ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

సాంప్రదాయ వైద్యం కోసంభారతదేశంలో డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం

Posted On: 09 MAR 2022 1:34PM by PIB Hyderabad

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్ఓ  గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (డబ్ల్యూహెచ్ఓ జిసిటీఎం) ఏర్పాటుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. డబ్ల్యూహెచ్ఓ జిసిటీఎంను నెలకొల్పేందుకు   ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తో  భారత ప్రభుత్వం హోస్ట్ కంట్రీ ఒప్పందంపై సంతకం చేస్తుంది. 

ఆయుష్ మంత్రిత్వ శాఖ గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో డబ్ల్యూహెచ్ఓ  గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (డబ్ల్యూహెచ్ఓ జిసిటీఎం) ఏర్పాటు చేస్తుంది.  సాంప్రదాయ వైద్యం కోసం ప్రపంచంలో ఏర్పాటవుతున్న   మొదటి మరియు ఏకైక గ్లోబల్ అవుట్‌పోస్ట్ సెంటర్ (కార్యాలయం)గా జామ్‌నగర్‌ గుర్తింపు పొందుతుంది. 

ప్రయోజనాలు:

i.     ప్రపంచవ్యాప్తంగా ఆయుష్ వ్యవస్థలకు గుర్తింపు లభిస్తుంది.

ii.     సాంప్రదాయ వైద్యానికి సంబంధించిన ప్రపంచానికి మార్గదర్శకత్వం  అందించడానికి అవకాశం కలుగుతుంది

iii.     సాంప్రదాయ ఔషధం నాణ్యత, భద్రత మరియు సమర్థత, ప్రాప్యత మరియు హేతుబద్ధమైన వినియోగాన్ని ప్రోత్సహించేందుకు వీలవుతుంది.

iv.     సంబంధిత సాంకేతిక అంశాలు, పరికరాలు, పద్ధతులు, ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరించి అభివృద్ధి చేసేందుకు అవకాశం కలుగుతుంది.  ఇప్పటికే అందుబాటులో ఉన్న టీఎం  డేటా బ్యాంక్‌లు, వర్చువల్ లైబ్రరీలు మరియు విద్య, పరిశోధన కేంద్రాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ టీఎం  ఇన్ఫర్మేటిక్స్ సెంటర్‌తో అనుసంధానం అవుతాయి.

v.    సంబంధించిన అంశాలలో నిర్దిష్ట సామర్థ్యం పెంపుదల మరియు శిక్షణ కార్యక్రమాలు అభివృద్ధి చేయడం మరియు క్యాంపస్, రెసిడెన్షియల్ లేదా వెబ్ ఆధారిత మరియు  డబ్ల్యూహెచ్ఓ   అకాడమీ మరియు ఇతర వ్యూహాత్మక భాగస్వాములతో సహకారంతో  శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలవుతుంది.

5 వ  ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా  2020 నవంబర్ 13న భారత ప్రధానమంత్రి సమక్షంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబెరేయేసస్ భారతదేశంలో  డబ్ల్యూహెచ్ఓ జిసిటీఎం   ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి  డబ్ల్యూహెచ్ఓ జిసిటీఎం కు పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. దీనిని   ప్రపంచంలో అత్యుత్తమ  ఆరోగ్య కేంద్రం గా అభివృద్ధి చేసేందుకు సహకరిస్తామని అన్నారు.  సాంప్రదాయ వైద్యం పై అవగాహన పెంచేందుకు శిక్షణ పరిశోధనా కార్యక్రమాలను  డబ్ల్యూహెచ్ఓ జిసిటీఎం చేపడుతుందని అన్నారు.

డబ్ల్యూహెచ్ఓ జిసిటీఎం కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన అంశాలను సమన్వయం  చేసి, సాధ్యమైనంత త్వరగా ఇది కార్యరూపం దాల్చేలా చూసేందుకు ప్రభుత్వం జాయింట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. భారత ప్రభుత్వం, భారత శాశ్వత మిషన్, జెనీవా మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు ఈ బృందంలో సభ్యులుగా వ్యవహరిస్తారు. ఈ బృందం పర్యవేక్షణలో జాంనగర్ ఐటీఆర్ఏ లో  డబ్ల్యూహెచ్ఓ జిసిటీఎం తాత్కాలిక కేంద్రం ఏర్పాటయింది. డబ్ల్యూహెచ్ఓ జిసిటీఎం ఏర్పాటుకు సంబంధించి సాంకేతిక ఇతర అంశాలను ఇక్కడ నుంచి పర్యవేక్షించడం జరుగుతుంది.

