ప్రధాన మంత్రి కార్యాలయం

బెర్లిన్.. కోపెన్‌హాగన్.. పారిస్ పర్యటనకు బయల్దేరేముందు ప్రధానమంత్రి వీడ్కోలు ప్రకటన

Posted On: 01 MAY 2022 11:56AM by PIB Hyderabad

   ర్మనీ సమాఖ్య చాన్సలర్‌ గౌరవనీయ ఓలాఫ్‌ షోల్జ్‌ ఆహ్వానం మేరకు 2022 మే 2వ తేదీన నేను బెర్లిన్‌ వెళ్తున్నాను. అలాగే డెన్మార్క్‌ ప్రధానమంత్రి శ్రీమతి మెట్టీ ఫ్రెడరిక్‌సన్‌ ఆహ్వానం అందుకున్న నేపథ్యంలో 2022 మే 3-4 తేదీల్లో కోపెన్‌హాగెన్‌ వెళ్లి, ద్వైపాక్షిక చర్చలతోపాటు అక్కడ నిర్వహించే భారత-నార్డిక్‌ రెండో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటాను. అటుపైన భారత్‌కు తిరుగు ప్రయాణంలో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌లో కొద్దిసేపు ఆగి, ఆ దేశాధ్యక్షుడు మాననీయ ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌తో సమావేశమవుతాను.

   చాన్సలర్‌ షోల్జ్‌తో సమగ్ర ద్వైపాక్షిక చర్చలకు నా బెర్లిన్‌ పర్యటన దోహదం చేస్తుంది. నిరుడు జర్మనీ వైస్‌-చాన్సలర్‌, ఆర్థిక మంత్రిగా ఉన్నపుడు జి20 సదస్సులో ఆయనతో నేను సమావేశమయ్యాను. ప్రస్తుతం మేమిద్దరం భారత-జర్మనీ 6వ అంతర-ప్రభుత్వ సంప్రదింపుల (ఐజీసీ) కార్యక్రమానికి సహాధ్యక్షత వహిస్తాం. ఇది భారత్‌ కేవలం జర్మనీతో మాత్రమే కొనసాగించే ఒక ప్రత్యేక ద్వైవార్షిక ప్రక్రియ. ఇందులో భాగంగా భారత్‌ నుంచి పలువురు కేంద్రం మంత్రులు కూడా జర్మనీ వెళ్లి అక్కడ అదేహోదాలోగల మంత్రులతో సంప్రదింపులు నిర్వహిస్తారు.

   ప్రస్తుత ‘ఐజీసీ’ని ఆరు నెలల కిందట ఏర్పడిన జర్మనీ కొత్త ప్రభుత్వంతో తొలి సంప్రదింపుల కార్యక్రమంగా నేను పరిగణిస్తున్నాను. రెండుదేశాలకూగల మధ్య, దీర్ఘకాలిక ప్రాథమ్యాలను గుర్తించేందుకు ఇది తోడ్పడుతుంది. భారత-జర్మనీ దౌత్యసంబంధాల 70వ వార్షికోత్సవం 2021లో నిర్వహించుకోగా, 2000 నుంచి రెండు దేశాలూ వ్యూహాత్మక భాగస్వాములుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలకూ సంబంధమున్న వ్యూహాత్మక, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చాన్సలర్‌ షోల్జ్‌తో అభిప్రాయాలు పంచుకోనుండటం నాకెంతో సంతోషంగా ఉంది.

   భారత్‌-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్య మూలస్తంభాల్లో రెండు దేశాల మధ్యగల దీర్ఘకాలిక వాణిజ్య సంబంధాలు ఒకటి భాగంగా ఉన్నాయి. తదనుగుణంగా ఒక వాణిజ్య రౌండ్‌టేబుల్‌ సమావేశంలో చాన్సలర్‌ షోల్జ్‌, నేను సంయుక్తంగా ప్రసంగించబోతున్నాం. రెండు దేశాల్లో కోవిడ్‌ అనంతర ఆర్థిక పునరుద్ధరణ దిశగా పరిశ్రమలతోపాటు పారిశ్రామిక సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం లక్ష్యం. ఐరోపా ఖండంలో పది లక్షల మందికిపైగా భారత సంతతి ప్రజానీకం నివసిస్తున్నారు. ముఖ్యంగా జర్మనీలో ఈ ప్రవాసుల సంఖ్య గణనీయ నిష్పత్తిలో ఉంది. ఐరోపాతో మన సంబంధాల్లో ప్రవాస భారతీయులు ఓ కీలక సంధానశక్తి. అందుకే ఈ ఖండంలోని మన సోదర-సోదరీమణులను కలిసేందుకు నా ఈ పర్యటనను సద్వినియోగం చేసుకోబోతున్నాను.

