ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

పెంచుకున్నదాన్ని పంచుకోవడంలో ఉన్న ఆనందం వెలకట్టలేనిది - ఉపరాష్ట్రపతి


జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి.. తర్వాత మాతృభూమి అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపు

మూలాలను కాపాడుకుంటూ భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించుకోవాలి

పరిపూర్ణ విద్యావికాసానికి ఉన్నతమైన, పవిత్రమైన గురు-శిష్య బంధం ఎంతో కీలకం

కరోనా సమయంలో విద్యావ్యవస్థను కొనసాగించేందుకు ఉపాధ్యాయులు శ్రమించిన తీరు అభినందనీయం

గుంటూరులో జరిగిన రామినేని ఫౌండేషన్-అమెరికా ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

విదేశాల్లో ఉంటున్న తెలుగువారికి మన సంస్కృతి, సంప్రదాయాలను అందించడంలో కృషి చేస్తున్న రామినేని ఫౌండేషన్ కు అభినందనలు

Posted On: 01 MAR 2022 12:55PM by PIB Hyderabad

కష్టపడి చదువుకుని, ఉన్నతస్థానాలకు వెళ్లి ఆర్థికంగా స్థిరపడుతున్న వారందరూ, ఆ తర్వాత తాము పెంచుకున్న సంపదను సమాజంతో పంచుకున్నప్పుడు కలిగే ఆనందం వెలకట్టలేనిదని గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నా తమ సంపదను మాతృభూమి అభివృద్ధి కోసం వినియోగించడంలో ఏమాత్రం సంకోచించవద్దని ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. 
మంగళవారం మంగళగిరిలోని సి.కె.కన్వెన్షన్ లో జరిగిన డాక్టర్ రామినేని ఫౌండషన్ – అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ‘సొంతలాభం కొంత మానుకుని... పొరుగువానికి తోడు పడవోయ్’ అన్న మహాకవి శ్రీ గురజాడ అప్పారావు గారి మాటలను ఉపరాష్ట్రపతి గుర్తుచేస్తూ.. స్వర్గీయ రామినేని అయ్యన్న చౌదరి గారు ఈ మాటలను తు.చ తప్పకుండా ఆచరించారన్నారు. 
వ్యవసాయ కుటుంబంలో పుట్టిన, గణిత శాస్త్రంలో పట్టభద్రుడై అమెరికా వెళ్ళి, అక్కడ ఆర్థిక శాస్త్రంలో ప్రావీణ్యం సంపాదించి, ప్రొఫెసర్ గా పని చేస్తూనే మరింత జ్ఞానాన్ని పెంచుకుని, వ్యాపార రంగంలోకి దిగి, అత్యున్నత స్థాయికి ఎదిగిన రామినేని అయ్యన్న చౌదరి గారి జీవితాన్ని అర్థం చేసుకోవాలని విద్యార్థులకు, యువతకు సూచించారు. ఎదిగిన చోటనే ఆగిపోకుండా, మాతృభూమికి ఏదైనా చేయాలనే తలంపుతో అమెరికాలో రామినేని ఫౌండేషన్ స్థాపించి, సేవా మార్గానికి అంకితం కావడం, ఉదాత్తమైన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం, వృద్ధి చేయడమే ప్రధాన బాధ్యతగా ఈ సంస్థ పనిచేయడం అభినందించదగిన విషయమని ఉపరాష్ట్రపతి అన్నారు. స్వయంకృషితో జీవితంలో ఉన్నతిని సాధించడం ఓ ఎత్తయితే, సమాజ సంక్షేమం కోసం కృషి చేయడం అభినందనీయమన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి పెను ప్రభావాన్ని చూపించిందన్న ఉపరాష్ట్రపతి, విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. హఠాత్తుగా ఏర్పడిన పరిణామాల కారణంగా సాంకేతికత అంతరాలు స్పష్టంగా కనిపించాయని, గ్రామాలు-పట్టణాల మధ్యలో ఉన్న ఈ అంతరాన్ని తగ్గించేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషిచేయాలన్నారు. 
కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ఎందరో ఉపాధ్యాయులు తమ విద్యార్థుల కోసం నూతన మార్గాలను అన్వేషించి మరీ విద్యను అందించారని ఉపరాష్ట్రపతి అన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఎందరో మంది గురువులు విద్యార్థుల ఇబ్బందులను గ్రహించి, వారికి సాయం చేయడమే కాకుండా, వారిలో చదువుకోవడం పట్ల ఆసక్తి తగ్గకుండా కంటికి రెప్పలా కాపాడారన్నారు. ఈ స్ఫూర్తితో తరగతి గదుల్లో నేరుగా విద్యా బోధనతోపాటు, ఆన్‌లైన్ తరగతి గదులను సమ్మిళితం చేస్తూ, సమగ్రమైన విద్యావిధానాన్ని, దూరవిద్య పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేయాల్సిన సమయం ఆసన్నమైందని ఉపరాష్ట్రపతి అన్నారు. నిజానికి కరోనా మహమ్మారి విద్యావ్యవస్థలో అనేక మార్పులకు నాంది పలికిందని పేర్కొన్నారు.
ఓవైపు మహమ్మారిని ఎదిరిస్తూనే విద్యార్థులకు చదువు చెప్పేందుకు శ్రమించిన ఉపాధ్యాయులందరినీ గౌరవించుకునే ప్రయత్నంలో భాగంగా వారికి అవార్డులు ఇవ్వడం మనందరికీ గర్వకారణమన్నారు. చదువుల్లో ప్రతిభ చూపిస్తున్న విద్యార్థులకు ప్రోత్సహించేందుకు వారికి ప్రతిభ అవార్డులతో సత్కరించడం, ఈ విద్యార్థులను ముందుకెళ్లేందుకు ప్రోత్సహించడంతోపాటు మిగిలిన విద్యార్థులకు ప్రేరణ కలిగిస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు. 
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యులు శ్రీ మోపిదేవి వెంకటరమణారావు, గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్  శ్రీమతి హెన్రీ క్రిష్టినా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శ్రీ ఆర్.పి.సిసోడియా, పూర్వ శాసనమండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు, మాజీమంత్రి శ్రీ కన్నా లక్ష్మీ నారాయణ, డాక్టర్ రామినేని ఫౌండేషన్ నిర్వాహకులు, ఛైర్మన్ శ్రీ రామినేని ధర్మప్రచారక్, సంస్థ కన్వీనర్ శ్రీ పాతూరి నాగభూషణం సహా ఫౌండేషన్ సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

***


(Release ID: 1802112) Visitor Counter : 156