మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

దేశవ్యాప్తంగా జాతీయ బాలికా దినోత్సవం!


బాలికా శిశువుల హక్కులు, విద్య, ఆరోగ్యం, పౌష్టికారంపై
అవగాహనకోసం పలు కార్యక్రమాల నిర్వహణ

Posted On: 24 JAN 2022 8:52AM by PIB Hyderabad

   జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి యేటా జనవరి 24వ తేదీన జరుపుకుంటారు. భారతదేశంలోని బాలికలందరికీ తగిన మద్దతును, అవకాశాలను కల్పించే లక్ష్యంతో జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. చిన్నారి బాలికలు హక్కుల గురించి అవగాహన కల్పించడం, బాలికల విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం వంటి విషయాల ప్రాధాన్యాన్ని తెలియజెప్పడం, సమాజంలో బాలికలు మెరుగైన జీవితం గడిపేలా చూడటం వంటి అంశాలను బాలికా దినోత్సవ లక్ష్యాలుగా నిర్దేశించుకున్నారు. లైంగిక వివక్ష అనేది బాలికలు లేదా మహిళలు తమ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. జాతీయ బాలికా దినోత్సవాన్ని తొలిసారిగా 2008లో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.

 

జాతీయ బాలికా దినోత్సవం ధ్యేయాలు

   తమకు దఖలుపడిన హక్కుల గురించి బాలికలకు అవగాహన కల్పించడం, అందరితో సమానంగా బాలికలకూ అవకాశాలు కల్పించడం, లైంగిక ప్రాతిపదికతో కూడిన వివక్షలను తొలగించడం జాతీయ బాలికా దినోత్సవ లక్ష్యాలు. సమాజంలో బాలికలు ఎదుర్కొనే అసమానతలను గురించి అవగాహనను ప్రోత్సహించడం, బాలికల విద్య ప్రాధాన్యతను ప్రజలకు తెలియజెప్పడం కూడా ఈ బాలికా దినోత్సవ ధ్యేయాలుగా నిర్దేశించారు. ప్రతి ఒక్కరిలాగే బాలికలకూ విలువ ఇచ్చి, గౌరవించడం, వారిపట్ల నెలకొన్న వివక్షను తగ్గించడం కూడా ఈ కార్యక్రమ ధ్యేయం. బాలికలపై సమాజ దృక్పథాన్ని, ఆలోచనా ధోరణులను మార్చడం, బాలికా శిశువుల భ్రూణహత్యలను నియంత్రించడం, జనాభాలో బాలికల నిష్పత్తి తగ్గిపోకుండా చూడటం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరిస్తారు.

  

ప్రభుత్వం తీసుకున్న చర్యలు

 బాలికల స్థితిగతులను మార్చివేయడానికి భారత ప్రభుత్వం కొన్నేళ్లుగా ఎన్నో చర్యలు తీసుకుంది. అనేక కార్యక్రమాలు, అవగాహనా ఉద్యమాలు చేపట్టింది.:

ఎ. బాలికా శిశువును కాపాడటం

బి. బేటీ బచావో, బేటీ పఢావో. (-బాలికలను రక్షించండి,..బాలికలను చదివించండి- కార్యక్రమం)

సి. సుకన్యా సమృద్ధి యోజన

డి. సి.బి.ఎస్.ఇ. ఉడాన్ పథకం

ఇ. బాలికా శిశువుకు ఉచితంగా లేదా, సబ్సిడీపై విద్య.

