ప్రధాన మంత్రి కార్యాలయం
గాంధీనగర్ లోని పాఠశాలల విద్యా సమీక్ష కేంద్రాన్ని సందర్శించిన - ప్రధానమంత్రి
కేంద్రానికి చెందిన వివిధ విభాగాలను తనిఖీ చేసి, భాగస్వాములతో సంభాషించారు
విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆకస్మిక ఇష్టాగోష్టి నిర్వహించారు
దీక్షా పోర్టల్ తో ఎక్కువ మంది విద్యార్థులను అనుసంధానం చేయాలని కోరారు
ఈ వ్యవస్థ లో పోషకాహార పర్యవేక్షణను జోడించడానికి ప్రయత్నించాలని సూచించారు
వ్యక్తిగత అనుబంధం ప్రాముఖ్యతను వివరిస్తూ, వాస్తవ మరియు వర్చువల్ మధ్య సమతుల్యత అవసరాన్ని నొక్కి చెప్పారు
నూతన వ్యవస్థ ఆధారంగా ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు
Posted On:
18 APR 2022 8:19PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు గాంధీ నగర్ లోని పాఠశాలల విద్యా సమీక్షా, నియంత్రణ కేంద్రాన్ని సందర్శించారు. పర్యవేక్షణ కార్యకలాపాలను ప్రధానమంత్రి కి వివరించారు. వీడియో ప్రదర్శన ఏర్పాట్లతో పాటు, కేంద్రానికి చెందిన వివిధ విభాగాల పనితీరును ప్రధానమంత్రి కి ప్రత్యక్షంగా తెలియజేశారు. దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా కూడా కేంద్రం కార్యకలాపాలను ప్రధానమంత్రి కి వివరించారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్రానికి చెందిన భాగస్వాములతో ప్రధానమంత్రి సంభాషించారు. అంబాజీ కి చెందిన ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి రాజశ్రీ పటేల్ తో ప్రధానమంత్రి ముందుగా మాట్లాడారు. నూతన సాంకేతికతల పట్ల ఉపాధ్యాయుల ఆసక్తి గురించి ప్రధానమంత్రి అడిగి తెలుసుకున్నారు. దీక్షా పోర్టల్ వినియోగం గురించి కూడా ప్రధానమంత్రి విద్యార్థులను అడిగారు. ఈ విధానాల వల్ల సమ్మతి భారం పెరిగిందా లేదా పరిస్థితి సులభతరమయ్యిందా అనే విషయాన్ని ప్రధానమంత్రి ఆరా తీశారు. ఈ విధానంలో మోసం చేయడం కూడా కష్టంగా మారి నట్లుంది కదా! అని ఆయన చమత్కరించారు. 7వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి తో ప్రధానమంత్రి మాట్లాడుతూ, బాగా ఆడాలని, తినాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి విద్యార్థుల బృందంతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అదే జిల్లాకు చెందిన సి.ఆర్.సి. సమన్వయకర్త ప్రధానమంత్రి తో మాట్లాడుతూ నూతన సాంకేతికతతో వచ్చిన మార్పును వివరించారు. సమన్వయకర్త చేపట్టే పర్యవేక్షణ, ధృవీకరణ ప్రక్రియ గురించి, ఆయన ప్రధానమంత్రి కి తెలియజేశారు. పోషణ పర్యవేక్షణ కోసం ఈ వ్యవస్థను ఉపయోగించడం ఉపాధ్యాయులకు ఆచరణీయంగా ఉందా? సమతుల ఆహారం గురించి విద్యార్థులు, ఇతర భాగస్వాములకు అవగాహన కల్పించడానికి ఇంకా ఏమి చేయవచ్చు? అని ప్రశ్నిస్తూ, కొత్త వ్యవస్థ యొక్క అవకాశాలను ప్రధానమంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు.
చాలా సంవత్సరాల క్రితం కెనడా పర్యటనలో తన వ్యక్తిగత అనుభవాన్ని శ్రీ మోదీ ఈ సందర్భంగా పేర్కొంటూ, అక్కడ ఒక సైన్స్ మ్యూజియాన్ని సందర్శించినప్పుడు, అక్కడ ఉన్న కియోస్క్ లో తన ఆహారం కోసం వివరాలను పూరించానని చెప్పారు. తాను పూరించిన శాఖాహార వివరాలు ఆ యంత్రాన్ని "నువ్వు పక్షివా?" అని అడిగేలా చేశాయని ఆయన చెప్పారు.
ప్రధానమంత్రి తమ సంభాషణ కొనసాగిస్తూ, అందుబాటులో ఉన్న సాంకేతికత ఇప్పటివరకు తెలియని కొత్త మార్గాలను తెరవగలదన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. అయితే, వర్చువల్ (సాంకేతిక పరమైన) ప్రపంచం కోసం వాస్తవ ప్రపంచాన్ని విస్మరించరాదని ప్రధానమంత్రి హెచ్చరించారు.
