వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
వినియోగదారులనుంచి బలవంతంగా సర్వీసు చార్జీలను వసూలు చేస్తున్న రెస్టారెంటులను హెచ్చరించిన డిఒసిఎ
ఇది వినియోగదారు విచక్షణకు సంబంధించినదని చెప్పిన డిఒసిఎ,
ఈ అంశంపై చర్చించేందుకు జూన్ 2న జాతీయ రెస్టరెంట్ అసోసియేషన్ తో సమావేశం ఏర్పాటు
Posted On:
23 MAY 2022 2:44PM by PIB Hyderabad
రెస్టరెంటు లు వసూలు చేస్తున్న సర్వీసు చార్జీలకు సంబంధించి కేంద్ర వినియోగదారుల విభాగం (డిఒసిఎ) 2022జూన్ 2 వ తేదీన నేషనల్ రెస్టరెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో సమావేశం నిర్వహించనుంది. రెస్టరెంటులు విధిస్తున్న సర్వీసు చార్జీ అంశం ఇందులో చర్చిస్తారు.
జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ (ఎన్ సిహెచ్ ) లో ఎంతో మంది వినియోగదారులు ఫిర్యాదు చేయడం, మీడియాలో దీనిపై వార్తా కథనాలు వచ్చిన నేపథ్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
డిపార్టమెంట్ ఆఫ్ కన్సూమర్ అఫైర్స్ కార్యదర్శి శ్రీ రోహిత్ కుమార్ సింగ్ ఇందుకు సంబంధించి నేషనల్ రెస్టరెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడికి ఒక లేఖ రాస్తూ రెస్టరెంట్లు, ఈటరీలు వినియోగదారులనుంచి సేవా రుసుములు వసూలు చేస్తున్నాయని, వాస్తవానికి ఇలాంటి వసూలు వినియోగదారుల విచక్షణ, స్వచ్ఛందంగా చెల్లింపు పై ఆధారపడి ఉంటుంది కాని చట్టప్రకారం తప్పనిసరి కాదని తెలిపారు.
రెస్టరెంట్లు ఏకపక్షంగా ఎక్కువ రేట్టు నిర్ణయించి వాటిని వినియోగదారులనుంచి బలవంతంగ వసూలు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిన విషయాన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి చార్జీల విషయంలో చట్టబద్ధత గురించి వినియోగదారులను తప్పుదారి పట్టిస్తున్న సందర్బాలు, బిల్లు నుంచి ఇలాంటి మొత్తాలను తొలగించాల్సిందిగా కోరిన వినియోగదారులను వేధింపులకు గురిచేస్తుండడాన్ని ఆయన ఆ లేఖలో ప్రస్తావించారు. ఈ అంశం రోజువారీగా పెద్ద ఎత్తున వినియోగదారులపై ప్రభావం చూపుతుండడం ,వినియోగదారుల హక్కులపై దీని ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ అంశాన్ని సవివరంగా , నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ఈ సమావేశంలో వినియోగదారుల ఫిర్యాదులకు సంబంధించి ఈ కింది అంశాలను చర్చించనున్నారు.
- రెస్టరెంట్‌లు సర్వీసు చార్జీని తప్పనిసరి చేస్తుండడం
- మరే ఇతర ఫీ లేదా చార్జీ రూపంలో బిల్లులో సర్వీసు చార్జీని కలుపుతుండడం
- వినియోగదారులు సర్వీసు చార్జీ చెల్లించడం ఐచ్చికం, స్వచ్ఛందం అనే వాస్తవాన్ని వినియోగదారులకు తెలియకుండా దాచిపెట్టడం
-సర్వీసు చార్జీల చెల్లింపునకు వ్యతిరేకించిన వారిని వేధింపులకు గురిచేయడం
. హోటళ్లు, రెస్టరెంటులు సర్వీసు వసూలు చేయడానికి సంబంధించి వినియోగదారుల వ్యవహారాల విభాగం ఇప్పటికే 21.04.2017 న సవివరమైన మార్గదర్శకాలను జారీచేసిన విషయం ఇక్కడ ప్రస్తావించడం అవసరం. ఈ మార్గదర్శకాల ప్రకారం, కస్టమర్ రెస్టరెంట్ లోకి అడుగుపెట్టడం అంటే అతను లేదా ఆమె ఆ హోటల్, రెస్టారెంట్ వారికి సర్వీసు చార్జీలు చెల్లించేందుకు అంగీకరించినట్టు కాదు. ఆర్డర్ పెట్టడానికి ముందస్తుగా సర్వీసు చార్జీ చెల్లిస్తామని అంగీకరించాలని ఒత్తిడి చేయడం, షరతులు విధించడం అనేది వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కిందికి వస్తుందని మార్గదర్శకాలు పేర్కొంటున్నాయి..
కస్టమర్ ఆర్డర్ పెడుతున్నారంటే , వారు మెనూ కార్డులో పేర్కొన్న ధరలు, వాటికి వర్తించే పన్నులు చెల్లించేందుకు సమ్మతి తెలిపినట్టు మాత్రే అని ఈ మార్గదర్శకాలు స్పష్టంగా పేర్కొంటున్నాయి.
పైన పేర్కొన్నవి కాక ఇక ఏ ఇతర వసూళ్లు అయినా వినియోగదారు సమ్మతి లేకుండా వసూలు చేయడమంటే అది అనుచిత వ్యాపార కార్యకలాపాల చట్టం కిందికి వస్తుంది.
ఇప్పటికే జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం, ఎవరైనా అనుచిత వ్యాపార పద్ధతులు లేదా నిర్బంధ వ్యాపార పద్ధతులకు పాల్పడినట్టయితే వినియోగదారు దానిపై వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద ఫిర్యాదు దాఖలు చేయడానికి , పరిష్కారం కోరడానికి హక్కు కలిగి ఉన్నారు. ఇందుకు సంబంధించి వినియోగదారులు వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్, ఫోరం లలో వాటి కి సంబంధించిన న్యాయపరిధికి లోబడి ఫిర్యాదు దాఖలు చేయడానికి వీలుంది.
***
(Release ID: 1828259)
Visitor Counter : 169