  ప్రభుత్వం ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తున్నారు.  అందరి సహకారం ఉంది.  కానీ ఇందులో ఇంకో విషయం ఉత్తమ మార్గదర్శి స్టార్టప్‌ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలడు. సరైన నిర్ణయం విషయంలో వ్యవస్థాపకులకు అన్ని విధాలుగా మార్గనిర్దేశం చేయగలడు. వృద్ధి చెందుతున్న స్టార్టప్‌లకు తమను తాము అంకితం చేసుకున్న అనేక మంది మార్గదర్శకులు భారతదేశంలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను.

శ్రీధర్ వెంబు గారు ఇటీవలే పద్మ అవార్డును పారిశ్రామికవేత్త. ఆయన ఇప్పుడు మరో పారిశ్రామికవేత్తని తీర్చిదిద్దే పనిలో పడ్డారు. శ్రీధర్ గారు గ్రామీణ ప్రాంతం నుండి తన పనిని ప్రారంభించారు. గ్రామంలోనే ఉంటూ గ్రామీణ యువతను ఈ ప్రాంతంలో ఏదో ఒక మంచి పని చేయాలని ప్రోత్సహిస్తున్నారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి 2014లో వన్-బ్రిడ్జ్ అనే ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించిన మదన్ పడకి వంటి వ్యక్తులు కూడా మనకు ఉన్నారు. దక్షిణ, తూర్పు భారతదేశంలోని 75 కంటే ఎక్కువ జిల్లాల్లో వన్-బ్రిడ్జ్ అందుబాటులో ఉంది. దీనితో అనుబంధించబడిన 9000 మందికి పైగా గ్రామీణ పారిశ్రామికవేత్తలు గ్రామీణ వినియోగదారులకు తమ సేవలను అందిస్తున్నారు. మీరా షెనాయ్ గారు కూడా అలాంటి ఒక ఉదాహరణ. మార్కెట్ తో అనుసంధానమైన నైపుణ్యాల శిక్షణను గ్రామీణ, గిరిజన, వికలాంగ యువతకు అందించేందుకు ఆమె విశేషమైన కృషి చేస్తున్నారు. నేను ఇక్కడ కొన్ని పేర్లను మాత్రమే తీసుకున్నాను.  కానీ ఈ రోజు మన మధ్య మార్గదర్శకుల కొరత లేదు. ఈ రోజు దేశంలో స్టార్టప్‌ల కోసం పూర్తి మద్దతు వ్యవస్థను సిద్ధం చేయడం మనకు  చాలా సంతోషకరమైన విషయం. రాబోయే కాలంలో భారతదేశంలోని స్టార్టప్ ప్రపంచంలో మనం కొత్త పురోగతిని చూడగలమన్న నమ్మకం నాకు ఉంది.

మిత్రులారా! దేశ ప్రజల సృజన, కళాత్మక ప్రతిభ మిళితమై ఉన్న ఒక ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన అంశాన్ని కొన్ని రోజుల క్రితం చూశాను. ఇది తమిళనాడులోని తంజావూరు నుండి స్వయం సహాయక బృందం నాకు పంపిన బహుమతి. ఈ బహుమతిలో భారతీయత  పరిమళం, మాతృ శక్తి  ఆశీర్వాదాలు ఉన్నాయి. నా పట్ల వారికి ఉన్న  స్నేహభావనకు ఇది నిదర్శనం. ఇది ప్రత్యేకమైన తంజావూరు బొమ్మ. దీనికి GI ట్యాగ్ కూడా ఉంది. స్థానిక సంస్కృతిలో భాగంగా రూపొందించిన ఈ బహుమతిని నాకు పంపినందుకు తంజావూరు స్వయం సహాయక బృందానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా! ఈ తంజావూరు బొమ్మ ఎంత అందంగా ఉందో అంతే అందంగా  మహిళా సాధికారతకు సంబంధించిన కొత్త గాథలను కూడా లిఖిస్తోంది. తంజావూరులో మహిళా స్వయం సహాయక సంఘాల దుకాణాలు, కియోస్క్‌లు కూడా ప్రారంభమవుతున్నాయి. దీంతో ఎన్నో పేద కుటుంబాల జీవితాలు మారిపోయాయి. అటువంటి కియోస్క్‌లు, దుకాణాల సహాయంతో మహిళలు ఇప్పుడు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించగలుగుతున్నారు. ఈ కార్యక్రమానికి 'థారగైగల్ కైవినై పోరుత్తకల్ వీరప్పనై అంగడి' అని పేరు పెట్టారు. విశేషమేమిటంటే 22 స్వయం సహాయక బృందాలు ఈ చొరవతో అనుసంధానమయ్యాయి. ఈ మహిళా స్వయం సహాయక సంఘాల దుకాణాలు తంజావూరులో చాలా ప్రధానమైన ప్రదేశంలో ఉన్నాయి. వాటి బాధ్యతను కూడా మహిళలు పూర్తిగా తీసుకుంటున్నారు.

