ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర బడ్జెట్ 2022-23 లో ప్రకటించిన ఈ-బిల్ ప్రాసెసింగ్ విధానం రేపు, 2022 మార్చి, 2వ తేదీ 46వ పౌర ఖాతాల దినోత్సవం సందర్భంగా ప్రారంభం కానుంది.
Posted On:
01 MAR 2022 12:22PM by PIB Hyderabad
న్యూఢిల్లీ, జనపథ్ లోని డాక్టర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో 2022 మార్చి, 2వ తేదీన, నిర్వహిస్తున్న 46వ పౌర ఖాతాల దినోత్సవంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి డా. టి.వి. సోమనాథన్, సంస్థ అధిపతి శ్రీమతి సోనాలి సింగ్ తో పాటు పలువురు ఇతర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
సులభతర వ్యాపారం మరియు డిజిటల్ ఇండియా పర్యావరణ వ్యవస్థ లో భాగంగా "ఎలక్ట్రానిక్ బిల్ (ఈ-బిల్) ప్రాసెసింగ్ విధానం" అనే ఈ-గవర్నెన్స్ కు సంబంధించిన ప్రధాన కార్యక్రమాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి సీతారామన్ ఈ సందర్భంగా ప్రారంభిస్తారు. 2022-23 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన, ఈ-బిల్ విధానం అన్ని కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో అమలు చేయడం జరుగుతుంది. పారదర్శకత, సమర్థత, వ్యక్తిగత ప్రమేయం లేని, కాగితం రహిత చెల్లింపు వ్యవస్థను మెరుగుపరచడానికి ఇది మరింత ముందడుగు అవుతుంది. సరఫరాదారులు, కాంట్రాక్టర్లు ఇప్పుడు తమ బిల్లులను ఆన్‌లైన్ లో సమర్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధానంలో వాస్తవ సమయం ప్రాతిపదికన ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకోడానికి వీలు కలుగుతుంది.
రోజంతా జరిగే ఈ కార్యక్రమంలో రెండు సాంకేతిక సదస్సులు ఉంటాయి.
1. “పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ లో సంస్కరణలు” అనే అంశంపై నీతి ఆయోగ్ సి.ఈ.ఓ శ్రీ అమితాబ్ కాంత్ కీలకోపన్యాసం;
2. “ప్రొక్యూర్‌మెంట్ మరియు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ పై సాధారణ మార్గదర్శకాలు” అనే అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ప్రొక్యూర్‌మెంట్ పాలసీ విభాగం, సలహాదారుడు, శ్రీ సంజయ్ అగర్వాల్ వివరణ.
ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ చెల్లింపు విధానాలు; ఇటీవల ప్రారంభించిన సంస్కరణలు; పి.ఎఫ్.ఎం.ఎస్. (పబ్లిక్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ విధానం) అభివృద్ధి, నిర్వహణలో తాజా సాంకేతికతను ఉపయోగించడంతో సహా, పౌర ఖాతాల సంస్థ కు చెందిన పౌర కేంద్రీకృత కార్యక్రమాలను తెలియజేస్తూ, సి.జి.ఏ. సంస్థ పై రూపొందించిన ఒక లఘు చిత్రాన్ని కూడా ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు. పి.ఎఫ్.ఎం.ఎస్. అనే ఈ ఏకీకృత ఐ.టి. వేదిక ద్వారా అన్ని డి.బి.టి.లు; పన్నులు లేని రసీదులతో సహా ప్రభుత్వ చెల్లింపులు ; అకౌంటింగ్ విధులు నిర్వహించబడతాయి.
ఈ వ్యవస్థల పటిష్టత కారణంగా, కోవిడ్-19 సంక్షోభ సమయంలో కూడా ప్రభుత్వ లావాదేవీలను ఎటువంటి అవరోధాలు లేకుండా చేయడంలో "ఇండియన్ సివిల్ అకౌంట్స్ ఆర్గనైజేషన్" కీలక పాత్ర పోషించింది. అవసరమైన వైద్య సేవలు, శాంతి భద్రతలు స్థిరంగా కొనసాగడానికీ, అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికీ, చెల్లింపు మరియు రసీదు లావాదేవీల వ్యవస్థ సజావుగా పని చేయడం చాలా అవసరం.
ఈ కార్యక్రమం దూరదర్శన్; ఏ.ఎన్ .ఐ. ఛానెళ్ళ తో పాటు ఎన్.ఐ.సి. కి చెందిన వెబ్ కాస్ట్ వేదిక (https://webcast.gov.in/finmin/cga) ద్వారా కూడా ప్రత్యక్షంగా ప్రసారమౌతుంది.
*****
(Release ID: 1802157)
Visitor Counter : 229