జల శక్తి మంత్రిత్వ శాఖ
‘ప్రతి ఇంటికీ నీరు’ లక్ష్యం వంద జిల్లాల్లో సాకారం!
-జలజీవన్ మిషన్- మరో మైలురాయి
ఈ లక్ష్యం సాధించిన100వ జిల్లాగా రికార్డు సాధించిన
హిమాచల్ ఆశావహ జిల్లా ‘చంబా’...
-2024నాటికి పల్లెల్లోని ప్రతి ఇంటికీ కుళాయి నీరు-
ఈ లక్ష్యసాధన దిశగా జలజీవన్ మిషన్ పురోగమనం
Posted On:
18 FEB 2022 4:32PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా 9కోట్ల ఇళ్లకు కుళాయిల ద్వారా మంచినీరు అందించే లక్ష్యాన్ని ఈ నెల 16వ తేదీన సాధించిన జలజీవన్ మిషన్ పథకం తాజాగా మరో మైలురాయిని అధిగమించింది. నేటితో దేశంలోని వంద జిల్లాల్లో ప్రతి ఇంటికీ నీటి కుళాయిలు అమర్చిన రికార్డును సొంతం చేసుకుంది. ‘ప్రతి ఇంటికీ నీరు’ అన్న లక్ష్యాన్ని సాధించిన 100వ జిల్లాగా హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లా నిలిచింది. ఇది ఈ రికార్డు సాధించిన దేశంలోని ఐదవ ఆశావహ జిల్లాగా కూడా చంబా మరో ఘనతను సాధించింది. ఈ రికార్డును ఇప్పటికే సొంతం చేసుకున్న మిగతా ఆశావహ జిల్లాల్లో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, జైశంకర్ భూపాలపల్లి, కొమరం భీం ఆసిఫాబాద్, హర్యానాలోని మేవాట్ జిల్లాలు ఉన్నాయి.
దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికీ 2024వ సవంత్సరం నాటికల్లా పరిశుభ్రమైన నీటిని కుళాయిల ద్వారా అందించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలను సాకారం చేసేందుకు జలజీవన్ మిషన్ పథకం కింద ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. గత రెండున్నరేళ్ల తక్కువ వ్యవధిలోనే కోవిడ్-19 వైరస్ మహమ్మారి వ్యాప్తి, లాక్ డౌన్ ఆంక్షలు ఎదురైనప్పటికీ, ఈ పథకం కింద 5.78కోట్లకు పైగా ఇళ్లకు నీటి కుళాయిలను అమర్చారు. దీనితో దేశంలోని 100 జిల్లాల్లో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా పరిశుద్ధమైన నీటి సరఫరా జరుగుతోంది. 2024 నాటికల్లా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ కుళాయి నీటిని సరఫరా చేయాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసే దిశగా జలజీవన్ మిషన్ ముందుకు సాగుతోంది.
2019వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన జలజీవన్ మిషన్ ప్రకటించిన సమయానికి దేశవ్యాప్తంగా 19.27కోట్ల ఇళ్లకుగాను, కేవలం 3.23 కోట్ల ఇళ్లకు (17శాతం ఇళ్లకు) మాత్రమే నీటి కుళాయిల కనెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ పేరిట ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకుని, ‘ప్రతి ఇంటికీ నీరు’ అన్న లక్ష్య సాధనకు దేశంలో బృహత్తర స్థాయిలో కృషి జరిగింది. అతి తక్కువ వ్యవధిలోనే 100 జిల్లాలు, 1,138 బ్లాకులు, 66,328 గ్రామ పంచాయతీలు, 1,36,803 గ్రామాల్లో ఈ లక్ష్యాన్ని సాధించ గలిగారు. గోవా, హర్యానా, తెలంగాణ, పుదుచ్చేరి, దాదర్-నాగర్ హవేలీ, డామన్-డయ్యూ ప్రాంతాల పరిధిలోని ప్రతి గ్రామీణ ఇంటికీ కుళాయిల ద్వారా నీటి సరఫరాను ఏర్పాటు చేయగలిగారు. ‘ప్రతి ఇంటికీ నీరు’ అందించడంలో మరిన్ని రాష్ట్రాలు కూడా గణనీయమైన ఫలితాలు సాధించి లక్ష్య సాధన దిశగా పురోగమిస్తున్నాయి. ఈ విషయంలో పంజాబ్ (99శాతం), హిమాచల్ ప్రదేశ్ (92.5శాతం), గుజరాత్ (92.5శాతం), బీహార్ (92శాతం) చక్కని ఫలితాలను సాధించాయి.
ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ నీటి కుళాయిలను అమర్చాలన్న ఈ బృహత్తర కార్యక్రమంలో ఆశించిన లక్ష్యాల సాధనకోసం రూ. 3.60లక్షల కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రతి ఇంటికీ నీరు లక్ష్య సాధనలో భాగంగా 3.8కోట్ల ఇళ్లకు నీటి కుళాయిల ఏర్పాటు కోసం 2022-23సంవత్సరపు బడ్జెట్లో రూ. 60,000కోట్లను కేటాయించారు.
దీనికి తోడుగా, 2021-22లో వివిధ రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం గ్రాంటుతో అనుసంధానించిన గ్రాంటు కింద, రూ. 26,940కోట్లను కేటాయించారు. గ్రామీణ స్థానిక సంస్ధలు, పంచాయతీ రాజ్ సంస్థలకు నీటి సరఫరా, పారిశుద్ధ్య ఏర్పాట్ల కింద ఈ నిధుల కేటాయింపు జరిగింది. వచ్చే ఐదేళ్ల వరకూ అంటే 2025-26వ సంవత్సరం వరకూ తప్పనిసరిగా అందించే నిధుల కింద రూ. 1,42, 084 కోట్లను ఈ పథకానికి అందుబాటులో ఉంచారు. దేశ వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పెడుతున్న ఈ భారీ స్థాయి పెట్టుబడులతో ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా ఊపందుకుంటుంది. అదే సమయంలో గ్రామ ప్రాంతాల్లోని యువజనులకు గణనీయంగా ఉపాధి కల్పనా అవకాశాలు లభిస్తాయి.
గతంలో చేపట్టిన నీటి సరఫరా పనులకు, కార్యక్రమాలకు విభిన్నమైన రీతిలో జలజీవన్ మిషన్ కార్యక్రమాలను చేపట్టారు. నీటి సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించడం మాత్రమే కాకుండా, నీటి పంపిణీ బాధ్యతలపై కూడా జలజీవన్ మిషన్ దృష్టిని కేంద్రీకరించింది. ఏ ఒక్క కుటుంబానికీ నీటి సరఫరా అందని పరిస్థితి ఎదురుకాకూడదన్న మూల సిద్ధాంతంతో జలజీవన్ మిషన్ పథకాన్ని చేపట్టారు. తద్వారా, సామాజిక, ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికీ కుళాయి ద్వారా నీరు లభించేలా కార్యక్రమాన్ని రూపొందించారు. సుదూర ప్రాంతాలనుంచి నీటిని మోసుకువచ్చేందుకు ఎన్నో శతాబ్దాలుగా తల్లులు, సోదరీమణులు పడుతున్న ప్రయాసను తప్పించేందుకు, వారి ఆరోగ్యాన్ని, విద్యా, సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు జలజీవన్ మిషన్ పథకాన్ని చేపట్టారు. గ్రామీణ కుటుంబాలు సౌకర్యవంతమైన, గౌరవ ప్రదమైన జీవితం గడిపేలా చూడటమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
జల జీవన్ మిషన్ పథకం కింద కుళాయిల ద్వారా నీటి సరఫరాను ఏర్పాటు చేసేందుకు పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. నీటి నాణ్యత దెబ్బతిన్న గ్రామాలకు, ఆశావహ జిల్లాలకు, షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగల జనాభా ప్రాబల్యం కలిగిన గ్రామాలకు, నీటి కొరతను ఎదుర్కొనే గ్రామాలకు, సంసద్ ఆదర్శ గ్రామ యోజన (ఎస్.ఎ.జి.వై.) అమలులో ఉన్న గ్రామాలకు ఈ పథకం కింద ప్రాధాన్యం ఇస్తున్నారు. కడచిన 24 నెలల వ్యవధిలో ఇళ్లకు అమర్చిన నీటి సరఫరా కుళాయిల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. దేశంలోని 117 ఆశావహ జిల్లాల పరిధిలో నీటి సరఫరా అందుకుంటున్న కుటుంబాల సంఖ్య 24 లక్షల నుంచి (7.17శాతం నుంచి), 1.37కోట్లకు (40శాతానికి) పెరిగింది.
అలాగే, మెదడు వాపు వ్యాధి (జపనీస్ ఎంసెఫలిటీస్), అక్యూట్ ఎంసెఫలిటీస్ సిండ్రోమ్ వ్యాధితో ప్రభావితమైన 61 జిల్లాల్లోని 1.15 కోట్ల ఇళ్లకు (అంటే 38శాతం ఇళ్లకు) నీటి కుళాయిలను ఏర్పాటు చేశారు. జలజీవన్ మిషన్ పథకం ప్రకటించడానికి ముందునాటి పరిస్థితిని పరిశీలించినపుడు, మెదడు వాపు వ్యాధితో ప్రభావితమైన జిల్లాల్లో 8 లక్షల ఇళ్లకు (అంటే 2.64శాతం ఇళ్లకు) మాత్రమే నీటి కుళాయిలు అందుబాటులో ఉండేవి. ఇక నీటి నాణ్యత సరిగా లేని ప్రాంతాల్లో ఉపరితల నీటి సరఫరా వ్యవస్థల ఏర్పాటుకు మరింత వ్యవధి పట్టే అవకాశం ఉన్నందున, తాత్కాలికంగా, సామూహిక నీటి శుద్ధీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఇంటిలో ఒక్కొక్కరికీ రోజూ 8నుంచి 10లీటర్ల చొప్పున శుద్ధిచేసిన సురక్షితమైన నీటిని సరఫరా చేసే లక్ష్యంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా పాఠశాలల్లో, అంగన్ వాడీ కేంద్రాల్లో ఉన్న చిన్నారుల ఆరోగ్యం, సంక్షేమం కాపాడే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందరోజుల ప్రచారోద్యమ కార్యక్రమాన్ని ప్రకటించారు. 2020వ సంవత్సరం అక్టోబరు 2న కేంద్ర జలశక్తిమంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఇప్పటి వరకూ, అంటే 16 వెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా 8.47లక్షల పాఠశాలలకు (82శాతం), 8.67లక్షల అంగన్ వాడీ కేంద్రాలకు (78శాతం) కుళాయిల ద్వారా నీటిని ఏర్పాటు చేశారు. తాగునీటి అవసరాలకు, మధ్యాహ్నం భోజనం తయారీకి, మరుగుదొడ్లలో వినియోగ అవసరాలకు ఈ నీటి కుళాయిలను ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో 93 వేలవరకూ వర్షపునీటి సంరక్షణ సదుపాయాలు, లక్షా 8వేల మురుగునీటి శుద్ధి, పునర్వినియోగ నిర్మాణాలు ఏర్పాటు చేశారు. అండమాన్-నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, దాద్రా-నాగర్ హవేలీ, డయ్యూ-డామన్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కాశ్మీర్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పాఠశాలన్నింటిలోనూ కుళాయిల ద్వారా నీటి సరఫరాకు ఏర్పాట్లు చేశారు. మిగిలిన స్కూళ్లలో, అంగన్ వాడీ కేంద్రాల్లో సాధ్యమైనంత త్వరగా పరిశుద్ధమైన కుళాయి నీటిని అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
జలజీవన్ మిషన్ పథకంలో ప్రజాసంఘాలకు, కీలకపాత్ర ఉంటుంది. ప్రణాళిక దశనుంచి అమలు దశ వరకూ, నీటి సరఫరా సదుపాయాల నిర్వహణ వరకూ వరకూ ప్రజా సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఇందుకోసం గ్రామ నీటి సరఫరా, పారిశుద్ధ్య కమిటీలు (వి.డబ్ల్యు.ఎస్.సి.), పానీ సమితులు ఏర్పాటు చేసి వాటిని మరింత బలోపేతం చేస్తున్నారు. గ్రామ స్థాయిలో కార్యాచరణ ప్రణాళికను ప్రజాసంఘాల ప్రమేయంతోనే రూపొందిస్తున్నారు; పథకం అమలుచేయడం, ప్రజల్లో అవగాహన కల్పించడం తదితర అంశాల్లో గ్రామ స్థాయి ప్రజా సంఘాలకు సహాయ పడేందుకుగాను,.. పలు మద్దతు ఏజెన్సీలను (ఐ.ఎస్.ఎ.లను) వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 4.70లక్షల వరకూ వి.డబ్ల్యు.ఎస్.సి.లు (పానీ సమితులు) ఏర్పాటయ్యాయి. 3.83 లక్షలకు పైగా గ్రామ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించగలిగారు.
జలజీవన్ మిషన్ పథకం కింద చేపట్టే పనుల్లో పారదర్శకత, జవాబ్దారీతనం లక్ష్యంగా ఈ పథకంపై పూర్తి సమాచారాన్ని పబ్లిక్ డొమైన్.లో, జలజీవన్ మిషన్ డ్యాష్ బోర్డులో పొందుపరిచారు. ఇంటర్నెట్.లో ఈ లింకు (https://ejalshakti.gov.in/jjmreport/JJMIndia.aspx) ద్వారా పథకంపై పూర్తి సమాచారాన్ని ఎవరైనా తెలుసుకోవచ్చు.
****
(Release ID: 1799381)
Visitor Counter : 234