జల శక్తి మంత్రిత్వ శాఖ
" భూగర్భ జలాలను ఉప్పొంగించి వెలికి తీయాలి" నినాదంగా ప్రపంచ జల దినోత్సవం 2022 నిర్వహణ
నదుల పునర్జీవం అనే అంశంపై సదస్సు నిర్వహించిన ఎన్ ఎంసీజీ సదస్సుకు హాజరైన విద్యార్థులు, విద్యా రంగ ప్రముఖులు
నీటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేయించిన కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్
నీటి కొరత సమస్య పరిష్కార మార్గాలను ఆలోచించాలని యువతకు సూచించిన మంత్రి
భూగర్భ జల మట్టం పెరుగుదల, వర్షం నీటి ఆదా ప్రాధాన్యత వివరించిన ఎన్ ఎంసీజీ డీజీ శ్రీ. జి. అశోక్ కుమార్
సైకత శిల్పాలు, వీధి నాటకాల ద్వారా నదుల పునర్జీవం, జల సంరక్షణ ప్రాధాన్యత వివరించిన కళాకారులు
నాడు పోస్టు చేయడమైనది:
22 MAR 2022 4:51PM by PIB Hyderabad
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా యువత కోసం నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగ ప్రత్యేకంగా 'నదుల పునర్జీవం-యువత పాత్ర అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. " భూగర్భ జలాలను ఉప్పొంగించి వెలికి తీయాలి" నినాదంతో జరిగిన కార్యక్రమంలో విద్యా రంగ ప్రముఖులు, వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. నదుల పునర్జీవం, జల సంరక్షణ ప్రధాన అంశాలుగా కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ అధ్యక్షత వహించారు. ఎన్ ఎంసీజీ డీజీ శ్రీ. జి. అశోక్ కుమార్, ఎన్ ఎంసీజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ( టెక్నికల్) శ్రీ.డి.పి. మథురియా, వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. జల వనరుల సంరక్షణ, వనరుల సుస్థిర నిర్వహణ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి ఏడాది మార్చి 22 ని జల దినోత్సవంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ ఏడాది " భూగర్భ జలాలను ఉప్పొంగించి వెలికి తీయాలి" నినాదంగా ప్రపంచ జల దినోత్సవం 2022 జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఈ రోజు ప్రారంభమైన కార్యక్రమాలు ఒక రోజు ముచ్చటగా మిగిలి పోకూడదని అన్నారు. ఒక్క నీటి బొట్టును కూడా వృధా చేయమని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేసి దానిని అమలు చేయాలని ఆయన అన్నారు. అందుబాటులో అన్ని మార్గాల ద్వారా జల వనరులను సంరక్షించాలని ఆయన సూచించారు. జల వనరుల సంరక్షణ, అభివృద్ధికి యువత కృషి చేయాలని అన్నారు.
నీటి వనరుల రంగంలో బుందేల్‌ఖండ్ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించిన మంత్రి జల్ జీవన్ మిషన్ ద్వారా సమస్య పరిష్కారానికి అమలు చేస్తున్న చర్యలను వివరించారు. జల్ జీవన్ మిషన్ కింద అమలు చేస్తున్న కార్యక్రమాల వల్ల బుందేల్‌ఖండ్‌లోని దామోహ్‌లో తాగునీటి లభ్యత ఈ సంవత్సరం ఏప్రిల్ నాటికి కేవలం 17% నుంచి 65% కు పెరుగుతుందని మంత్రి వివరించారు. జల్ జీవన్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు దేశంలో 9.5 కోట్ల కుటుంబాలకు తాగునీటి పైప్‌లైన్లు అందించినట్లు ఆయన చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా నీరు అందుతున్న కుటుంబాలు సంతోషంగా ఉన్నాయని మంత్రి అన్నారు.
భారతీయ సంస్కృతిలో నదులు అంతర్భాగంగా ఉన్నాయని శ్రీ ప్రహ్లాద్ సింగ్ అన్నారు. మత, సామాజిక, ఆర్థిక, వాణిజ్య, వ్యవసాయం, ఔషధం లాంటి అనేక అంశాలు నదులతో ముడిపడి ఉన్నాయని అన్నారు. జల వనరులు, నదులను గౌరవించడం అనేది శతాబ్దాలుగా భారతీయ సంప్రదాయం మరియు సంస్కృతిలో అంతర్భాగంగా ఉందని ఆయన అన్నారు. రానున్న తరానికి నీటి కొరత ప్రధాన సమస్యగా ఎదురయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందాలని ఆయన స్పష్టం చేశారు. " పెట్రోల్ డీజిల్ కోసం ఆలోచిస్తున్న మనం జీవన అవసరమైన జల వనరుల గురించి ఆలోచించక తప్పదు' అని మంత్రి స్పష్టం చేశారు.
