ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రేయస్సు కోసం భారత-పసిఫిక్ ఆర్థిక ముసాయిదా - ఒక ప్రకటన

Posted On: 24 MAY 2022 3:42PM by PIB Hyderabad

మేము, భారతదేశం, ఆస్ట్రేలియా, బ్రూనై దారుస్సలాం, ఇండోనేషియా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, అమెరికా తో పాటు ఇండో-పసిఫిక్ ప్రాంతం లోని వియత్నాం దేశాలు మా శక్తివంతమైన ప్రాంతీయ ఆర్ధిక వ్యవస్థ గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని అంగీకరిస్తున్నాము.  స్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఉచిత, బహిరంగ, న్యాయమైన, కలుపుకొని, పరస్పరం అనుసంధానించబడిన, స్థితిస్థాపకంగా, సురక్షితమైన, సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతానికి మేము నిబద్ధతను పంచుకుంటాము.  ఈ ప్రాంతంలో మా ఆర్థిక విధాన ఆసక్తులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మేము గుర్తించాము. నిరంతర వృద్ధికి, శాంతి, శ్రేయస్సు కోసం భాగస్వాముల మధ్య లోతైన ఆర్థిక ఒడంబడిక కీలకమని మేము గుర్తించాము.

స్థితిస్థాపకత, సుస్థిరత, చేరికలపై  ఆర్థిక పునరుద్ధరణ, పురోగమనం ఆధారపడి ఉన్నాయని నిర్ధారించడానికి కలిసి పని చేయడం యొక్క ఆవశ్యకతను కోవిడ్-19 మహమ్మారి నొక్కి చెప్పినట్లు మేము గుర్తించాము.  ఆర్థిక పోటీతత్వం మరియు సహకారాన్ని బలోపేతం చేయడం, క్లిష్టమైన సరఫరా వ్యవస్థలను సంరక్షించడం యొక్క ప్రాముఖ్యతను కూడా మహమ్మారి నొక్కి చెప్పింది.    అదే సమయంలో ఉద్యోగ వృద్ధిని ఉత్తేజపరుస్తుంది.  మా కార్మికులు, మహిళలు, మధ్యస్థ, చిన్న తరహా సంస్థలు, మన సమాజంలో అత్యంత హాని కలిగించే సమూహాలతో సహా ఆర్థిక అవకాశాలను మెరుగుపరుస్తుంది.

దీర్ఘకాలికంగా, సాంకేతికతను ఉపయోగించుకోవడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో పాల్గొనడం, శక్తి వ్యవస్థలను న్యాయబద్ధంగా మార్చడంతో పాటు శక్తి భద్రతను సాధించడం వంటి వాటి ద్వారా ఆర్థిక పోటీతత్వాన్ని ఎక్కువగా నిర్వచించడం జరుగుతుంది. సమానమైన, సమ్మిళిత వృద్ధిని ఉత్పత్తి చేయడంతో పాటు, సామాజిక-ఆర్థిక సంక్షేమాన్ని మెరుగుపరిచే పద్ధతిలో వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడం జరుగుతుంది. 

భవిష్యత్తు కోసం మన ఆర్థిక వ్యవస్థలను సిద్ధం చేయడానికి, మేము ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పెరిటీని స్థాపించే ప్రక్రియను ప్రారంభిస్తున్నాము.

ఈ ఫ్రేమ్‌వర్క్ మన ఆర్థిక వ్యవస్థలకు స్థితిస్థాపకత, స్థిరత్వం, సమ్మిళితత, ఆర్థిక వృద్ధి, న్యాయబద్ధత, పోటీతత్వాన్ని అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడింది.  ఈ చొరవ ద్వారా, మేము ఈ ప్రాంతంలో సహకారం, స్థిరత్వం, శ్రేయస్సు, అభివృద్ధి, శాంతి కి తోడ్పడాలని లక్ష్యంగా పెట్టుకున్నాము.

మేము ఈ ప్రాంతం కోసం మా లక్ష్యాలు, ఆసక్తులు, ఆశయాలను పంచుకునే అదనపు ఇండో-పసిఫిక్ భాగస్వాముల నుండి భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నాము.  సాంకేతిక సహాయం, సామర్థ్యాన్ని పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, సౌకర్యవంతమైన విధానాన్ని నిర్వహించడానికి, అదేవిధంగా, మా ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించే విధంగా మా ఫ్రేమ్‌వర్క్ భాగస్వాములతో సహకరించడానికి మేము కట్టుబడి ఉన్నాము.

ఈ రోజు, మేము ఈ క్రింది అంశాలపై భవిష్యత్ సంప్రదింపుల వైపు సమిష్టి చర్చలను ప్రారంభిస్తాము.  ఫ్రేమ్‌వర్క్ భాగస్వాములు ఈ లక్ష్యాలను సాధించడానికి, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయడానికి ,వివిధ మార్గాలపై ఇటువంటి చర్చలలో పాల్గొంటారు.  అదేవిధంగా, మాతో చేరడానికి ఆసక్తి ఉన్న ఇతర ఇండో-పసిఫిక్ భాగస్వాములను మేము ఆహ్వానిస్తున్నాము.

