ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గుజరాత్ లోని దియోదర్ లో బనస్ డెయిరీలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం

Posted On: 19 APR 2022 5:37PM by PIB Hyderabad

 

 

నమస్తే!

 

మీరంతా బాగున్నారని భావిస్తాను. నేను  హిందీలో ప్రసంగించాల్సివచ్చినందుకు మొదట మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాను. కాని మీడియా మిత్రులు హిందీలో నేను మాట్లాడితే బాగుంటుందని అభ్యర్థించారు గనుక వారి అభ్యర్థనను మన్నించాలని నేను నిర్ణయించాను.

 

ఎప్పుడూ సౌమ్యంగా మాట్లాడే స్వభావం గల, ప్రముఖుడైన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర బాయ్ పటేల్;  పార్లమెంటులో నా సీనియర్ సహచరుడు, గుజరాత్ ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు శ్రీ సి.ఆర్.పాటిల్, గుజరాత్ ప్రభుత్వ మంత్రి శ్రీ జగదీష్ పాంచాల్, ఈ భూమి పుత్రులు శ్రీ కృతిసింగ్ వఘేలా, శ్రీ గజేంద్ర సింగ్ పర్మార్, పార్లమెంటు సభ్యులు శ్రీ ప్రబాత్ భాయ్, శ్రీ భరత్ సింగ్ దభీ;  శ్రీ దినేష్ భాయ్ అనవాడియా, బనస్ డెయిరీ చైర్మన్, ఉత్సాహం ఉరకలు వేసే సహచరుడు శ్రీ శంకర్ చౌదరి, ఇతర ప్రముఖులు, సోదర సోదరీమణులారా!

 

మా నరేశ్వరి, మా అంబాజీల ఈ పవిత్ర భూమి ముందు నేను మోకరిల్లుతున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.  నా జీవితంలో బహుశ తొలిసారి కావచ్చు, నేడు సుమారు రెండు లక్షల మంది తల్లులు, సోదరీమణులు నన్ను ఆశీర్వదిస్తున్నారు. మీరు ఆశీస్సులు అందిస్తున్నప్పుడు నా మనోభావాలు నేను అదుపు చేసుకోలేకపోవచ్చు. ఈ పవిత్ర భూమి తల్లులైన మా జగదంబ ఆశీస్సులు అమూల్యమైనవి. అమూల్య శక్తి అందించే సాధనాలు. బనస్ కు చెందిన మాతలు, సోదరీమణులందరికీ గౌరవపూర్వకంగా శిరసు వంచి అభివాదం చేస్తున్నాను.

 

సోదరసోదరీమణులారా,

గత ఒకటి రెండు గంటలుగా నేను విభిన్న ప్రాంతాలు సందర్శించాను. డెయిరీ రంగానికి చెందిన ప్రభుత్వ పథకాలతో లాభం పొందిన సోదరీమణులతో సవివరంగా సంభాషించాను. బంగాళాదుంప ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మించిన సముదాయాన్ని సందర్శించే అవకాశం కూడా కలిగింది. నేను చూసినవి, మొత్తం తిరిగినంత సమయంలో జరిపిన సంభాషణల సందర్భంగా తెలుసుకున్న సమాచారంతో నేనెంతో ఆకర్షితుడనయ్యాను. బనస్ డెయిరీకి చెందిన సహచరులందరికీ, మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అందచేస్తున్నాను.

 

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ శక్తి ఏమిటి;  తల్లులు, సోదరీమణుల సాధికారత ఎంత శక్తివంతం అవుతుంది, ఆత్మనిర్భర్ భారత్ ప్రచారానికి సహకార వ్యవస్థ ఎంత శక్తిని అందించగలదు అనేవి ఇక్కడ ప్రతీ ఒక్కరి అనుభవంలోకి వస్తాయి. కొద్ది నెలల క్రితం నా పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో బనస్ డెయిరీ సంకుల్ కు శంకుస్థాపన చేసే అవకాశం నాకు కలిగింది.