ప్రాథమిక ఉపాధ్యాయుల ప్రయోజనాల గురించి ప్రధానమంత్రి అడిగిన ప్రశ్నకు కచ్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఎస్.ఎం.సి. కమిటీ నుంచి వచ్చిన రాథోడ్ కల్పన సమాధానం చెబుతూ, కొత్త వ్యవస్థ సమ్మతిని మెరుగుపరుస్తోందని తెలియజేశారు. పూజ అనే 8వ తరగతి విద్యార్థిని తో ప్రధానమంత్రి మాట్లాడుతూ, మెహసానా లోని ఉపాధ్యాయులు స్థానిక కచ్ మాండలికంలో బోధించలేకపోయిన ఒక పాత విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి మెరుగైందని, వారు ప్రధానమంత్రి కి తెలియజేశారు. బలహీనంగా ఉండే విద్యార్థులకు అందిస్తున్న ఆదరణ గురించి ప్రధానమంత్రి ప్రశ్నించారు. కరోనా సమయంలో జి-శాల, దీక్షా వంటి యాప్ లను ఉపాధ్యాయులు ఎలా ఉపయోగించారనే విషయాన్నీ, అదేవిధంగా సంచార వర్గాలకు విద్యను ఎలా అందించారనే విషయాన్నీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రధానమంత్రి కి వివరించారు. నూతన వ్యవస్థ కోసం అవసరమైన పరికరాలు చాలా మంది విద్యార్థుల వద్ద ఉన్నాయని కూడా వారు ప్రధానమంత్రి కి చెప్పారు. శారీరక కార్యకలాపాలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పట్ల ప్రధానమంత్రి తన ఆందోళనను వ్యక్తం చేశారు. క్రీడలు పాఠ్యాంశేతర వ్యాపకంగా భావించకూడనీ, ఇకపై అవి పాఠ్యాంశాల్లో భాగమేనని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.
తాపీ జిల్లాకు చెందిన దర్శన బెన్ తన అనుభవాన్ని వివరిస్తూ, కొత్త వ్యవస్థ వల్ల వివిధ అంశాలు ఎలా మెరుగుపడ్డాయో వివరించారు. పని భారం తగ్గిందని కూడా ఆమె చెప్పారు. దీక్షా పోర్టల్ లో చాలా మంది విద్యార్థులు తమ పేరు నమోదు చేసుకున్నారని కూడా ఆమె తెలియజేశారు. 10వ తరగతి చదువుతున్న తన్వీ, తనకు డాక్టర్ కావాలని ఉందని చెప్పింది. గతంలో మారుమూల ప్రాంతాల్లో సైన్స్ సబ్జెక్టులు అందుబాటులో ఉండేవి కావనీ, అయితే, ఇప్పుడు విస్తృత ప్రచారం తర్వాత పరిస్థితులు మారాయనీ, ఇప్పుడు ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రధానమంత్రి, ఆమెకు చెప్పారు.
కొత్త పద్ధతులను అనుసరించడంలో గుజరాత్ ఎప్పుడూ ముందుంటుందనీ, ఆ తర్వాత మొత్తం దేశం వాటిని అవలంబిస్తుందనీ, ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు చూపుతున్న ఆసక్తి గురించి ఆయనకు వివరించారు. అయితే, ఎక్కువగా విడిపోకూడదని ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మానవీయత సజీవంగా ఉండేలా ప్రాజెక్టు సమన్వయకర్తలు కృషి చేయాలన్నారు. 'రీడ్ ఎలాంగ్' ఫీచర్ మరియు వాట్సాప్ ఆధారిత నివారణ చర్యల గురించి ఆయనకు వివరించారు. నూతన వ్యవస్థ ఆధారంగా ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని కొనసాగించాలని కూడా ప్రధానమంత్రి కోరారు.
ఈ కేంద్రం సంవత్సరానికి 500 కోట్ల డేటా సెట్ లను సేకరిస్తుంది. విద్యార్థుల మొత్తం అభ్యాస ఫలితాలను మెరుగుపరచడానికి వీలుగా, బిగ్ డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ లను ఉపయోగించి వాటిని అర్థవంతంగా విశ్లేషిస్తుంది. ఉపాధ్యాయులు, విద్యార్థుల రోజు వారీ ఆన్-లైన్ హాజరును పరిశీలించడం, విద్యార్థుల అభ్యాస ఫలితాల కేంద్రీకృత సంకలిత, ఆవర్తన మూల్యాంకనాలను చేపట్టడంలో ఈ కేంద్రం సహాయపడుతుంది. విద్యా సమీక్ష కేంద్రాన్ని అంతర్జాతీయ అత్యుత్తమ అభ్యాసంగా ప్రపంచబ్యాంక్ గుర్తించింది. ఇతర దేశాలు ఈ కేంద్రాన్ని సందర్శించి, ఈ కేంద్రం కార్యకలాపాల గురించి తెలుసుకోవాలని కూడా ఆహ్వానించింది.
*****
(Release ID: 1818495)
Visitor Counter : 148
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam