ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

“ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ: కొవిడ్-19పై పోరాడుతున్న ఆరోగ్య కార్యకర్తలకు బీమా పథకం” మరో 180 రోజుల పాటు పొడిగింపు

Posted On: 19 APR 2022 1:35PM by PIB Hyderabad

కొవిడ్-19పై పోరాటం చేస్తున్న ఆరోగ్య సిబ్బంది కోసం తీసుకొచ్చిన 'ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ (పీఎంజీకేపీ) బీమా పథకాన్ని' మరో 180 రోజుల పాటు పొడిగించారు. ఇవాల్టి నుంచి (19 ఏప్రిల్, 2022) నుంచి ఈ పొడిగింపు అమల్లోకి వస్తుంది. కొవిడ్‌ రోగుల సంరక్షణ కోసం నియమించిన ఆరోగ్య సిబ్బంది మీద ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక భరోసాను మరింత కాలం పెంచడానికి ఈ పథకాన్ని పొడిగించారు.

ఈ పొడిగింపు గురించి అన్ని రాష్ట్రాలు/యూటీల్లోని ఆరోగ్య సిబ్బందికి అవగాహన కల్పించడం కోసం, ఆయా రాష్ట్రాలు/యూటీల అదనపు ప్రధాన కార్యదర్శులు (ఆరోగ్యం)/ ముఖ్య కార్యదర్శులు (ఆరోగ్యం)/ కార్యదర్శులకు (ఆరోగ్యం) ఇవాళ ఒక లేఖను పంపారు.

2020 మార్చి 30వ తేదీన పీఎంజీకేపీని ప్రారంభించారు. తాము కొవిడ్‌ బారిన పడే ప్రమాదం ఉన్నా వెరవకుండా, కొవిడ్‌ రోగులకు చికిత్స చేస్తున్న సామాజిక ఆరోగ్య కార్యకర్తలు సహా ఆరోగ్య సంరక్షణ సిబ్బందికి సమగ్ర వ్యక్తిగత ప్రమాద కవరేజీని అందించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. మొత్తం 22.12 లక్షల మంది సిబ్బందికి, ఒక్కొక్కరికి రూ.50 లక్షల బీమా కవరేజీ కల్పించారు.

ప్రైవేట్ ఆస్తుపత్రుల సిబ్బంది, రాష్ట్రాలు, కేంద్ర ఆసుపత్రులు/ కేంద్ర, రాష్ట్ర, యూటీల స్వయంప్రతిపత్త ఆసుపత్రులు/ ఎయిమ్స్ & జాతీయ ప్రాధాన్యత సంస్థ (ఐఎన్‌ఐ)/ కొవిడ్-19 రోగుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖల ఆసుపత్రుల్లో కొవిడ్‌ విధుల్లో ఉన్న విశ్రాంత/ స్వచ్ఛంద/ స్థానిక పట్టణ సంస్థల/ ఒప్పంద / రోజువారీ వేతన/ అడ్‌హక్‌/ ఔట్‌సోర్స్ సిబ్బంది కూడా కూడా పీఎంజేకేపీ పరిధిలోకి వస్తారు.

ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు, కొవిడ్ సంబంధిత విధుల్లో ఉంటూ మరణించిన ఆరోగ్య సిబ్బందికి సంబంధించిన 1905 క్లెయిములను పరిష్కరించారు.

 

****



(Release ID: 1818061) Visitor Counter : 247