 

ఈ గుజరాత్ భూమి నుంచి నా పార్లమెంటరీ నియోజకవర్గం కాశీలోని రైతులు, పశువుల పెంపకందారులకు సేవలందించాలని తీర్మానించినందుకు బనస్ డెయిరీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. కాశీ ఎంపిగా మీ అందరికీ నేనెంతో రుణపడి ఉన్నాను. నా హృదయం లోతుల నుంచి బనస్ డెయిరీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇక్కడ బనస్ డెయిరీ సంకుల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వామిని కావడం వల్ల ఆ ఆనందం ఎన్నో రెట్లు పెరిగింది.

 

సోదరసోదరీమణులారా,

సాంప్రదాయిక బలంతో భవిష్యత్ నిర్మించవచ్చుననేందుకు ఈ రోజు ఇక్కడ జరుగుతున్న వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు ఉత్తమ ఉదాహరణ. బనస్ డెయిరీ కాంప్లెక్స్, చీజ్, వే పౌడర్ ప్లాంట్లు డెయిరీ రంగం విస్తరణలో అత్యంత ప్రధానమైనవి. అలాగే స్థానిక రైతుల ఆదాయాలు పెరగడానికి ఇతర వనరులు కూడా ఉపయోగించవచ్చునని బనస్ డెయిరీ నిరూపించింది.

 

బంగాళాదుంపలు,  పాలకు ఒక దానితో ఒకదానికి సంబంధం ఏమిటి, నాకు చెప్పండి. కాని ఆ రెండింటినీ కలపడం సాధ్యమేనని బనస్ డెయిరీ కనుగొంది.పాలు, వెన్న, పెరుగు, చీజ్, ఐస్ క్రీమ్  తో పాటుగా ఆలూ-టిక్కీ, ఆలూ వెజ్, ఫ్రెంచ్ ఫ్రైలు, హాష్ బ్రౌన్, బర్గర్ పాటీలు వంటి ఇతర ఉత్పత్తుల ద్వారా కూడా బనస్ డెయిరీ రైతులను సాధికారం చేసింది. ప్రపంచానికి భారత్ లో ఉత్పత్తుల తయారీ దిశగా ఇది మంచి అడుగు.

 

మిత్రులారా,

అతి తక్కువ వర్షపాతం ఉండే బనస్కాంత జిల్లాలో కంక్రేజ్ ఆవులు, మెహసాని గేదెలు, బంగాళాదుంపలు రైతుల అదృష్టాన్ని ఎలా మార్చాయో మనం కనులారా వీక్షించవచ్చు. బనస్ డెయిరీ అత్యుత్తమమైన బంగాళాదుంప విత్తనాలు రైతులకు అందించి బంగాళాదుంపలకు మంచి ధర కూడా అందించగలుగుతుంది. బంగాళాదుంప రైతులు కోట్లాది రూపాయలు సంపాదించడానికి కొత్త మార్గాలు తెరుస్తుంది. ఇది బంగాళాదుంపలకే పరిమితం కాదు. నేను తీయని విప్లవం గురించి నిరంతరం మాట్లాడుతూ ఉంటాను. తేనె ఉత్పత్తి ద్వారా అదనపు ఆదాయాలు పొందాలని రైతులకు పిలుపు ఇస్తూ ఉంటాను. బనస్ డెయిరీ దీన్ని చిత్తశుద్దితో ఆచరించింది. అలాగే బనస్కాంతకు  ఎంతో బలం అయిన  వేరుశనగ, ఆముదం విషయంలో కూడా బనస్ డెయిరీకి పెద్ద ప్రణాళికలున్నాయని తెలిసి ఎంతో ఆనందంగా ఉంది. వంటనూనెల ఉత్పత్తిలో స్వయం-సమృద్ధి సాధించాలన్న ప్రభుత్వ ప్రచారానికి ఉత్తేజం ఇచ్చే విధంగా మీ సంస్థ ఆయిల్ ప్లాంట్లు కూడా నెలకొల్పుతోంది. నూనెగింజల రైతులకు ఇది పెద్ద ప్రోత్సాహకం.

 

సోదరసోదరీమణులారా,

నేడు ఇక్కడ బయో-సిఎన్ జి ప్లాంట్ ను  ప్రారంభించడంతో పాటు నాలుగు గోబర్ గ్యాస్ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరుగుతోంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బనస్ డెయిరీ ఇలాంటి ప్లాంట్లు ఎన్నో నెలకొల్పుతోంది. “వృధా నుంచి సంపద” సృష్టికి ప్రభుత్వం చేస్తున్న ప్రచారానికి ఇది ఎంతో సహాయకారి అవుతుంది.