ఈ మహిళా స్వయం సహాయక బృందం తంజావూరు బొమ్మలు, కాంస్య దీపాలు మొదలైన జిఐ ఉత్పత్తులే కాకుండా అల్లికలు, కృత్రిమ ఆభరణాలు కూడా తయారు చేస్తారు. ఇటువంటి దుకాణాల కారణంగా GI ఉత్పత్తులతో పాటు హస్తకళా ఉత్పత్తుల అమ్మకాలు బాగా పెరిగాయి. ఈ ప్రచారం వల్ల చేతివృత్తిదారులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా మహిళలు కూడా తమ ఆదాయాన్ని పెంచుకుంటూ సాధికారత సాధిస్తున్నారు. 'మన్ కీ బాత్' శ్రోతలకు కూడా నాకో విన్నపం. మీ ప్రాంతంలో ఏ మహిళా స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయో తెలుసుకోండి. మీరు వారి ఉత్పత్తుల గురించి సమాచారాన్ని కూడా సేకరించాలి. వీలైనంత ఎక్కువగా ఈ ఉత్పత్తులను ఉపయోగించాలి. ఇలా చేయడం ద్వారా మీరు స్వయం సహాయక బృందానికి ఆదాయాన్ని పెంచడంలో సహాయపడటమే కాకుండా ‘ఆత్మ నిర్భర్ భారత్’ ప్రచారానికి ఊపునిస్తారు.

మిత్రులారా! మన దేశంలో అనేక భాషలు, లిపులు, మాండలికాల గొప్ప సంపద ఉంది. వివిధ ప్రాంతాలలో భిన్నమైన దుస్తులు, ఆహారం, సంస్కృతి మన గుర్తింపు. ఈ వైవిధ్యం ఒక దేశంగా మనల్ని శక్తివంతం చేస్తుంది. మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. దీనికి సంబంధించిన చాలా స్పూర్తిదాయకమైన ఉదాహరణ కల్పన గారు. ఈ విషయాన్ని నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఆమె పేరు కల్పన. కానీ ఆమె ప్రయత్నం 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్'  నిజమైన స్ఫూర్తితో నిండి ఉంది. వాస్తవానికి కల్పన గారు  ఇటీవలే కర్ణాటకలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అయితే ఆమె విజయంలో ప్రత్యేకత ఏమిటంటే కల్పనకు కొంతకాలం క్రితం వరకు కన్నడ భాష తెలియదు. మూడు నెలల్లో కన్నడ భాష నేర్చుకోవడమే కాకుండా 92 మార్కులు తెచ్చుకుని చూపించారు. ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. ఆమె గురించి మీకు ఆశ్చర్యం కలిగించే, మీకు స్ఫూర్తినిచ్చే అనేక ఇతర విషయాలు ఉన్నాయి. కల్పన స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్. ఆమె ఇంతకుముందు టిబితో బాధపడ్డారు. ఆమె మూడవ తరగతిలో ఉన్నప్పుడు కంటి చూపును కూడా కోల్పోయారు. కానీ, 'సంకల్పం ఉన్నచోట, ఒక మార్గం ఉంటుంది'అన్న సూక్తి ఉంది కదా. కల్పనకు తరువాత మైసూరు నివాసి ప్రొఫెసర్ తారామూర్తి గారితో పరిచయం ఏర్పడింది.  ఆమె కల్పనను ప్రోత్సహించడమే కాకుండా అన్ని విధాలుగా సహాయం చేశారు. ఈరోజు ఆమె తన కృషితో మనందరికీ ఆదర్శంగా నిలిచింది. కల్పన ధైర్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదేవిధంగా దేశంలోని భాషా వైవిధ్యాన్ని పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాకు చెందిన శ్రీపతి టూడూ గారు. ఆయన పురూలియాలోని సిద్ధో-కానో-బిర్సా విశ్వవిద్యాలయంలో సంతాలీ భాష  ప్రొఫెసర్. ఆయన సంతాలీ సమాజం కోసం వారి 'ఓల్ చికి' లిపిలో భారతదేశ రాజ్యాంగాన్ని సిద్ధం చేశారు. మన రాజ్యాంగం మన దేశంలోని ప్రతి పౌరుడికి వారి హక్కులు, కర్తవ్యాలపై అవగాహన కల్పిస్తుందని శ్రీపతి టూడూ గారు అంటారు. అందువల్ల ప్రతి పౌరుడు దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం సంతాలీ సమాజానికి వారి సొంత లిపిలో రాజ్యాంగ ప్రతిని సిద్ధం చేసి బహుమతిగా ఇచ్చాడు. శ్రీపతి గారి ఈ ఆలోచనను, ఆయన ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తికి ఇది సజీవ ఉదాహరణ. ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ఇలాంటి అనేక ప్రయత్నాల గురించి మీరు 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు. అక్కడ మీరు ఆహారం, కళ, సంస్కృతి, పర్యాటకం వంటి అనేక అంశాలకు సంబంధించిన కార్యకలాపాల గురించి తెలుసుకుంటారు. మీరు ఈ కార్యకలాపాలలో కూడా పాల్గొనవచ్చు. ఇది మీకు మన దేశం గురించి సమాచారాన్ని అందిస్తుంది. మీరు దేశం  వైవిధ్యాన్ని కూడా అనుభూతి చెందుతారు.

నా ప్రియమైన దేశప్రజలారా! ప్రస్తుతం మన దేశంలో ఉత్తరాఖండ్‌లోని 'చార్-ధామ్' పవిత్ర యాత్ర కొనసాగుతోంది. 'చార్-ధామ్'కు, ముఖ్యంగా కేదార్‌నాథ్‌ కు  ప్రతిరోజూ వేలాది మంది భక్తులు చేరుకుంటున్నారు. ప్రజలు తమ 'చార్-ధామ్ యాత్ర'  సంతోషకరమైన అనుభవాలను పంచుకుంటున్నారు. కానీ కేదార్‌నాథ్‌లో కొంతమంది యాత్రికులు అపరిశుభ్రంగా వ్యాపింపజేయడం వల్ల భక్తులు చాలా బాధపడటం నేను చూశాను. సోషల్ మీడియాలో కూడా చాలా మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. పవిత్ర తీర్థయాత్రకు వెళ్ళి, అక్కడ అపరిశుభ్రతను వ్యాపించేలా చేయడం సరైంది కాదు. కానీ మిత్రులారా!  ఈ ఫిర్యాదుల మధ్య చాలా మంచి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. విశ్వాసం ఉన్నచోట సృజన, సకారాత్మకత కూడా ఉన్నాయి. బాబా కేదార్ ధామ్‌లో పూజలు చేయడంతో పాటు స్వచ్చతా సాధన కూడా చేసే భక్తులు చాలా మంది ఉన్నారు. ఒకరు తాము  బస చేసిన ప్రదేశానికి సమీపంలో శుభ్రం చేస్తున్నారు. మరొకరు ప్రయాణ మార్గం నుండి చెత్తను శుభ్రం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ ప్రచార బృందంతో పాటు పలు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా అక్కడ పనిచేస్తున్నాయి. మిత్రులారా!  తీర్థయాత్రకు ప్రాముఖ్యత ఉన్నట్టే తీర్థ సేవ  ప్రాముఖ్యత కూడా ఇక్కడ కనబడుతోంది. తీర్థ సేవ లేకుండా తీర్థయాత్ర కూడా అసంపూర్ణమే అని నేను చెప్తాను. దేవభూమి ఉత్తరాఖండ్‌లో పరిశుభ్రతా కార్యక్రమాల్లో, సేవలో నిమగ్నమై ఉన్నవారు చాలా మంది ఉన్నారు. రుద్ర ప్రయాగకు చెందిన మనోజ్ బైంజ్ వాల్ గారి నుండి కూడా మీకు చాలా ప్రేరణ లభిస్తుంది. గత పాతికేళ్లుగా పర్యావరణ సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. పరిశుభ్రత ప్రచారాన్ని నిర్వహించడమే కాకుండా పవిత్ర స్థలాలను ప్లాస్టిక్ రహితంగా మార్చడంలో నిమగ్నమై ఉన్నారు. గుప్తకాశీలో నివసించే సురేంద్ర బగ్వాడీ గారు స్వచ్చతను తన జీవిత మంత్రంగా మార్చుకున్నారు. ఆయన గుప్తకాశీలో క్రమం తప్పకుండా పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన ఈ ప్రచారానికి 'మన్ కీ బాత్' అని పేరు పెట్టారని నాకు తెలిసింది. ఇదే విధంగా దేవర్ గావ్ కు చెందిన చంపాదేవి గత మూడేళ్లుగా గ్రామంలోని మహిళలకు వ్యర్థ పదార్థాల నిర్వహణను నేర్పిస్తున్నారు. చంపా గారు వందలాది చెట్లను నాటారు. తన శ్రమతో పచ్చని వనాన్ని రూపొందించారు.  మిత్రులారా!  