ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
ప్రతి చిన్నారికీ ఐదేళ్లలోగా పోలియో చుక్కల టీకా!
కేంద్రమంత్రి మన్.సుఖ్ మాండవీయ పిలుపు..
2022 జాతీయ పోలియో నిరోధక కార్యక్రమానికి శ్రీకారం..
"ఆరోగ్యంతో కూడిన చిన్నారులు.. అంటే,
ఆరోగ్య సమాజం,.. ఆరోగ్యవంతమైన దేశం"
“ప్రధానమంత్రి పిలుపు మేరకు
సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమం కింద
దేశంలోని ప్రతి చిన్నారికీ
అన్ని వ్యాక్సీన్లూ అంది తీరాల్సిందే”
Posted On:
26 FEB 2022 1:10PM by PIB Hyderabad
జాతీయ పోలియో వ్యాధి నిరోధక ప్రత్యేక కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్.సుఖ్ మాండవీయ ఈ రోజు ప్రారంభించారు. 2022వ సంవత్సరపు జాతీయ పోలియో వ్యాధి నిరోధక కార్యక్రమం ప్రారంభానికి సూచనగా ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆయన పోలియో చుక్కల మందును వేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వికాస్ శీల్, సంయుక్త కార్యదర్శి అశోక్ బాబు, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.)లో భారతీయ ప్రతినిధి, డాక్టర్ రోడెరికో హెచ్. ఆఫ్రిన్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ మన్ సుఖ్ మాండవీయ మాట్లాడుతూ, పోలియో వ్యాధి నిరోధంకోసం భారతదేశం సాగించిన పోరాటం ఇప్పటికే విజయవంతమైందని అన్నారు. “వ్యాక్సీన్ (టీకా) ద్వారా నిరోధించగలిగిన వ్యాధులపై భారతీయ ఆరోగ్య విధానం సాధించిన విజయమిది. ఇకపై ఐదేళ్ల లోపు వయస్సున్న ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు తప్పకుండా అందేలా మనం మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య్వంతమైన చిన్నారులు అంటే, ఆరోగ్యవంతమైన సమాజం, ఆరోగ్యవంతమైన దేశం అని అర్థం చేసుకోవాలి” అని ఆయన అన్నారు.
“ఇదివరకటి కంటే ఎక్కువ వ్యాధులనుంచి చిన్నారులకు రక్షణ కల్పించే విషయమై గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని సార్వత్రిక వ్యాధినిరోధక కార్యక్రమం తన దృష్టిని కేంద్రీకరించింది. న్యూమోక్కాల్ కాంజుగేట్ వ్యాక్సీన్ (పి.సి.వి.), రోటావైరస్ వ్యాక్సీన్, మశూచీ (మీజిల్స్)-రూబెల్లా వ్యాక్సీన్ (ఎం.ఆర్.) వంటి టీకా మందులను ఈ కార్యక్రమం ద్వారా ప్రవేశపెట్టారు. మన చిన్నారులకు ఆరోగ్యపరంగా అదనపు రక్షణ కల్పించే లక్ష్యంతో ఇన్.జెక్షన్ ద్వారా ఇవ్వగలిగిన ఇనాక్టివేటెట్ పోలియో టీకా మందును కూడా తన సాధారణ వ్యాధి నిరోధక కార్యక్రమంలో భాగంగా భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇకపై మరిన్ని వ్యాధులనుంచి మన చిన్నారులను రక్షణ కల్పించేందుకు మరింతగా కృషి చేస్తున్నాం. వ్యాధి నిరోధక ప్రత్యేక కార్యక్రమం ద్వారా దేశంలోని ప్రతి చిన్నారికీ అన్ని రకాల వ్యాక్సీన్లు అందేలా చూడటం చాలా ముఖ్యం.”, అని డాక్టర్ మాండవీయ అభిప్రాయపడ్డారు.
జాతీయ వ్యాధి నిరోధక దినోత్సవం పాటించవలసిన అవసరాన్ని, ప్రాముఖ్యాన్ని గురించి ఆయన తెలియజెప్పారు. “మన చిన్నారులంతా ఆరోగ్యంగా ఉన్నపుడే స్వాస్త్య భారత్ లక్ష్యాన్ని సాధించగలం. పోలియో వంటి భయానక వ్యాధులనుంచి రక్షణ కల్పించడమే ఇంద్రధనుష్ పేరిట చేపట్టిన పోలియో టీకా ప్రత్యేక కార్యక్రమ లక్ష్యం. మన పొరుగుదేశాలేవీ ఇంకా పోలియో రహితం కానందున, పోలియో రహిత వ్యాక్సినేషన్ కార్యక్రమం అమలుపై మనం ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా రానున్న నెలల్లో ఐదేళ్ల లోపు వయస్సున్న 15కోట్లమందికిపైగా చిన్నారులంతా వ్యాధి నిరోధక వ్యాక్సీన్లు అందుకోబోతున్నారు. ఏ ఒక్క చిన్నారికీ వ్యాక్సీన్ అందని పరిస్థితి తలెత్తకుండా చూసేందుకు ఇంటింటికీ తిరిగి వ్యాక్సినేషన్ అందిస్తాం. మన ప్రధానమంత్రి పిలుపుమేరకు ఈ వ్యాధినిరోధక కార్యక్రమాన్ని ప్రజాభాగస్వామ్యంతో కూడిన జనోద్యమంగా మార్చే కృషిలో పాలుపంచుకున్న ఆరోగ్యరక్షణ కార్యకర్తలకు అభినందనలు తెలుపుతున్నాను. అలాగే, ఇతర భాగస్వామ్య వర్గాలైన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ.), యునిసెఫ్, రోటరీ క్లబ్, ఇతర ప్రభుత్వేతర స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఈ విషయంలో ఎంతో ప్రశంసనీయంగా కృషి చేయాయి. తమతమ చిన్నారులకు వ్యాక్సీన్లు అందేలా చూసేందుకు దేశంలోని కుటుంబాలన్నీ రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.”
కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి మాట్లాడుతూ, జాతీయ వ్యాధి నిరోధక కార్యక్రమ విజయాలను, ఇకపై చేపట్టవలసిన కార్యాచరణ ప్రణాళికను గురించి ప్రధానంగా వివరించారు. “భారతదేశం ఇప్పటికే పోలియో వ్యాధినుంచి పూర్తిగా విముక్తి పొందినప్పటికీ, పరిస్థితుల దృష్ట్యా మరింత నిఘాతో వ్యవహరించడం మనందరి బాధ్యత. వ్యాధి నిరోధక కార్యక్రమం సజావుగా సాగేందుకు వీలుగా పలు సంచార బృందాలను ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు తరలించాం. పొరుగుదేశాలేవీ ఇప్పటికీ పోలియోనుంచి విముక్తి పొందలేదు కాబట్టి, సరిహద్దుల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇకపై కూడా క్రమం తప్పకుండా పటిష్టంగా అమలు చేయాల్సిందే.” అని ఆయన అన్నారు.
జాతీయ పోలియో నిరోధక ప్రత్యేక కార్యక్రమం,
జాతీయ పోలియో నిరోధక దినం-2022:
2022వ సంవత్సరపు జాతీయ పోలియో నిరోధక దినాన్ని ఫిబ్రవరి 27వ తేదీ ఆదివారంనాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. పోలియో రహిత స్థితిని సాధించే లక్ష్యంతో, ప్రజలందరికీ ఈ వ్యాధినుంచి విముక్తి కలిగించేందుకు ప్రతి సంవత్సరం రెండు ఉపజాతీయ వ్యాధినిరోధక దినోత్సవాలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. జాతీయ పోలియో నిరోధక దినం సందర్భంగా దేశంలోని 36రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని, 735జిల్లాల్లో 15కోట్లమందికి పైగా చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని వర్తింపజేస్తారు. ఈ సందర్భంగా దేశంలోని దాదాపు 23.6కోట్లమేర ఇళ్లను 24లక్షలమంది వాలంటీర్లు, లక్షన్నరమంది పర్యవేక్షలు సందర్శిస్తారు. స్థానిక పరిస్థితుల కారణంగా, మేఘాలయ రాష్ట్రం ఇప్పటికే 2022 జనవరి 24వ తేదీన వ్యాధినిరోధక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. మిజోరాం 2022, మార్చి ఒకటిన కార్యక్రమాన్ని నిర్వహించబోతోంది. ఇక ఎన్నికలు జరుగుతున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 20న, మణిపూర్.లో మార్చి 24న జాతీయ వ్యాధి నిరోధక దినాలను నిర్వహించనున్నారు. మొదట, ఆయా పోలింగ్ బూత్.ల పరిధిలో వ్యాక్సినేషన్ అమలు చేసిన అనంతరం, బూత్.ల వద్ద కూడా టికా చుక్కల మందు అందని చిన్నారులను గుర్తించేందుకు ఇంటింటి సర్వేని కూడా నిర్వహిస్తారు. రెండుంచి ఐదు రోజుల వ్యవధిలో అవసరమైన వారందరికీ వ్యాక్సినేషన్ అమలు చేస్తారు. ప్రయాణంలో ఉన్న చిన్నారులకు వ్యాధి నిరోధక టీకా మందును అందించేందుకు బస్ టర్మినల్స్, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు తదితర ప్రాంతాలకు కూడా వ్యాక్సినేషన్ బృందాలను తరలించారు. ప్రాణ రక్షక టీకామందు చిన్నారులందరికీ అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాలన్నీ అమలు చేస్తారు.
భారతదేశంలో చివరి పోలియో కేసు నమోదై ఇప్పటికే దశాబ్ద కాలం దాటింది. చివరి పోలియో కేసు 2011వ సంవత్సరం జనవరి 13వ తేదీన నమోదైంది. అయినా, పొరుగుదేశాలైన ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్.ల నుంచి పోలియో వైరస్ తిరిగి దేశంలో ప్రవేశించకుండా నివారించేందుకు భారతదేశం ఎంతో అప్రమత్తతతో పనిచేస్తూవస్తోంది. ఎందుకంటే ఆ రెండు దేశాల్లో ఇప్పటికీ వ్యాధికారక పోలియో వైరస్ కేసులు నమోదవుతూ వస్తున్నాయి.
కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఈ వ్యాధి నిరోధక కార్యక్రమం అమలుకోసం కోవిడ్ నిబంధనలను కచ్చితంగా పాటించారు. బూత్.ల స్థాయిలో జనం గుమికూడకుండా నివారించడం, భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు పరిశుభ్రపరుచుకోవడం వంటి నిబంధనలను పాటిస్తూ, చక్కగా వెలుతురు ప్రసరించే ప్రాంతాల్లోనే చిన్నారులకు పోలియో టీకా చుక్కల మందును అందించారు.
****
(Release ID: 1801462)
Visitor Counter : 371