ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19పై ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధత.. జాతీయ కోవిడ్‌-19 టీకాల ప్రగతిపై 8 రాష్ట్రాలు/యూటీలతో డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ సమీక్ష


కోవిడ్‌ నిర్వహణలో కేంద్రం/రాష్ట్రాల సమన్వయంపై కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రశంస;

కోవిడ్‌-19 నిరోధంలో ‘పరీక్ష.. అన్వేషణ.. చికిత్స.. టీకా.. కోవిడ్‌ సముచిత ప్రవర్తన’ ఐదంచెల వ్యూహంపై దృష్టి సారించడంపై మంత్రి పునరుద్ఘాటన;

మహమ్మారిపై పోరులో పరస్పర అవగాహన.. ఉత్తమాచరణల భాగస్వామ్యం..
సహకార స్ఫూర్తి మనకు తోడ్పడ్డాయి: డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ”;

“ భారత కోవిడ్‌-19 టీకాల కార్యక్రమం… ముఖ్యంగా అత్యధిక
జనాభాగల మన దేశంలో ఒక అంతర్జాతీయ విజయగాథ”

Posted On: 28 JAN 2022 6:27PM by PIB Hyderabad

   హమ్మారిపై యుద్ధంలో కేంద్ర, రాష్ట్రాల మధ్య పరస్పర అవగాహన, ఉత్తమాచరణల భాగస్వామ్యం, సహకార స్ఫూర్తి దేశానికి ఎంతగానో తోడ్పడ్డాయి” అని కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ అన్నారు. అంతేకాకుండా కేంద్ర-రాష్ట్రాల మధ్య సమన్వయం కూడా ఎంతో చక్కగా ఉన్నదని ఇవాళ ఎనిమిది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ప్రశంసించారు. దక్షిణ భారతంలోని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అండమాన్‌-నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌)  ఆరోగ్యశాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు, పాలన యంత్రాంగం అధినేతలు ఇందులో పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య-కుటుంబ సంక్షేమశాఖ సహాయమంత్రి డాక్టర్‌ భారతతి ప్రవీణ్‌ పవార్‌తోపాటు పుదుచ్చేరి ముఖ్యమంత్రి శ్రీ ఎన్‌.రంగస్వామి కూడా సమీక్షలో పాలుపంచుకున్నారు.

   దేశంలో కోవిడ్‌-19 నిరోధం, నిర్వహణపై ప్రజారోగ్య వ్యవస్థ సంసిద్ధత, జాతీయ కోవిడ్‌-19 టీకాల ప్రగతిపై సమీక్ష నిమిత్తం ఈ వాస్తవిక సాదృశ మాధ్యమ సమావేశం నిర్వహించబడింది. ఈ ఉన్నతస్థాయి సమీక్షలో ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖల మంత్రులు డాక్టర్‌ కె.సుధాకర్‌ (కర్ణాటక), డాక్టర్‌ వీణా జార్జ్‌ (కేరళ), శ్రీ ఎం.ఎ.సుబ్రమణియం (తమిళనాడు), శ్రీ తన్నీరు హరీష్‌ రావు (తెలంగాణ) పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతుతోపాటు అవసరం మేరకు కోవిడ్‌ టీకాలు సరఫరా చేయడంపై రాష్ట్రాల ఆరోగ్యశాఖల మంత్రులు ఏకగ్రీవంగా కృతజ్ఞతలు తెలిపారు.

   సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మాట్లాడుతూ- దేశంలోని వయోజనులలో 95 శాతానికి తొలి మోతాదు టీకా పూర్తికాగా, 74 శాతానికి రెండు మోతాదులూ పూర్తికావడం విశేషమని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా “ భారత కోవిడ్-19 టీకాల కార్యక్రమం… ముఖ్యంగా అత్యధిక జనాభాగల మన దేశంలో అంతర్జాతీయ విజయగాథకు నిదర్శనం” అని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్త కోవిడ్‌-19 టీకాల కార్యక్రమానికి మరింత ఊపునిచ్చే దిశగా ఈ నెల నుంచీ ముందుజాగ్రత్త టీకా మోతాదుసహా 15-17 వయోవర్గంలోని యుక్తవయస్కులకూ టీకాలు ఇవ్వడం ప్రారంభించామని మంత్రి గుర్తుచేశారు. దీనికి సంబంధించి ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల అవసరాలపై అంచనాలకు మించి రెండు రకాల టీకాలనూ సరఫరా చేసినట్లు తెలిపారు. ఆ మేరకు టీకాల కార్యక్రమ వేగంలో అంతరాయానికి తావులేకుండా జాగ్రత్త వహించామని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో రెండో మోతాదు టీకాసహా 15-17 వయోవర్గంలోని యుక్తవయస్కులకు టీకాలివ్వడాన్ని మరింత వేగిరపరచాలని ఆయన రాష్ట్రాలను కోరారు.