అలాంటి వారి కృషి వల్ల ఆ దేవ భూమి, తీర్థయాత్రల దివ్యమైన అనుభూతి అక్కడ కలుగుతోంది. మనం అక్కడ అనుభవించే ఈ దైవత్వాన్ని,  ఆధ్యాత్మిక వాతావరణాన్ని  కాపాడుకోవడం మన బాధ్యత. ప్రస్తుతం మన దేశంలో  'చార్ ధామ్ యాత్ర'తో పాటు రాబోయే కాలంలో 'అమర్‌నాథ్ యాత్ర', 'పండర్‌పూర్ యాత్ర', 'జగన్నాథ యాత్ర' వంటి అనేక యాత్రలు ఉంటాయి. శ్రావణ మాసంలో బహుశా ప్రతి గ్రామంలో ఏదో ఒక జాతర జరుగుతుంది. మిత్రులారా! మనం ఎక్కడికి వెళ్లినా ఈ యాత్రా స్థలాల గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. పరిశుభ్రత, పవిత్ర వాతావరణం మనం ఎప్పటికీ మరచిపోకూడదు. వాటిని మనం కాపాడుకోవాలి. అందుకే పరిశుభ్రతా   తీర్మానాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం. కొన్ని రోజుల తర్వాత జూన్ 5వ తేదీన 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' జరుపుకుంటున్నాం. పర్యావరణానికి సంబంధించి మన చుట్టూ సానుకూల ప్రచారాలను నిర్వహించాలి. ఇది నిరంతరం జరగవలసిన పని. మీరు ఈసారి అందరూ కలిసి  పరిశుభ్రత కోసం, చెట్ల పెంపకం కోసం కొంత ప్రయత్నం చేయండి. మీరే ఒక చెట్టును నాటండి.  ఇతరులకు కూడా స్ఫూర్తినివ్వండి.

నా ప్రియమైన దేశప్రజలారా! వచ్చే నెల జూన్ 21వ తేదీన మనం 8వ 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' జరుపుకోబోతున్నాం. ఈసారి యోగా దినోత్సవ అంశం  మానవత్వం కోసం యోగా. 'యోగా డే'ని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. అవును! అలాగే కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు యావత్ ప్రపంచంలో మునుపటి కంటే మెరుగైన పరిస్థితి ఉంది. ఎక్కువ టీకా కవరేజ్ కారణంగా ఇప్పుడు ప్రజలు గతంలో కంటే ఎక్కువగా బయటకు వెళ్తున్నారు.  అందువల్ల యోగా దినోత్సవం తో సహా అనేక విషయాల్లో చాలా సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. మన జీవితంలో ఆరోగ్యానికి ఉండే ప్రాధాన్యతను కరోనా తెలియజేసింది. ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాధాన్యత చాలా ఉంది. అవును. యోగా ద్వారా శారీరక, ఆధ్యాత్మిక, మేధో శ్రేయస్సు ఎంతగా వృద్ధి చెందుతుందో ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్త నుండి సినీ, క్రీడా ప్రముఖుల వరకు, విద్యార్థుల నుండి సామాన్య మానవుల వరకు, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో అంతర్భాగంగా చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు పెరుగుతున్న ప్రజాదరణను చూడడానికి మీరందరూ ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మిత్రులారా! ఈ సారి దేశ విదేశాల్లో యోగా దినోత్సవం సందర్భంగా చాలా వినూత్నమైన కార్యక్రమాల నిర్వహణ గురించి తెలిసింది.   వీటిలో ఒకటి గార్డియన్ రింగ్. ఇది చాలా ప్రత్యేకమైన కార్యక్రమం. ఇందులో సూర్యుని కదలికను ఉత్సవంగా జరుపుకుంటారు. అంటే సూర్యుడు ప్రయాణించేటప్పుడు భూమిపై ఉన్న వివిధ ప్రాంతాల నుండి మనం యోగా ద్వారా దాన్ని స్వాగతిస్తాం. వివిధ దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలు అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సూర్యోదయం సమయంలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమం ఒక దేశం తర్వాత మరొక దేశం నుండి ప్రారంభమవుతుంది. తూర్పు నుండి పడమరకు ప్రయాణం నిరంతరం జరుగుతుంది. అలాగే ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమాల ధార ఒకదాని తర్వాత ఒకటిగా అనుసంధానమవుతుంది. అంటే ఇది ఒక రకమైన రిలే యోగా స్ట్రీమింగ్ ఈవెంట్. మీరు కూడా తప్పకుండా చూడండి.

