ఆయుష్
azadi ka amrit mahotsav

గాంధీనగర్‌లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్నోవేషన్ సమ్మిట్ 2022ను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఆయుష్ థెరపీ కోసం ప్రజలు భారతదేశానికి వచ్చేందుకు వీలుగా ప్రత్యేక ఆయుష్ వీసా వర్గాన్ని భారతదేశం ప్రవేశపెట్టబోతోంది: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

గ్లోబల్ సమ్మిట్ ప్రపంచ స్థాయిలో అవకాశాలను హైలైట్ చేయడానికి ఆధునిక సాంకేతికతలు మరియు ఆధునిక ఆవిష్కరణలను ఉపయోగించమని పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తుంది: శ్రీ సర్బానంద సోనోవాల్

Posted On: 20 APR 2022 3:15PM by PIB Hyderabad

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్నోవేషన్ సమ్మిట్ 2022ను ప్రారంభించారు. మూడు రోజుల ఈ ఆయుష్ గ్లోబల్ సమ్మిట్..వ్యవస్థాపకులు, పరిశ్రమలు, స్టార్టప్‌లు మరియు ఇతర వాటాదారులతో సంభాషణకు అవకాశం కల్పిస్తుంది. ఆయుష్‌లో ఆవిష్కరణల కోసం పెట్టుబడులను పెంచడానికి వారిని ప్రోత్సహించడానికి ఈ రంగం వృద్ధికి భారీ అవకాశాన్ని ప్రదర్శిస్తోంది.

గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్నోవేషన్ సమ్మిట్ 2022 ప్రారంభ సెషన్‌లో మారిషస్ ప్రధాన మంత్రి శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్, కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా, కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ముంజ్‌పరా మహేంద్ర కాలుభాయ్ మరియు రాయబారులు, విదేశీ ప్రముఖులు, పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులు మరియు ఇతర ముఖ్యమైన వాటాదారులు పాల్గొన్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రారంభ ప్రసంగంలో " ఆయుష్ ఔషధాలు, సప్లిమెంట్లు మరియు సౌందర్య సాధనాల ఉత్పత్తిలో మనం ఇప్పటికే అపూర్వమైన వృద్ధిని నమోదు చేస్తున్నాం. 2014లో ఆయుష్ రంగం 3 బిలియన్ డాలర్ల కంటే తక్కువగా ఉంటే..నేడు అది 18 బిలియన్ డాలర్లకు పెరిగింది. అలాగే ఆయుష్ ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహించేందుకు గత కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి" అని చెప్పారు.

ఆయుష్ రంగంలో అనేక కొత్త కార్యక్రమాలను ప్రధాన మంత్రి ప్రకటించారు. అందులో మొదటిది ఆయుష్ ఉత్పత్తులకు ప్రత్యేక ఆయుష్ గుర్తు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు నాణ్యమైన ఆయుష్ ఉత్పత్తులపై విశ్వాసాన్ని ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఆయుష్ ఉత్పత్తుల ప్రమోషన్, పరిశోధన మరియు తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఆయుష్ పార్కుల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తుంది. హెర్బల్ న్యూట్రిషనల్ సప్లిమెంట్ల ఉత్పత్తిదారులకు  ఉపయోగపడే 'ఆయుష్ ఆహార్' పేరుతో కొత్త కేటగిరీని ప్రకటించారు.

వీటితో ఆయుష్ థెరపీని సద్వినియోగం చేసుకోవడానికి భారత్‌కు రావాలనుకునే విదేశీ పౌరుల కోసం మరో ప్రధాన కార్యక్రమం ప్రకటించబడింది. ఈ మేరకు త్వరలో ప్రత్యేక ఆయుష్ వీసా కేటగిరీని భారత్‌ ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత యుగాన్ని యునికార్న్‌ల యుగంగా అభివర్ణిస్తూ ఒక్క 2022 సంవత్సరంలోనే ఇప్పటివరకు భారతదేశం నుండి 14 స్టార్టప్‌లు యునికార్న్ క్లబ్‌లో చేరాయని ప్రధాన మంత్రి తెలియజేశారు. "మన ఆయుష్ స్టార్టప్‌ల నుండి అతి త్వరలో యునికార్న్‌లు వెలువడతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని ఆయన తెలిపారు.

ఆయుష్ ఎగుమతి ప్రమోషన్ కౌన్సిల్ మరియు ఆయుష్ ఇన్ఫర్మేషన్ హబ్, ఆయుసాఫ్ట్, ఆయుష్ నెక్స్ట్ మరియు ఆయుష్ జీఐఎస్‌ వంటి నాలుగు ఆయుష్ ఐసీటీ కార్యక్రమాలను ప్రారంభించినట్లు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. కోవిడ్-19 మాత్రమే కాకుండా ఇతర వ్యాధులతో కూడా పోరాడడంలో ఆయుష్ వ్యవస్థలు మరియు ఉత్పత్తులు ఎలా సహాయపడ్డాయో వివరించే 'ప్రొఫెసర్ ఆయుష్మాన్' అనే కామిక్ పుస్తకాన్ని కూడా ప్రధాని విడుదల చేశారు.

