ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో వృద్ధి చెందుతున్న - డిజిటల్ ఆరోగ్య సంరక్షణ సేవలు

Posted On: 08 FEB 2022 12:37PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవల పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడానికి డిజిటల్ ఆరోగ్య సంరక్షణ సేవల సామర్థ్యాన్ని భారత ప్రభుత్వం గుర్తించింది.  ఈ దిశగా, డిజిటల్ ఆరోగ్య కార్యక్రమాల అమలు కోసం వివిధ పథకాలు / కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది. 

ఆరోగ్య రంగంలో డిజిటల్ ఆరోగ్య సాంకేతికతల అమలుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించేందుకు "ఆయుష్మాన్-భారత్-డిజిటల్-మిషన్" - ఏ.బి.డి.ఎం.  ను ప్రారంభించడం జరిగింది.   ఏ.బి.డి.ఎం. కింద, హెల్త్ ఐ.డి., హెల్త్ ప్రొఫెషనల్ రిజిస్ట్రీ (హెచ్.పి.ఆర్), హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (హెచ్.ఎఫ్.ఆర్) తో పాటు సమాచార మార్పిడి కోసం డిజిటల్ మౌలిక సదుపాయాలు అనే మూడు కీలక రిజిస్ట్రీ లను అభివృద్ధి చేయడం జరిగింది.   ఏ.బి.డి.ఎం. క్రింద నెలకొల్పిన ఈ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థ, నిరంతర సంరక్షణను నిర్ధారించడం కోసం, ప్రాథమిక, ద్వితీయ మరియు తృతీయ సౌకర్యాలలో ఎటువంటి అవరోధాలు లేని సమాచార మార్పిడికి మద్దతు ఇస్తుంది.  పునరావృత పరీక్షలను తగ్గించడం, ఖచ్చితమైన ఔషధం, అనుకూలమైన చికిత్సా ప్రణాళికలు, నాణ్యమైన సేవలతో పాటు, తక్కువ ఖర్చుతో పౌరులు ప్రయోజనం పొందుతారు. 

కోవిడ్ తో పాటు ఇతర వ్యాధుల కోసం పౌరులకు ఉచిత టెలి-కన్సల్టేషన్ సేవలను అందించడం కోసం, భారత ప్రభుత్వం ఇ-సంజీవని టెలి-మెడిసిన్ విధానాన్ని కూడా ముందస్తుగా అమలు చేసింది.  హెల్త్ & వెల్నెస్ కేంద్రాల్లో (హెచ్.డబ్ల్యూ.సి.లు) ప్రత్యక్ష సంప్రదింపులతో పాటు, పౌరులకు వారి ఇంటి నుంచే, ఆన్‌-లైన్-కన్సల్టేషన్ ద్వారా వైద్యులు / నిపుణులు వైద్య సేవలు అందించే ఈ విధానం, 36 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో పనిచేస్తోంది. 

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, ఈ రోజు రాజ్యసభకు లిఖితపూర్వకంగా సమర్పించిన సమాధానంలో ఈ సమాచారాన్ని పొందుపరిచారు. 

*****



(Release ID: 1796681) Visitor Counter : 109