మిత్రులారా! ఈసారి మన దేశంలో 'అమృత్ మహోత్సవ్'ను దృష్టిలో ఉంచుకుని 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' దేశంలోని 75 ప్రధాన ప్రదేశాలలో జరుగుతుంది.  ఈ సందర్భంగా పలు సంస్థలు, దేశప్రజలు తమ తమ ప్రాంతాల్లో తమ స్థాయిలో వినూత్నంగా ఏదైనా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని, మీ నగరం, పట్టణం లేదా గ్రామంలో అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ప్రదేశం పురాతన దేవాలయం, పర్యాటక కేంద్రం కావచ్చు. లేదా ప్రసిద్ధ నది, సరస్సు లేదా చెరువు ఒడ్డు కూడా కావచ్చు. దీంతో యోగాతో పాటు మీ ప్రాంతానికి గుర్తింపు పెరగడంతో పాటు టూరిజం కూడా పుంజుకుంటుంది. ప్రస్తుతం 'యోగా డే'కి సంబంధించి వంద  రోజుల కౌంట్‌డౌన్ కూడా జరుగుతోంది.  వ్యక్తిగత, సామాజిక ప్రయత్నాలకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే మూడు నెలల క్రితం ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో 100వ రోజు, 75వ రోజు కౌంట్ డౌన్ కార్యక్రమాలు జరిగాయి. అదే సమయంలో అస్సాంలోని శివసాగర్‌లో 50వ కౌంట్‌డౌన్ ఈవెంట్లు, హైదరాబాద్‌లో 25వ కౌంట్‌డౌన్ ఈవెంట్లు నిర్వహించారు. 'యోగా డే' కోసం మీరు ఇప్పుడే సన్నాహాలు ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. మరింత మంది వ్యక్తులను కలవండి.  ప్రతి ఒక్కరూ 'యోగా డే' కార్యక్రమంలో చేరేవిధంగా స్ఫూర్తినివ్వండి. మీరందరూ 'యోగా డే'లో ఉత్సాహంగా పాల్గొంటారని, మీ రోజువారీ జీవితంలో యోగాను అలవర్చుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.

