ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘నారీశక్తి పురస్కారం-2020/2021’ గ్రహీతలతో ప్రధాని ఇష్టాగోష్ఠి


అవార్డు గ్రహీతలకు ప్రధానమంత్రి ప్రశంస.. దేశానికేగాక
సమాజానికీ సేవలు అందిస్తున్నారని అభినందన;

మీ కృషిలో సేవా స్ఫూర్తితోపాటు వినూత్నత కూడా ఉంది: ప్రధానమంత్రి;

‘సబ్‌ కా ప్రయాస్‌’ సాకారంపై ప్రభుత్వం దృష్టి సారించింది: ప్రధానమంత్రి;
దేశ అగ్ర నాయకత్వానికి తమ గళం వినిపించే

వేదిక కల్పనపై ప్రధానికి అవార్డు గ్రహీతల కృతజ్ఞతలు

Posted On: 07 MAR 2022 8:12PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ‘నారీశక్తి  పురస్కారం-2020/2021’ గ్రహీతలతో లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ లో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. మహిళల సాధికారత దిశగా ప్రధాని చేస్తున్న నిరంతర కృషికి ఈ కార్యక్రమం ఒక నిదర్శనం. కాగా, అవార్డు గ్రహీతలు అద్భుత విజయాలు సాధించారంటూ ప్రధానమంత్రి ఈ సందర్భంగా వారిని కొనియాడారు. దేశానికేగాక సమాజానికీ సేవలు అందిస్తున్నారని అభినందించారు. అలాగే వారి కృషిలో సేవా స్ఫూర్తితోపాటు వినూత్నత కూడా స్పష్టంగా కనిపిస్తున్నదని ఆయన అన్నారు. మహిళలు తమ ప్రతిభను ప్రదర్శించని రంగమంటూ ఏదీలేదని, వారంత దేశం గర్వించేలా కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

   మహిళల సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉన్నదని, ఆ సామర్థ్యాన్ని గుర్తించేందుకు తగిన విధానాలను రూపొందిస్తున్నామని ప్రధాని చెప్పారు. కుటుంబాల స్థాయిలో నిర్ణయాత్మకత దిశగా మహిళలందరూ భాగస్వాములు కావడం ముఖ్యమని, వారి ఆర్థిక సాధికారతకు ఇది నిదర్శనం కాగలదని ఆయన పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్‌లో భాగంగా ‘సబ్‌ కా ప్రయాస్‌’ విషయంలో ప్రభుత్వం దృష్టి సారించడం గురించి ప్రధాని ప్రస్తావించారు. ప్రభుత్వం పిలుపునిచ్చిన “స్థానికత కోసం స్వగళం” వంటి కార్యక్రమాలు విజయవంతం కావడమన్నది మహిళల పాత్రపై ఆధారపడి ఉన్నదని ఆయన వ్యాఖ్యానించారు.

   ఈ సందర్భంగా పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ- దేశ అగ్ర నాయకత్వానికి తమ గళం వినిపించే వేదిక కల్పనపై ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రిని కలుసుకోవడమేగాక ఆయనతో ముచ్చటించే అవకాశం లభించడంతో తమ కల సాకారమైనట్లు భావిస్తున్నామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన వినూత్న చర్యలు తాము సాధించిన విజయాల్లో ఎనలేని తోడ్పాటునిచ్చాయని వారు ప్రశంసించారు. ఇప్పటిదాకా తమ జీవనయానం గురించి, తాము చేసిన కృషి గురించి వారు ప్రధానికి వివరించారు. తమతమ రంగాలకు సంబంధించి విలువైన సమాచారాన్ని, సూచనలను ఈ సందర్భంగా ప్రధానితో పంచుకున్నారు.

 


(Release ID: 1803982) Visitor Counter : 199