   బెర్లిన్‌ నుంచి నేను నేరుగా కోపెన్‌హాగెన్‌ వెళ్లి, ప్రధానమంత్రి ఫ్రెడరిక్‌సన్‌తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటాను. డెన్మార్క్‌తో మనకుగల ప్రత్యేక ‘వ్యూహాత్మక హరిత భాగస్వామ్యం’ ప్రగతిసహా ద్వైపాక్షిక సంబంధాల్లోని ఇతర అంశాల సమీక్షకు ఇదొక అవకాశం. అటుపైన భారత-డెన్మార్క్‌ వాణిజ్య రౌండ్‌టేబుల్‌ సమావేశంలో పాల్గొనడమే కాకుండా డెన్మార్క్‌లోని భారతీయ సమాజంతో ముచ్చటిస్తాను. డెన్మార్క్‌తో ద్వైపాక్షిక చర్చలుసహా డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే ప్రధానమంత్రులతో కలిసి భారత-నార్డిక్ రెండో శిఖరాగ్ర సదస్సుకు హాజరవుతాను. ఈ సందర్భంగా 2018లో తొలి భారత-నార్డిక్ సదస్సు నిర్వహించిన నాటినుంచి సభ్యదేశాల మధ్య సహకారంపై మేం సమీక్షిస్తాం. అలాగే కోవిడ్‌ మహమ్మారి అనంతర ఆర్థిక పునరుద్ధరణ, వాతావరణ మార్పు, ఆవిష్కరణ-సాంకేతికత, పునరుత్పాదక ఇంధనం, ప్రపంచ భద్రత పరిణామాల నేపథ్యం, ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్‌-నార్డిక్ సహకారం వగైరా అంశాలపైనా దృష్టి సారిస్తాం.

   శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నేను… ఇతర నాలుగు నార్డిక్‌ దేశాల అధినేతలతో సమావేశం కావడమేగాక ఆ దేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని వారితో కలసి  సమీక్షిస్తాను. సుస్థిరత, పునరుత్పాదక ఇంధనం, డిజటలీకరణ, ఆవిష్కరణలరీత్యా భారతదేశానికి నార్డిక్‌ దేశాలు ముఖ్యమైన భాగస్వాములు. కాబట్టి నార్డిక్‌ ప్రాంతంతో బహముఖ సహకార విస్తరణకు నా పర్యటన దోహదం చేస్తుంది. నా తిరుగు ప్రయాణంలో భాగంగా నా మిత్రుడైన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్‌ మేక్రాన్‌ను కలుసుకునేందుకు  కొద్దిసేపు నేను పారిస్‌లో ఆగుతాను. ఆయన ఇటీవలే దేశాధ్యక్ష పదవికి మళ్లీ ఎన్నికయ్యారు. ఈ ఫలితాలు వెలువడిన పది రోజుల వ్యవధిలో నేను పర్యటించడం నేరుగా ఆయనను కలిసి అభినందనలు తెలపడానికి పరిమితం కాబోదు. రెండు దేశాల మధ్య స్నేహబంధం మరింత గట్టిపడేందుకు తోడ్పడుతుంది. అలాగే భారత్‌-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్యం తదుపరి దశకు మార్గనిర్దేశం చేసే అవకాశం లభిస్తుంది.

   నేక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై అధ్యక్షుడు మేక్రాన్, నేను అభిప్రాయాలు పంచుకోవడమే కాకుండా ప్రస్తుత ద్వైపాక్షిక సహకారం ప్రగతిని కూడా సమీక్షిస్తాం. ప్రపంచ క్రమంపై రెండు దేశాలదీ ఒకటే దృక్పథం కావడంతోపాటు విలువలను పంచుకుంటున్న నేపథ్యంలో పరస్పరం సన్నిహిత సహకారంతో ముందుకెళ్లాలన్నది నా నిశ్చితాభిప్రాయం. ఐరోపా ప్రాంతం అనేక సవాళ్లు-సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నేను పర్యటనకు వెళ్తున్నాను. శాంతి, సౌభాగ్యాల దిశగా భారత్‌ మార్గాన్వేషణలో కీలక సహచరులైన ఐరోపా భాగస్వాములతో నా చర్చల ద్వారా సహకార స్ఫూర్తిని మరింత బలోపేతం చేయడం ఒక  బాధ్యతగా భావిస్తున్నాను.



(Release ID: 1821899) Visitor Counter : 203