మిత్రులారా!  కొన్ని రోజుల క్రితం నేను జపాన్ వెళ్ళాను. అనేక కార్యక్రమాల మధ్య కొందరు అద్భుతమైన వ్యక్తులను కలిసే అవకాశం నాకు లభించింది. నేను వారి గురించి 'మన్ కీ బాత్'లో మీతో చర్చించాలనుకుంటున్నాను. వారు జపాన్ ప్రజలు. కానీ వారికి భారతదేశంతో  అద్భుతమైన అనుబంధం, ప్రేమ ఉన్నాయి. వీరిలో ఒకరు ప్రముఖ కళా దర్శకులు హిరోషి కోయికే గారు. ఆయన మహాభారత్ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించారని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఈ ప్రాజెక్ట్ కంబోడియాలో ప్రారంభమైంది. గత 9 సంవత్సరాలుగా కొనసాగుతోంది. హిరోషి కోయికే గారు ప్రతిదీ చాలా భిన్నమైన రీతిలో నిర్వహిస్తారు. ఆయన  ప్రతి సంవత్సరం, ఆసియాలోని ఒక దేశానికి వెళ్తారు.  అక్కడ స్థానిక కళాకారులు, సంగీతకారులతో మహాభారతంలోని భాగాలను రూపొందిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆయన భారతదేశంతో పాటు కంబోడియా, ఇండోనేషియాతో సహా తొమ్మిది దేశాలలో రంగస్థల ప్రదర్శనను అందించారు. శాస్త్రీయ, సాంప్రదాయిక ఆసియా ప్రదర్శన కళల నేపథ్యం ఉన్న కళాకారులను హిరోషి కోయికేగారు ఒకచోట చేరుస్తారు.  దీని కారణంగా, ఆయన పనిలో వైవిధ్యం కనిపిస్తుంది. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, జపాన్ దేశాల ప్రదర్శనకారులు జావా నృత్యం, బాలినీస్ నృత్యం, థాయ్ నృత్యం ద్వారా మరింత ఆకర్షణీయంగా చేస్తారు. విశేషమేమిటంటే, ఇందులో ప్రతి ప్రదర్శకుడు తన స్వంత మాతృభాషలో మాట్లాడతారు.  కొరియోగ్రఫీ ఈ వైవిధ్యాన్ని చాలా అందంగా ప్రదర్శిస్తుంది. సంగీత వైవిధ్యం దీన్ని  మరింత సజీవంగా చేస్తుంది. మన సమాజంలోని వైవిధ్యాన్ని, సహజీవనం  ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు నిజమైన శాంతి ఎలా ఉండాలో చెప్పడం వారి లక్ష్యం. వీరితో పాటు నేను జపాన్‌లో కలిసిన మరో ఇద్దరు వ్యక్తులు అత్సుషి మాత్సువో గారు,  కెంజీ యోషీ గారు. వారిద్దరూ TEM ప్రొడక్షన్ కంపెనీకి అనుసంధానమై ఉన్నారు. ఈ సంస్థ 1993లో విడుదలైన జపనీస్ యానిమేషన్ చిత్రం రామాయణానికి సంబంధించినది. ఈ ప్రాజెక్ట్ జపాన్ కు చెందిన సుప్రసిద్ధ చిత్ర దర్శకుడు యుగో సాకో గారితో అనుబంధం కలిగి ఉంది. దాదాపు 40 ఏళ్ల క్రితం 1983లో ఆయనకు రామాయణం గురించి తొలిసారిగా తెలిసింది. 'రామాయణం' ఆయన హృదయాన్ని తాకింది. ఆ తర్వాత దానిపై లోతుగా పరిశోధన చేయడం ప్రారంభించారు. అంతే కాదు- జపనీస్ భాషలో రామాయణానికి సంబంధించిన 10 వెర్షన్లు చదివారు. ఇంతటితో ఆగకుండా యానిమేషన్‌లో కూడా రూపొందించాలనుకున్నారు. ఇందులో భారతీయ యానిమేటర్లు కూడా ఆయనకు చాలా సహాయపడ్డారు. చిత్రంలో చూపిన భారతీయ ఆచారాలు, సంప్రదాయాల గురించి ఆయనకు మార్గనిర్దేశం చేశారు. భారతదేశంలోని ప్రజలు ధోతీని ఎలా ధరిస్తారు, చీర ఎలా ధరించాలి, జుట్టును ఎలా దువ్వుకుంటారో వారికి వివరించారు. కుటుంబం లోపల పిల్లలు ఒకరినొకరు ఎలా గౌరవిస్తారు, ఆశీర్వాదాల సంప్రదాయం ఏమిటి,  ఉదయాన్నే లేవడం, ఇంట్లోని పెద్దలకు పాదాభివందనం చేయడం, వారి ఆశీస్సులు తీసుకోవడం- ఇలా అన్నీ-  30 ఏళ్ల తర్వాత ఈ యానిమేషన్ చిత్రం నాలుగింతల రెజల్యూషన్ ఉండే చిత్రంగా మళ్ళీ  రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. మన భాష తెలియని, మన సంప్రదాయాల గురించి తెలియని మనకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్‌ వాసులైన వారికి మన సంస్కృతి పట్ల ఉన్న అంకితభావం, గౌరవం ప్రశంసనీయమైనవి. ఏ భారతీయుడికి ఇది గర్వంగా అనిపించదు?