ఎఫ్. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో బాలికలకు రిజర్వేషన్

జి. బాలికల మాధ్యమిక విద్యకోసం జాతీయ ప్రోత్సాహక పథకం

బాలికలను రక్షించండి, బాలికలను చదివించండి (బి.బి.బి.పి.) కార్యక్రమ నేపథ్యం

   బాలికల సంక్షేమం లక్ష్యంగా తక్షణం తీసుకోవలసిన చర్యలను గురించి 2011వ సంవత్సరపు జనాభా లెక్కలు అప్రమత్తం చేశాయి. బాలికా శిశువు వెలికి గురవుతోందని, బాలికలకు సంబంధించి శిశు లైంగిక నిష్పత్తి (సి.ఎస్.ఆర్.) క్రమంగా తగ్గుతూ వస్తోందని ఈ లెక్కలు సూచించాయి. 1961వ సంవత్సరంలో ప్రతి వెయ్యిమందికీ 976మంది ఉన్న బాలికల సంఖ్య, 2001లో 927కు, 2011లో 918కి తగ్గిపోయిందని ఈ లెక్కలు తెలియజెప్పాయి. సమాజంలో బాలికల అల్పస్థాయిని సూచించే ఈ సమాచారం చాలా ఆందోళనకరం. జీవిత చక్రంలో వారి సాధికారత తీవ్రంగా దెబ్బతింటుందనడానికి ఇది సూచికగా చెప్పవచ్చు. బాలికలకు సంబంధించిన శిశు లైంగిక నిష్పత్తి క్రమంగా తగ్గిపోవడం, పుట్టుకకు ముందుగానే ఆడపిల్లలపై అనుసరించే లైంగిక వివక్షను సూచిస్తోంది. ఇక ఆరోగ్య రక్షణ, పౌష్టికాహారం, విద్యావకాశాలు వంటి అంశాల విషయంలో పుట్టుక తర్వాత కూడా బాలికలపై వివక్షను పాటిస్తూ ఉన్నారని ఈ లెక్కలు తెలియజెపుతున్నాయి.

సంవత్సరం

1961

1971

1981

1991

2001

2011

శిశు లైంగిక నిష్పత్తి

976

964

962

945

927

918

  

      బాలికల సంక్షేమం కోసం బలమైన చట్టబద్ధమైన విధాన వ్యవస్థ అమలుచేసి, ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, బాలికలకు సంబంధించిన శిశు లైంగిక నిష్పత్తి (సి.ఎస్.ఆర్.) తగ్గిపోతూనే వచ్చింది. సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి, వినియోగానికి సంబంధించిన ఎంపికలో బాలికలను తల్లిదండ్రులు  దూరంగా పెట్టడం, పట్టణ, గ్రామీణ సమాజాల్లో దృక్ఫథాలు మార్పుచెందడం, కుటుంబ వ్యవస్థల్లో మార్పులు, సంతానోత్పత్తిపై నిర్ణయంలో మార్పులు, చిన్న కుటుంబంవైపు మొగ్గు చూపడం తదితర కారణాల  వల్ల కూడా సి.ఎస్.ఆర్.లో తగ్గుదల నమోదవుతూ వచ్చింది. దీనితో కుమారుడిని కనడానికి ప్రాధాన్యం ఇవ్వడంవలన సమాజంలో మహిళ స్థాయి తగ్గిపోయింది. పితృస్వామిక సామాజిక నిబంధనలు, లైంగిక వివక్షతో కూడిన హింసను బాలికలు, మహిళలు ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడటం కూడా బాలికల శిశు లైంగిక నిష్పత్తి తగ్గడానికి కారణాలుగా చెప్పవచ్చు.

  బాలికల శిశు లైంగిక నిష్పత్తి వేగంగా తగ్గడాన్ని నియంత్రించేందుకు వివిధ రకాల విధాన నిర్ణయాలు, కార్యక్రమాల నిబంధనలను అమలులోకి తెచ్చినప్పటికీ, ఈ విషయంలో తీవ్రమైన సవాళ్లు ఎదురవుతూ వచ్చాయి. బాలికా శిశువులను నిలదొక్కునేలా చేసి, రక్షించి, వారికి విద్యను కల్పించేందుకు పూర్తిస్థాయిలో అభ్యున్నతి చెందించేందుకు ఎన్నో చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో గౌరవ భారత రాష్ట్రపతి, 2014 జూన్ 9న పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. “బాలికలను రక్షించండి...బాలికలను చదవించండి” అన్న కార్యక్రమాన్ని అమలుచేసే చిత్తశుద్ధితో నా ప్రభుత్వం ఒక భారీ స్థాయి సామూహిక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. బాలికా శిశువును రక్షించడం, విద్యాభ్యాసం సాగించేలా సహాయ పడటం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాం. అని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి 2014-15వ సంవత్సరపు బడ్జెట్ ప్రసంగంలో ఇదే అంశాన్ని పునరుద్ఘాటించారు. రూ. వందకోట్లను కేటాయించడం ద్వారా బాలికల అభ్యున్నతిపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజెప్పారు. తగ్గుతున్న శిశు లైంగిక నిష్పత్తి పట్ల గౌరవ  ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

  ఈ నేపథ్యంలోనే బేటీ బచావో, బేటీ పఢావో (బి.బి.బి.పి.) పథకాన్ని గౌరవ ప్రధానమంత్రి 2015 జనవరి 22న హర్యానాలోని పానిపట్టులో ప్రారంభించారు. బాలికలకు సంబంధించిన శిశు లైంగిక నిష్పత్తి సమస్యను పరిష్కరించడం, బాలికలకు, మహిళలకు జీవితగమనంలో సాధికారత కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు.

  2014-15వం సంవత్సరంలో తొలుత వంద జిల్లాల్లో ఈ పథకాన్ని (తొలిదశగా) ప్రారంభించారు. ఆ తర్వాత 2015-16వ సంవత్సరంలో దీనికి కొనసాగింపుగా అదనంగా 61 జిల్లాల్లో రెండవ దశగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రారంభ దశలో అందిపుచ్చుకున్న విజయాలతో ఈ పథకాన్ని దేశంలోని 640జిల్లాలకు విస్తరింపజేశారు.  2011 జనాభా లెక్కల ప్రాతిపదికగా 2018 మార్చి 8వ తేదీ నాటికి ఈ పథకాన్ని 640 జిల్లాలకు విస్తరింపజేశారు.  బాలికా శిశువులకు రక్షణ కల్పించి, వారికి చదువుకునేందుకు అవకాశాలు కల్పించడమే బేటీ బచావో,..బేటీ పఢావో పథకం ప్రధాన లక్ష్యంగా నిర్దేశించారు.

 

లక్ష్యాలు, టార్గెట్ గ్రూపులు:

బాలికా శిశువులను రక్షించి, వారికి తగన విద్యావకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ కార్యక్రమం అమలు చేస్తూ వస్తున్నారు. ఈ పథకం లక్ష్యాలను దిగువన చూడవచ్చు.:

 

    1. లైంగిక వివక్షతో బాలికలను అవకాశాలకు దూరం చేయడాన్ని నివారించడం
    2. బాలికా శిశువులను నిలదొక్కుకొనేలా చేసి, తగిన రక్షణకల్పించడం.
    3. విద్యావకాశాలు కల్పించి, వివిధ కార్యకలాపాల్లో  వారి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం.

 

పథకం అమలు స్థాయి, సాధించిన విజయం:

  బాలికా శిశువుల హక్కులను గుర్తించే విషయంలో ప్రజల ఆలోచనా ధోరణిని, దృక్పథాన్ని ఈ పథకం పూర్తిగా మార్చివేసింది. బాలికల హక్కులపై ప్రజల్లో అవగాహనను పెంచింది. భారతదేశంలో నానాటికీ తగ్గుతున్న శిశు లైంగిక నిష్పత్తి అంశంపై ఆందోళనను ఈ పథకం బట్టబయలు చేసింది. బేటీ బచావో, బేటీ పఢావో కార్యక్రమంపై ప్రజల సామూహికంగా చైతన్యవంతులు కావడంతో ఈ అంశం ప్రజా బాహుళ్యంలో పూర్తి చర్చనీయాంశంగా తయారైంది.

  • 2014-15వ సంవత్సరానికల్లా లైంగిక నిష్పత్తి రేటు జాతీయ స్థాయిలో 19 పాయింట్లు పెరిగింది. 2014-15లో 918 స్థాయిలో ఉన్న నిష్పత్తి 2020-21వ సంవత్సరంలో 937కు పెరిగింది.  (మూలం: ఆరోగ్య నిర్వహణా సమాచార వ్యవస్థ (హెచ్.ఎం.ఐ.ఎస్.) డేటా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఏప్రిల్-మార్చి, 2014-15 మరియు 2020-21)
  • స్థూల నమోదు నిష్పత్తి (జి.ఇ.ఆర్.): మాధ్యమిక విద్యలో బాలికల నమోదు పెరిగింది. 77.45% in 2014-15వ సంవత్సరంలో 77.45శాతం ఉన్న బాలికల నమోదు, 2018-19లో 81.32శాతానికి పెరిగింది. (మూలం: యు.-డి.ఐ.ఎస్.ఇ., కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ(2018-19 సమాచారం తాత్కాలికం)
  • ఐదేళ్లలోపు బాలికా శిశువుల మరణాలు గణనీయంగా తగ్గాయి. 2014వ సంవత్సరంలో 45శాతం ఉన్న బాలికా శిశు మరణాలు 2018లో 36 శాతానికి తగ్గాయి. (మూలం: ఎస్.ఆర్.ఎస్. జనాభా లెక్కలు india.gov.in)
  • ప్రసవానికి ముందస్తుగా మొదటి మూడు నెలల్లో జరిగే మహిళల నమోదు శాతం పెరిగింది.  2014-15వ సంవత్సరంలో ఇది 61శాతం ఉండగా,  2020-21లో  73.9శాతానికి పెరిగింది. (మూలం: హెచ్.ఎం.ఐ.ఎస్. డేటా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమమంత్రిత్వశాఖ (ఏప్రిల్-మార్చి, 2014-15 మరియు 2020-21)
  • ఆసుపత్రుల్లో జరిగే సంస్ధాగత ప్రసవాల శాతం కూడా గణనీయంగా పెరిగింది. 2014-15వ సంవత్సరంలో నమోదైన 87శాతంనుంచి 2020-21వ సంవత్సరంలో 94.8 శాతానికి పెరిగింది. (మూలం: హెచ్.ఎం.ఐ.ఎస్. డేటా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఏప్రిల్-మార్చి, 2014-15 మరియు 2020-21)

 

జాతీయ బాలికా శిశు దినోత్సవం-2022

   దేశవ్యాప్తంగా కోవిడ్ వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జాతీయ బాలికాశిశు దినోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలన్నింటినీ వర్చువల్ పద్ధతిలో, ఆన్ లైన్ ద్వారా నిర్వహించాలని, భౌతిక ప్రమేయంతో కూడిన కార్యక్రమాలన్నింటినీ నివారించాలని నిర్ణయించారు.

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పి.ఎం.ఆర్.బి.పి.)-2022

  జాతీయ బాలికా శిశు దినోత్సవం సందర్భంగా జనవరి 24వ తేదీన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా, బాలల అద్భుత విజయాలకు గుర్తింపునిస్తూ వర్చువల్ పద్ధతిలో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విజయాలు సాధించిన బాలలను 2022వ సంవత్సరపు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుతో సత్కరిస్తారు. సంబంధిత బాలల తల్లిదండ్రులు, జిల్లా మెజిస్ట్రేట్లు, కలెక్టర్లు ఈ తమతమ జిల్లాల ప్రధాన కేంద్ర కార్యాలయాలనుంచి వర్చువల్ పద్ధితిలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.

  ఈ సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి విజేతలకు డిజిటల్ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు. 2021వ సంవత్సరపు అవార్డుల సర్టిఫికెట్లను కూడా ఈ సందర్భంగా ప్రదానం చేస్తారు. గత ఏడాది కోవిడ్ వ్యాప్తి  ఈ అవార్డుల ప్రదానం జరగలేదు. పి.ఎం.ఆర్.బి.పి. 2022వ సంవత్సరపు అవార్డులకు గాను రూ. 1,00,000లను అందిస్తారు. ఆ మొత్తాన్ని విజేతల ఖాతాలకు ఈ కార్యక్రమంలోనే బదిలీ చేస్తారు.

 

 

 

జనవరి 24న జరిగే వెబినార్ సదస్సులు

  ‘కన్యా మహోత్సవ్’ పేరిట దేశవ్యాప్తంగా జరిగే ఆన్ లైన్ కార్యక్రమంలో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ పిల్లలతో ముచ్చటిస్తారు.

#యూనిసెఫ్ ఆధ్వర్యంలో లడికియాఁ జహాఁ ఖుషీ వహాఁ పేరిట నిర్వహించే కార్యక్రమాన్ని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేస్తారు.  .

 

   వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతి సాధించిన యువతులతో కేంద్ర జవుళి, వాణిజ్యం, పరిశ్రమలు, ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ పద్ధతిలో ముచ్చటిస్తారు.

  శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో చెప్పుకోదగిన విజయాలు సాధించిన యువతులతో కేంద్ర సైన్స్, టెక్నాలజీ శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్ వర్చువల్ పద్ధతిలో ముచ్చటిస్తారు.

మంత్రులు జరిపే ఈ కార్యక్రమాలు, ఆర్థిక స్వాతంత్ర్యంకోసం శ్రమిస్తున్న లక్షలాది మంది ఇతర బాలికల, యువతులకు ఉత్ప్రేరకాలుగా, స్ఫూర్తిదాయంగా పనికివస్తాయి.

  బాలికల హక్కులు, బాలికా విద్యకు ఉన్న ప్రాధాన్యం తదితర అంశాలపై అవగాహన కల్పించేందుకు జాతీయ మహిళా కమిషన్ వర్చువల్ పద్ధతిలో ఆన్ లైన్ ద్వారా ఒక చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పలువురు వక్తలు ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. 

  “భారతదేశంలోని కిశోరప్రాయపు బాలికల్లో సమగ్ర అవసరాలను తీర్చడం”, # లడికియాఁ జహాఁ ఖుషీ వహాఁ.. పేరిట జాతీయ ప్రజా సహకార, శిశు అభివృద్ధి సంస్థ (ఎన్.ఐ.సి.సి.డి.) ఒక వెబినార్ సదస్సు నిర్వహిస్తోంది. కిశోర ప్రాయంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, విద్యకు సంబంధించి కిశోర ప్రాయపు బాలికలకు ఎదురయ్యే సవాళ్లు, ముందున్న మార్గం,.. కిశోర ప్రాయపు బాలికల మానసిక అభివృద్ధి వంటి అంశాలపై ఈ కార్యక్రమంలో చర్చిస్తారు.

  ’బాలికా శిశువు చట్టబద్ధమైన హక్కులు’ అన్న అంశంపై జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ (ఎన్.సి.పి.సి.ఆర్.) ఒక వెబినార్ సదస్సును నిర్వహిస్తుంది. ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్పేశ్ సత్యేంద్ర ఝవేరీ ఈ సదస్సులో ప్రధాన వక్తగా ప్రసంగిస్తారు.

  బేటీ బచావో, బేటీ పఢావో (బి.బి.బి.పి.) కార్యక్రమం కింద బాలికా శిశు లైంగిక నిష్పత్తి అనే అంశంపై గ్రామ సభ, మహిళా సభ కార్యక్రమాలను అన్ని రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో, 405 జిల్లాల్లో  నిర్వహిస్తారు. బాలికా శిశువు విలువపై పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిశాస్త్రాలకు సంబంధించిన అంశాలపై స్కూళ్లలో పోస్టర్లు, నినాదాల రచన, చిత్రలేఖనం, వర్ణచిత్రాల పోటీలను నిర్వహిస్తారు. బి.బి.బి.పి. కార్యక్రమం అమలుకు సంబంధించి స్థానికంగా ముందంజలో ఉన్న వారిపై స్థానిక పత్రికల్లో, ప్రచార సాధనాల్లో పలు కథనాలను,  కార్యక్రమాలను ప్రసారం చేస్తారు.

 

****



(Release ID: 1792252) Visitor Counter : 527