   మారుమూల ప్రాంతాల్లోని, ఏకాంత గృహనిర్బంధంలోగల కోవిడ్‌ రోగులకు సేవలందించడంలో దూరవైద్య సంప్రదింపులు, దూరవైద్య చికిత్స కీలకపాత్ర పోషించడాన్ని డాక్టర్‌ మాండవీయ ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో మెరుగైన ప్రజారోగ్య నిర్వహణకు కూడలి-శాఖ నమూనాలో భాగంగా మరిన్ని దూరవైద్య కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించాలని ఆయన రాష్ట్రాలకు సూచించారు. “దూరవైద్య సంప్రదింపు కేంద్రాలు కోవిడ్ మహమ్మారి సమయంలోనే కాకుండా కోవిడేతర వైద్య సంరక్షణ సేవల్లోనూ మనకు ఎంతగానో తోడ్పడతాయి” అని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కేరళ ఆరోగ్యశాఖ మంత్రి స్పందిస్తూ- కేన్సర్, మధుమేహం నిర్వహణ, మానసిక ఆరోగ్యం తదితర కోవిడేతర వైద్య సంరక్షణలో భాగంగానే కాకుండా సంస్థాగత సౌకర్యాలను పొందలేని స్థితిలోగల ఏకాంత గృహనిర్బంధంలోని వారికి దూరవైద్య కేంద్రాల ద్వారా సేవలు అందించామని తెలిపారు. కాగా, ‘ఇ-సంజీవని’ కింద అత్యధిక సంఖ్యలో దూరవైద్య సంప్రదింపుల ద్వారా చక్కని ప్రగతి కనబరచిన ఆంధ్రప్రదేశ్,  కర్ణాటక ప్రభుత్వాల కృషిని సమావేశం కొనియాడింది.

   దేశంలో బలమైన, ప్రతిరోధక ఆరోగ్య మౌలిక సదుపాయాల అవసరాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నొక్కిచెప్పారు. ఇందుకోసం ‘ఈసీఆర్‌పీ-2’ ప్యాకేజీ కింద రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు నిధులు విడుదల చేసిన నేపథ్యంలో వాటిని 2022 మార్చి 31లోగా సద్వినియోగం చేయాలని స్పష్టం చేశారు. “ఆరోగ్య మౌలిక వసతుల కల్పనకు ఆమోదించిన నిధుల సమర్థ వినియోగంలో కొన్ని రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అయితే, ఇతర రాష్ట్రాలు కూడా ‘ఈసీఆర్‌పీ-2’ కింద చేపట్టిన పనుల భౌతిక, ఆర్థిక ప్రగతిని సమీక్షించుకోవాలి” అని ఆయన సూచించారు.

   కోవిడ్‌ నిర్వహణలో భాగంగా కేసులపై సమర్థ నిఘాతోపాటు ‘పరీక్ష, అన్వేషణ, చికిత్స,  టీకా, కోవిడ్‌ సముచిత ప్రవర్తన’ అనే ఐదంచెల వ్యూహానికీ కట్టుబడాల్సిన ఆవశ్యకతను డాక్టర్‌ మాండవీయ పునరుద్ఘాటించారు. ఈ మేరకు కేసుల సంఖ్య అత్యధికంగాగల, కొత్తగా ఆవిర్భవిస్తున్న జనసముదాయాలపై నిశిత నిఘా పెట్టాలని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఆయన సూచించారు. కోవిడ్‌ పరీక్షలకు సంబంధించి ‘ఆర్టీపీసీఆర్‌’ వాటా విషయంలో వెనుకబడి ఉన్న రాష్ట్రాలు ప్రస్తుత పరిస్థితిని సమీక్షించుకోవాలని కోరారు. సకాలంలో, తగిన సంఖ్యలో పరీక్షల నిర్వహణ వల్ల వ్యాధి సోకినవారిని తక్షణం గుర్తించడం ద్వారా ఒక్కసారిగా కేసుల పెరుగుదల పరిస్థితిని నివారించవచ్చునని పేర్కొన్నారు. కోవిడ్‌పై ప్రతిస్పందన, నిర్వహణలో రాష్ట్రాల కృషికి కేంద్రం అన్నివిధాలా చేయూతనిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చారు. అయితే, దృఢమైన-సమర్థ విధాన నిర్ణయాలకు వీలుగా సంబంధిత సమాచారం సకాలంలో తమకు అందడం ముఖ్యమని ఆయన గుర్తుచేశారు.

   సీఆర్‌పీ-2 నిధులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ భారతి ప్రవీణ పవార్‌ అన్ని రాష్ట్రాలకూ సూచించారు. ఈ మేరకు ప్రయోగశాలల బలోపేతం, మందుల కొరత ఉన్నట్లయితే సకాలంలో కొనుగోలు ఆర్డర్లు జారీ చేయడం, ‘పీఎస్‌ఏ’ ప్లాంట్ల ఏర్పాటును వేగిరపరచడం, మరిన్ని దూరవైద్య సంప్రదింపు కేంద్రాల ఏర్పాటు తదితరాలపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు శ్రద్ధ పెట్టాలని ఆమె కోరారు. భవిష్యత్తులో రోగులకు చికిత్స అందించే దిశగా దూరవైద్య సంప్రదింపు కేంద్రాలు ఎంతగానో దోహదం చేయగలవని ఆమె నొక్కిచెప్పారు. అలాగే కోవిడ్‌తోపాటు ఇతర అనారోగ్యాలున్న వారి విషయంలో ప్రత్యేకంగా దృష్టిసారించాల్సి ఉందని స్పష్టం చేశారు.

   కోవిడ్‌ నిర్వహణ, నిరోధానికి సంబంధించిన అనేక అంశాలపై సమావేశం సమగ్రంగా, సవివరంగా చర్చించింది. ఈ మేరకు కోవిడ్‌ పరీక్షలు, ఆస్పత్రులలో పడకల లభ్యత, రోగలక్షణాలుగల-వ్యాధిపీడితుల పెరుగుదల, ఆస్పత్రి మౌలిక వసతుల పెంపు, పరీక్షల సంఖ్య పెంపు, వ్యాధి వ్యాప్తి వేగాన్ని ఛేదించే కఠినమైన నియంత్రణ చర్యలు, కోవిడ్‌ సముచిత ప్రవర్తన ప్రాముఖ్యంపై ప్రజల్లో అవగాహన పెంపు తదితరాలపై క్రమబద్ధ పర్యవేక్షణ ఉండాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. దీనిపై కర్ణాటక ప్రతినిధులు స్పందిస్తూ- తమ రాష్ట్రంలోని 8 ప్రాంతాల్లో ఒక్కొక్కటి వంతున ‘అత్యవసర కేంద్రాలు’ ఏర్పాటు చేశామని, ఇవి సీనియర్‌ అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తున్నాయని తెలిపారు. కోవిడ్‌ మహమ్మారి నియంత్రణ దిశగా తాము వైద్య సిబ్బంది సంఖ్యను పెంచామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వివరించారు. అలాగే తమ రాష్ట్రాల్లో ‘జ్వర పీడితుల సర్వే’ నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు తెలిపాయి. ఈ మేరకు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి, ఆయా కుటుంబాల్లో జ్వరం, ఇతరత్రా శ్వాసకోశ వ్యాధులపై అధ్యయనం చేశారని పేర్కొన్నాయి. కాగా, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో పడకల లభ్యతపై ఎప్పటికప్పుడు సమాచారం అందించేలా ‘ఆస్పత్రి పడకల నిర్వహణ వ్యవస్థ’ను ఏర్పరచినట్లు తెలంగాణ తెలిపింది. దీంతోపాటు కోవిడ్‌ బాధిత కుటుంబాలపై పర్యవేక్షణ, మందుల పంపిణీద్వారా మద్దతు, పరీక్ష కిట్ల లభ్యత వగైరాలకోసం బహుళ విభాగ బృందాలను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ బృందాలు నిత్యం సుమారు 40-50 ఇళ్లను సందర్శిస్తున్నాయని తెలిపింది.

   ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ రాజేష్‌ భూషణ్‌, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ, ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి డాక్టర్‌ మనోహర్‌ యజ్ఞానీ, సంయుక్త కార్యదర్శి శ్రీ లవ్‌ అగర్వాల్‌, ఎన్‌సీడీసీ డైరెక్టర్‌ డాక్టర్‌ సుజీత్‌ సింగ్‌లతోపాటు ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

***



(Release ID: 1793475) Visitor Counter : 115