నా ప్రియమైన దేశవాసులారా! వ్యక్తిగత ప్రయోజనాలకు పై స్థాయిలో సమాజానికి సేవ చేయాలనే మంత్రం, సమాజం కోసం నేను అనే మంత్రం మన విలువలలో ఒక భాగం. మన దేశంలో లెక్కలేనంతమంది ఈ మంత్రాన్ని తమ జీవిత లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో నివాసముంటున్న రామ్‌భూపాల్‌రెడ్డి గారి గురించి నాకు తెలిసింది. రాంభూపాల్ రెడ్డి గారు ఉద్యోగ విరమణ తర్వాత తన సంపాదనంతా ఆడపిల్లల చదువుల కోసం విరాళంగా ఇచ్చారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన 'సుకన్య సమృద్ధి యోజన' కింద దాదాపు 100 మంది ఆడపిల్లల కోసం ఖాతాలు తెరిచి అందులో 25 లక్షల రూపాయలకు పైగా డబ్బును డిపాజిట్ చేశారు. అటువంటి సేవకు మరొక ఉదాహరణ ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని కచౌరా గ్రామంలో ఉంది.  చాలా ఏళ్లుగా ఈ గ్రామంలో మంచినీటి కొరత ఉండేది. ఇంతలో గ్రామానికి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కున్వర్ సింగ్ అనే ఆ గ్రామానికి చెందిన రైతు పొలంలో మంచినీరు వచ్చింది. ఇది వారికి ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. ఈ నీళ్లతో మిగతా గ్రామస్తులందరికీ ఎందుకు సేవ చేయకూడదని ఆయన అనుకున్నారు. కానీ, పొలం నుంచి గ్రామానికి నీరు తీసుకెళ్లేందుకు 30-32 లక్షల రూపాయలు కావాలి. కొంతకాలం తర్వాత కున్వర్ సింగ్ గారి తమ్ముడు శ్యామ్ సింగ్ గారు సైన్యం నుండి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత గ్రామానికి వచ్చారు. అప్పుడు ఆయనకు ఈ విషయం తెలిసింది. రిటైర్‌మెంట్‌ ద్వారా వచ్చిన డబ్బునంతా ఈ పనికి అప్పగించి పొలం నుంచి గ్రామానికి పైప్‌లైన్‌ వేసి గ్రామస్తులకు మంచినీళ్లు సరఫరా చేశారు. ససహృదయత, కర్తవ్యంపై అంకితభావం ఉంటే ఒక్క వ్యక్తి కూడా మొత్తం సమాజ భవిష్యత్తును ఎలా మార్చగలడనే విషయం తెలిపేందుకు ఈ ప్రయత్నం ప్రేరణగా నిలుస్తుంది. కర్తవ్య మార్గంలో నడవడం ద్వారానే సమాజాన్ని శక్తివంతం చేయగలం. దేశాన్ని శక్తివంతం చేయగలం. ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో  ఇది మన సంకల్పం. ఇది మన సాధన కూడా కావాలి. దానికి ఒకే మార్గం - కర్తవ్యం, కర్తవ్యం , కర్తవ్యం.

నా ప్రియమైన దేశప్రజలారా!  ఈ రోజు మనం 'మన్ కీ బాత్'లో సమాజానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను చర్చించాం. మీరందరూ నాకు వివిధ అంశాలకు సంబంధించిన ముఖ్యమైన సూచనలను పంపండి. వాటి ఆధారంగా మన చర్చ ముందుకు సాగుతుంది. అలాగే 'మన్ కీ బాత్' తర్వాతి సంచిక కోసం మీ సూచనలను పంపడం మర్చిపోవద్దు. ప్రస్తుతం స్వాతంత్య్ర అమృత మహోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు పాల్గొంటున్న కార్యక్రమాల గురించి కూడా తప్పక చెప్పండి. నమో యాప్, మై గవ్ లపై మీ సూచనల కోసం నేను ఎదురు చూస్తున్నాను. తర్వాతిసారి మనం మరోమారు కలుద్దాం.  దేశప్రజలకు సంబంధించిన ఇలాంటి అంశాలపై మరోసారి మాట్లాడుకుందాం. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ చుట్టూ ఉన్న అన్ని జంతువులను కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ వేసవి కాలంలో జంతువులు, పక్షులకు ఆహారం, నీరు అందించే మానవీయ బాధ్యతను మీరు కొనసాగించాలి.  ఇది గుర్తుంచుకోండి. అప్పటి వరకు చాలా చాలా ధన్యవాదాలు.

*****



(Release ID: 1829197) Visitor Counter : 230