 

గోబర్ ధన్ ద్వారా ఇలాంటి ఎన్నో లక్ష్యాలు సాధించవచ్చు. ఇది గ్రామాల్లో స్వచ్ఛతను పెంచడంతో పాటు గోవుల పేడ ద్వారా బయో-సిఎన్ జి, విద్యుత్ ఉత్పత్తి చేసి పశువుల పెంపకందారులకు అదనపు ఆదాయ వనరులు కల్పిస్తుంది. అలాగే ఈ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే ఆర్గానిక్ ఎరువు రైతులకు ఎంతో సహాయకారి కావడమే కాకుండా భూమాత పరిరక్షణకు ఒక అడుగు అవుతుంది. బనస్ డెయిరీకి చెందిన ఇలాంటి చొరవలన్నీ యావత్ దేశానికి విస్తరించినప్పుడు మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉత్తేజితం అవుతుంది. గ్రామాలు శక్తివంతం అయిన మన సోదరీమణులు, కుమార్తెలు సాధికారం అవుతారు.

 

మిత్రులారా,

గుజరాత్ అందుకున్న విజయశిఖరం, అభివృద్ధి ప్రతీ ఒక్క గుజరాతీకి గర్వకారణం అవుతాయి. గాంధీనగర్ లో విద్యాసమీక్ష కేంద్రం సందర్శించినపుడు నేను కూడా అదే అనుభవం పొందాను. విద్యాసమీక్ష కేంద్రం గుజరాతీ బాలలు, భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడంలో ఒక శక్తిగా మారుతుంది.మన ప్రాథమిక పాఠశాలలో ఉపయోగిస్తున్న టెక్నాలజీ చూపి ప్రపంచం యావత్తు సంభమానికి లోనవుతుంది.

 

నేను కూడా తొలి దశలో ఈ రంగంతో అనుబంధం ఉన్న వాడినే అయినప్పటికీ గుజరాత్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు  గాంధీనగర్ లో ఆ కేంద్రాన్ని సందర్శించాను. విద్యాసమీక్ష కేంద్ర విస్తరణ, అక్కడ ఉపయోగిస్తున్న టెక్నాలజీ నాకెంతో ఆనందం కలిగించాయి. ప్రముఖుడైన మన ముఖ్య‌మంత్రి శ్రీ భూపేంద్రభాయ్ నాయకత్వంలో ఈ విద్యాసమీక్ష కేంద్రం యావత్ దేశానికి ఒక దిశను కల్పిస్తోంది.

 

వాస్తవానికి నేను ఆ కేంద్రంలో ఒక గంట మాత్రమే ఉండాలి, కాని అక్కడ జరుగుతున్న విద్యా కార్యక్రమాల గురించి తెలుసుకుని  రెండున్నర గంటలు  అక్కడే గడిపాను. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో అధిక సమయం సంభాషించాను. ఆ పిల్లల్లో ఎక్కువ మంది దక్షిణ గుజరాత్, ఉత్తర గుజరాత్, కచ్-సౌరాష్ట్ర ప్రాంతాలకు చెందిన వారే.

 

నేడు విద్యాసమీక్ష కేంద్రం ఒక చైతన్య కేంద్రంగా మారింది. గుజరాత్ లోని 54,000 పాఠశాలలకు చెందిన 4.5 లక్షల మంది ఉపాధ్యాయులు, 1.5 కోట్ల మంది విద్యార్థులకు సజీవ శక్తిని సమకూరుస్తోంది. కృత్రిమ మేథ, మెషీన్ లెర్నింగ్, బిగ్ డేటా అనాలిసిస్ వంటి ఎన్నో ఆధునిక సదుపాయాలు అందులో ఉన్నాయి.

