రక్షణ మంత్రిత్వ శాఖ
రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహక కార్యక్రమంలో పాల్గొన్న రక్షణ శాఖ మంత్రి
సంతోషకర సమతుల్య జీవనానికి యోగ చేయాలి.. ప్రజలకు రక్షణ మంత్రి పిలుపు
Posted On:
19 MAY 2022 10:00AM by PIB Hyderabad
ఈ రోజు ఢిల్లీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 2022 నిర్వహణకు సన్నాహక కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్ భట్, రక్షణ వ్యవహారాల సలహాదారుడు (రక్షణ సేవలు) శ్రీ సంజీవ్ మిట్టల్, డైరెక్టర్ జనరల్ డిఫెన్స్ ఎస్టేట్స్ శ్రీ అజయ్ కుమార్ శర్మ, రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, ప్రజలతో కలిసి శ్రీ రాజనాధ్ సింగ్ వివిధ యోగాసనాలు వేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్ యోగాని భారతదేశ అతి గొప్ప వారసత్వ సంపదగా వర్ణించారు. ప్రజల జీవితాలకు కొత్త శక్తిని అందించే యోగా వారికి స్వయం నియంత్రణ అలవరచి, ప్రకృతితో మమేకం చేస్తుందని శ్రీ రాజనాధ్ సింగ్ అన్నారు.
"యోగా మనస్సును క్రమశిక్షణలో ఉంచి, ఆరోగ్యవంతం చేస్తుంది. విధులను సమర్థంగా నిర్వహించడంలో సహాయపడుతుంది. యోగా అనేది ఒక నిర్దిష్ట సమయంలో చేసే అభ్యాసం మాత్రమే కాదు, రోజువారీ పనులను సమర్థత మరియు చురుకుదనంతో నిర్వహించడానికి అవసరమైన శక్తి, ప్రేరణ అందిస్తుంది. ఆలోచన, జ్ఞానం, సమర్థత మరియు అంకిత భావాన్ని అందిస్తుంది" అని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
మధుమేహం, రక్తపోటు, రక్తపోటు మరియు డిప్రెషన్‌తో సహా వివిధ ఆరోగ్య రుగ్మతలను ఎదుర్కోవడానికి యోగా ఒక మార్గమని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. అంతర్గత సంఘర్షణ మరియు ఒత్తిడిని యోగ తొలగిస్తుందని అన్నారు. కోవిడ్ -19 మహమ్మారి తో పోరాడడానికి అవసరమైన రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు అవసరమైన యోగాసనాలు మరియు ప్రాణాయామం సహాయ పడ్డాయని ఆయన పేర్కొన్నారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని 2014 సెప్టెంబర్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా శ్రీ రాజ్‌నాథ్ సింగ్ గుర్తు చేశారు. పైసా ఖర్చు చేయకుండా యోగాతో ఆరోగ్యం పొందవచ్చునని ఆయన అన్నారు. యోగాని ఒక అభ్యాసంగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం గుర్తించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. యోగా ద్వారా ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం అందిస్తుందని అన్నారు.
ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్న సాయుధ దళాలు, ఇండియన్ కోస్ట్ గార్డ్, ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు, రక్షణ మంత్రిత్వ శాఖ విభాగాలను శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. సంతోషకర సమతుల్య జీవనానికి యోగ చేయాలని ప్రజలకు రక్షణ మంత్రి పిలుపు ఇచ్చారు.
***
(Release ID: 1826713)
Visitor Counter : 199