ఉప రాష్ట్రపతి సచివాలయం
ప్రాణదానం మనందరి చేతుల్లో ఉంది: ఉపరాష్ట్రపతి
• సీపీఆర్ ద్వారా ఒకరికి ప్రాణదానం చేయొచ్చనే విషయాన్ని గుర్తించాలి
• దీనిపై మనమంతా బాధ్యతగా శిక్షణ పొందాలి
• పాఠశాలల్లో CPR శిక్షణను తప్పనిసరిగా అందించాలి
Posted On:
02 MAR 2022 1:39PM by PIB Hyderabad
ఆపత్కాలంలో ఒకరి ప్రాణాలను కాపాడటాన్ని మించిన ఆనందం దేనిలోనూ దొరకదని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దయ, కరుణ, జాలి వంటివి సమాజంలో పెంపొందించేందుకు ఒకరికొకరు తోడుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారాయన.
బుధవారం, విజయవాడలోని స్వర్ణభారత్ ట్రస్టు ఆవరణలో జరిగిన సి.పి.ఆర్. అవగాహన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ.. హఠాత్తుగా గుండెపోటు వచ్చిన వ్యక్తికి అత్యవసరంగా చికిత్సనందించే సీపీఆర్ ( కార్డియో పల్మనరీ రిససిటేషన్) పద్ధతిని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
‘ఎవరికైనా గుండెపోటు వచ్చిందంటే వారి గుండె పనిచేయడం మందగించిందని అర్థం. ఆ సమయంలో ప్రథమ చికిత్స అందిందా లేదా అన్న అంశంపైనే ఆ వ్యక్తి ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. అప్పుడు ప్రథమ చికిత్సను అందించే సీపీఆర్ పద్ధతిని నేర్చుకుని ఉంటే ఆ వ్యక్తి ప్రాణాలను మనం కాపాడిన వారమవుతాం’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ఇటీవలి కాలంలో జీవనశైలిలో వస్తున్న మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు పెరుగుతున్నాయన్నారు. వీటి ద్వారా గుండెపోటు కేసులు పెరుగుతున్నాయన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తుచేస్తూ.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా సీపీఆర్ నేర్చుకోవడం వల్ల మన కళ్లముందు ఎవరైనా గుండెపోటుకు గురయితే వారికి ప్రాణదానం చేయవచ్చన్నారు. ఒకరి ప్రాణాలను కాపాడటం కూడా మన బాధ్యతేననే విషయాన్ని ప్రతి పౌరుడూ గుర్తెరగాలన్నారు.
పాఠశాలల్లోనూ సీపీఆర్ కు సంబంధించిన శిక్షణ అందించాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. చిన్నప్పటినుంచే విద్యార్థుల్లో దయ, కరుణ, నైతిక విలువలు తదితర అంశాలతోపాటు ప్రాణాలు కాపాడటంపైనా అవగాహన కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రిసస్సిటేషన్ కౌన్సిల్ ఫెడరేషన్ ఛైర్మన్ శ్రీ చక్రరావు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1802373)
Visitor Counter : 172