ఉప రాష్ట్రపతి సచివాలయం
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 75 శాతం ఓటింగ్ జరిగేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత: ఉపరాష్ట్రపతి
- ఏకకాలంలో అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరపడంపై ఏకాభిప్రాయ సాధన జరగాలని అభిప్రాయపడిన ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు*
- స్వాతంత్ర్య భారతంలో 2019 ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం పెరగడంపై హర్షం*
- ఎన్నికల ప్రక్రియను మరింత ముందుకు తీసుకెళ్లడంలో సాంకేతికతను సద్వినియోగం చేసుకోవాలని సూచన*
- అభ్యర్థులను వారి యోగ్యత ఆధారంగా ఎన్నుకోవాలని ఉపరాష్ట్రపతి సూచన*
- ఈ దిశగా ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలను అభినందించిన ఉపరాష్ట్రపతి*
Posted On:
25 JAN 2022 1:21PM by PIB Hyderabad
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 75 శాతం ఓటింగ్ శాతం నమోదయ్యేలా ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని ఎన్నికల సంఘంతో పాటు, భారత పౌరులకు గౌరవ భారత ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఓటింగ్ శాతం పెరగడం, ఎన్నికల ప్రక్రియ సాఫీగా కొనసాగడం ద్వారానే ప్రజాస్వామ్యయుతమైన వ్యవస్థ మరింత సమగ్రంగా ముందుకెళ్ళగలదని ఆయన పేర్కొన్నారు. దేశంలో అభివృద్ధి అడ్డంకుల్లేకుండా ముందుకెళ్లేందుకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని శాసనసభ స్థానాలకు, పార్లమెంటు స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉందని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు, సంబంధిత వర్గాల మధ్య ఏకాభిప్రాయ సాధన అత్యంత ఆవశ్యకమని ఆయన అభిప్రాయపడ్డారు.
12వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఎన్నికల సంఘం ఢిల్లీలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి తన సందేశాన్ని పంపించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ కరోనా నియమనిబంధనల మేరకు స్వీయనిర్బంధంలో ఉన్న ఆయన హైదరాబాద్ నుంచే తమ సందేశాన్ని పంపించారు. ఈ సందేశాన్ని మంగళవారం ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చదివి వినిపించారు. ఎన్నికల బరిలో నిలిచిన వారి యోగ్యత ఆధారంగానే వారికి ఓటేసి చట్టసభలకు పంపించాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కిచెప్పారు. ఈ ప్రక్రియలో ఓటు అర్హత ఉన్న ప్రతి పౌరుడు తన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన సూచించారు.
1951-52లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో 44.87 శాతం ఓటింగ్ నమోదు జరిగిందని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి, 2019లో జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఓటింగ్ శాతం 67.40 శాతానికి పెరగడం శుభపరిణామమని ఆయన అన్నారు. నాటి పరిస్థితులతో పోలిస్తే అధిక శాతం పెరుగుదల కనిపించడంలో కృషిచేసిన ఎన్నికల సంఘం, ఇతర భాగస్వామ్య పక్షాలను ఉపరాష్ట్రపతి అభినందించారు. స్వాతంత్ర్య భారతదేశంలో ఎన్నికల సంస్కరణలు తీసుకురావడంలో, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎన్నికల సంఘం చేస్తున్న కృషిని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.
అయితే ఓటర్లు స్వేచ్ఛగా ఓటింగ్ లో పాల్గొనేలా చేయడంలో ఉన్న అడ్డంకులను పరిష్కరించడం, సమగ్రమైన ఎన్నికల వ్యవస్థను తీసుకురావడం ఎన్నికల సంఘం ముందున్న సవాళ్లలో ఒకటని ఉపరాష్ట్రపతి అన్నారు.
‘స్వాతంత్ర్యం సాధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మనమంతా కొన్ని సంకల్పాలతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కనీసం 75 శాతం ఓటింగ్ నమోదయ్యేలా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత. ఇందులో ఎన్నికల సంఘం చేస్తున్న కృషికి బాధ్యతాయుతమైన దేశ పౌరులుగా మనందరి తోడు ఉండాలి. దేశవ్యాప్తంగా శాసనసభలు, పార్లమెంటు స్థానాలకు ఏకకాలంలో ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయసాధనతో ముందుకెళ్లాలి. వివిధ ప్రాంతాల్లో వివిధ సమయాల్లో జరిగే ఎన్నికల కారణంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి వేగానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఈ దిశగా ప్రతి ఒక్కరూ సానుకూల దృక్పథంతో ముందుకెళ్లాలి’ అని ఎన్నికల సంఘం కార్యక్రమానికి పంపిన సందేశంలో ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు 2009 నుంచి ఎన్నికల సంఘం ఆవలంబిస్తున్న ఎస్‌బీఈఈపీ (సిస్టమేటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) విధానాన్ని ఉపరాష్ట్రపతి ప్రత్యేకంగా అభినందించారు.
స్వాతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదవడాన్ని ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, దేశంలో వస్తున్న సానుకూలమైన మార్పునకు ఇదొక సంకేతంగా అభివర్ణించారు. గతేడాది జరిగిన ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కరోనా నేపథ్యంలోనూ వేర్వేరు రాష్ట్రాల్లో 74 నుంచి 84 శాతం పోలింగ్ నమోదవడాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి మార్పులు సార్వత్రిక ఎన్నికల్లోనూ రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఎన్నికల ప్రక్రియలో ఉన్న అవాంతరాలను తొలగించి ప్రక్రియ మొత్తాన్ని సాఫీగా ముందుకు తీసుకెళ్లడంలో సాంకేతికతలో వస్తున్న మార్పులను సద్వినియోగ పరుచుకోవాలని కూడా ఉపరాష్ట్రపతి సూచించారు.
***
(Release ID: 1792593)
Visitor Counter : 198