 

ప్రతీ ఏడాది ఈ విద్యా సమీక్ష కేంద్ర 500 కోట్ల డేటా సెట్లను విశ్లేషిస్తుంది. అసెస్ మెంట్ టెస్ట్, సీజన్ చివరిలో జరిగే పరీక్షలు. పాఠశాల గుర్తింపు, పిల్లలు, ఉపాధ్యాయుల హాజరు వంటి అన్ని అంశాల విశ్లేషణ ఇక్కడ జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు ఒకే రకమైన టైమ్ టేబుల్ అందించడం, ప్రశ్న పత్రాల తయారీ, ఆన్సర్ షీట్ల మదింపు అన్నింటిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కేంద్రం కారణంగానే పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 26 శాతం పెరిగింది.

 

ఈ ఆధునిక కేంద్రం యావద్దేశంలోను విద్యారంగంలో సమూలమైన మార్పులు తీసుకురాగలుగుతుంది. విద్యాసమీక్ష కేంద్రం గురించి అధ్యయనం చేయాలని కేంద్రప్రభుత్వంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలను, మంత్రులను నేను కోరుతున్నాను. అలాగే వివిధ రాష్ర్టాలకు చెందిన సంబంధిత మంత్రిత్వ శాఖల అధికారులు ఇక్కడ అమలులో ఉన్న విధానాల గురించి అధ్యయనం చేసేందుకు గాంధీనగర్ సందర్శించాలి. విద్యా సమీక్ష కేంద్ర వంటి ఆధునిక వ్యవస్థ వల్ల దేశంలో అధిక శాతం మంది బాలలు  ప్రయోజనం పొందుతారు. భారతదేశం భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది.

 

ఇప్పుడు బనస్ డెయిరీపై దృష్టి కేంద్రీకరిస్తాను. నేను బనస్ భూమిలో అడుగు పెట్టినప్పుడు బనస్ డెయిరీకి శ్రీకారం చుట్టిన గల్బ కాకాకు శిరసు వంచి అభివాదం చేశాను. 60 సంవత్సరాల క్రితం ఒక రైతు కుమారుడైన గల్బ కాకా కల నేను ఒక పెద్ద మర్రి వృక్షంగా మారింది. బనస్కాంతకు చెందిన ప్రతీ ఒక్క ఇంటికి ఆయన ఒక కొత్త ఆర్థిక శక్తిని అందించారు. అందుకే గల్బ కాకాకు నా గౌరవ ప్రణామాలు అందిస్తున్నాను. అలాగే పశువులను సొంత పిల్లల వలె సాకుతున్న బనస్కాంత ప్రాంతానికి చెందిన తల్లులు, సోదరీమణులకు కూడా అభివాదం చేస్తున్నాను. పశువులకు పశుగ్రాసం, నీరు అందకపోతే నా బనస్కాంత తల్లులు, సోదరీమణులు నీరు తాగడానికి కూడా ఇష్టపడరు. ఏదైనా వివాహం లేదా కుటుంబంలో ఇతర వేడుకకు హాజరు కావలసివస్తే వారు పశువులను ఒంటరిగా వదిలిపెట్టరు. ఆ తపన ఫలితమే నేడు బనస్ కు చెందిన తల్లులు, సోదరీమణులు ప్రకాశించడానికి దోహదపడుతోంది. అందుకే ఆ తల్లులు, సోదరీమణులకు గౌరవసూచకంగా వందం చేస్తున్నాను.

 

కరోనా సమయంలో కూడా బనస్ డెయిరీ ప్రశంసనీయమైన కృషి చేసింది. అది గల్బ కాకా పేరు మీద వైద్యకళాశాల నిర్మించడమే కాదు, ఇప్పుడు బంగాళాదుంపలు, పాలు, పశువుల పేడ, తేనె, ఇంధన ఉత్పత్తి వంటి కార్యకలాపాలెన్నో నిర్వహిస్తోంది. పిల్లల విద్యారంగంలో కూడా ఆ సంస్థ భాగస్వామిగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే బనస్ డెయిరీలోని సహకారోద్యమం బనస్కాంత భవిష్యత్తులో ఉజ్వల కేంద్రంగా మారడానికి దోహదపడుతుంది. దేనికైనా ఒక విజన్ ఉండాలి, అది బనస్ డెయిరీలో మనందరికీ కనిపిస్తుంది. గత ఏడెనిమిది సంవత్సరాలుగా బనస్ డెయిరీ ఎంతగానో విస్తరించింది. బనస్ డెయిరీ మీద గల విశ్వాసంతోనే నేను ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా స్వయంగా హాజరవుతూ ఉండే వాడిని. ఇప్పుడు మీరు నన్ను ఢిల్లీకి పంపారు, అయినా నేను మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీ ఆనందం, విచారం ఎందులోనైనా మీతో ఎల్లప్పుడూ నేనుంటాను.

