ప్రధాన మంత్రి కార్యాలయం

మార్చి 6న ప్రధానమంత్రి పుణె సందర్శన… పుణె మెట్రో రైలు ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం


ఈ ప్రాజెక్టుతో పట్టణ రవాణా కోసం పుణెలో ప్రపంచ స్థాయి
మౌలిక వసతులు; 2016లో దీనికి శంకుస్థాపన చేసిన ప్రధానమంత్రి;

పుణె నగర పాలక సంస్థ ప్రాంగణంలో ఛత్రపతి శివాజీ
మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధానమంత్రి;

వివిధ ప్రగతి పనులకు శంకుస్థాపన… ఆర్‌.కె.లక్ష్మణ్
ఆర్ట్‌ గ్యాలరీకి ప్రధానమంత్రి ప్రారంభోత్సవం;

సింబయాసిస్‌ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలకు ప్రధానమంత్రి శ్రీకారం

Posted On: 05 MAR 2022 12:39PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2022 మార్చి 6వ తేదీన పుణె నగరాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా ఆయన పుణె మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభించడంతోపాటు వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు, పుణె నగరపాలక సంస్థ ప్రాంగణంలో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. దాదాపు 9.5 అడుగుల పొడవైన ఈ విగ్రహాన్ని 1850 కిలోల గన్ మెటల్‌తో తయారుచేశారు.

   నంతరం ఉదయం 11:30 గంటలకు ప్రధానమంత్రి పుణె మెట్రో రైలు ప్రాజెక్టును ప్రారంభిస్తారు. పట్టణ రవాణా కోసం పుణెలో ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పన దిశగా కృషిలో ఈ ప్రాజెక్టు అంతర్భాగం. కాగా, దీనికి 2016 డిసెంబరు 24న ప్రధానమంత్రి స్వయంగా శంకుస్థాపన చేశారు. మొత్తం 32.2 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం పనులు పూర్తయిన 12 కిలోమీటర్ల మార్గాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. ఈ ప్రాజెక్టును రూ.11,400 కోట్లకుపైగా వ్యయంతో నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమం తర్వాత గర్వారే మెట్రో స్టేషన్‌లో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి, సందర్శన తర్వాత అక్కడి నుంచి ఆనంద్‌నగర్ మెట్రో స్టేషన్ వరకు ఆయన మెట్రోరైలులో ప్రయాణిస్తారు.

   తర్వాత మ‌ధ్యాహ్నం 12 గంట‌ల ప్రాంతంలో ప్రధానమంత్రి వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి, కొన్నిటికి శంకుస్థాప‌న చేస్తారు. అలాగే మూలా-ముఠా నదీ సంబంధిత పునరుజ్జీవన-కాలుష్య నివారణ ప్రాజెక్టులకూ ఆయన శంకుస్థాపన చేస్తారు. ఇందులో భాగంగా నది పొడవునా 9 కిలోమీటర్ల మేర రూ.1,080 కోట్ల వ్యయంతో పునరుజ్జీవన పనులు చేపడతారు. ఈ మేరకు నది అంచుల రక్షణ, ఇంటర్‌సెప్టర్ మురుగునీటి నెట్‌వర్క్, ప్రజా సౌకర్యాలు, పడవల విహార కార్యకలాపాల సంబంధిత పనులు నిర్వహిస్తారు. “ఒకే నగరం-ఒకే నిర్వహణ సంస్థ” ఇతివృత్తంగా రూ.1470 కోట్లకుపైగా వ్యయంతో మూల-ముఠా నదీ కాలుష్య నివారణ ప్రాజెక్టు అమలవుతుంది. దీనికింద 400 ఎం.ఎల్.డి.ల సామర్థ్యంగల 11 మురుగుశుద్ధి ప్లాంట్లు నిర్మిస్తారు. కాగా, బనేర్‌లో ఇ-బస్‌ డిపోతోపాటు 100 ఇ-బస్సులను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

   పుణెలోని బలేవాడీలో నిర్మించిన ఆర్‌.కె.లక్ష్మణ్‌ ఆర్ట్‌ గ్యాలరీని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. మాల్గుడి గ్రామం ఆధారంగా రూపొందించబడిన సూక్ష్మ నమూనా ఈ మ్యూజియంలో ప్రధాన ఆకర్షణ. కాగా, ఇది దృశ్య-శ్రవణ మాధ్యమంద్వారా సజీవ చిత్రణను మనముందు ఉంచుతుంది. కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్ గీసిన కార్టూన్‌లను కూడా మ్యూజియంలో ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమాలు ముగించుకున్న అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు సింబయాసిస్‌ విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

 

***



(Release ID: 1803266) Visitor Counter : 184