వాణిజ్యం:     మేము అధిక-ప్రామాణిక, సమ్మిళిత, ఉచిత, సరసమైన వాణిజ్య కట్టుబాట్లను నిర్మించాలని ప్రయత్నిస్తాము. వాణిజ్యం, సాంకేతిక విధానంలో నూతన, సృజనాత్మక విధానాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తాము.  ఇవి ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడికి ఇంధనం, స్థిరమైన, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని మరియు ప్రయోజనాలను ప్రోత్సహించే విస్తృత లక్ష్యాలను ముందుకు తీసుకువెళతాయి. కార్మికులు, వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తాయి.  మా ప్రయత్నాలలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు సహకారం ఉంటుంది, కానీ వాటికి మాత్రమే పరిమితం కాదు.

 

సరఫరా వ్యవస్థలు:     మా సరఫరా వ్యవస్థలలో పారదర్శకత, వైవిధ్యం, భద్రతతో పాటు, స్థిరత్వాన్ని మెరుగుపరచడానికి మేము కట్టుబడి ఉన్నాము.  అదేవిధంగా, వాటిని మరింత స్థితిస్థాపకంగా, మరింతగా సమీకృతం చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము.  సంక్షోభ ప్రతిస్పందన చర్యలను సమన్వయం చేయడానికి మేము ప్రయత్నిస్తాము;  వ్యాపార కొనసాగింపును మెరుగ్గా నిర్ధారించడానికి, అంతరాయాల ప్రభావాలను బాగా సిద్ధం చేయడానికి, తగ్గించడానికి సహకారాన్ని అందిస్తాము;  సరుకుల రవాణా వ్యవస్థ సామర్థ్యం, మద్దతును మెరుగుపరుస్తాము;   కీలకమైన ముడి సరుకులు, ప్రాసెస్ చేసిన పదార్థాలు, సెమీకండక్టర్లు, క్లిష్టమైన ఖనిజాలు, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ మొదలైనవి అందుబాటులో ఉండే విధంగా కృషి చేస్తాము.

 

క్లీన్ ఎనర్జీడీకార్బనైజేషన్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్:     మన పారిస్ ఒప్పందం లక్ష్యాల సాధన తో పాటు, మన ప్రజలు, కార్మికుల జీవనోపాధికి తోడ్పడే ప్రయత్నాలకు అనుగుణంగా,  మా ఆర్థిక వ్యవస్థలను డీకార్బనైజ్ చేయడానికి, వాతావరణ ప్రభావాలకు స్థితిస్థాపకతను పెంపొందించడానికి,  క్లీన్ ఎనర్జీ టెక్నాలజీల అభివృద్ధి మరియు విస్తరణను వేగవంతం చేయాలని మేము ప్రణాళికలు రూపొందిస్తున్నాము.   ఇందులో భాగంగా - సాంకేతికతలపై లోతైన సహకారాన్ని, రాయితీ ఫైనాన్స్‌ తో సహా ఫైనాన్స్‌ను సమీకరించడం, స్థిరమైన మరియు మన్నికైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇవ్వడంతో పాటు, సాంకేతిక సహాయాన్ని అందించడం ద్వారా పోటీతత్వాన్ని, అనుసంధానతను మెరుగుపరచడానికి మార్గాలను అన్వేషించడం జరుగుతుంది. 

పన్ను మరియు అవినీతి నిరోధకం:     భారత-పసిఫిక్ ప్రాంతంలో పన్ను ఎగవేత, అవినీతిని అరికట్టడానికి ఇప్పటికే ఉన్న బహుపాక్షిక బాధ్యతలు, ప్రమాణాలు, ఒప్పందాలకు అనుగుణంగా సమర్థవంతమైన, పటిష్టమైన పన్ను విధానాన్ని అమలు చేయడంతో పాటు, మనీలాండరింగ్ వ్యతిరేక, లంచం వ్యతిరేక పాలనకు అవసరమైన నిబంధనలు రూపొందించి, అమలు చేయడం చేయడం ద్వారా న్యాయమైన పోటీని ప్రోత్సహించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ఇందులో భాగంగా - నైపుణ్యాన్ని పంచుకోవడం, జవాబుదారీ, పారదర్శక వ్యవస్థలను ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సామర్థ్య నిర్మాణానికి మద్దతు ఇచ్చే మార్గాలను అన్వేషించడం జరుగుతుంది. 

ప్రాంతీయ ఆర్థిక అనుసంధానత మరియు ఏకీకరణను అభివృద్ధి చేసే ఉద్దేశ్యంతో, మా భాగస్వామ్య ఆసక్తులను మరింతగా పెంచుకోవడానికి భాగస్వాముల మధ్య సంప్రదింపుల ఆధారంగా అదనపు సహకార రంగాలను గుర్తించడం కొనసాగిస్తున్నాము.  మా ఆర్థిక వ్యవస్థల మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడుల ప్రవాహాలను పెంచడానికి మరియు ప్రమాణాలను మెరుగుపరచడానికి అనుకూలమైన వాతావరణాలను సంయుక్తంగా సృష్టించడానికి మేము ఎదురుచూస్తున్నాము.  మా సంయుక్త మార్కెట్లలో మా కార్మికులు, కంపెనీలు, ప్రజలకు అవకాశాలు కల్పిస్తాము.

*****

 



(Release ID: 1828114) Visitor Counter : 416