 

నేను బనస్ డెయిరీ దేవతామూర్తుల ప్రదేశాలు సోమనాథ్ నుంచి జగన్నాథ్  వరకు విస్తరించి ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్తాన్,  ఆంధ్రప్రదేవ్, జార్ఖండ్ రాష్ర్టాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆయా ప్రాంతాలకు చెందిన పశువుల పెంపకందారులకు అధిక ప్రయోజనాలు అందిస్తోంది. ప్రపంచంలో అధికంగా పాలు ఉత్పత్తి చేసే దేశం కావడం వల్ల కోట్లాది మంది జీవితాలు పాల మీదనే ఆధారపడి ఉన్నాయి. కాని ఈ పరిశ్రమ గణాంకాలపై దేశంలోని అత్యున్నత స్థాయి ఆర్థికవేత్తలు కూడా దృష్టి కేంద్రీకరించరు. మన దేశంలో ఏడాదికి 8.5 లక్షల కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అవుతాయి. గ్రామాల్లోని వికేంద్రీకృత వ్యవస్థ ఇందుకు నిదర్శనం. పాల ఉత్పత్తితో పోల్చితే గోధుమ, బియ్యం ఉత్పత్తి కూడా 8.5 లక్షల కోట్ల టన్నులుండదు. వాస్తవానికి పాల ఉత్పత్తి అంతకన్నా ఎక్కువే ఉంటుంది. రెండు, మూడు, ఐదు బీఘాల భూమి ఉన్న చిన్న రైతులు కూడా డెయిరీ రంగం నుంచి గరిష్ఠ లాభం పొందుతారు. వానలు లేకపోయినా లేదా నీటి ఎద్దడి ఉన్నా మన రైతు  సోదరుల జీవితం దుర్భరంగా మారుతుంది. అలాంటి పరిస్థితిలో రైతులు పశువుల పెంపకం ద్వారానే కుటుంబాలను పోషించుకుంటారు. ఈ డెయిరీ చిన్న వ్యవసాయదారులపై అధిక శ్రద్ధ తీసుకుంటుంది. చిన్న రైతుల ఆందోళనల మధ్యనే పెరిగిన నేను ఢిల్లీ వెళ్లాను. అందుకే నేను దేశం  మొత్తంలోని చిన్న రైతుల సంక్షేమ బాధ్యత తీసుకున్నాను. నేడు ప్రతీ ఏడాది మూడు సార్లు రైతుల ఖాతాల్లో రూ.2,000 డిపాజిట్ చేయిస్తున్నాను.

 

ఢిల్లీ నుంచి వచ్చే ప్రతీ ఒక్క రూపాయిలోనూ 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతుందని ఒక మాజీ ముఖ్యమంత్రి గతంలో చెప్పారు. కాని ప్రధానమంత్రి హోదాలో నేను చెబుతున్నాను, ఇప్పుడు ఢిల్లీ ఖర్చు చేసే ప్రతీ ఒక్క రూపాయిలోనూ 100 పైసలూ లబ్దిదారులకే చేరుతుంది, రైతుల ఖాతాల్లోకే డబ్బు జమ  అవుతోంది. ఈ పనులన్నీ ఒకే విడతలో చేయగలుగుతున్నందుకు భారత ప్రభుత్వానికి, గుజరాత్ ప్రభుత్వానికి, గుజరాత్ లోని సహకారోద్యమానికి నేను హృదయం లోతుల నుంచి అభినందనలు తెలియచేస్తున్నాను. వారందరూ ప్రశంసనీయులే.