భవిష్యత్తులో నీటి కోసం ప్రపంచ యుద్ధం జరిగే ప్రమాదం ఉందంటూ మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజపేయి చేసిన వ్యాఖ్యలను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. జల వనరుల సంరక్షణకు శ్రీ అటల్ బిహారీ వాజపేయి ఇచ్చిన ప్రాధాన్యతను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని ఆయన అన్నారు. శ్రీ అటల్ బిహారీ వాజపేయి ని స్ఫూర్తిగా తీసుకుని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జల వనరుల రంగంలో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నారని శ్రీ ప్రహ్లాద్ సింగ్ తెలిపారు. నిర్లక్ష్యం మరియు అవగాహన లోపం ప్రస్తుత సమస్యలకు కారణమని అన్నారు. విలువైన భూగర్భ జలాలతో సహా నీటి వనరులను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకరించాలని కోరారు.
ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా జల సంరక్షణ ప్రతిజ్ఞ చేయడం పట్ల శ్రీ జి. అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. నీటి కొరత నుంచి బయటపడేందుకు ప్రపంచ దేశాలు కలిసి కృషి చేస్తున్నాయని అన్నారు. జల వనరులు, నదుల పరిరక్షణకు అన్ని దేశాలు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. జల వనరుల అభివృద్ధి, సంరక్షణ, నదుల పర్యావరణ అంశాలపై యువత ఆలోచనా దృక్పథం మారిందని, ఇది శుభ సూచన అని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రతి ఒక్కరూ నీటిని గౌరవించాలని శ్రీ అశోక్ కుమార్ అన్నారు. భూగర్భ జలాల వినియోగంలో ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని శ్రీ అశోక్ కుమార్ వెల్లడించారు. 250 బిలియన్ లీటర్ల భూగర్భ జలాలను దేశం వెలికి తీస్తున్నదని ఆయన వివరించారు. మన పూర్వీకులు అనుసరించిన విధానాల భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. భవిష్యత్ తరాలకు పరిరక్షణకు భరోసా ఇస్తూ భూగర్భ జలాలను పరిరక్షించి బహుమతిగా అందించాలని అన్నారు. 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో జల వనరులు కీలక పాత్ర పోషిస్తాయని శ్రీ అశోక్ కుమార్ అన్నారు. భూగర్భ జలాల సంరక్షణ కోసం " క్యాచ్ ది రైన్: వేర్ ఇట్ ఫాల్స్, వెన్ ఇట్ ఫాల్స్" కార్యక్రమం ద్వారా చర్యలు అమలు చేస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమంలో స్టాన్‌ఫోర్డ్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్, జైపురియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, శోభిత్ యూనివర్శిటీ, ఐఎమ్ఎస్, నోయిడా మరియు శారదా యూనివర్సిటీ నుంచి 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
సైకత శిల్పి శ్రీ రజత్ కుమార్ సైకత శిల్పం ద్వారా నీటి సంరక్షణ సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఐఎమ్ఎస్ , నోయిడా విద్యార్థులు నీటి సంరక్షణ ప్రాముఖ్యతపై వీధి నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో భాగంగా గంగా క్వెస్ట్ 2022 ఆన్‌లైన్ క్విజ్ కూడా ప్రారంభించబడింది. ప్రఖ్యాత పర్యావరణవేత్త మైక్ పాండే రూపొందించిన నేషనల్ జియోగ్రాఫిక్ ఫిల్మ్ – “గంగా: ఎ రివర్ ఫ్రమ్ స్కైస్” టీజర్ ను కార్యక్రమంలో ప్రదర్శించారు. వివిధ విద్యా సంస్థలకు చెందిన ప్రముఖ విద్యావేత్తలను మంత్రి సన్మానించారు.
***
(రిలీజ్ ఐడి: 1808547)
సందర్శకుల సూచీ సంఖ్య : : 211