ఈ సందర్భంగా స్టార్టప్ ఇండియా సహకారంతో ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) నిర్వహించిన 'ఆయుష్ స్టార్టప్ ఛాలెంజ్' విజేతలకు ప్రధాన మంత్రి అవార్డులను పంపిణీ చేశారు. ప్రారంభ సెషన్‌లో ప్రపంచ సంస్థలు మరియు ప్రభుత్వాల మధ్య 5 అవగాహన ఒప్పందాలపై సంతకాలు కూడా జరిగాయి. అర్జెంటీనాతో రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠ్ (ఆర్‌ఏవి) అవగాహన ఒప్పందం, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ) మరియు బ్రెజిల్ మధ్య ఆయుర్వేదంలో అకడమిక్ సహకారం ఏర్పాటుపై త్రైపాక్షిక అవగాహన ఒప్పందం కుదిరింది. అలాగే ఆల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద మరియు యూనివర్శిటీ హెల్త్ నెట్‌వర్క్, టొరంటో (యూహెచ్‌ఎన్‌), కెనడా మధ్య అవగాహన ఒప్పందం, యూనివర్సిడాడ్ ఆటోనోమా డి న్యూవో లియోన్ (యూఏఎన్‌ఎల్‌), మెక్సికోలో ఆయుర్వేద చైర్ స్థాపనకు సంబంధించిన అవగాహన ఒప్పందం మరియు ఎన్‌ఐఏ, జైపూర్ మరియు ఫిలిప్పైన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మరియు ఆయుర్వేదం మరియు ఇతర సాంప్రదాయ వైద్య విధానంలో సహకారంపై అవగాహన ఒప్పందాలు కుదిరాయి.

సెషన్‌ను ఉద్దేశించి డా. టెడ్రోస్ మాట్లాడుతూ ఆయుష్ రంగం గణనీయంగా వృద్ధి చెందుతోందని - 2014 నుండి సంవత్సరానికి 17 శాతం చొప్పున పెరుగుతోందని అన్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఆయుష్ పరిశ్రమ 23 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. '' ప్రామాణిక యాదృచ్ఛిక ట్రయల్స్ సాధ్యం కానప్పుడు లేదా చేపట్టడం కష్టంగా ఉన్న సందర్భాల్లో, సాంప్రదాయ వైద్య విధానాల ప్రభావాన్ని డాక్యుమెంట్ చేయడానికి  వినూత్న అధ్యయన డిజైన్లను మరియు కృత్రిమ మేధస్సును ఉపయోగించడాన్ని అన్వేషిస్తున్నామని తెలిపారు. మెరుగైన ఆరోగ్య ఫలితాలు, ఆర్థిక ప్రయోజనాలు మరియు మొత్తం ప్రభావాన్ని ప్రోత్సహించడానికి, సాంప్రదాయ ఔషధం యొక్క సాక్ష్యాధారాలను బలోపేతం చేయడం ద్వారా కమ్యూనిటీలు దాని వినియోగాన్ని సులభతరం చేయాలని అన్నారాయన.

ఈ సందర్భంగా శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్‌ మాట్లాడుతూ డబ్ల్యూహెచ్‌ఓ గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను ప్రారంభించినందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని అభినందించారు మరియు సాంప్రదాయ వైద్యం ఆధునిక వైద్యాన్ని పూర్తి చేస్తుందని మారిషస్ గుర్తించిందని అన్నారు.

కేంద్ర ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ తన ప్రసంగంలో " గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్నోవేషన్ సమ్మిట్‌తో ప్రజల్లో అవగాహన పెరుగుతుందని భావిస్తున్నాం. అలాగే వ్యాపార అవకాశాల గురించి టేక్‌హోల్డర్‌లు, ప్రపంచ స్థాయిలో అవకాశాలను హైలైట్ చేయడానికి ఆధునిక సాంకేతికతలు మరియు ఆధునిక ఆవిష్కరణలను ఉపయోగించుకునేలా యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహం లభిస్తుంది. సమ్మిట్‌లోని చర్చలు ఆయుర్వేద రంగంలో వ్యాపార అభివృద్ధికి గల వివిధ అవకాశాల గురించి యువ పారిశ్రామికవేత్తలకు అవగాహన కల్పిస్తాయని భావిస్తున్నామని" చెప్పారు

ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖలు ఆయుర్వేదం మరియు ఇతర సాంప్రదాయ ఔషధాల నిపుణులలో వ్యవస్థాపకతను అభివృద్ధి చేస్తున్నాయని ఆయన తెలిపారు. ప్రధానమంత్రి స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్‌కు అనుగుణంగా ఆయుష్‌లో స్టార్టప్‌లను స్థాపించడానికి యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ వ్యవస్థాపకత అభివృద్ధి కార్యక్రమం (ఈడీపీ)ని కూడా అభివృద్ధి చేసిందన్నారు.

మూడు రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్‌లో 5 ప్లీనరీ సెషన్‌లు, 8 రౌండ్‌టేబుల్‌లు, 6 వర్క్‌షాప్‌లు మరియు 2 సింపోజియంలు జరుగుతాయి. ఇందులో దాదాపు 90 మంది ప్రముఖ వక్తలు మరియు 100 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. సమ్మిట్ పెట్టుబడి సామర్థ్యాన్ని వెలికి తీయడంలో సహాయపడుతుంది మరియు ఆవిష్కరణలు, పరిశోధన & అభివృద్ధి, స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ మరియు వెల్నెస్ పరిశ్రమకు పూరకంగా ఉంటుంది. ఇది పరిశ్రమ ప్రముఖులు, విద్యావేత్తలు మరియు పండితులను ఒకచోట చేర్చి, భవిష్యత్ సహకారాలకు వేదికగా పని చేస్తుంది.

గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్‌మెంట్ & ఇన్నోవేషన్ సమ్మిట్ ఏప్రిల్ 22, 2022 వరకు గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కొనసాగుతుంది మరియు జామ్‌నగర్‌లో డబ్లూహెచ్‌ఓ-గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను ప్రధాని ప్రారంభించిన ఒక రోజు తర్వాత ప్రారంభమవుతుంది.


 

******


(Release ID: 1818493) Visitor Counter : 193