 

ఇప్పుడే భూపేంద్రభాయి ఎంతో భావావేశంతో ఆర్గానిక్ వ్యవసాయం గురించి ప్రస్తావించారు. అయితే బనస్కాంత ప్రజలకు ఏదైనా అవగాహన ఏర్పడితే దాన్ని ముందుకి నడిపించే వరకు వెనుకడుగు వేయరనేది నా వ్యక్తిగత అనుభవం. ప్రారంభంలో దానికి కఠిన శ్రమ అవసరం అవుతుంది. విద్యుత్తును వదిలివేయండి అని ప్రజలకు పదేపదే చెప్పి నేను అలసిపోయాను. బనస్ ప్రాంత ప్రజలు కూడా శ్రీమోదీకి ఏమీ తెలియదు అని భావించి నన్ను వ్యతిరేకించే వారు. కాని బనస్ రైతులకు దాని ప్రయోజనం గురించి అర్ధమైనప్పుడు వారు నా కన్నా 10 అడుగులు ముందుకేశారు. నీటి సంరక్షణ, డ్రిప్ ఇరిగేషన్ గురించి భారీ ప్రచారోద్యమం చేపట్టారు. ఈ రోజు బనస్కాంత ప్రజలు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారు.

 

బనస్ కు నీరు అందిస్తున్న నర్మద మాతను భగవంతుని బహుమతిగా ఈ ప్రాంత ప్రజలు ఆరాధిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అమృత్ మహోత్సవ్ మనం నిర్వహించుకుంటున్నాం. ఈ సమయంలో బనస్ ప్రాంతంలో 75 పెద్ద చెరువులు నిర్మించాలని నేను ప్రజలకు సూచిస్తున్నాను. అలా చయేసినట్టయితే ఒకటి, రెండు భారీ వర్షాలు కురిసినా ఈ బంజరు భూమిలో తగినంత నీరు అందుబాటులో ఉంటుంది. మీరు చెరువుల నిర్మాణం ప్రారంభించినట్టయితే ఈ భూమి ఎంతో సారవంతంగా మారుతుంది. దీనిపై వచ్చే రెండుమూలు నెలల కాలంలో వానలు ప్రారంభం కావడానికి ముందే ప్రజలు భారీ ప్రచారోద్యమం ప్రారంభించినట్టయితే స్వాతంత్ర్య అమృత మహోత్సవం నాటికి అంటే 2023 ఆగస్టు 15 నాటికి 75 చెరువులూ నీటితో పొంగి పొరలుతాయి. ఫలితంగా మనం చిన్న సమస్యను అధిగమించగలుగుతాం. ఈ పొలాల్లో పని చేసే వ్యక్తి వలెనే నేను కూడా మీ  సహచరునిగా నిలుస్తాను. మీతో కలిసి పని చేసి మీ వెంట నిలుస్తాను.

 

ఈ రోజు నాడాబెట్ ఒక పర్యాటక కేంద్రంగా మారింది. భారతదేశ సరిహద్దు జిల్లాలను ఎలా అభివృద్ది చేయవచ్చునో గుజరాత్  ప్రజలు ఒక ఉదాహరణ చూపారు. కచ్ సరిహద్దులో జరిగే రాన్ ఫెస్టివల్ ఈ ప్రాంతంలోని గ్రామాలన్నింటినీ ఆర్థికంగా చలనశీలంగా చేసింది. నాడాబెట్ ను సరిహద్దు వీక్షణ కేంద్రంగా తీర్చి దిద్దినట్టయితే బనస్, పటాన్ జిల్లాలు టూరిజంతో కళకళలాడతాయి. మారుమూల ప్రాంతాల ప్రజలకు కూడా ఎన్నో జీవనోపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అభివృద్ధికి ఎన్ని మార్గాలున్నాయో తెలియడానికి మంచి ఉదాహరణగా మారుతుంది. క్లిష్ట సమయాల్లో కూడా ప్రకృతి ఒడిలో కూచుని ఎన్నో మార్పులు తేవచ్చునని నిరూపిస్తుంది. గుజరాత్, యావత్ దేశ ప్రజలకు నేను అమూల్యమైన వజ్రాన్ని అందిస్తున్నాను.. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు బనస్ డెయిరీకి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.

 

మీరందరూ చేతులు పైకెత్తి నినదించండి, “భారత్ మాతాకీ జై” అని నాతో బిగ్గరగా పలకండి.

భారత్ మాతాకీ జై,

భారత్ మాతాకీ జై.

ధన్యవాదాలు

 


(Release ID: 1818923) Visitor Counter : 165