సంప్రదాయ వైద్య విధానానికి సంబంధించిన రుజువులు, ఆవిష్కరణలు, కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత పరిష్కారాలు, ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందిన ఆరోగ్య సంస్థల  సహకారంతో సమీక్షలు నిర్వహించి  డబ్ల్యూహెచ్ఓ జిపిడబ్ల్యు    (పదమూడవ జనరల్ ప్రోగ్రామ్ ఆఫ్ వర్క్ 2019-2023)  సంప్రదాయ వైద్య విధానాలుపై సేకరించిన సమాచారాన్ని అధ్యయనం చేసేందుకు     తాత్కాలిక కార్యాలయం కృషి చేస్తుంది. అభివృద్ధి లక్ష్యాలు, సాంప్రదాయ ఔషధం సామాజిక-సాంస్కృతిక మరియు జీవవైవిధ్య వారసత్వం, స్థిరమైన అభివృద్ధి మరియు నిర్వహణ మరియు క్రాస్-కటింగ్ విధులు, వ్యాపార కార్యకలాపాలు మరియు  డబ్ల్యూహెచ్ఓ జిసిటీఎం   ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు అవసరమైన  పరిపాలన ప్రక్రియ వేగంగా సాగేందుకు ఈ కేంద్రం కృషి చేస్తుంది.

సంప్రదాయ వైద్య విధానాలకు   సంబంధించిన అన్ని అంశాలపై సభ్య దేశాలకు సహకారం అందించడంతో పాటు  సాంప్రదాయ ఔషధ పరిశోధన, పద్ధతులు మరియు ప్రజారోగ్యానికి సంబంధించిన వివిధ విధానాలను రూపొందించడంలో   డబ్ల్యూహెచ్ఓ జిసిటీఎం కీలక పాత్ర పోషిస్తుంది.

ఆయుర్వేదం మరియు యునాని వ్యవస్థ రంగాలలో  శిక్షణ ఇవ్వడం, విధానాలను అమలు చేసేందుకు అవసరమైన ప్రమాణాలను  అభివృద్ధి చేయడం, అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ -11 రెండవ మాడ్యూల్‌లో     సాంప్రదాయ వైద్యం  అధ్యాయాన్ని చేర్చడం , ఎం -యోగ వంటి యాపులను  అభివృద్ధి చేయడం, ఇంటర్నేషనల్ ఫార్మకోపియా ఆఫ్ హెర్బల్ మెడిసిన్, పరిశోధన అధ్యయనాల వంటి అనేక అంశాలలో ప్రపంచ ఆరోగ్య సంస్థతో కలిసి ఆయుష్ మంత్రిత్వ శాఖ పనిచేస్తోంది.

 ఆరోగ్య సంరక్షణ  వ్యవస్థ లో సంప్రదాయ వైద్య విధానం కీలకంగా ఉంటుంది.  ఆరోగ్యం మరియు ఆరోగ్య సంరక్షణ అంశాలలో    కీలక పాత్ర పోషిస్తుంది. 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలని భారతదేశం నిర్ణయించింది. దీనికోసం రానున్న పది సంవత్సరాల్లో ప్రజలందరికీ నాణ్యమైన అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సురక్షితమైన, సమర్థవంతమైన మరియు సరసమైన అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు అమలు చేస్తోంది. లక్ష్య సాధనలో  సురక్షితమైన మరియు సమర్థవంతమైన సాంప్రదాయ ఆరోగ్య విధానాలు  ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.  ఆయా దేశాల్లో సంప్రదాయ వైద్య విధానాలను  సమగ్రంగా అమలు చేయడం, నియంత్రణ, అభివృద్ధి చేసే అంశాలలో డబ్ల్యూహెచ్ఓ జిసిటీఎం తన వంతు సహకారాన్ని అందిస్తుంది. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు భారతదేశంలో సమర్థంగా అమలు జరిగేలా చూసేందుకు  త్వరలో  ఏర్పాటు కానున్న   డబ్ల్యూహెచ్ఓ జిసిటీఎం కృషి చేస్తుంది.  భారతీయ సంప్రదాయ వైద్య విధానాలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించేలా సంస్థ చర్యలు అమలు చేస్తుంది. 

 

***



(Release ID: 1804473) Visitor Counter : 165